దేశంలో మళ్లీ కరోనా మృత్యుఘంటికలు?!
posted on Apr 10, 2023 @ 2:38PM
దేశంలో మరో మారు కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవలి కాలంలో రోజు వారి కేసులు అధికమవ్వడం ఆందోళన రేకెత్తించినా.. మరణాల సంఖ్య స్వల్పంగా ఉండటం ఒకింత ఊరటగా మిగిలింది. ఆయితే గత 24 గంటలలో ఏకంగా కరోనా కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
మరో మారు మహమ్మారి తన కరాళ నృత్యం చేయడానికి రెడీ అయ్యిందా అన్న అందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. గత 24 గంటలలో అంటే ఆదివారం ఒక్క రోజే దేశంలో కరోకా బారిన పడి 14 మంది మృత్యు ఒడికి చేరారు. అంతే కాకుండా ఆదివారం ఒక్క రోజే 5880 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాల మేరకు రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య పెరగడంతో పాటుగా, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.
ఒకే రోజులో ఇంచు మించుగా 50 శాతానికి పైగా హెచ్చు కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కరోనా కట్టడి చర్యలకు సంబందించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే మహారాష్ట్ర, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి తీవ్రత ఆందోళనకరంగా ఉంది.