బీహారు ఓటరుపై...ఓటు చోర్ యాత్ర ప్రభావం?
posted on Aug 26, 2025 @ 1:18PM
త్వరలో జరగానున్నబీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర’ చివరాఖరి ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 17 న ససారలో ప్రారంభమైన రాహుల్ యాత్ర, సెప్టెంబర్ 1న పాట్నాలో ముగుస్తుంది. అయితే, రాహుల్ గాంధీ సాగిస్తున్న ఈ యాత్ర రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా ? అంటే, రాజకీయ విశ్లేషకుల నుంఛి అవుననే సమాధానమే వస్తోంది.
అయితే, రాహుల్ యాత్ర ప్రభావం, ఆయన ఆశించిన స్థాయిలో, ఆశించిన విధంగా అయితే, ఉండకపోవచ్చని, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిజానికి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్’ ప్రభుత్వం పట్ల ప్రజల్లో కావల్సినంత వ్యతిరేకత వుంది. ముఖ్యంగా అటునుంచి ఇటు ఇటునుంచి అటూ గోడలు దూకుతూ,14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రి కుర్చీని అంటి పెట్టుకుని కూర్చున్న నితీష్ కుమార్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మాత్రమే కాదు, ఒక విధమైన ఏహ్య భావం కూడా ఏర్పడిందని, అంటున్నారు.
దానికి తోడు, నిరుద్యోగం,క్షీణిస్తున్న శాంతి భద్రతల సమస్యలు తదితర సమస్యల కారణంగా, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయి. అవును ఇటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల, అటు, ఎన్డీఎ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే, ఇటీవల వివిధ సంస్థలు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలను గమనిస్తే రాష్ట్రంలో, కేవలం 18 శాతం మంది ఓటర్లు మాత్రమే, ఎన్డీఎ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో 48 మంది ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.
అన్నిటికీ మించి, ముఖ్యమంత్రిగా ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు, 25 శాతం మంది నితీష్ కుమార్’ కు జై కొడితే, 32 శాతం మంది ఆర్జేడీ, నాయకుడు,మహా ఘటబంధన్’ ముఖ్యమంత్రి అభ్యర్ధి తేజస్వీ యాదవ్’కు జై కొట్టారు. ముఖ్యంగా యువత తేజస్వీ యాదవ్’ వైపు మొగ్గు చూపుతున్నారు. నితీష్ కుమార్’కు తేజస్వీ యాదవ్’ బలమైన ప్రత్యర్ధిగా ఓటర్లు గుర్తిచినట్లు సర్వేలు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్టోబర్, నవంబర్ నెలలో జరగనున్నబీహార్ అసెంబ్లీ ఎన్నికలలో, ఎగసి పడుతున్న నితీష్ ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్రంలో వీస్తున్న తేజస్వీ అనుకూల పవనాలను ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రాలుగా చేసుకుంటే, మహా ఘట బంధన్’ విజయావకాశాలు’ మరింత మెరుగ్గా ఉండచ్చని పరిశీలకులు అంటున్నారు.
అలాగే, రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర’ వలన కూడా మహా ఘటబంధన్’ కు కొంత ప్రయోజనం జరగవచ్చు కానీ, ఎన్నికల కథా కథనం స్థానిక సమస్యల నుంచి పక్కకు వెళ్ళే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, కేంద్ర ఎన్నికల సంఘం బీహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర’కు ఆశించిన స్థాయిలో స్పందన రాక పోగా, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలలో నిజం లేదనే విషయం తేట తెల్లం కావడంతో, ఒక ప్రత్యేక వర్గానికి చెందిన ప్రజలు మినహా ఇతర వర్గాల ప్రజలు రాహుల్ యాత్రను అసలు పట్టిచుకోవడం లేదని అంటున్నారు.
అలాగే,అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు సహజంగా స్థానిక సమస్యలు,స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ, జాతీయ అంశాలకు మరీ ముఖ్యంగా, ఎన్నికల అక్రమాలకు సంబదించిన అంశాలకు ఓటర్లు అంతగా ప్రాధాన్యత ఇవ్వరని పరిశీలకులు బావిస్తునారు. నిజానికి, నితీష్ వర్సెస్ తేజస్వీగా సాగ వలసిన ఎన్నికల ప్రచారం, రాహుల్ ఎంట్రీతో మోదీ వర్సెస్ రాహుల్. పోల్ బ్యాటిల్’ గా మారుతోందని, ఇది మహా ఘట బంధన్’ కు అంతగా మంచిది కాదని అంటున్నారు.అంతే కాకుండా మహా ఘట బంధన్’ కు అనుకూలంగా ఉన్న వాతావరణం తిరగబడే ప్రమాదం లేక పోలేదని విశ్లేషకులు అంటున్నారు.