ఏపీలో భారీ వర్షాలపై..హోం మంత్రి అనిత సమీక్ష
posted on Aug 26, 2025 @ 10:45AM
బంగాళాఖతంలో ఏర్పాడిన అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. జిల్లా స్ధాయి అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని హోం మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో దిశా నిర్దేశం చేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఎడతెరిపి లేని వర్షాలకు పంట నష్టం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు.