భయానకంగా భౌ- భౌ...బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు
posted on Aug 26, 2025 @ 10:59AM
బౌ..బౌ మనే శబ్దం ఇప్పుడు దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కల తో గ్రామాల నుంచి పట్టణాల దాకా భయోత్పాతం సంతరించుకొంటోంది. కాలనీలు, వీధుల్లో వీటి అరుపులు వినిపిస్తేనే అలజడి రేగుతోంది. వెంటపడి కరవడం, కాట్లు చేయడంతో ప్రాణాంతకంగా మారింది. వీధి కుక్కల బెడదపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించి తగు చర్యలు తీసుకోవడంతో పాటు వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో వీటికి ఆహారం వేయడం కూడా నేరంగా భావిస్తూ చర్యలు తీసుకోవాలని ఈనెల 22న ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అంటే దేశవ్యాప్తంగా వీటి అలజడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 3.50 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేశారు. వీటి కాట్లతో ర్యాబిస్ వ్యాధికి గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వీటితో భయానకమే అవుతుంది.
*కడపలో లోనే 14376 మందికి కుక్క కాట్లు
వీధి కుక్కల స్వైర విహారం ప్రజలను భయపెడుతోంది. ఒక కడప జిల్లాలోనే ఇంచుమించు రెండున్నర ఏళ్ల కాలంలో 14376 మంది కాటేశాయంటే ఏ స్థాయిలో వీధి కుక్కలు మనుషులపై దాడి చేస్తున్నాయో ఊహించవచ్చు. జిల్లాలో 2023లో 5485 మందిని, 2024 లో 5549 మందిని 2025 ఇప్పటివరకు 3342 మందిని వీధి కుక్కలు కాటేశాయి.
అంటే సగటున సుమారు 400 మందిని నెలకు కుక్కలు కాటేస్తున్నాయి. ఇది అధికారులు అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా అయితే ఇంతకు మూడింతలు గా కుక్క కాట్లు తప్పడం లేదు. కుక్కకాటు గురైన కొందరు దానిపై అవగాహన లేకపోవడం, చిన్నచిన్న గాయాలే కదా అని పెద్దగా పట్టించుకోకుండా ఉండడం లాంటి కారణాలతో ఇవి పూర్తి గా నమోదు కావడం లేదు. నిజంగా అన్ని నమోదు అయితే నెలకు 1500 కు పైమాటే అని అధికారులే అనధికారికంగా చెబుతున్న మాటలు.
*పెంపుడు కుక్కలూ కాటేస్తున్నాయి
వీధి కుక్కలే కాదు పెంపుడు కుక్కలూ(పెట్ డాగ్స్)కాటేస్తున్నాయి. వీటితోనూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అవసరమయ్యాయి . ఒక అంచనా ప్రకారం నెలకు సుమారు 200 మందిని పెంపుడు కుక్కలు కూడా కాటేస్తున్నాయి. యజమానుల కుటుంబ సభ్యులు,వారి ఇంటికి వచ్చేవారు, చుట్టుపక్కల వారికి వీటి తో ఏర్పడుతోందని చెప్పుకొస్తున్నారు. దీంతో కుక్కలు పెంచుకునే యజమానులు వాటిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది
*ఒకే రోజు 27 మందిని కాటేసిన ఒకే కుక్క
బద్వేల్ పట్టణంలో ఓ కుక్క భయానక వాతావరణాన్ని సృష్టించింది. కుక్కల్లో ఆవేశపూరిత కుక్కలు ,పిచ్చి పట్టిన కుక్కలు ఉంటాయి. ఈ కోవకు చెందిన ఓ కుక్క బద్వేల్ లో ఈ ఏడాది మే 26న 27 మందిని కాటేసి కలకలం రేపింది .దీంతో బద్వేలు వాసులు భయాందోళనలకు గురయ్యారు. ఇలాంటి కుక్కలు చాలా ప్రమాదకరంగా చెప్పుకోవాలి
*నివేదిక కోరిన డిల్లీ
బద్వేల్ లో ఒకేరోజు 27 మందిని కాటేసిన కుక్క వ్యవహారంపై ఢిల్లీలోని సెంట్రల్ మీడియా స్కానర్ రాష్ట్ర వైద్య శాఖను నివేదిక కోరింది. ఆ వీధి కుక్క ఎంతమందిని కాటేసింది. వారికి వ్యాక్సిన్స్ వేశారా, చికిత్స చేశారా,వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలతో నివేదిక కోరడం జరిగింది .ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారులు బద్వేల్ కు వెళ్లి వ్యాక్సిన్ విచారణ చేసి అందుబాటులో ఉన్నాయి, వీరందరికీ వ్యాక్సిన్ చేశారని నివేదిక పంపడం జరిగింది.
*ఇద్దరు మృతి
కడప జిల్లాలో రాబిస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. వీధి కుక్కలు పెద్ద ఎత్తున మనషులపై పై దాడి చేస్తునన్నా గాయాలు కావడం వైద్యం చేయించుకోవడంతో బయటపడుతున్నారు .ఒకటి రెండు చోట్ల ర్యాబిస్ కారణంగా మృత్యువాత పడ్డారు .2003 వ సంవత్సరం పులివెందులలో ఒకరు 2024లో కడపల ఒకరు మృతి చెందారు. వీధి కుక్కల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడడంతో ఇప్పుడు దేశమంతా వీటి వ్యవహారం చర్చ అంశంగా మారింది
*సుప్రీంకోర్టు ఆదేశాలతో అయినా!
వీధి కుక్కల వ్యవహారంపై సీరియస్ గా స్పందించిన సుప్రీంకోర్టు త్రి సభ్య ధర్మాసనం ఢిల్లీతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేసింది.వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వదిలేయాలని, వ్యాధులు ఆవేశపూరిత ప్రవర్తన కలిగిన కుక్కలను షెల్టర్ కు తరలించాల్సిందేనని, బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టడం నేరంగానూ, ఉల్లంఘనగాను పేర్కొంది .వీధుల్లో ఆహారం పెట్టే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
జంతు ప్రేమికులు వీధి కుక్కలను దత్తత తీసుకోవచ్చు కానీ మళ్ళీ వాటిని మళ్ళీ వీధుల్లో వదిలేయ కూడదని సూచించింది. కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం భాగస్వామ్య పక్షాలుగా చేస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రియల్ టైం పరిశీలన కోసం ప్రత్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సెప్టెంబరు నెల నాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అయనా మున్సిపాలిటీలు, పంచాయతీలో వీధి కుక్కల వ్యవహారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం అధికారులపై ఉంది.