ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తాం : సీఎం రేవంత్
posted on Aug 25, 2025 @ 1:58PM
తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా వర్సిటీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ, ఉస్మానియా, తెలంగాణ అవిభక్త కవలలు అని సీఎం పేర్కొన్నారు. ఓయూలో రూ.90 కోట్లతో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. దుందుభి, బీమా హాస్టల్ భవనలను ప్రారంభించి డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్‌లకు శంకుస్థాపన చేశారు. పీవీ నరసింహారావు ఈ గడ్డ నుంచే ధిక్కారస్వరం వినిపించారు. మర్రి చెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దరన్నను అందించిన నేల ఇది. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందని సీఎం రేవంత్ తెలిపారు.
ఈ ఉస్మానియా వర్సిటీకీ గొప్ప చరిత్ర ఉంది. వందేళ్లలో ఓయూకు వీసీగా దళితుడిని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారు. ఓయూలో చదువుకున్న వారికి చాలా అవకాశాలు వచ్చాయి. యువ నాయకత్వం దేశానికి అవసరం ఉంది. దేశానికి అతిపెద్ద సంపద యువతే అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా చేసిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన పదవిని తీయించేశారని విమర్శించారు. ప్రొ. కోదండరామ్ ఎమ్మెల్సీ పదవిని ఊడకొట్టేందుకు రూ. కోట్లు ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయినా.. ఎందుకు అంత శునకానందం మీకు అంటూ.. బీఆర్ఎస్ పార్టీ నేతలపై సీఎం మండి పడ్డారు. ఉస్మానియా వర్సిటీ చదువులకే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం పని చేయని వారిని వ్యతిరేకించండి. డిసెంబర్‌లో ఆర్ట్స్ కళాశాల వద్ద సభ పెడితే నేను వస్తా. అన్ని పనులు మంజూరు చేస్తా. ఒక్క పోలీసును కూడా క్యాంపస్‌లో ఉంచొద్దని ముఖ్యమంత్రి అన్నారు.
ఒక వేళ విద్యార్థులు నన్ను అడ్డుకొని ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం చెబుతా. ఉస్మానియా వర్సిటీని ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నేను సిద్ధం. సకల వసతులు చేకూర్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. అందుకోసం నిపుణులతో కమిటీ వేయండి. నిధులు సమకూర్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వేం నరేందర్‌రెడ్డి, కోదండరామ్, ఓయూ వీసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
.