లోకేష్ చొరవతో గణేష్, దసరా మండపాలకు ఉచిత విద్యుత్
posted on Aug 26, 2025 @ 3:17PM
తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణానికి మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయం మరింత శోభను ఇచ్చింది. తెలుగురాష్ట్రాలలో బుధవారం (ఆగస్టు 27) నుంచి వినాయక చవిత నవరాత్రులు అత్యంత వైభవంగా, అంబరాన్నంటే సంబరంతో జరగనున్నాయి. వీధి వీధినా గణేష్ పందిళ్లు వేసి తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రులను అత్యంత వేడుకగా జరుపుకోవడం తెలుగురాష్ట్రాలలో ఆనవాయితీ. ఇక ఈ వేడకకు మరింత శోభ, నిర్వాహకులకు, భక్తులకు మరింత ఆనందం చేకూర్చేలా మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్న మండపాల నిర్వాహకుల వినతి లోకేష్ వద్దకు చేరింది. ఆయన క్షణం ఆలోచించకుండా అందుకు సానుకూలంగా స్పందించారు.
మండప నిర్వాహకుల వినతిపై యఆయన సామాజిక మాధ్యమ వేదికగా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన మేరకు వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడతాయి. అన్నది ఆ ప్రకటన సారాంశం. ఆయన అన్నట్లుగానే గణపతి మంటపాలకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతే కాదు. వినాయక చవితి తరువాత వచ్చే దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు కూడా ప్రభుత్వం విద్యుత్ ను ఉచితంగా అందించనుంది. ఈ రెండు పండుగలకూ సంబంధించి ఏర్పాటు చేసే మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం పాతిక కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిర్ణయంతో మంత్రి లోకేష్ ప్రజా నాయకుడిగా తన ఇమేజ్ ను మరింత పెంచుకున్నట్లు అయ్యింది.
చూడటానికి గణేష్, దసరా మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా అన్నది ఒక చిన్న చర్య గా కనిపించవచ్చు. కానీ ఇది ప్రజా హృదయాలపై చాలా బలమైన ముద్ర వేస్తుందనడంలో సందేహం లేదు. ఆబాలగోపాలం ఆనందంగా భాగస్వాములై నిర్వహించుకునే ఈ రెండు పండుగల విషయంలో లోకేష్ చూపిన చొరవ ఆయన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచేయడమే కాదు.. తెలుగుదేశం కూటమి ప్రతిష్ఠను కూడా ఇనుమడింప చేసిందనడంలో సందేహం లేదు.