జైల్లో పెట్టినా జగన్ మారలేదే!
posted on Jun 24, 2013 @ 12:20PM
“పార్టీలో నీ అంతటి మొనగాడు మరోడు లేడు. నువ్వెంతంటే సోనియామ్మకి అంతే! ఆమె నీ మాట కాదనదని” అసమ్మతి నేతలందరూ కలిసి పార్టీలో కొత్తగా చేరిన చిన్నజీవిని ఎగదోస్తే వారి మాటలు నిజమేననుకొని, మెగాజీవి హడావుడిగా విమానం పుచ్చుకొని డిల్లీలో వాలిపోయి ‘కిరణ్ కుమార్ రెడ్డి ఈజే వెరీ బ్యాడ్ బాయ్’ అని సోనియమ్మకు క్లాసు పీకబోయాడు. అయితే, ఆమె వెంటనే ‘కిరణ్ ఈజే గుడ్ బాయ్’ అని ఆయన ఇదివరకు ఇచ్చిన సర్టిఫికేట్ ను సొరుగులోంచి తీసి చూపించి ‘మరి దీని సంగతేమిటి?’ అంటూ ఎదురు ప్రశ్నించడమే కాక, ‘ఏడాది తిరక్కుండానే అప్పుడే పార్టీ నీరు ఇంతగా వంట బట్టించుకోవడం ఆరోగ్యానికి హానికరం’ అని గట్టిగా హెచ్చరించడంతో, మళ్ళీ అదే విమానంలో హైదరాబాద్ వచ్చిపడ్డాక మళ్ళీ నిన్నటివరకు ఆయన పబ్లిక్కి దర్శనం ఈయలేదు.
అయితే రాజకీయ నాయకుడన్నాక ఇటువంటి తిట్లని, విమర్శలని ఖద్దరు చొక్కా క్రింద మడతేసి మరిచిపోవాలని గ్రహించిన కేంద్రమంత్రి గారు, మళ్ళీ మరో కొత్త ఖద్దరు చొక్కా ఒంటికి ఎక్కించుకొని, నిన్న గుంటూరులో ఏరువాక కార్యక్రమానికి వచ్చి తన ఉపన్యాసంతో జనాలని కుమ్మేశారు.
పనిలో పనిగా, ఎవరేమన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బోనులో ఉన్నపులిలా పడున్న జగన్ మోహన్ రెడ్డి మీద నాలుగు రాళ్ళు వేసి తన కసి తీర్చుకొన్నాడు. ‘జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినా కూడా అతని పద్దతుల్లో మార్పు కనిపించడం లేదని, అతనికి సత్ప్రవర్తన అబ్బట్లేదని’ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, ‘పులి ఎక్కడ ఉన్నా పులే!’ అని చెల్లెమ్మ షర్మిల చెవిన ఇల్లు కట్టుకొని పోరుతున్నపటికీ ఆయనకి ఎందుకు అర్ధం కావట్లేదో అని జనాలు ఆశ్చర్యపోయారు.
ఇక, ఒంటి చేత్తో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ, ఆ సంగతిని పార్టీలో తన రామచంద్రుడు తప్ప మరెవరూ ప్రస్తావించలేదు. ప్రస్తావించడం సంగతి దేవుడెరుగు, కనీసం గుర్తించను కూడా లేదు. దానితో మనసు నొచ్చుకొన్నమంత్రిగారు కృతజ్ఞతలేని ఈ కాంగ్రెస్ నేతలకి ఓ మంచి మాటనడానికి కూడా నాలిక రాదని ఆవేదన చెందారు. అటువంటి వారిని నమ్ముకోవడం కంటే, స్వయంగా ఆ పనేదో మనమే చాటింపు వేసుకొంటే తప్ప జనాలు కూడా బొత్తిగా పట్టించుకొనే పరిస్థితి లేదని భావించి, ఏరువాకలో కర్ణాటక ఎన్నికల గురించి మాట్లాడారు.
అయితే పంటలకి కర్ణాటక ఎన్నికలకీ ఎటువంటి లింకూ లేదని గ్రహించిన తరువాత, మొన్న డిల్లీ వెళ్లి ముఖ్యమంత్రిని తిట్టిన సంగతి కూడా మరిచిపోయి, ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల, వ్యవసాయానికి తగిన సాయం అందుతుందని, అప్పుడు వ్యవసాయం కూడా లాభసాటిగా మారుతుందని,ఆయన గ్యారంటీ ఇచ్చారు.
ఈ మాటలన్నీ ఎందుకు? అదేదో సినిమాలో మీరు పాటందుకోగానే టపటపా వానపడిపోయినట్లు, మళ్ళీ ఇప్పుడు కూడా ఏదయినా పాటందుకొని నాలుగు వానలు కురిపిస్తే మా తిప్పలేవో మేమే పడతాము కదా అని రైతులు గొణుకొన్నారు.అయితే, అదేమి పట్టించుకోని ఆ పెద్దాయన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తాను, కొంచెం శ్రమ పడవలసి ఉన్నపటికీ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించక తప్పదని అభిప్రాయపడ్డారు.