మతతత్వ ముద్రనే ఇష్టపడుతున్న బీజేపీ
posted on Jun 22, 2013 @ 5:54PM
బీజెపీని ఎవరయినా మతతత్వ పార్టీగా అభివర్ణిస్తే ఆ పార్టీ నేతలు విరుచుకొని పడతారు. తాము తప్ప మిగిలిన పార్టీలన్నీ కుహనా సెక్యులర్ ముసుగులు ధరించి తిరుగుతున్నాయని వారు ఎద్దేవా చేస్తారు. అయితే, వారు హిందూమతానికి ప్రాతినిద్యం వహిస్తున్నసంగతిని ఎన్నడూ దాచిపెట్టుకొనే ప్రయత్నం చేయలేదు. దానిని అలుసుగా తీసుకొని కాంగ్రెస్, ఆ పార్టీపై మతతత్వ ముద్ర వేసి పబ్బం గడుపుకోవడం కూడా అందరికీ తెలిసిందే.
తన మతతత్వ ధోరణివల్ల బాబ్రీ మశీదు విద్వంసం జరిగినపుడు, దానికి ప్రధాన కారకుడయిన అద్వానీ ఏనాడు అందుకు పశ్చాతాపం వ్యక్తం చేయలేదు. కానీ, అదే ధోరణి వల్ల గుజరాత్ రాష్ట్రంలో మారణ కాండ జరిగినందుకు కారకుడయిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పార్టీ అధికారం కట్టబెట్టాలని చూసినప్పుడు మాత్రం ఆయన తీవ్రంగా వ్యతిరేఖిస్తూ తన పదవులకి రాజీనామా చేసారు. అంటే ఒక మతతత్వ వాదిని మరొక మతతత్వవాది అసహ్యించుకొంటున్నాడన్న మాట. మరటువంటప్పుడు, ఇతర పార్టీలు వారు అసహ్యిన్చుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?
తను చేసిన తప్పులనే మోడీ చేస్తే సహించలేని అద్వానీ, ఇప్పుడు అంతకంటే ఘనుడయిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎన్డీయే కన్వీనర్‌గా ఉండాలని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆహ్వానించినపుడు ఏవిధంగా స్పందిస్తారు? బీజేపీ కంటే నాలుగాకులు ఎక్కువే చదివిన శివసేన కేవలం మత తత్వమే కాకుండా ప్రాంతీయవాదం కూడా నరనరాన్న జీర్ణించుకొని ఉంది. పొట్ట చేత పట్టుకొని వచ్చిన బీహారీలు, గుజరాతీలు, దక్షిణాది వారిని ముంబై నుండి తరిమేయాలని ఆ పార్టీ గతంలో చాలా సార్లు విఫలయత్నాలు చేసింది.
బాల్ టాక్రే వారసుడిగా శివసేన పగ్గాలు చేతబట్టిన ఆయనకూడా తండ్రి అడుగు జాదలలోనే నడుస్తూ, ముంబైయేతరులను బయటకి పంపాలని గట్టిగా వాదిస్తున్నారు. అటువంటి భావాలున్న ఉద్ధవ్ ఠాక్రేను ఎన్డీయే కన్వీనర్‌గా ఉండాలని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కోరడం ద్వారా బీజేపీ తన మతతత్వ ముద్రను మరో మారు దృవీకరించుకొంటోందని చెప్పవచ్చును. తద్వారా తన కెదురయిన అవకాశాలను తానే జారవిడుచుకొంటోంది
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మోడీ గురించి మాట్లాడుతూ “దేశాన్ని కలిపే నాయకుడే మనకి కావాలి తప్ప, విడదీసేవాడు అవసరం లేదని” అన్నారు. మరిప్పుడు బీజేపీ అధ్యక్షుడు స్వయంగా ఉద్ధవ్ ఠాక్రేకు హారతి పట్టిన సంగతి తెలిస్తే మరి ఆయన ఏమంటాడో?