చర్చలు, దోశలు తరువాత ఇప్పుడు ప్యాకేజి కధ
posted on Jun 24, 2013 @ 8:59PM
తెరాస మరియు టీ-కాంగ్రెస్ నేతల రియాక్షన్ తెలుసుకోవడాని కోసమన్నట్లు ‘తెలంగాణా ప్యాకేజి’ మ్యాటర్ ని కాంగ్రెస్ పార్టీ మీడియాకి లీకేజ్ చేయగానే, ఊహించినట్లే ఇక్కడ నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దానితో మళ్ళీ కొందరు కాంగ్రెస్ నేతలు ‘అవ్వన్నీ గాలి వార్త’లంటూ ఖండనలు పడేసారు. కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఎక్కడ ఇచ్చేస్తుందో అని హడలి చచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ ప్యాకేజీ కబురు చెప్పగానే ‘అమ్మ కడుపు సల్ల గుండ!’ ‘నా ఉద్యమం సల్ల గుండ!’ అని వీపు రాసుకొని, ప్రకటన వెలువడగానే చేయవలసిన ముఖ్యమయిన పనులు అంటే ధర్నాలు, నిరాహార దీక్షలు, రాస్తా రోకోలు, బందులు వంటి కార్యక్రమాలకి షెడ్యుల్ నిర్ణయించేందుకు కేసీఆర్ తన వాళ్ళతో ఓ మీటింగేసుకొన్నాడు. పనిలో పనిగా ‘కాంగ్రెస్ కి బొందపెట్టుడు, భూమిలోపాతిపెట్టుడు’ వంటి పిల్లి శాపాలకు, ప్రాస బాగా కుదిరిందని ‘ప్యాకేజ్ అంటే ప్యాక్ చేసుడే’ అనే పంచ్ డైలాగు కూడా కొత్తగా యాడ్ చేసుకొన్నారు.
అటు కాంగ్రెస్ ప్యాకేజి ప్రకటించగానే, ఇటు తను పార్టీ టికెట్స్ పంచడం మొదలుపెడితే మరికొన్ని కాంగ్రెస్ చేపలను ఈ సారి వలలో వేసేయోచ్చునని ఆయన ఆశ. తద్వారా హోం సిక్కుతో బెంగ పెట్టుకొన్న కేశవ్ రావు, వినోద్, మందా వారికి పార్టీలో కొంచెం కంపెనీ దొరికితే హోమ్లీగా ఉంటుందని కేసీఆర్ ఆలోచన.
అయితే, కాంగ్రెస్ పార్టీ ఆలోచన వేరేలా ఉంది. ప్రస్తుతం టీ-కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరిపోయినప్పటికీ, ఏదో ఒకరోజున కేసీఆర్ నోటికి బలయినప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికే తిరిగి వస్తారనే ధీమా ఉంది. లేకుంటే, ఎన్నికల వరకు ఈ ప్యాకేజి గేం షో ఇలాగే కంటిన్యూ చేసుకొంటూ పోయి, సరిగ్గా ఎన్నికల గంట కొట్టగానే, తెలంగాణా మీద ఏదో ఒక సానుకూల ప్రకటన చేసేసి ‘సహేంద్ర తక్షకాయిస్వాహా’ అన్నట్లుగా కేసీఆర్తో సహా మొత్తం అందరినీ కాంగ్రెస్ మహా సముద్రంలో కలిపేసుకొంటే బెటరేమోనని కాంగ్రెస్ దురాలోచన. ఏమయినప్పటికీ, ఎన్నికల గంట మ్రోగేవరకు ఈ డ్రామాలు అందరూ కంటిన్యూ చేసికోవడం మాత్రం ఖాయం.