అలక పాన్పు దిగిన అద్వానీ
posted on Jun 22, 2013 @ 9:07PM
నరేంద్ర మోడీకి పదోన్నతి కల్పించడంతో అలక పాన్పు ఎక్కిన పార్టీ సీనియర్ నేత అద్వానీ, పార్టీలో అందరు తన ముందు సాగిలపడిన తరువాత, బెట్టు చాలించి అలక పానుపు దిగారు. మొన్న ఆర్. యస్.యస్. అధ్యక్షుడు మోహన్ భగవత్ కూడా ఆయనకు వాస్తవ పరిస్థితులకనుగుణంగా నడుచుకోమని సున్నితంగా మందలించడంతో, అద్వానీ ఇంకా మళ్ళీ లైన్లో పడక తప్పలేదు.
అయితే, తన పెద్దరికం చాటుకొంటూ, మొన్న డిల్లీలో జరిగిన ఒక సభలోఆయన మాట్లాడుతూ, మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఇతర పార్టీలతో ఇప్పటి నుండే ఎన్నికల పొత్తులు కుదుర్చుకొని, ఎన్డీయే కూటమిని బలపరుచుకోవలసి ఉందని ఆయన సూచించారు. ఆ సూచన కొత్తగా పార్టీ ప్రచార కమిటీ పగ్గాలు చెప్పటిన నరేంద్రమోడీకి చేసిన సూచనని వేరే చెప్పనవసరం లేదు.
ఎన్డీయే కూటమి నుండి జనతాదళ్ (యు) తప్పుకోవడంతో, కూటమి జాతీయ స్థాయిలో బలహీనపడింది. అంతే కాకుండా నిన్నటి వరకు మిత్రుడిగా కలిసి పనిచేసిన నితీష్ కుమార్ ని, ఆయన జేడీ(యు)పార్టీని బీహార్ రాష్ట్రంలో ఎదుర్కోవలసి ఉంటుంది. నితీష్ కుమార్ గనుక వెళ్లి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే బీజేపీకి మరింత క్లిష్టపరిస్థితులు ఎదుర్కోక తప్పదు. గనుక, ఆ సమస్యలను పరిష్కరించుకోవలసిన బాధ్యత మోడీదేనని అద్వానీ చెప్పకనే చెప్పారు. తద్వారా మోడీకి కార్యాచరణ ప్రణాలికను కూడా ఆయనే సూచించి ఎలా నెగ్గుకు వస్తారో చూద్దామనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చును.