తెలంగాణాపై రాజకీయ పార్టీల చదరంగం
posted on Jun 23, 2013 @ 12:31PM
తెలంగాణా ప్రజల భావోద్వేగాలకు సంబందించిన సున్నితమయిన తెలంగాణా అంశం, తెరాసతో సహా అన్ని రాజకీయ పార్టీలకి ఇప్పుడు ఒక రాజకీయ లబ్ది చేకూర్చే ఒక ఆయుధంగా మారిపోయింది.
తెలంగాణా అంశాన్ని ఉపయోగించుకొని, రాబోయే ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలుచుకొని తెరాస రాష్ట్రంలో, కేంద్రంలో చక్రం తిప్పాలని కలలు గంటుంటే, కాంగ్రెస్ పార్టీ ఒకసారి చర్చలు, మరొకసారి దోశలు, మరొకసారి ప్యాకేజీలు అంటూ కాలక్షేపం చేస్తూనే, ఎలాగయినా రాబోయే ఎన్నికలలో తెలంగాణాలో మళ్ళీ విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవాలని కోర్ కమిటీ వ్యూహాలు రచిస్తోంది.
ఇక్కడ తెలంగాణా ప్రాంతంలో కొంచెం హడావుడి మొదలవగానే, అక్కడ డిల్లీలో కోర్ కమిటీ సమావేశాలు మొదలయిపోతాయి. కానీ, వాటి వల్ల తెలంగాణాకి మాత్రం ఒరిగేదేమీ ఉండదు. తెలంగాణాకి ప్రత్యేక ప్యాకేజ్ అంటూ కాంగ్రెస్ అధిష్టానం మీడియాకి ఒక గాలి వార్త లీక్ చేసి తెలంగాణావాదుల రియాక్షన్ కోసం ఎదురు చూస్తుంటే, కొన్ని రోజులు రాజీనామా డ్రామాలు, మరి కొన్ని రోజులు పార్లమెంటు మెట్ల మీద ధర్నాలు చేసిన తెలంగాణా కాంగ్రెస్ నేతలు, మళ్ళీ ఇప్పుడు 30వ తేదీన బహిరంగ సభ అంటూ హడావుడి చేస్తూ తమ ఉనికిని కాపాడు కొనే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇక, తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చామని చెప్పుకొంటున్న తెదేపా, దాని అధ్యక్షుడు చంద్రబాబు ఏనాడు కూడా ప్రత్యేక తెలంగాణా గురించి స్పష్టంగా మాట్లాడింది లేదు. అయినప్పటికీ, తాము కూడా ఈ ‘తెలంగాణా ఆటలో’ వెనుకబడి పోకూడదని ‘బయ్యారం మొదలుకొని చలో అసెంబ్లీ’ వరకు ఏ అవకాశాన్ని ఆ పార్టీ జారవిడుచుకోలేదు. అలాగని ప్రత్యేక తెలంగాణా కావాలని చంద్రబాబు ఏనాడు కోరలేదు కూడా.
ఇక, వైకాపా సంగతి సరే సరి! రాష్ట్రాన్ని ఏలేద్దామని రంగంలోకి దూకిన ఆ పార్టీ తెలంగాణా అంశంపై తమ అభిప్రాయం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అదేవిషయం గురించి తెలంగాణా ప్రజలు నిలదీస్తుంటే, ‘జగనన్న వస్తాడు, రాజన్న రాజ్యం తెస్తాడు’ అంటూ అసందర్భ సమాధానాలతో తెలంగాణాలో పార్టీని నిలుపుకోవాలని తిప్పలు పడుతున్నారు.
ఇక, బీజేపీ మాత్రం ప్రత్యేక తెలంగాణకు విస్పష్టంగా తన మద్దతు ప్రకటించడమే గాకుండా ఉద్యమాలు కూడా చేస్తోంది. అయితే ఆ పోరాటాల ద్వారా తెలంగాణా ప్రజల మనసు గెలుచుకొని, తెలంగాణా ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ ముఖ్యోదేశ్యం. అంటే, బీజేపీకి కూడా తెలంగాణా అంశం రాజకీయ లబ్ది చేకూర్చే అంశంగానే భావిస్తోందన్నమాట.
తెలంగాణా అంశం ఎంత సున్నితమయినదో, అంత బలమయినదని తెరాస కనిపెట్టినప్పటి నుండి, రాజకీయ పార్టీలకు అదొక రాజకీయ ఆయుధంగా మారిపోయింది. ఎవరికి అవసరమయినట్లు దానిని తమ అవసరాలకు అనుగుణంగా వాడుకొంటున్నారు తప్ప దానివల్ల ప్రజల మనోభాలు ఎంతగా గాయపడతాయో ఎవరికీ పట్టడంలేదు. సున్నితమయిన తెలంగాణా అంశం ఈవిధంగా రాజకీయ పార్టీలకు ఆట వస్తువుగా మారిపోవడానికి ప్రధాన కారణం, తెలంగాణా నేతలలో చిత్తశుద్ధి లేకపోవడమే. సంకల్ప బలం లేని నేతలు, అందుకు వేరెవరినో నిందిస్తూ తమకు అన్ని విధాల లబ్ది కుదిర్చేఈ రాజకీయ చదరంగం కొనసాగిస్తూనే ఉంటారు. వారిని సవరించి దారిన పెట్టుకోవలసిన బాధ్యత తెలంగాణా ప్రజలది, మేధావులదే.