అమ్మో .. 'రూపాయ్'
posted on Jun 22, 2013 @ 1:53PM
.....సాయి లక్ష్మీ మద్దాల
నేడు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థను వణికిస్తున్న ఒకే ఒక అంశం పెరిగిన డాలర్ రేటు. భారతదేశంతో పాటు మిగిలిన చాలా దేశాల కరెన్సీ విలువ పడిపోయింది. దీనికి కారణం ఏమిటి?ప్రపంచం మొత్తం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నా కూడా ఏమాత్రం చెక్కు చెదరని పటిష్టమైన ఆర్ధికవ్యవస్థ మన భారతదేశానిది అని ఢంకా బజాయించే మన నేతలంత నేటి ఈ పరిస్థితికి ఏమని సమాధానం చెప్తారు?అసలు ఈపరిస్థితికి కారణం ఏమిటి?రూపాయి విలువ పడిపోయిన వైనం ఒక్కరాత్రిలో జరిగినది కాదు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో దాదాపు 30%ఆర్ధిక వ్యవస్థ అమెరికా భాగస్వామ్యంలో ఉంది. ప్రపంచీకరణ నేపధ్యంలో విదేశీ వస్తువుల మీద మోజు పెరగటం,తద్వారా వాటి దిగుమతులు పెరగటం పరిపాటి అయిపోయింది. ఇది కుడా నేటి ఈ పతనానికి ఒక కారణం.
అమెరికా ఫెడరల్ బ్యాంకు ఉద్దీపన ప్యాకేజి పేరుతో ప్రతినెల ముద్రిస్తున్న 85 బిలియన్ డాలర్ల అధిక కరెన్సీని తగ్గిస్తాయన్న సంకేతాలు వెలువడి నప్పటి నుండి అంటే ఏప్రిల్ చివరి నుంచి రూపాయి పతనం వేగవంతమ్ అయింది. ఎక్కువగా విదేశీదిగుమతులపై ఆధారపడటం,కరెంట్ అకౌంట్ లోటు అధికంగా ఉండటం మూలాన భారతీయ కరెన్సీ ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కుంటోంది. గడచిన 5సం "ల కాలంలో రూపాయి విలువ 50%నికి పైగా పడిపోయింది.2008లో రూ॥ 39/- వద్ద ఉన్న డాలరు విలువ నేడు రూ60/-ల సమీపానికి చేరింది. దీనివలన దిగుమతులు మరింత భారమయ్యె పరిస్థితి కనిపిస్తుంది. దీని వలన దేశ సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదముంది. అయితే ఆర్ధిక మంత్రి ఇతర కొంతమంది ఆర్ధిక నిపుణులు దిగుమతులను కట్టడి చేయాలని చుబుతున్నారు. ఏ దిగుమతులను కట్టడి చేయాలి?ఎరువులా?క్రూడ్ ఆయిలా ?వ్యవసాయాధారితమైన భారతదేశానికి ఎరువుల అవసరం ఎంత ఉందొ అందరికి తెలిసినదే,క్రుడాయిల్ అవసరం మనదేశానికే కాదు అన్ని దేశాలకు ఉంది. తదనుగుణంగానే ఈరెండింటి దిగుమతి తప్పనిసరి. ఇక్కడ కట్టడి చేయగలిగిన దిగుమతి కేవలం ఒక్క బంగారం మాత్రమే.
కరెంట్అకౌంట్ లోటును పుడ్చాలంటే తక్షణ చర్యలేవి?ప్రభుత్వం పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయలేదు. ఉన్న పెట్టుబడులన్నీ అవినీతి లోకి మళ్ళి పోయాయి. వ్యవసాయాధారిత దేశంలో నేటికి ఎరువులను దిగుమతి చేసుకున్తున్నామే గాని ఎరువులను ఉత్పత్తి చేయలేక పోతున్నాము. రూపాయి పతనం కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థలో ద్రవ్యం లభ్యత కఠినం అవుతుంది. భారత స్టాక్ మార్కెట్ కు బయటి నుండి నిధులు రావటం తగ్గిపోతుంది. రూపాయి విలువ నానాటికి క్షీణిస్తున్న దశలో ఇంధన సబ్సిడితో పాటు,ఎరువుల సబ్సిడీ కూడా అమాంతం పెరిగే ప్రమాదముంది. డాలర్ విలువ ఒక్క రూపాయి పెరిగితే ఇంధన ఖర్చు రూపంలో సంత్సరానికి 9000కోట్ల రూపాయల అదనపు భారం భారత ప్రజానీకం మీద పడుతుంది. ముఖ్యంగా రూపాయి పతనం కారణంగా పేద,మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతారు. వంటనూనెల నుండి నిత్యావసర వస్తువులు,పెట్రోలియం ఉత్పత్తుల ధరలతో ప్రజానీకం విలవిల లాడే పరిస్థితి. దీనితో మధ్యతరగతి ప్రజల నెలవారీ ఇంటి బడ్జెట్ 15%నుండి 20%నికి పెరిగిపోతుంది.
నేడు భారతీయ ఆర్ధిక రంగం విలవిల లాడుతోంది. దీనికి కారణం,మన నేతలు ఎన్నో సంత్సరాలుగా చేస్తున్న తప్పుల ఫలిత మిది. ఓట్ బాంక్ రాజకీయాల కోసం ఎటువంటి పథకాలనైన అమలుపరిచే రాజకీయ యంత్రాంగం చేతకాని తనం,నిర్ణయ రాహిత్యం కారణంగా ఏర్పడిన సంక్షోభం ఇది. అర్ధం పర్ధం లేని పధకాల అమలు కారణంగానే ఆర్ధిక రంగం గాడి తప్పింది. దీనిని గాడిలో పెట్టాలంటే,ప్రభుత్వం చాలా విషయాల మీద దృష్టి సారించాలి. అందులో ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని అభివ్రిద్ది చేసి,తద్వారా ఉపాధిని కల్పించాలి. ఈకొద్ది మంది పెట్టుబడిదారుల ఆధిపత్యం కాకుండా పారిశ్రామిక వికేంద్రీకరణ చేపట్టాలి. ఇది కొంచెం దీర్ఘకాలిక ప్రణాళిక. ఇప్పటికిప్పుడు సత్వర నివారణ చర్యలు అంటే మన దేశం చేస్తున్న ఎగుమతులైన బాసుమతి బియ్యం ,వజ్రాలు,జౌళి ఉత్పత్తులు,రసాయనాలు,ఔషధాలు,ఇంజనీరింగ్ విడిభాగాలఉత్పత్తి,తదితర ఎగుమతుల పరిమాణం పెరగాలి. దానికి తగిన తోడ్పాటు,ప్రోత్సాహకం ప్రభుత్వం అందించాలి. ప్రభుత్వనిధులు పనికిమాలిన పధకాల కోసం కాక సక్రమమైన వాణిజ్య ఉత్పత్తుల కోసం ఖర్చు చేయ గలగాలి. ముఖ్యంగా ఓట్ బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి దేశ సంక్షేమానికి పెద్దపీట వేయగలిగితే,భవిష్యత్తులో మరోసారి ఇలాంటి విపత్తు బారిన పడకుండా దేశాన్ని కాపాడిన వారవుతారు. దేశ ప్రజలు కూడా రానున్న భవిష్యత్త్ ప్రయోజనాల రీత్యా పొదుపుకు పెద్ద పీట వేయాలి.