విద్యార్దుల మనసులలో విషబీజాలు నాటుతున్న ఉద్యమాలు

  సీమంధ్ర ప్రజలను ద్వేషిస్తున్న నోటితోనే, తెలంగాణా ఏర్పడితే అక్కడ స్థిరపడిన సీమాంధ్రా ప్రజల ధన,మాన, ప్రాణాలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకీ ఎటువంటి ముప్పు ఉండదని, అందుకు తాము పూచీ అని తెరాస నేతలు గట్టిగా చెపుతుంటారు. అయితే, వారు తెలంగాణా ఉద్యమం పేరిట నేర్పిన విద్వేష పాఠాలు బాగా వంట బట్టించుకొన్న కొందరు, స్థానికేతరుల మీద విషం చిమ్మడం మొదలుపెట్టారు.   మొన్న సోమవారం నాడు, నిజాం కాలేజీలో ఉస్మానియా పీజీ కోర్సులలో ప్రవేశం కొరకు జరిగిన ఓయు కామన్ ఏంట్రాన్స్ టెస్ట్ కౌన్సిలింగ్ కోసం వచ్చిన స్థానికేతర విద్యార్ధులను కొందరు తెలంగాణా విద్యార్దులు అడ్డగించి వెనక్కి తిప్పి పంపేసారు. ఏ విశ్వవిద్యాలయంలోనైనా స్థానికేతరులకు 15 శాతం కోటా ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఈ సీట్లు భర్తీ చేయబడుతాయి. దానికి స్థానికులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చును. దానికి దరఖాస్తు చేసేందుకు వచ్చిన స్థానికేతర విద్యార్ధులను కొందరు తెలంగాణా విద్యార్దులు అడ్డుకొని తిప్పి పంపేసారు.   ఇది ఈ రోజు కొత్తగా మొదలయిన సమస్యేమి కాదు. గత మూడు నాలుగేళ్ల నుండి ఉస్మానియాలో ఇదే తంతు నడుస్తున్నా ఎవరూ పట్టించుకొనే నాధుడు లేదు. మొన్న సోమవారం నాడు కూడా మళ్ళీ అదే తంతు జరుగుతున్నపుడు అక్కడే ఉన్న పోలీసులు కానీ, విశ్వవిద్యాలయ అధికారులు గానీ కలుగజేసుకోలేదు. కళ్ళ ముందు జరుగుతున్నఅన్యాయాన్ని చూస్తూ కూడా, విద్యార్ధులెవరూ తమకు పిర్యాదు చేయలేదని చేసినట్లయితే తగిన చర్యలు తీసుకొంటామని ఉస్మానియా వైస్ చాన్సిలర్ ప్రొఫసర్.సత్యనారాయణ చెప్పడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.   అదే విధంగా మొన్న ‘నమస్తే తెలంగాణా పత్రిక’ సీమంద్రా లో ఆత్మీయ యాత్ర చేపట్టినపుడు, అమలాపురంలో కొందరు సీమాంధ్ర యువకులు వాహనాన్ని అడ్డుకొని, పత్రిక ప్రతులను తగుల బెట్టారు. ఈవిధంగా ఇతరుల అభిప్రాయాల పట్ల అసహనం చూపడం వలన మరింత విద్వేషం పెరుగుతుందే తప్ప వేరే ప్రయోజనం ఉండదు.   నేడు ఉస్మానియాలోనో లేక కాకతీయాలోనో లేక ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనో చదువులు పూర్తి చేసుకొన్నవిద్యార్ధులు రేపు ఉన్నత చదువులకి లేదా ఉద్యోగాలకి ఇతర రాష్ట్రాలకి, దేశాలకి వెళ్లి నప్పుడు వారికి అక్కడ ఇదే అనుభవం ఎదురయితే ఏవిధంగా ఉంటుందో ఆలోచించి ఉంటే వారు ఈవిధంగా చేయరు. స్వార్ధ రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనేక ఉపదేశాలు చేస్తుంటారు. అయితే, భావి భారతాన్ని నిర్మించాల్సిన విద్యార్దులు అటువంటి ఉపదేశాలకు లొంగిపోకూడదు.   వేయి మంది తెలంగాణా యువకులు తమ బలిదానాలతో కన్నవారికి ఆగర్భశోకం మిగిల్చితే, నేడు దానికి కారకులయిన మహానుభావులు ఎన్నికలు ఓట్లు, నోట్లు సీట్లు అని రాజకీయాలు చేసుకొంటున్నారు. అటువంటి స్వార్ధ రాజకీయ నేతల మాటలకి లొంగిపోయి విద్యార్ధులు బలిదానాలు చేసుకోవడం, సాటి విద్యార్ధులపట్ల విద్వేషం వెళ్ళగక్కడం సబబు కాదు. విద్యార్ధులు రాజకీయ నాయకులకి ఆదర్శంగా నిలవాలి తప్ప రాజకీయ నాయకులని ఆదర్శంగా తీసుకోరాదు.   ఉడుకు రక్తం గల విద్యార్దుల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఉద్యమాల బాట పట్టించిన సదరు నేతలు తమ రాజకీయ భవిష్యత్ నిర్మించుకొంటుంటే, విద్యార్ధులు మాత్రం తమ చదువులను, భవిష్యత్తుని, చివరికి ప్రాణాలను కూడా త్యాగాలు చేస్తున్న సంగతి గుర్తుంచుకొంటే, తాము రాజకీయ నేతల చేతిలో పావులుగా వాడుకోబడుతున్నామని అర్ధం అవుతుంది.   నేడు రాష్ట్రం సమైక్యంగా ఉంది. రేపు విడిపోవచ్చును. కానీ, మనుషులు ఎక్కడ ఉన్నా మానవత వెల్లివిరియాలి. మానవత్వం, వివేకం లేని విజ్ఞానం ఎంత ఉన్నామనిషి మనిషిగా చెప్పుకోవడానికి అర్హత ఉండదు. భావి భారతాన్ని నిర్మించవలసిన విద్యార్దులు సంకుచిత భావాలు విడనాడి మనమంతా భారతీయులమనే విశాల దృక్పధం అలవరుచుకోవాలి.

వైఎస్ విజయమ్మ పై కేసు

      వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మీద ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదయింది. వరంగల్ జిల్లా మరిపెడ మండల కార్యాలయం ఆవరణలో సభ నిర్వహించారు. గత నెల 28న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు ఇక్కడ బహిరంగసభకు అనుమతి తీసుకున్నారు. అయితే బుధవారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయానికి చెందని స్థలంలో సభ నిర్వహించవద్దని స్థానిక ఎంపీడీవో నోటీసు పంపారు. దీనిని పట్టించుకోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు యధావిధిగా సభ నిర్వహించారు. దీంతో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లు అయింది. మరిపెడ ఎంపీడీవో ఫిర్యాదు మేరకు విజయమ్మతో పాటు ఏడుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసు నమోదయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశారు.

మావోయిస్టు మాజీనేత పై కొడవళ్ళతో దాడి

మావోయిస్టు మాజీనేత గంటి ప్రసాదంపై నెల్లూరులో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులు, వేటకొడవళ్ళతో దాడి చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు వచ్చిన ఆయనపై దుండగులు వేటకొడవళ్ళతో దాడి చేసి తుపాకితో కాల్పులు జరిపారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేస్తున్నారు. గంటి ప్రసాదం నెల్లూరుకు వస్తున్నాడని తెలిసి ముందస్తు వ్యూహంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా పోలీసులే ఈ దాడికి పాల్పడి ఉంటారని విరసం నేత వరవరరావు సందేహం వ్యక్తం చేశారు.

స్వామి వివేకానందుని మహా నిష్క్రమణ!

....గోపి చిల్లకూరు       అమెరికా తో స్వామిజి కి ఏర్పడిన విశ్వ మత సభల ఆధ్యాత్మిక అనుభందం, స్వామిజి ఆధ్యాత్మిక జైత్ర యాత్ర అమెరికా ప్రజలతో పాటు తన భారతీయుల మదిలో ఎంతో స్పూర్తిని, ఆత్మ విశ్వాసాన్ని, ఒక ఆదర్శాన్ని నింపి నిద్రావస్తలో వున్న భారతీయులను మేల్కొలిపి కార్యోన్ముకులను చేసాయి. ఎందరో స్వతంత్ర సమరయోధులు స్వామిజి ప్రసంగాలు, రచనల ద్వారా ఉత్తేజితులై స్వాతంత్రము కోసం పోరాడి కొంత కాలానికి విజయం సాదించారు.   స్వామిజి అమెరికన్ స్వాతంత్ర దినం రోజు జూలై 4th 1902 నాడు భౌతికముగా మహా సమాధి అయ్యారు. ఆశ్యర్య కరముగా మహా సమాధికి నాలుగు సంవత్సరాల క్రితం 4th of July 1898 నాడు అమెరికన్ శిష్యులతో కలసి కాశ్మీర్ పర్యటనలో వున్నప్పుడు .ఒక అమెరికన్ భక్తు రాలు స్వామిజి ని అమెరికన్ స్వతంత్ర దినం రోజు సందేశం ఇవ్వమని అడిగితె ,అయన ప్రేమతో జూలై 4 వ తేది అమెరికన్ స్వాత్రంత్రదినాన్ని గురించి అద్భుతమైన పద్యం ఇంగ్లీష్ లో వ్రాసి శిష్యులచే చదివించారు స్వామిజి అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజున అమెరికన్ భక్తుల కోసం తనని ఆదరించిన అమెరికా దేశం పై అద్భుతముగా ఒక గీతం రాసి అమెరికాకు అంకిత మిచ్చారు . అమెరికా స్వాతంత్రము పై అయన కవితా ప్రవాహం ఇలా పొంగి పొర్లింది . Fourth Of July, Poem By Swami Vivekananda Behold, the dark clouds melt away, That gathered thick at night,and hung So like a gloomy pall above the earth! ["రాత్రి గాఢముగా క్రమ్మి భూమి పై విషాద యావని కల్లా వేలాడుతున్న కారు మేఘాలు ఎలా కరిగిపోతున్నాయో చూడు ] Before thy magic touch,the worldAwakes. The birds in chorus sing. The flowers raise their star-like crowns- Dew-set, and wave thee welcome fair. నీ అమృత స్పర్శతో జగత్తు మేల్కొనుచున్నది ,పక్షులు ఐక్య కంఠ ముతో పాడుతున్నాయి ! శశిరచ్చాదిత ప్రసూనాలు నక్షత్ర మండిత మకుటాలతో తల ఎత్తి నీకు సుస్వాగతము పలుకుతున్నాయి . The lakes are opening wide in love Their hundred thousand lotus-eyes To welcome thee, with all their depth. All hail to thee, thou Lord of Light! [నిన్ను ఆహ్వానించుటకై శత కోటి కమల నయనాలతో సరస్సులు తమ హృదయాంతరాల నుండి ప్రేమ భాహువులను ప్రసరించు చున్నాయి] A welcome new to thee, today, O sun! today thou sheddest LIBERTY! Bethink thee how the world did wait, And search for thee, through time and clime. [ ధీర మణి నీకు విజయోస్తు భాస్కర ! మారోసారి ఈనాడు నీకు నవీన ఆహ్వానం నేడు నీవు స్వతంత్రం కురిపిస్తున్నావు ! దీర్ఘ కాలం నుండి ప్రపంచమంతా నిన్ను గాలిస్తూ ,నీ కొరకు తహ తహతో ఎలా నిరీక్షించి వుందో ఒక్కసారి అలోచించి చూడు] Some gave up home and love of friends, And went in quest of thee, self banished, Through dreary oceans, through primeval forests, Each step a struggle for their life or death; [ ఎంతో మంది గృహాన్ని ,మిత్ర ప్రేమను పరిత్యజించి స్వయం గా గంభీర సముద్రాలూ దాటుతూ ,దట్ట మైన అరణ్యాల లో నడుస్తూ వేచిన ప్రతి అడుగు జీవన్మరణ సమస్య గా నీ అన్వేషణలో మునిగి పోయారు] Then came the day when work bore fruit, And worship, love, and sacrifice, Fulfilled, accepted, and complete. Then thou, propitious, rose to shed [వారి పరిశ్రమ పలిచిన ఒక్క సుదినం వచ్చింది వారి పూజ ,ప్రేమ ,త్యాగం స్వీకరించ బడ్డాయి ,పరి పూర్ణతను పొందాయి . నువ్వు అత్యంత ప్రీతి మంతుడవు అయ్యావు ] The light of FREEDOM on mankind. Move on, O Lord, on thy resistless path! Till thy high noon o'erspreads the world. Till every land reflects thy light, Till men and women, with uplifted head, Behold their shackles broken, and Know, in springing joy, their life renewed మానవాళి పై "స్వంతంత్ర జ్యోతి ని వెదజల్లడానికి లేచావు నీ మద్యాహ్నపు దినపు ఖరకిరణాలు ప్రపంచాన్నంతా ముంచెత్తెవరకు ,ప్రతి దేశము నీ క్రాంతిని ప్రతిబింబించే వరకు , స్రీ పురుషులు అందరు ఎత్తిన తలలతో తమ సంకెళ్ళు సడల బడి , తమ జీవితాలు క్రొత్త ఆనందముతో సరి కొత్త గా చూసేంత వరకు ప్రభూ ! నీ దివ్యమైన పధం లో పయనించు . అసంఖ్యాక సుఖాశిస్సులు !   జూలై 4th 1902 న మహాసమాధి చెందినా స్వామిజి వివేకానంద భౌతికముగా తన చివరి ఏడు రోజులు బేలూరు మఠ్ లో ఇలా గడిపారు ------------------------------------------------------------------------------------------------------------ శిష్యులు తమ కార్యనిర్వహణలో సమస్యలు చెప్పు కోవడానికి అయన దగ్గరకు వచ్చినపుడు సున్నితముగా తిరస్కరించి "ఇంకా నేను బౌతిక విషయాలలో నన్ను తలదూర్చ నియద్దని ,శిష్యులు తమ నాయకుడు వారితో లేనపుడే వారి సామర్ద్యము వెలువడుతుందని మీ ప్రకారం మీరు ప్రయతించండి అని చెప్పి ,నేను భగవంతుని లో ఇక్యానికి దగ్గరగా వున్నాను అని చెప్పారు . మూడు రోజులకు ముందు ఏకాదశి రోజున సోదరి నివేదిత కు తన స్వహస్తాలతో భోజనము వడ్డించి,తినిపించి ,ఆమె చేతులు కడుగుకోడానికి తనే నీళ్ళు,towel ఇచ్చారు ,సోదరి నివేదిత స్వామిజి ని ఏమిటి స్వామి ఇది అని వారిన్చినపుడు ,ఆమెతో స్వామి ఇలా అన్నారు " ఏసు ప్రభువు తన భక్తుల పాదలను స్వయంగా కడిగారు కదా అన్నారు ". వెంటనే నివేదిత స్వామిజి ఇదే చివరి సారి ఇలా అనభోయీ ,క్షణంలో తమాయించుకున్నారు ఆమెకు ఏదో చెడు స్పురించినది (మహాసమాధి) .కాని అదే చివరిది అయినది. చివరి రోజు 4th జూలై నా స్వామిజి ఎప్పటికంటే ముందుగా ఉదయాన్నే లేచి ధ్యాన మందిరం లోకి వెళ్లి తలుపులు గట్టిగా బంధించుకొని ౩ గంటలు ధ్యానములో గడిపారు తన రోజు వారి పనులకు విరుద్దగాముగా.తరువాత ఆనందముగా ,తన్మయత్వముతో మెట్లు దిగుతూ జగజ్జనని కాళిమాతా పై అద్భుతమైన పాట పాడారు,కొద్దిచేపు తరువాత తనలో తను మాట్లాడుకొంటూ "ఇంకొక వివేకానందుడు వుంటే ,అయన మాత్రమే ఈ వివేకానందుడు చేసిన కార్యాలు అర్దమై ఉండేవి ,ఆయినా ఎన్ని మంది వివేకనందులు పుడుతారు ఎంతో కాలానికి గాని " అన్నారు . సాయంతం స్వామి ప్రేమానంద తో కలసి దాదాపు రెండు మైళ్ళు నడుస్తూ వేద కాలేజీ ప్రారంభించడానికి కొన్ని చూచనలు చేసారు .చివరగా మాట్లాడుతూ భారత దేశం ఆద్యాతమక,పుణ్య దేశం ,భారత దేశం స్తిరంగా నిలబడేది భగవంతుని అన్వేషణలోనే ,ప్రపంచానికి భగవంతుని అన్వేషణ గూర్చి తెలెయ చెప్పడమే కాని ఇది రాజకీయాలలో ,సాంఘిక విషయాలలో తలడూర్చకూడదు. స్వామిజి సాయత్రం ఏడు గంటలకు అయన రూం లోకి వెళ్లి శిష్య్లని ఆయనను పిలిచేదాకా రావద్దని చెప్పి వెళ్లారు . ఒక గంట ధ్యానం తరువాత అందరిని పిలిచి తలుపులు కిటికీలు తీసి ,అయన పడక పై పనుకొన్నారు. ఒక గంట తరువాత అయన గట్టిగా భారం గా శ్వాస పీల్చారు .మరల కొద్ది సెకండ్ల తరువాత అదేవిధముగా శ్వాస పిల్చి శరీరాన్ని వదిలారు .అయన తన సోదర శిష్యులతో తరచు చేపుతుందే వారు తానూ 40 వ జన్మదినం జరుపుకోలేనని,చివరకు అదే నిజమవుతూ ౩౦ సంవస్తరాల 5 నెలల ఇరవై నలుగు రోజులు బౌతికముగా జీవిచారు. స్వామి వారి జయంతిని January 12th ను జాతీయ యువజన దినోస్తావం గా జరుపుకుంటాము . 150 వ జయంతి ఉత్సవాలు గత మూడు సంవత్సరాలుగా భారత దేశములోనే కాకుండా ప్రపంచ వ్యాప్తముగా ఘనం గా జరుగుతున్నాయి ఎక్కడా కూడా అయన మహాసమాధి ,వర్దంతి లు జరుపము ఎందుకంటే స్వామి వారు బౌతికముగ ,శారీరకం గా మనకు దూరమయ్యారు కాని అయన రగిలించిన స్పూర్తి ,ఆయన రచనలు ,అయన ఏర్పాటు చేసిన శ్రీ రామకృష్ణ మఠ్ లు భారతీయులకు తరతరాలుగా ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చూపిస్తూనే వుంటాయి . ప్రపంచ యువతకు అయన సందేశాలు మార్గదర్శకాలు అవుతాయి .

అల్లూరి సీతారామరాజు జయంతి

      అది భరతమాత తెల్లోడి కబంద హస్తాల్లో నలిగిపోతున్న రోజులు.. ఉత్తర భారతంలో స్వతంత్రోధ్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజులు అలాంటి సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లా అడవుల్లో ఓ అగ్నికణం పుట్టింది.. ఆ అగ్ని కణమే దావాణలంలా వ్యాపించి బ్రిటీష్‌ సామ్రాజ్య గుండెల్లో వణుకు పుట్టింది.. అలా తెల్లోడి పెత్తనం మీద గర్జించిన తెలుగు తేజమే అల్లూరి సీతారామరాజు.. ఈ రోజు ఆ విప్లవ వీరుని జయంతి సందర్భంగా ఆ త్యాగాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.. తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగరా... దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా... అంటూ భరతమాత విముక్తి కోసం బ్రిటీషువారిని గడగడలాడించిన మన్యం వీరుడు మన అల్లూరి సీతారామరాజు. అల్లూరి ఒక వ్యక్తి కాదు ఆయనో మహోజ్వల శక్తి. ఆయన జీవితం విప్లవానికి ఒక సంకేతం. స్వతంత్రం సాదించటానికి ఆయుధాలు సుశిక్షుతులైన సైనికులు కాదు..అది సాధించాలన్న కాంక్ష చాలని నిరూపించిన అసలు సిసలు భారతీయుడు అల్లూరి. అందుకే లోకజ్ఞానం లేని అడవి బిడ్డలనే ఆయుధాలుగా మార్చి తెల్లదొరలు గుండెలు చీల్చాడు.. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. అడవిబిడ్డలైన గిరిజనులను ఏకంచేసి... ఆ ప్రకృతి సంపదలను అనుభవించే హక్కు గిరిజనులదేనని ఎలుగెత్తి చాటాడు. ఈయన పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యం. పోడు వ్యవసాయానికి పన్ను కట్టక్కర లేదన్నాడు, గిరిజనులను నిలువు దోపిడీ చేస్తున్న దళారుల మీద, వారికి అండదండలుగా ఉన్న బ్రిటీషువారిమీద అల్లూరి తన విల్లును ఎక్కుపెట్టాడు. ప్రతీ గిరిజనున్ని ఒక గెరిల్లా యోధునిగా మార్చి తెలుగు నేలకు స్వతంత్ర పోరాట మార్గం చూపాడు.. భీమవరానికి ఆరుమైళ్ల దూరంలో ఉండే మోగల్లులోని పాండ్రంకిలో వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు 1897 జూలై 4వ తేదీన జన్మించారు అల్లూరి సీతారామరాజు. ఆంగ్లం, సంస్కృతం, తెలుగు బాగా చదువుకున్న వెంకటరామరాజుకు జాతీయ భావాలు ఎక్కువే. తండ్రి భావాలను పుణికిపుచ్చుకున్న అల్లూరికి, తండ్రి నడిపే ఫొటో స్టుడియోలోని జాతీయ నాయకుల ఫొటోలు, వారి జీవిత విశేషాలు ఎక్కువగా ప్రభావం చూపించాయి. వందేమాతరం ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే పసిప్రాయం వీడకపోయినా తండ్రితో సహా అనేక సభల్లో పాల్గొన్నారు. అదే సమయంలో గిరిజనులపై జరుగుతున్న దురాగతాలను చూసి చెలించిపోయిన అల్లూరి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులను నేర్పించి పోరాటానికి సిద్దం చేశాడు. 1922 సంవత్సరం మన్యంలో కాలుపెట్టిన సీతారామరాజు విప్లవానికి రంగం సిద్ధం చేశాడు. తన విప్లవ దళాలతో పోలీసు స్టేషన్లపై మెరుపుదాడులు నిర్వహించి బ్రిటిషు అధికారులను గడగడలాడించాడు. సమాచారం ఇచ్చి మరీ పోలీసుస్టేషనులపై దాడుల నిర్వహించి బ్రిటిషు అధికారుల్లో ముచ్చెమటలు పట్టించాడు. అయితే అదే ఏడాది అల్లూరి సీతారామరాజు విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. 1922 డిసెంబరు 6న జరిగిన పోరులో 12 మంది అనుచరులను రామరాజు కోల్పోయాడు. ఆ తర్వాత రామరాజు కొన్నాళ్లు ఎలాంటి పోరాటాలు జరుపలేదు ఆ సమయంలో ఆయన మరణించాడనే పుకార్లు కూడా వ్యాపించాయి. అయితే అల్లూరి 1923 సంవత్సరం ఏప్రిల్ నెలలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. మరోసారి దాడులకు దిగాడు. కాని అల్లూరికి సాయం చేస్తున్నారన్న నేపంలో బ్రిటీస్‌ అధికారులు మన్యం ప్రజలను వేథిచటం మొదలు పెట్టారు.. తనకున్న అవకాశాలతో పూర్తి స్థాయిలో మన్యం వీరులకు రక్షణ కల్పించలేని రామరాజు లొంగిపోవాలనుకున్నాడు.. అలా అయిన మన్యం ప్రజలకు వేదింపులు తగ్గుతాయని భావించాడు.. తాను స్నానానికి చేరువు దగ్గరకు రాబోతున్నట్టుగా తన అనుచరుల ద్వారా బ్రిటీష్‌ అధికారులకు సమాచారం అదించాడు రామరాజు..   1923 మే 7న ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా ఆయనను బంధించిన పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టకుండానే అదే రోజున కాల్చిచంపారు. ఆయుదం చేతిలో లేని అల్లూరిని కూడా ఎదిరించలేని బ్రిటీష్‌ పోలీసులు ఆయన చెట్టు కట్టేసి కాల్చి కసి తీర్చుకున్నారు.. కాని బ్రిటీష్‌ అధికారులు ఓ నాయకున్ని చంపగలిగారు కాని ఆయన ప్రజల్లో రగిలించిన.. స్వతంత్ర కాంక్షను మాత్రం ఆర్పేయలేకపోయారు.. తెలుగు నేల మీద కూడా స్వతంత్ర సమరానికి బీజాలు వేసిన మహానాయకుడు అల్లూరి జయంతి సందర్భంగా ఒక్కసారి ఆ మహానాయకుని మరోసారి ఘన నివాళి అర్పిద్దాం..  

రాయలసీమ ఉద్యమం రాజేస్తున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

  ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు, రాయల తెలంగాణా గురించి కాంగ్రెస్ ఎటువంటి అధికార ప్రకటన చేయకపోయినా, కోతి పుండు కోతిని బ్రహ్మ రాక్షసిని చేసినట్లు, మీడియా రాజకీయ పార్టీలు కలిసి దానిని చిలికి చిలికి అదో ప్రముఖమయిన అంశంగా మార్చేశాయి. ఒకప్పుడు కేసీఆర్ తెదేపాను వీడి తెలంగాణా ఉద్యమం పెట్టుకొన్ని పైకెదిగినట్లే, ఇప్పడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితిని పెట్టుకొని పైకెదగాలని తాపత్రయపడుతున్నాడు.   ఆ మద్య రాయలసీమలో ట్రాక్టర్ యాత్రలు కూడా చేసి కొంచెం పేరు కూడగట్టుకొన్న ఆయన, ఇప్పుడు కాంగ్రెస్ వదిలిన రాయల తెలంగాణా అంశాన్ని అందుకొని, రాయలసీమను తెలంగాణాలో కలపొద్దని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద 52 గంటల పాటు దీక్ష దీక్షకు కూర్చోబోతున్నాడు. ఆయన డిమాండ్ సంగతి ఎలా ఉన్నపటికీ, హైదరాబాదులో దీక్షకు కూర్చోవడం ద్వారా, అందరి దృష్టిని ఆకర్షించి తను కూడా కేసీఆర్ స్థాయికి ఎదగాలని తపన పడుతున్నట్లున్నారు.   ఇప్పటికే, కేసీఆర్ చేసిన ఉద్యమాల వల్ల రాష్ట్రం అన్నివిధాల వెనకబడిపోవడమే కాకుండా, ఉద్యమంతో ఏవిధంగాను సంబంధం లేని మారుమూల గ్రామాలలో ప్రజలు సైతం తమకు తెలియకుండానే అందుకు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటువంటి ఉద్యమాల వల్ల కేసీఆర్ వంటి వ్యక్తులు వారి కుటుంబాలు రాజకీయంగా లాభపడితే, సామాన్య ప్రజలు అన్ని విధాల తీవ్ర నష్టపోతున్నారు. ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ ఉద్యమం రాజేస్తున్న ఈ బైరెడ్డి వంటివారిని ఉపేక్షిస్తే, రేపు అతను కూడా మరో కేసీఆర్ వలె తయారయి, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసే అవకాశం ఉంది.

జగన్ని దెబ్బతీయబోయి కాంగ్రెస్ గోతిలో పడిందా

  కాంగ్రెస్ ఒకటి తలిచి రాయల తెలంగాణా అంశాన్ని మీడియాకు లీక్ చేస్తే, దాని మీద జరుగుతున్న నిరుపయోగమయిన చర్చలవల్ల ఊహించని విధంగా జగన్ మోహన్ రెడ్డికే మేలు జరుగుతోంది. కాంగ్రెస్ ఉద్దేశ్యం రాయల తెలంగాణా ప్రతిపాదన తెచ్చి జగన్ మోహన్ రెడ్డిని భయపెట్టి లొంగ దీసుకోవడం. అతని పార్టీకి బాగా బలమున్న ప్రాంతాలను విడదీసి తెలంగాణాలో కలిపేసి, అతని పార్టీని దెబ్బ తీయగలమని అతనికి ఒక సంకేతం పంపేందుకే కాంగ్రెస్ రాయల తెలంగాణా ప్రతిపాదన ముందుకు తెచ్చింది. అయితే, ఊహించని విధంగా ఆ ప్రతిపాదనకు అన్ని వైపులా నుండి వ్యతిరేఖత ఎదురవడమే కాకుండా, దీనిపై జరుగుతున్న విస్తృత చర్చల వల్ల, సీమంధ్ర ప్రాంతంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభావం చాలా ఎక్కువగానే ఉందనే సంగతి బయటపడింది.   కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిని ప్రభావం చూసి భయపడుతున్నదని, అందుకే రాయల తెలంగాణా ఆలోచన చేస్తోందని నిర్దారిస్తున్న విశ్లేషణల వల్ల జగన్ కి, ఆయన పార్టీకి రాజకీయ వర్గాలలో మరింత సానుకూల పరిస్థితిని ఏర్పరుస్తుంది. అదిగాక ఈ విశ్లేషణలు జగన్ కి చెందిన సాక్షి మీడియాలో కాకుండా వేరే ఇతర మీడియాలో జరుగుతుండటం వలన, ప్రజలలో, రాజకీయ వర్గాలలో జగన్ మోహన్ రెడ్డి బలంపై నమ్మకం కలుగుతుంది. అందువల్ల వైకాపా నేతలు కూడా ఈ అంశాన్ని అందిపుచ్చుకొని మరికొంత కాలం దీనిపై చర్చలు కొనసాగిస్తే, జగన్ మోహన్ రెడ్డి బలం గురించి ఫ్రీ గా ప్రచారమూ జరుగుతుంది. పనిలోపనిగా కాంగ్రెస్ బలహీనతను ఎండగట్టవచ్చును.   కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డిని భయపెట్టాలని పధకం వేస్తే, అది అతనికి, అతని పార్టీకి ఉచితంగా ప్రచారం కల్పించి మేలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తను తవ్వుకొన్న గోతిలో తానే పడినట్లయిందిప్పుడు.

మీడియాకు ముడిసరకు అందిస్తున్న కాంగ్రెస్

  ఏదో ఒక చిన్న పాయింటుని మీడియాకు లీక్ చేస్తే, దానిని పట్టుకొని రాజకీయపార్టీలు, మీడియా తీవ్రంగా చర్చించుకొంటూ కొన్ని రోజులు తన జోలికి రాకుండా ఉంటాయని కాంగ్రెస్ ఆలోచన. అందుకే ఒకసారి తెలంగాణా ప్యాకేజీ, మరోసారి రాయల తెలంగాణా, ఇప్పుడు పదిరోజుల్లో తెలంగాణా అంటూ చర్చలకు అవసరమయిన ముడి సరుకుని కాంగ్రెస్ పార్టీ ఉదారంగా అందిస్తోంది.   తెలంగాణా ప్యాకేజీని పట్టుకొని పదిరోజులు తీవ్ర చర్చలు, ఖండనల తంతు ముగిసిన వెంటనే రాయల తెలంగాణాని చర్చకు ఇచ్చింది. ఆ తరువాత 10 రోజుల్లో తెలంగాణా అనే టాపిక్ చర్చకు ఇచ్చి దిగ్వజయ్ సింగ్ ఎంచక్కా విమానం ఎక్కి వెళ్ళిపోయారు.   ఈసారి డెడ్ లైన్ నెలరోజుల నుండి 10 రోజులకి తగ్గించడంతో, నిజంగా తెలంగాణా కోరుకొనేవారిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంటే, మరికొందరు మాత్రం ఇప్పటికిప్పుడు తెలంగాణా ఇచ్చేస్తామంటే మా పరిస్థితి ఏమిటని? కంగారు పడుతున్నారు. అయితే కేసీఆర్ మాత్రం, “నెలంటే ముప్పై రోజులు కాదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కూడా 10 రోజులంటే 10 రోజులు కాదని ఖచ్చితంగా చెపుతుందని” కాంగ్రెస్ మీద కొండంత భరోసాతో ఉన్నాడు.   సీమంద్రా నేతలు మళ్ళీ రాజీనామాలు చేస్తామని హూంకరిస్తుంటే, టీ-కాంగ్రెస్ నేతలు వారిపై విరుచుకు పడుతున్నారు. తెదేపా వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని లగడపాటి ఆరొపిస్తుంటే, కాదు జగన్ వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి టీ జీ వెంకటేష్ శలవిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, మీడియాకి మరో పదిరోజులకి సరిపడే మేతవేసి దిగ్విజయంగా తన యాత్ర ముగించుకొన్నారు సింగు గారు.

కాంగ్రెస్ పార్టీకి సింహస్వప్నంలా మారిన జగన్

  పదిరోజుల్లో తెలంగాణా సంగతి తేల్చేస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పి విమానం ఎక్కినప్పటికీ, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఇంకా రాయల తెలంగాణాపై చర్చలు సాగుతూనే ఉండటం విశేషం.    ఈ 10రోజుల తాజా డెడ్ లైన్ సంగతి ఎలా ఉన్నపటికీ, గత 10 రోజులుగా ప్రధానంగా, ‘సీమంధ్రాపై జగన్ మోహన్ రెడ్డి ప్రభావం’ గురించే చర్చ సాగింది. అతను జైల్లో ఉన్నపటికీ, ‘అతనిది కూడా తమ డీ.యన్.ఏ.నని’ సాక్షాత్ దిగ్విజయ్ సింగే చెప్పుకొవడం చూస్తే, కాంగ్రెస్ పార్టీ అతని బలాన్ని బాగానే అంచనా వేసిందని చెప్పవచ్చును. రాయలసీమ ప్రాంతంలో బలంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డిని బలహీనపరచడానికే కాంగ్రెస్ రాయల తెలంగాణా ఎత్తు వేసిందని విశ్లేషణలు తేల్చి చెప్పాయి.   ఇక, రాయల తెలంగాణా, 10 రోజుల్లో తెలంగాణా అనే ప్రస్తావనలు రెండు కూడా జగన్ కారణంగానే వచ్చాయని మంత్రి టీజీ. వెంకటేష్ కూడా కనిపెట్టేశారు. అంటే జగన్నిచూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని ఆయన కూడా తేల్చి చెప్పేశారు. అందువల్ల, ఇప్పుడు ఈ 10 రోజుల్లో తెలంగాణా అనే నిర్ణయం జగన్ మోహన్ రెడ్డిని కట్టడి చేసే విధంగానే ఉండవచ్చునని భావిస్తున్నందునే, ఇంకా రాయల తెలంగాణా సీరియల్ నడుస్తోంది.   ఈ సారి 10రోజులంటే ఖచ్చితంగా 10 రోజులే అని కాంగ్రెస్ గనుక భావిస్తే, కాంగ్రెస్ ఎటువంటి తెలంగాణా ఇవ్వబోతోందో మనకీ తెలుసుకొనే అవకాశం దొరుకుతుంది.

కాంగ్రెస్ ఎత్తుకి కెసిఆర్ చిత్తయ్యాడా!

  కాంగ్రెస్ నేతలకి వలేసిపట్టుకొందామనుకొన్న కేసీఆర్ తానే ఇప్పుడు కాంగ్రెస్ గాలానికి చిక్కుకొని విలవిలలాడుతున్నాడు. తమ ప్రమేయం లేకుండానే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణా గురించి మాట్లాడుతుంటే, దానికి ఏవిధంగా స్పందించాలో అర్ధంకాక రెండురోజులు మౌనంగా ఉండిపోయిన ఆయన, “కాంగ్రెస్ మాటలు వింటుంటే నిజంగానే తెలంగాణా ఇస్తుందేమోననిపిస్తోంది. కానీ దాని గత చరిత్ర చూస్తే, ఇదికూడమరో కొత్తనాటకమనిపిస్తుంది. ఏమయినప్పటికీ, కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే మాకొచ్చిన నష్టం ఏమి లేదు. అప్పుడు తెలంగాణా నిర్మాణం కోసం మేము మరో కొత్త ఉద్యమం మొదలుపెట్టవలసి ఉంటుంది. మా ప్రమేయం లేకుండా కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే, మేము కాంగ్రెస్ లో విలీనం కావలసిన అవసరం కూడా ఉండదు. కాంగ్రెస్ తెలంగాణా ఇస్తుందని నాకయితే నమ్మకం లేదు,” అని అన్నారు.   గత పదేళ్ళ బట్టి కాంగ్రెస్ ఎప్పుడెప్పుడు తెలంగాణా ఇవ్వబోతోందో జోస్యం చెపుతూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ తనంతట తానే తెలంగాణా ఇస్తానని చెపుతుంటే నమ్మలేకబోతున్నాడు. ‘కాంగ్రెస్ మాటలు నమ్మాలో లేదో అర్ధం కావట్లేదని’ మొట్ట మొదటిసారిగా ఆయన నిజాయితీగా ఒప్పుకోవడం విశేషం. ఇక, ‘తమ ప్రమేయం లేకుండా కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే, తమ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదని’ చెప్పడంలోనే, ఆయన నష్టపోయానని ఒప్పుకొంటున్నారు.   ఉద్యమాలు జోరుగా నడుస్తున్నపుడు, కాంగ్రెస్ కి ఆయన షరతులు, హెచ్చరికలు జారీచేసే పరిస్థితిలో ఉండేవారు. తెలంగాణాలో, ముఖ్యంగా హైదరాబాదులో ప్రశాంతత ఉండాలంటే కాంగ్రెస్ ఆయనను ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆయనని, ఆయన పార్టీని పక్కన బెట్టి, తెలంగాణాపై తానే స్వయంగా నిర్ణయం తీసుకొంటుంటే, ఆయన ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.ఇది వరకు తెరాసను విలీనం చేయమని కాంగ్రెస్ వెంటబడితే, ఇప్పుడు కేసీఆరే స్వయంగా విలీనం గురించి మాట్లాడుతుండటం మారిన పరిస్థితికి అద్దం పడుతోంది.   అయితే, పరిస్థితులు ఎల్లపుడు అటు కాంగ్రెస్ పార్టీకో, ఇటు తెరసకో అనుకూలంగా ఉంటాయని అనుకోవడం అవివేకం. ఒకప్పుడు తెరాసది పైచేయి అయితే, ఇప్పుడు కాంగ్రెస్ హస్తం పైనుంది. అందువల్ల రాజకీయాలలో ఎప్పుడు, ఏ కారణం చేతయినా పరిస్థితులు తారుమారవవచ్చును. అంతవరకు కేసీఆర్ ఓపికగా ఎదురుచూడగలడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.

కెసిఆర్ అన్న కుమార్తె ఇంటిపై టీఆర్ఎస్ దాడి!

      తమ్ముడే తమ్ముడే...పేకాట పేకాటే అని చాలా మంది అంటుంటారు. రాజకీయాలలో కూడా అంతే బంధువైన, బయటవరైనా ఒకటే. టీఆర్ఎస్ మహిళ కార్యకర్తలు కెసిఆర్ అన్న కూతురు ఇంటిపై దాడి చేయడం విశేషం. తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతా స్వామి ఈ నెల ఏడును కెసిఆర్ కు వ్యతిరేకంగా నిర్వహించబోతున్న కార్యక్రమానికి మద్దతు ఇచ్చి పోస్టర్ విడుదల కార్యక్రమంలో రమ్య పాల్గొని కెసిఆర్ ను విమర్శించారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ మహిళ కార్యకర్తలు ఆమె ఇంటిపై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి దాడులు చేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీకే నష్టం జరిగే అవకాశం వుంది.

కాంగ్రెస్ కి జలక్ ఇచ్చిన మోపిదేవి

  వాన్పిక్ భూముల వ్యవహారంలో గతేడాది అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకి ఇంతవరకు బెయిలు కూడా దొరకలేదు. ధర్మాన ప్రసాదరావును, సబితా ఇంద్ర రెడ్డిని వెనకేసుకు వచ్చిన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మోపిదేవిని మాత్రం ఎందుకో మొదటి నుండి పట్టించుకోలేదు. అదే విషయం మీడియా అడిగినప్పుడు వారిద్దరి కేసుల్లో చాలా తేడా ఉందని మాత్రమే జవాబు ఇచ్చారు తప్ప ఆయనకి ఎటువంటి సహాయము చేయలేదు. కనీసం పార్టీలో మిగిలిన నేతలు కూడా ఆయనను ఎన్నడూ పలకరించిన పాపాన పోలేదు.   ఒకనాడు గుంటూరులో ఒక వెలుగు వెలిగిన మోపిదేవి, నేడు తరచూ అనారోగ్యం గురవుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ, కిరణ్ కుమార్ రెడ్డి గానీ కనీసం సానుభూతి కూడా చూపకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిశ్చయించుకొన్నారు. ముందుగా ఆయన సోదరుడు హరనాథ బాబు, మరి కొందరు మాజీ సర్పంచులు, ఆయన అనుచరులు ఈ నెల 5న వైయస్సార్ కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకొన్నారు. ఇక మోపిదేవి, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో ఉన్నందున, ఆయన కూడా వైకాపా గూటిలో ఉన్నట్లే లెక్క.   రాయపాటి, కన్నా లక్ష్మినారాయణ, కొత్తగా చేరిన రత్తయ్య వంటి హేమా హేమీలున్న గుంటూరు జిల్లాలో మోపిదేవి నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం కలుగకపోయినా, వైకాపాకు మాత్రం చాల బలం చేకూరుతుంది. అయితే, ఎవరి కారణంగా అయన జైలు పాలయ్యాడో వారిని ద్వేషించేబదులు ఆయన వారి పంచనే చేరడం ఆశ్చర్యం. మోపిదేవి గనుక అరెస్ట్ కాకపోయి ఉంటే, మిగిలిన కాంగ్రెస్ నేతలవలే నేడు ఆయన కూడా జగన్ మోహన్ రెడ్డి ని నిందిస్తూ ఉండేవారేమో!

రాయపాటి రాజీనామా హెచ్చరిక

      కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడానికి మొగ్గుచుపుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సమైఖ్య సెగ పెరుగుతోంది. తెలంగాణ ఇస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని లగడపాటి రాజగోపాల్ ప్రకటిస్తే... రాష్ట్ర విభజన జరిగితే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. తాను ముమ్మాటికి సమైక్యవాదినేనని అన్నారు. తెలంగాణ, సమైక్యం పైన రెఫరెండం పెడితే తాను సమైక్యవాదానికే ఓటు వేస్తానని ఆయన చెప్పారు.   మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై వారం, పది రోజుల్లో తేల్చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.  తెలంగాణపై తేల్చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. విభజన, సమైక్యవాద సభలకు అనుమతించిన దిగ్విజయ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.  

పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

      పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) రమాకాంత్ రెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నట్లు ఆయన తెలిపారు. బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ జరుగనుంది. 23న తొలి విడత ఎన్నికలు, 27న రెండో విడత ఎన్నికలు, 31న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈనెల 9న జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. జులై 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 13న నామినేషన్లకు చివరి తేది. ఈనెల 14న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది జులై 17. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా నేటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావలి(ఎన్నికల కోడ్) అమలులోకి వచ్చిందని రమాకాంత్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటాం: లగడపాటి

      స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తెలంగాణపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అలా ప్రవేశపెట్టే అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడమే మా లక్ష్యం అని లగడపాటి అన్నారు. సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు ఎటు ఓటేస్తారో తేల్చుకోవాలి అని ఆయన అన్నారు. టీడీపీ లేఖ వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది అని ఆరోపించారు. తెలుగుతల్లి మెడపై కత్తిపెట్టారు, అందరూ మేల్కోవాలి అని అన్నారు. తెలంగాణ వస్తే తను రాజకీయాల్లో ఉండను అని స్పష్టం చేశారు. అయితే మెజార్టీ ప్రజల ఆంకాక్షకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరించొద్దు అని ఆయన అశాభావం వక్తం చేశారు. మరి ఈయన ఆశలు ఫలించేనా…

ఎవరి కాళ్ళు పట్టుకోలేదు: కావూరి

        కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కిన తర్వాత కావూరి తొలిసారి తన సొంత నియోజకవర్గమైన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి వచ్చిన సంధర్బంగా ఇండోర్ స్టేడియంలో ఆయనకు జిల్లా నేతలు సన్మానం చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్రానికి ఎక్కువగా నిదులు తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తాను పదవుల కోసం ఎవరి కాళ్ళు పట్టుకోలేదని అన్నారు. తాను కాంగ్రెసు పార్టీకి నిత్యం కార్యకర్తగానే పని చేశానని, ఏనాడు పదవి కోసం ఎదురు చూడలేదన్నారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలని తాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి పదవి కోసం గట్టిగా ఆశించి,ఒక సందర్భంలో అలిగిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తనకు పదవీకాంక్ష లేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి తపన

  దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు కేంద్రం త్వరలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు జరుగుతున్నపరిణామాలు తెలియజేస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి సహజంగానే అందరికంటే ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేయబడటంతో, రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే తపనతో ఆయన క్రిందటి వారంలో మూడు రోజులుపాటు డిల్లీలో మకాం వేసి సోనియా గాంధీని కలిసి తన వాదనను వినిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసారు. అందుకోసం ఆయన అత్యంత రహస్యంగా ఒక ప్రత్యేక నివేదిక కూడా తయారు చేయించారు. దానిలో తెలంగాణను రూ.80,000 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పన చేసారు. అయితే, తెలంగాణా అంశంపై కోర్ కమిటీ ఇప్పటికే సుదీర్గ చర్చలు చాలా చాల చేసి, ఒక నిర్ణయానికి వచ్చినందున, ఇక ఈ విషయంలో మళ్ళీ మరో ఆలోచనకు ఇష్టపడని సోనియా గాంధీ, ముఖ్యమంత్రిని కలిసేందుకు నిరాకరించారు. అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దల ద్వారా ఆమెను ఒప్పించి కలవాలని విశ్వప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. చివరికి దిగ్విజయ్ సింగ్ వచ్చి సోనియా గాంధీ అభిప్రాయం ఆయనకు తెలియజేయడంతో, ఆయన నిరాశగా వెనుతిరిగి వచ్చారు.   ఆ తరువాత టీ-కాంగ్రెస్ నేతల బహిరంగ సభ జరగడం, ఆ మరునాడే దిగ్విజయ్ సింగ్ పదిరోజుల్లో తెలంగాణాపై నిర్ణయం వెలువడుతుందని ప్రకటించడం అంతా శాస్త్ర ప్రకారమే జరిగిపోయింది. ఇక, ఆయన తెలంగాణపై రోడ్ మ్యాప్ తయారుచేసే బాధ్యతకూడా ఆయన ముఖ్యమంత్రికే అప్పజెప్పడం విశేషం.

విశ్వసనీయతకు పేటెంట్ హక్కులు మావే

  దిగ్విజయ్ సింగ్, జగన్ డీ.యన్.ఏ. తమ కాంగ్రెస్ డీ.యన్.ఏ. రెండూ ఒకే రకమయినవని అన్నపుడు కాంగ్రెస్ నేతల నోట మాట రాలేదు. కాంగ్రెస్ నుండి వచ్చిన ఈ సందేశానికి వైకాపా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తుంటే, ఆ పార్టీ నేత షర్మిల తన సోదరుడిని కాంగ్రెస్ తో పోల్చడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.   తన పాదయాత్రలో మంగళవారం సాయంత్రం విశాఖ జిల్లా పెందుర్తి వద్ద గల సబ్బవరం చేరుకొన్నఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, తన సోదరుడిది మూమ్మాటికీ కాంగ్రెస్ డీఎన్ఏ కాదని అన్నారు. జగన్ డీఎన్ఏ పేరు విశ్వసనీయత అయితే, కాంగ్రెస్ డీఎన్ఏ నయవంచన అని ఆమె ఎద్దేవా చేసారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లు సేవ చేశారని, రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలను నిలబెట్టారని, అయినప్పటికీ ఆ విశ్వాసం లేకుండా ఆయన పేరును సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చిందని, ఇంతటి నమ్మక ద్రోహం చేసిన వారి డీఎన్ఏతో, విస్వసనీయతకు మారు పేరుగా నిలిచిన తన సోదరుడు జగన్ డీఎన్ఏ సరిపోల్చుకోవడానికి కాంగ్రెస్ సిగ్గుపడాలని ఆమె విమర్శించారు. అదేవిధంగా సోనియా గాంధీని, కిరణ్ కుమార్ రెడ్డిని, చంద్రబాబుని, చిరంజీవిని కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు.   కాంగ్రెస్ పార్టీపై ఇంత తీవ్రంగా విరుచుకుపడుతున్న ఆమె మరి అదే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తరువాత మద్దతు ఈయలనుకోవడం ద్వంద ప్రమాణాలు కావా? చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా తిడుతూ, తెర వెనుక ఆ పార్టీతో కలిసిపనిచేస్తున్నాడని ఆరోపిస్తున్న షర్మిల, మరి తాము కూడా ఇప్పుడు అదే తప్పు ఎందుకు చేయబోతున్నట్లు? విశ్వసనీయతకు తాము మారుపేరని అభివర్ణించుకొనే వారు, మరి విశ్వాసంలేని కాంగ్రెస్ పార్టీ తోకపట్టుకొని ఎందుకు వ్రేలాడాలనుకొంటున్నారు?   ప్రజల కోసం జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారని పదేపదే నొక్కి చెపినంత మాత్రాన్న ప్రజలు నమ్ముతారనుకోవడం ఆమె భ్రమ. అతనికి ముఖ్యమంత్రి కావాలనే దురాశే అతను కాంగ్రెస్ ను వీడేలా చేసింది తప్ప షర్మిల చెపుతున్నట్లు ప్రజల ఓదార్చడం కోసం మాత్రం కాదని అందరికి తెలుసు.   ఆయన ఓదార్పు పేరిట తన పార్టీని బలపరుచుకొనే ప్రయత్నం చేస్తున్నపుడు, అతను ఏకుమేకవుతాడనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, అతని వేలకోట్ల అక్రమార్జనపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో అతను కటకటాల పాలయ్యాడు. అతనికే గనుక ముఖ్యమంత్రి యావ లేకపోయి ఉంటే, నేడు కాంగ్రెస్ పార్టీలోనే ఏ కేంద్ర మంత్రి పదవో పొందేవాడని సాక్షాత్ గులాం నబీ ఆజాద్ చెప్పారు. అతని అధికార దాహం పార్టీకి దూరం చేస్తే, అతని ధన సంపాదన దాహం కటకటాల వెనుకకు నెట్టింది.   ఇదంతా కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నపటికీ, దేశంలో క్రింద కోర్టు నుండి పై కోర్టు వరకు అతనిని తప్పు పడుతున్నపటికీ, అతను నిర్దోషని వాదించడం అతని కుటుంబ సభ్యులకే చెల్లు. పైగా విశ్వసనీయతకి తామే పేటెంట్ హక్కులు తీసుకొన్నట్లు మాట్లాడటం మరీ విచిత్రం.

కావూరి ర్యాలీలో అపశ్రుతి: ఓ వ్యక్తి మృతి

    కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ర్యాలీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కేంద్రమంత్రిగా భాద్యతలు తీసుకున్న తరువాత కావూరి తొలిసారి తన సొంత జిల్లాకు వస్తుండడంతో, గన్నవరం ఎయిర్‌పోర్టులో కృష్ణా జిల్లా నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ సంధర్బంగా కార్యకర్తలు బాణాసంచా పేలుస్తుండగా నిప్పు రవ్వలు బాణాసంచాతో వెళ్తున్న ఆటోలో పడ్డాయి. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఆటోలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, గాయాలైన మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బయలు దేరిన కావూరి కాన్వాయ్‌ను హనుమాన్‌జంక్షన్ వద్ద టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకొని పరిస్థితిని అదుపుచేశారు.