విభజనపై ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌

      విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడుగా అడుగులు వేస్తోంది. విభజన వల్ల శాంతిభద్రతలపై పడే ప్రభావం, నక్సల్స్ సమస్య, హైదరాబాద్ స్థాయి తదితరాలపై అధ్యయనానికి కేంద్ర హోంశాఖ ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపిఎస్ అదికారి విజయకుమార్ ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. మాజీ ఐపిఎస్ అదికారి ఎ.కె. మహంతి , జెవి రాముడు తదితరులు కూడా ఈ బృందంలో ఉన్నారని చెబుతున్నారు. ఇది రాష్ట్ర అధికార వర్గాల నుంచి సమగ్ర సమాచారం సేకరించి ఓ వ్యూహాత్మక పత్రాన్ని రూపొందిస్తుంది. కేంద్ర మంత్రుల బృందానికి తన నివేదిక సమర్పిస్తుంది. వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి హోంశాఖ గడువు విధించినట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంటే నవంబర్ 5లోగా ఇది జీవోఎంకు ప్రాథమిక నివేదిక సమర్పించాల్సి ఉంటున్నదన్నమాట.

క్లైమాక్స్ సీన్ కోసం దివాకర్ రెడీ, మరి బొత్స?

  ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు పదవి నుండి తప్పించబోతోందనే దాని పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆయన కంటే ముందుగా సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి క్లైమాక్స్ యాక్షన్ సీన్ చేసేందుకు ఆరాటపడుతున్నట్లు కనిపిస్తున్నారు.   మొన్న జగన్ సభకు కాంగ్రెస్ అధిష్టానం మద్దతు ఉందని ప్రకటించి అందరినీ నివ్వెరపరిచిన ఆయన, ఈ రోజు మరో అడుగు ముందుకు వేసి, తమ అధిష్టానం కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతోనే ముందుకు సాగుతూ అటు తెరాసతో, ఇటు వైకాపాతో పొత్తులకు సిద్ధపడుతోందని, జగన్ 25 ఎంపీ సీట్లకు హామీ ఇచ్చినందునే తమనందరినీ పక్కన బెడుతోందని ఆరోపించారు.   తమ అధిష్టానం కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆరాటపడుతుంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేప్పటి ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నాడని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. తనకు కొత్త పార్టీ గురించి ఎటువంటి ఆలోచన లేదని, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఇప్పుడే ఎవరూ ఏమి చెప్పలేరని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు పలకడం అనవసరమని భావించవచ్చు గనుక, రాష్ట్ర విభజనను ఆపేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మొత్తం బీజేపీలో చేరితే బాగుటుందని అన్నానని మీడియాకు వివరణ ఇచ్చారు.   ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో మహా అయితే రెండు నుండి ఆరు యంపీ సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని, కాంగ్రెస్ నేతలందరూ తాము కాంగ్రెస్ పార్టీకి చెందినవారమని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడుతున్నారని ఆయన అన్నారు. బహుశః ఈ విధంగా మాట్లాడినందుకు షోకాజ్ నోటీసులు అందుకొన్నాఆశ్చర్యం లేదని, ప్రజలే కాదు ఆయన కూడా భావించడం విశేషం. అయినప్పటికీ తను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని అన్నారు.   ఆయనను ఇష్టం లేకపోతే పార్టీలో నుండి బయటకి పొమ్మని ఇప్పటికే హెచ్చరించిన బొత్స, ఇంత రాద్ధాంతం చేస్తుంటే ఇంకా వేచి చూస్తారని అనుకోలేము. పార్టీ నుండి ఎవరినయినా బయటకి తరిమేసేందుకు ఈ మాత్రం మాటలు చాలు. అయితే ఆయనని బయటకి పంపితే ఆయన మరిన్ని రహస్యాలు బయటపెడితే పార్టీకి ఇంత కంటే ఎక్కువ నష్టం కలుగుతుందని బొత్స భావిస్తే మాత్రం ఆయనను ఉపేక్షించే అవకాశం ఉంది.

కాలుజారిన చిరు

  వరద ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించటానికి వచ్చిన కేంద్ర మంత్రి చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది.. సినిమాల్లో ఎన్ని స్టంట్‌లు అయినా అవలీలగా చేసు మన మెగాస్టార్‌ అదే రేంజ్‌లో పడవ ఎక్కబోయి పాపం కాలు జారిపడిపోయారు..   తిమ్మాపురంలో వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిరంజీవితోపాటు మరో ఇద్దరు నేతలు పడవ ఎక్కారు. ముగ్గురూ జారి నీటిలో పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న సెక్యూరిటి సిబ్బంది చిరును లేపి జాగ్రత్తగా తరలించారు. వరద బాధితులను పరమర్శించడానికి వచ్చిన మంత్రిగారు చివరకు తననే మరొక పరామర్శించే పరిస్థితి కొని తెచ్చుకున్నారంటున్నారు అక్కడి ప్రజలు.  

జగన్ పై వైకాపా నేతలు అసంతృప్తి

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఏ దుర్ముహూర్తంలో సమైక్య శంఖారావ సభ ఏర్పాటు చేశారోగానీ, అన్ని పార్టీ వాళ్ళు ఆయనపై విరుచుకుపడుతున్నారు.ఇటు సమైక్యవాదులు, అటు విభజనవాదులు, అటు కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీ.. మధ్యలో టీఆర్ఎస్. అన్ని వైపుల నుంచీ జగన్ నిర్వహించిన సభ మీద, జగన్ మాట్లాడిన తీరు మీద విమర్శనాస్త్రాలు దూసుకొస్తున్నాయి.   జగన్‌తో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్న కాంగ్రెస్,  టీఆర్‌ఎస్ పార్టీలు కూడా అందరూ జగన్ని తిడుతున్నారు.. మనం కూడా తిట్టకపోతే బాగోదన్నట్టుగా వాళ్ళు కూడా ప్రెస్‌మీట్లు పెట్టి జగన్‌ని తిట్టిపోశారు. సరే బయటి పార్టీల వాళ్ళు తిట్టారంటే సర్దిచెప్పుకోవచ్చు. వైకాపా శ్రేణులు కూడా సభలో జగన్ మాట్లాడిన తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బాహాటంగా బయటపడలేక లోపల లోపలే కుమిలిపోతున్నారు. జగన్ ఎవరు మంచి చెప్పినా వినడు.. ఒకవేళ సాహసించి మంచి చెపితే ఆ చెప్పినవాళ్ళనే తరిమేస్తాడన్న వాస్తవం పార్టీలో ఎవరూ నోరెత్తకుండా చేస్తోంది.

యథా రాహుల్.. తథా జగన్!

      కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్‌గాంధీకి, కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడు జగన్‌ని మధ్య చాలా అంశాలలో పోలికలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పోలిక-1. రాహుల్ తండ్రి మాజీ ప్రధానమంత్రి. జగన్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి. ఇద్దరి తండ్రులూ కీర్తిశేషులే.  ఇద్దరూ తండ్రికి ఏకైక కుమారులే! రాహుల్, జగన్ ఇద్దరూ తమ తండ్రులు అధిష్టించిన పదవులను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నవారే. పోలిక-2. రాహుల్ని ప్రధానమంత్రి చేయాలని ఆయన తల్లి సోనియా పరితపిస్తుంటే, జగన్‌ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన తల్లి విజయమ్మ పరిశ్రమిస్తున్నారు. పోలిక-3. రాహుల్, జగన్.. ఇద్దర్నీ జనం మూడక్షరాల పేరుతోనే పిలుస్తారు. రాహుల్‌కి ‘యువరాజు’ అనే నిక్‌నేమ్ వుంది. జగన్‌కి ‘యువనేత’ అనే నిక్‌నేమ్ వుంది. పోలిక-4. అటు రాహుల్, ఇటు జగన్ ఇద్దరూ ఆవేశపరులుగా, దూకుడు కలిగి వున్నవాళ్ళుగా,  తనమాటే నెగ్గాలనే పట్టుదల ఉన్నవారిగా పేరు తెచ్చుకున్నారు. పోలిక-5. రాహుల్ గాంధీ కారణంగా దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జగన్ కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పోలిక-6. రాహుల్‌గాంధీలో, జగన్మోహన్‌రెడ్డిలో రాజకీయ అపరిపక్వత కనిపిస్తుంది. ఇద్దరికీ చిన్న వయసులోనే పెద్ద కుర్చీ మీద కన్ను వుంది. పోలిక-7. రాహుల్‌కి, జగన్‌కి వేదికల మీద ఎలా మాట్లాడాలో తెలియదు. రాజస్థాన్ ఎన్నిక ప్రచారంలో నోటికొచ్చినట్టు మాట్లాడి రాహుల్ విమర్శలు ఎదుర్కుంటుంటే, సమైక్య శంఖారావంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి జగన్ ఇబ్బందులు తెచ్చుకున్నాడు. పోలిక-8. రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. అలాగే జగన్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎటుచూసినా కనిపించడం లేదు.

కాంగ్రెస్, బిజెపి ట్విట్టర్ వార్

      గతంలో రాజకీయ నాయకులు చట్టసభల్లో, మీటింగుల్లో, ప్రెస్‌మీట్లలో తిట్టుకున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని సోషల్ నెట్‌వర్క్ వేదికల మీద కూడా ‘ట్విట్టు’కుంటున్నారు. ట్విట్టర్లో రెగ్యులర్‌గా కామెంట్లు పోస్ట్ చేసేవాళ్ళలో నరేంద్రమోడీ ముందుంటున్నాడు. ఈమధ్య దిగ్విజయ్ ‌సింగ్ కూడా ట్విట్లు పోస్ట్ చేయడంలో యాక్టివ్‌గా వుంటున్నాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనుకున్నాడో లేక బీజేపీలో నిప్పుపెట్టాలని అనుకున్నాడో గానీ దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్‌లో బీజేపీ మీద కొన్ని కామెంట్లు పోస్ట్ చేశాడు.   ‘‘బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా మతోన్మాది, అబద్ధాల కోరు, మానసిక దుర్బలుడు అయిన నరేంద్రమోడీ కాకుండా సుష్మా స్వరాజ్ అయితే చాలా బాగుండేది.’’ అంటూ ట్విట్ చేశాడు. ఈ ట్విట్ చదివి సుష్మా స్వరాజ్ కాకుండా మరెవరన్నా అయితే మురిసిపోయి దిగ్వింజయ్ సింగ్‌కి ఫోన్ చేసి థాంక్స్ చెప్పేవారే. కానీ బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ మాత్రం అలా చేయలేదు. ట్విట్టుని ట్విట్టుతోనే ఎదుర్కోవాన్నట్టు ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో ఒకకామెంట్ పోస్ట్ చేశారు. ‘‘బీజేపీ ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో దిగ్వింజయ్ సింగ్ అభిప్రాయం అదయితే, మా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ కంటే దిగ్వింజయ్ సింగే ఉత్తమ అభ్యర్థి’’ అని పోస్ట్ చేశారు. కుక్కకాటుకి చెప్పుదెబ్బలా వున్న ఈ ట్విట్ చదివిన దిగ్విజయ్ సింగ్ ‘‘సుష్మా స్వరాజ్ చెప్పింది కరెక్టే కదా’’ అనుకున్నాడేమో మళ్ళీ చప్పుడు చేయలేదు.

దిగ్విజయ్ జోక్స్

  సినిమాలలో బ్రహ్మానందమే కాదు, ఒక్కోసారి కాంగ్రెస్ వాళ్ళు కూడా బలే జోకులేసి జనాలను నవ్విస్తుంటారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి వ్రాసిన లేఖల గురించి అమెరికా, జపాన్లో ఉన్నవాళ్ళకి కూడా ఈపాటికి తెలిసిపోయుంటుంది. కానీ ఎప్పుడూ డిల్లీలోనే ఉండే మన రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ వారికి మాత్రం ఆవిషయం తెలియనే తెలియదట. మీడియావాళ్ళు చెపితేనే తెలిసిందని ఇంకా ఆ లేఖలో సారాంశం ఏమిటో చూడవలసి ఉందని జోక్ వేసారు.   క్రిందటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ‘జగన్ మోహన్ రెడ్డిది మా కాంగ్రెస్ పార్టీది సేమ్ టు సేమ్ డీ.యన్.యే’, అని మళ్ళీ డిల్లీ వెళ్ళిన తరువాత కూడా ‘జగన్ నా కొడుకు వంటి వాడు’ అని మరోసారి కన్ఫర్మ్ చేసిన ఆయన, ఈసారి మాత్రం తమ సంబంధాల గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదుట. బహుశః జగన్ మొన్న హైదరాబాదులో సోనియమ్మని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన తరువాత కూడా ఇంకా ‘జగన్ నా కొడుకు వంటి వాడే’ అనాలంటే చాల గుండె దైర్యం ఉండాలి కదా?   మళ్ళీ రెండు పార్టీలలో హార్మోన్స్ లలో ఏమయినా మార్పులు చేర్పులు చోటు చేసుకొంటున్నాయా? అని ప్రజలకి అనుమానం కలిగేలా ఆయన మౌనం వహించినప్పటికీ, ఇంకా డీ.యన్.యే.లు మార్చుకోవడం ఎవరి తరమూ కాదుకదా!

ఇంటి గుట్టు రట్టు చేస్తే ఎలా దివాకర్?

  ఇంటి గుట్టు లంకకి చేటంటారు. మరి అటువంటిది లంకలో ఉన్నవాళ్ళే మన ఇంటి గుట్టుని భద్రంగా  కాపాడే ప్రయత్నం చేస్తుంటే, ఇంట్లో వాళ్ళే గుట్టు రట్టు చేస్తుంటే ఏ ఇంటి పెద్దకయినా ఆగ్రహం కలుగక మానదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో మిగిలిన పార్టీలకి పెద్దన్నపాత్ర పోషిస్తుంటే, అందులో బొత్ససత్యనారాయణ రాష్ట్ర కాంగ్రెస్ లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన లంకంత తమ కాంగ్రెస్ గుట్టు మట్టులను కోడిపెట్ట కోడి పిల్లలను జాగ్రత్తగా కాపడుకొస్తున్నట్లు కాపాడుకొస్తుంటే, ముఖ్యమంత్రితో సహా అందరూ ఎప్పుడో అప్పుడు ఆ ఇంటి గుట్టు గురించి టంగ్ స్లిప్పు చేసుకొంటూనే ఉన్నారు.   మొన్న జగన్ ముచ్చటపడి హైదరాబాదులో శంఖం ఊదుకొంటుంటే “మా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మంచి అండర్ స్టాండింగ్ ఉందని, అందుకు నూటా నలబై నాలుగు ఉదాహరణలున్నాయని, ఆయన సభకి అన్ని రైళ్ళని పరిగెత్తించడం కూడా అందులో ఒకటని ప్రకటించేసారు కల్లాకపట మెరుగని మన జేసీ దివాకర్ రెడ్డి గారు. ఓసారి లగడపాటి మరోసారి హర్ష కుమార్ ఇంకోసారి జేసీ దివాకర్ రెడ్డి ఇలా ఎందరిని కంట్రోల్ చేయగలడు ఎంత పెద్దన్న అయితే మాత్రం?   అయినప్పటికీ మరీ మౌనంగా కూర్చొంటే కొంప కోల్లేరయిపోతుందని ఆయన బెంగపెట్టుకొన్నవాడై, దివాకర్ రెడ్డిని లైన్లో పెట్టి ‘ఇంటి గుట్టు రట్టు చేస్తే ఎలా? ఉంటే బుద్దిగా ఉండండి లేకుంటే బయటకి దయచేయండని’ మందలించినట్లు మీడియా గుప్పుమంది. అయితే మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నానన్నట్లు, ఏదో ఇంటి గుట్టు బయట పెట్టోదని సింపుల్ గా చెపితే పోయేదానికి, బయటకి పొమ్మని చెప్పడం ఏమిటి?అయినా నన్ను బయటకి పొమ్మనడానికి నువ్వెవరని? దివాకరుడు సీమ పౌరుషం ప్రదర్శించినట్లు తాజా సమాచారం. ఎందుకయినా మంచిదని కాంగ్రెస్ లోనే పుట్టిన తను తన చివరాఖరి శ్వాస కూడా కాంగ్రెస్లోనే కంటిన్యూ అయిపోతానని ఒకచిన్న డిక్లరేషన్ కూడా చేసేసారు.   అయితే అరచేతిని అడ్డం పెట్టి ఉదయించే సూర్యుడిని ఆపలేమని వైయస్సార్ కాంగ్రెస్ వాళ్ళు మాటిమాటికి ఎందుకు ఏ ఉద్దేశ్యంతో అంటున్నారో పెద్దన్నగారు కాస్త ప్రజలకి వివరిస్తే బాగుంటుందేమో!

బీజేపీలోకి కృష్ణంరాజు

      ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి కృష్ణంరాజు తిరిగి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఉదయం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో కృష్ణంరాజు సమావేశమయ్యారు. కృష్ణం రాజు రెండున్నర నెలల క్రితం హైదరాబాదుకు వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఇప్పుడు రాజ్‌నాథ్‌ను కలిశారు. కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణం రాజు తిరిగి పాతగూటికి దగ్గరవుతున్నారు.   గతంలో బీజేపీ తరపున పోటీచేసి రెండు సార్లు ఎంపీగా గెలిచిన కృష్ణంరాజు 1999-2004 వరకు కేంద్ర రక్షణ శాఖ సహాయక మంత్రిగా కొనసాగారు. అనంతరం బీజేపీ నుంచి వైదొలిగిన చాలాకాలం తర్వాత తిరిగి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

లగడపాటిని బహిష్కరించాలి

      విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై రాష్ట్ర మంత్రి కొండ్రు మురళీమోహన్ మండిపడ్డారు. లగడపాటి మీడియాలో కనబడేందుకు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుంటాడని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయింది అవాస్తమని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న లగడపాటిని ముందు పార్టీ నుండి బహిష్కరించండి. ఇదే విషయం కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కోరుతున్నా అని అన్నారు.   చంద్రబాబు నాయుడు , వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు ఇచ్చారు. మరి జగన్ మాత్రం ఆ విషయం ఎవరితోనూ చెప్పడం లేదు. రాహుల్ గాంధీని ప్రదానిని చేయాలన్నది జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కోరిక అని జగన్ కు తెలియదా ? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సమైక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం లేదని తాను భావిస్తున్నానని మురళీమోహన్ అన్నారు.

జగన్ తో కేంద్రం కుమ్మక్కు

      కేంద్రంతో జగన్ కుమ్మక్కయ్యారని, అధిష్ఠానం ఆయన్ని దత్తపుత్రుడిగా భావిస్తోందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. ఇక వైసీపీ, టీఆర్ఎస్ లాలూచీ పడ్డాయన్న విషయాన్ని జగన్ సభను చూసిన చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడని అన్నారు. సమైక్య సభ బలపడాలని జగన్ ప్రయత్నించారని, అయితే ఆయన పార్టీ బలపడటం లేదని అధిష్ఠానానికి ఆలస్యంగా అర్థమైందన్నారు. రాష్ట్రం జగన్ గుప్పిట్లో ఉందన్న భ్రమతో కాంగ్రెస్ అధిష్ఠానం విభజన ప్రకియను వేగవంతం చేస్తోందన్నారు.   సమైక్యవాదంతో ముందుకెళ్తున్న ఏపీఎన్జీవో సభకు అడ్డంకులు సృష్టించిన టీఆర్ఎస్.. జగన్‌తో కుమ్మక్కయినందునే ఆయన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదన్నారు. జగన్, కేసీఆర్ తోడు దొంగల్లా కూడబలుక్కుని హైదరాబాద్‌లో శంఖారావం సభను నిర్వహించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లు వచ్చినా, తీర్మానం వచ్చినా ఓడిస్తామని, ఆ తర్వాత రాజీనామా చేయడానికి ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి, ప్రజల గుండెల్లోని భావనను తెలియజేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ప్రజల భావోద్వేగాలను తేలిగ్గా తీసుకోవద్దని అధిష్ఠానానికి చెప్పామన్నారు.

తమలపాకుతో నువొకటంటే తలుపు చెక్కతో నేను రెండంటిస్తా..

  తమలపాకుతో నువొకటంటే తలుపు చెక్కతో నేను రెండంటిస్తా.. అందిట వెనకటికికో గడుసు ఇల్లాలు. జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర సెంటిమెంటు పట్టుకొని సీమాంధ్రలో దూసుకుపోదామని ప్రయత్నిస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు చూసినా ఆయన కంటే రెండడుగులు ముందే ఉంటున్నారు.   జగన్ సమైక్య శంఖారావం పూరించడానికి సిద్దం కాగానే కిరణ్ రచ్చబండ ముచ్చట్లకి సిద్దం అయ్యారు. కోట్లు ఖర్చుపెట్టి జగన్ శంఖారావం చేస్తే, కిరణ్ తన ఏసీ ఆఫీసు గదిలో కూర్చొని, పైసా ఖర్చు, ప్రయాస లేకుండా ప్రధానికి, రాష్ట్రపతికి రెండు చిన్న లేఖలు వ్రాసి పడేసి, జగన్ సభకి దక్కవలసిన మీడియా ఫోకస్ అంతా తన వైపు తిప్పుకొని చిద్విలాసంగా చిర్నవ్వులు చిందిస్తున్నారు.   జగన్ అంత చెమటోడ్చినా దక్కని ఫలం, కిరణ్ సందించిన లేఖాస్త్రాలు బాంబులవలె పేలుతూ అటు సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణాలో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయన వ్రాసిన లేఖను రాష్ట్రపతి హోంశాఖకు పంపి సంజాయిషీ కోరడమే అందుకు కారణం. రాష్ట్రవిభజన కీలకదశకి చేరుకొన్న ఈ తరుణంలో కిరణ్ ఈవిధంగా లేఖలు వ్రాసి తెలంగాణాకి అడ్డుపడుతున్నాడని తెరాస మరియు టీ-కాంగ్రెస్ నేతలు ఆయన మీద చాలా ఫైర్ అయిపోతున్నారు. తెరాస మరియు టీ-కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణాకి అడ్డుపడుతున్నావని ఎంతగా దూషిస్తే, అవతల సీమాంధ్రలో ఆయన రేటింగ్స్ అంతగా పెరిగిపోతున్నాయి.   పైగా ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారారని, ఆయన ఆ కుర్చీలో కూర్చోనంత కాలం రాష్ట్రవిభజన అసాధ్యమని తెలిసినప్పటికీ అధిష్టానం అయనను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని, మీడియాలో వస్తున్నవార్తలు, రాజకీయ విశ్లేషణలు ఆయన రేటింగ్స్ కి మరిన్ని స్టార్స్ జోడిస్తున్నాయి.   అందువల్ల ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ మరో కొత్త ఉపాయం ఆలోచించవలసి ఉంటుంది. అయితే రాష్ట్రవిభజన అనివార్యమని అందరికీ తెలిసినప్పటికీ వీరిద్దరిలో ఎవరు సమైక్య ఛాంపియన్ షిప్ ట్రోఫీ గెలుస్తారా అని ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

బీహారీలను ఆకట్టుకొన్ననరేంద్రమోడీ ప్రసంగం

  ఈరోజు (ఆదివారం) పాట్నాలో మోడీ సభ మొదలయ్యే రెండు గంటల ముందు ఏడు వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగాయి.అందులో ఐదుగురు మరణించగా దాదాపు డబ్బై మంది ప్రజలు గాయపడ్డారు. అయినప్పటికీ నరేంద్ర మోడీ సభకు భారిగా జనాలు తరలివచ్చారు.   మోడీ స్థానిక భోజ్ పురీ బాషలో కొంత సేపు ప్రసంగించి బీహారీలను బాగా ఆకట్టుకొన్నారు. ఎటువంటి సభలో ఏ అంశాలు ప్రస్తావించాలో, ఏవిధంగా మాట్లాడాలో బహుశః మోడీకి తెలిసినంత బాగా నేటి రాజకీయ నాయకులలో చాలామందికి తెలియదని చెప్పవచ్చును. డిల్లీ వంటి నగర ప్రజలని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కొంచెం క్లిష్టమయిన అంశాలను, సాంకేతికమయిన పదాలను ప్రయోగించే మోడీ ఇక్కడ మాత్రం స్థానిక ప్రజలకు సులువుగా అర్ధం అయ్యే అంశాలను తనదయిన శైలిలో ప్రసంగించి వారిని ఆకట్టుకోవడమే ఆయన పరిణతికి ఒక మంచి నిదర్శనం.   పౌరాణిక యుగంలో సీతాదేవి పుట్టిన పుణ్యభూమి బీహార్ అని మొదలుపెట్టడంతోనే 'ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్' అన్నట్లు ఆ తరువాత ప్రజలచేత జేజేద్వానాలు పలికించుకొంటూ అలవోకగా ఆయన ముందుకు సాగిపోయారు. బీహార్ గత వైభవం గురించి వారి కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ బుద్ధుడు, అశోకుడు, చాణక్యుడు, చంద్రగుప్తుడు, మౌర్యులు వంటి మహామహులు బీహార్ గడ్డ మీదనే జన్మించారని, నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు యావత్ ప్రపంచంలో మేటి విద్యాలయాలుగా పేరు తెచ్చుకొన్నాయని చెప్పడంతో ప్రజలు హర్షద్వానాలు మిన్నంటాయి.   అదేవిధంగా స్వాతంత్రోద్యమంలో గాంధీ మహాత్ముడు చంపారణ్ లో చేసిన ఉద్యమం గురించి చెప్పి, బీహార్ రాష్ట్రం దేశానికి ఎప్పుడు అవసరమయిన జయప్రకాశ్ నారయణ్ వంటి గొప్ప నేతలను అందిస్తూనే ఉందని, అటువంటి మహానీయుడితో కలిసి పనిచేసే భాగ్యం తనకి దక్కనప్పటికీ, ఇప్పుడు బీహార్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు తను చాల సంతోషిస్తున్నాని అన్నారు.   బీహార్ లో అత్యధికంగా ఉన్నయాదవ కులస్తులను ఆయన మెప్పించిన తీరు అసమాన్యం. వారు ఆరాధించే శ్రీకృష్ణుడు గుజరాత్ లో ఉన్న ద్వారకలో నివసించాడని, అందువల్ల యాదవులతో తనకున్న అనుబంధం ప్రత్యేకమయిందని, అందుకే వారికోసం ద్వారక నుండి ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీసులు తీసుకువచ్చానని ఆయన అన్నపుడు ప్రజల స్పందన ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   అయితే వారి కులానికే చెందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల దాణా కేసులో ఐదేళ్ళు జైలు శిక్షపడినప్పటికీ ఆయన పేరు పలికి వారి మనసులు నొప్పించకుండా ఆయన జాగ్రత్త పడుతూనే, లాలూ హయంలో సాగిన ఆటవిక రాజ్యం నుండి వారికి విముక్తి కలిగించదానికే బీజేపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి చెందిన జేడీ(యు)కి మద్దతు ఇచ్చిందని, గానీ ఆయన అధికారంలో స్థిరపడిన తరువాత బీజేపీని కాదని కాంగ్రెస్ హస్తం అందుకొని మిత్రద్రోహం చేసాడని విమర్శించారు.   నితీష్ కుమార్ కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు రాష్ట్రం కోసం రూ.50వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీగా కోరారని, అయితే బీహార్ ప్రజలు ఇక కాంగ్రెస్ ముందు ఎంత మాత్రం చేతులు జాపవలసిన అవసరం లేదని, తనను ఇంతగా ఆదరిస్తున్న బీహార్ ప్రజలకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, రూ.50వేల కోట్లని వడ్డీతో సహా చెల్లించి ప్రజల ఋణం తీర్చుకొంటానని చెప్పి ప్రజల జేజే ద్వానాలు అందుకొన్నారు.   జాతులు, మతాలు, ప్రాంతాల పేరిట విభజించి పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆరు దశబ్దాల పాలనలో చేసిందేమీ లేదని, కనీసం నేటికీ కోట్లాది పేద ప్రజలు రెండు రొట్టెలు తినడానికి కూడా నోచుకోలేదని, అందువల్ల తమ ఈ పరిస్థితుల్లోమార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాక తప్పదని ఆయన చెప్పారు. నిరుపేద హిందూ, ముస్లిం ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుకోకుండా, తమ పేదరికంపైనే పోరాటం చేయాలని, హిందు, ముస్లిం ప్రజలు సంఘటితంగా కలిసిపనిచేసినప్పుడే ఒక ధృడమయిన భారతదేశాన్ని నిర్మించగలమని మోడీ సందేశం ఇచ్చారు. ఆయన తన ప్రసంగంతో బీహారీలను చాలా బాగా అక్కట్టుకోగాలిగారు. అందువల్ల మోడీ సభ ఊహించిన దానికంటే చాలా దిగ్విజయంగా ముగిసింది.

మోడీ సభకి బాంబులతో స్వాగతం

  అవేమి మోడీకి స్వాగతం పలకడానికి పేల్చిన దీపావళి టపాసులు కావు, ఉగ్రవాదులో మరెవరో పేల్చిన నిజమయిన బాంబులు. ఒకటి తరువాత మరొకటి చొప్పున మొత్తం ఏడూ బాంబులు పాట్నా నగరంలో ప్రేలాయి. అందులో ఐదుగురు మరణించగా డబ్బై మంది గాయపడ్డారు. సభ మొదలవడానికి కేవలం రెండు గంటల ముందు ఈ ప్రేలుళ్ళు జరగడం చాలా విచిత్రం. ఎందుకంటే ప్రధాని అభ్యర్ధిగా పోటీలో ఉన్న మోడీ సభకి చాలా ముందు నుంచే భద్రతాపరమయిన ఏర్పాట్లు అన్నీ జరిగి ఉంటాయి. అయినప్పటికీ వరుస ప్రేలుళ్ళు జరిగాయి. అయినప్పటికీ వేలాది మంది జనాలు మోడీ సభకి తరలివచ్చారు. అటువంటి సంఘటన తరువాత కూడా అన్నివేలమంది (అదే మన రాష్ట్రంలో అన్ని లక్షల మంది అని చెప్పుకొంటాము) సభకు హాజరవడం విశేషమే. బహుశః దీనినే మోడీయిజం అనాలేమో.   అటువంటి సంఘటన తరువాత కూడా అంతమంది నిర్భయంగా తనకు సభకు హాజరవడం చూసి మోడీ కూడా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెల్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీతో సహా అతిరధ మహారధులందరూ మోడీని భూతంగా, బీజేపీని మతతత్వపార్టీగా చూపిస్తూ ప్రజలని ఎంతగా భయపెట్టాలని ప్రయత్నిస్తున్నపటికీ జనాలు మాత్రం మోడీ సభకి తరలివస్తుండటం కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం ముందుందని సూచిస్తోంది.   పైగా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా భావింపబడుతున్న రాహుల్ గాంధీ, పార్టీ ప్రచారనికని బయలు దేరి, తన ప్రసంగాలతో పార్టీకి మేలు చేయకపోగా తన ప్రసంగాలతో తనకి, తన పార్టీకి కూడా తలనొప్పులు తెచ్చిపెట్టడం నరేంద్ర మోడీకి కలిసివస్తోంది. మొట్ట మొదటి సారిగా ఇద్దరూ ప్రధాని అభ్యర్దులు జనాల ముందుకి ఒకేసారి రావడంతో ప్రజలు వారి రాజకీయ పరిణతి, నిజాయితీ మరనేక అంశాలను స్వయంగా బేరీజు వేసుకోగలుగుతున్నారు.   నవంబర్, డిశంబర్ నెలలో ఐదు రాష్ట్రాలలో (మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం మరియు డిల్లీ) జరుగబోయే శాసనసభ ఎన్నికలు వారిరువురికీ సెమీ ఫైనల్స్ అంటివే గనుక దానిని బట్టి వారిరువురిలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలుసుకోవచ్చును.   ఇంతవరకు ఈ ప్రేలుళ్ళకు బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది.

చ్చాల బాధ కలుగుతోంది....

  ప్రజలు అడుగుతున్నారు...ఎప్పుడూ ఎవరినో ఒకరిని అనుకరిస్తూనే ఉంటావెందుకని? ప్రజలు అడుగుతున్నారు. సమైక్యాంధ్ర సభ అని చెప్పి ముప్పై పార్లమెంటు సీట్లు సంపాదించి డిల్లీని శాసిద్దామని ఓట్లు, సీట్లు గురించి ఎందుకు మాట్లాడుతున్నావని ప్రజలు అడుగుతున్నారు? వచ్చేఎన్నికల తరువాత తల్లీ, చెల్లీ, అన్న ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకే మద్దతిస్తామని చెపుతూ కూడా మళ్ళీ సోనియమ్మను ఆడిపోసుకోవడమెందుకని...ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్ర విభజన చేయిస్తున్నకేసీఆర్ ఊసెత్తకుండా సమైక్యవాదం వినిపిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డినే ఎందుకు ద్వేషిస్తున్నావని ప్రజలు అడుగుతున్నారు.   జనగణమణ గీతం కూడా సరిగ్గా పాడలేననందుకు ప్రజలు చ్చాల బాధ పడుతున్నారు. ప్రజలకి బాధ కలుగుతోంది..జనగణమణ గీతం కూడా సరిగ్గా పాడలేని వారు వందేమాతరం గేయం పాడుతామని చెపుతుంటే...బాధ కలుగుతోంది...చ్చాలా బాధ కలుగుతోంది సమైక్యాంధ్ర సభ అని చెప్పి ఓట్లు సీట్లు గురించి మాట్లాడుతున్నపుడు.   చ్చాల బాధ కలుగుతోంది....రాహుల్ గాంధీని సోనియమ్మ ప్రధానిని చేస్తుంటే...ఇది అన్యాయం కాదా? అని నువ్వడుగుతున్నపుడు బాధ కలుగుతోంది. ప్రజలు అడుగుతున్నారు...ప్రజలు అడుగుతున్నారు మరి సోనియమ్మ చేయాలనుకొంటున్న తప్పునే విజయమ్మకూడా ఎందుకు చేస్తోందని? విజయమ్మ కలలు సోనియమ్మా కలలకి తేడా ఏమిటని ప్రజలు అడుగుతున్నారు.   రాజకీయాలలో విలువలు లేకుండా పోయినందుకు చ్చాల... బాధ.. కలుగుతోంది...చ్చాల బాధ కలుగుతోంది దేశంలో, రాష్ట్రంలో మరే పార్టీకి కూడా వైకాపా అంత నీతి నిజాయితీ లేకుండా పోయినందుకు చ్చాల.. బ్భాద కలుగుతోంది. ప్రజలు అడుగుతున్నారు...అయినా అటువంటి నీతినిజాయితీ లేని పార్టీలకే ఎందుకు మద్దతు ఇస్తావని?   సమైక్య సభపెట్టి డిల్లీలో చక్రం తిప్పుదామంటున్నావేమిటని ప్రజలు అడుగుతున్నారు...చ్చాల బాధ పడుతున్నారు....సమైక్యాంధ్ర సెంటిమెంటుని ఇలా క్యాష్ చేసుకోవాలని చూస్తునందుకు... ...నిజంగా చాలా బాధ పడుతున్నారు...

రేణుకని సాధిస్తున్నారు!

  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సాధించడానికి రేణుకా చౌదరి అప్పనంగా దొరికినట్టుంది. ఆమెని ఇబ్బంది పెట్టడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే వుంటారు. రేణుకా చౌదరికి వున్న నాయకత్వ లక్షణాలు, ఎవరినీ లెక్కచేయనితనం, తాను చెప్పాలనుకున్నది నిర్భయంగా చెప్పే లక్షణమే ఆమెను తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు శత్రువుగా మార్చాయి. తె.కాం. నాయకులలోని పురుషాధిపత్య ధోరణి కూడా ఆమెకు శత్రువుల్ని పెంచుతోంది.   మహిళా కాంగ్రెస్ నాయకురాలంటే తాము చెప్పిన వాటికి తలూపడం తప్ప ఎదురు మాట్లాకూడదు. ఒకవేళ ఎదురు తిరిగి మాట్లాడితే.. ఇదిగో.. ఇలా రేణుకాచౌదరిని వెంటాడినట్టే వెంటాడి వేధిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను రేణుకా చౌదరి మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే తెలంగాణని అభివృద్ధి చేయడమే ముఖ్యమని ఆమె చెప్పేవారు. అది మనసులో పెట్టుకుని ఆమె మీద తెలంగాణ ద్రోహి ముద్ర వేశారు.   ఆమధ్య తెలంగాణ కాంగ్రెస్ సమావేశానికి రేణుకా చౌదరి వెళ్తే పొన్నం లాంటి నాయకులు ఆమెని ఆ సమావేశంలోంచి బయటకి పంపేయాలని నానా యాగీ చేశారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రి ఒకరు రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా ఆడపడుచే కాని రేణుకని ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొనసాగించకూడదని ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా వున్న రేణుక వచ్చే ఎన్నికలలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.   అయితే కొంతమంది తె.కాం. నాయకులు ఈసారి రేణుకకు ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ ఇవ్వాలంటే ఆమె ఖమ్మం జిల్లాలో పుట్టినట్టు బర్త్ సర్టిఫికెట్ చూపించాలని డిమాండ్ చేశారు. ఈసారి రేణుకకు ఖమ్మం టిక్కెట్ రాకుండా చేయాలన్న ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇదంతా ఇలా వుంటే, రేణుకకు చెక్ పెట్టడంతోపాటు, రాహుల్‌గాంధీ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఖమ్మం జిల్లాలో వున్న రేణుక వ్యతిరేక వర్గం ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాంటి ఒక ప్లాన్ వేసింది.   రాహుల్‌గాంధీ ఈసారి ఎన్నికలలో ఖమ్మం నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించింది. ఇది రేణుక వర్గీయులకి ఆగ్రహం తెప్పించింది. దాంతో వాళ్ళు ఖమ్మం జిల్లా ఎడిషన్ న్యూస్ పేపర్లలో ‘‘ఖమ్మం నుంచి రేణుకా చౌదరి పోటీ చేయాలంటే బర్త్ సర్టిఫికెట్ కావాలన్నారు. మరి రాహుల్‌గాంధీకి ఖమ్మం జిల్లాలో పుట్టినట్టు బర్త్ సర్టిఫికెట్ ఏదైనా వుందా’’ అనే అర్థం వచ్చేలా ప్రకటనలు ఇచ్చారు. రేణుకని దెబ్బతీయడానికి కాచుకుని కూర్చుని వున్న వాళ్ళకి ఆ ప్రకటనలు లడ్డులా దొరికాయి. ఆ ప్రకటనల కటింగ్‌ని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి శనివారం నాడు దిగ్విజయ్‌సింగ్‌కి అందజేశారు.   రేణుకా చౌదరి వ్యవహార శైలి మీద కూడా డిగ్గీకి ఫిర్యాదు చేశారు. యువరాజు మీదే కామెంట్లు చేయడానికి సాహసిస్తున్న రేణుకని, ఆమె వర్గాన్ని తగిన విధంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తమ్మీద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తనను ఎంత సాధిస్తున్నా, వేధిస్తున్నా రేణుకా చౌదరి వెనకడుగు వేయడం లేదు. కాంగ్రెస్ పార్టీలో వున్న ఈ వర్గపోరు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశానికి మరింత లాభం చేకూర్చే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు

      గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ సభ జరగనున్న భీహారు రాజధాని పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ ఉదయం నుంచి మొత్తం ఆరు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు పాట్నా రైల్వే స్టేషన్ లోని పదవ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఓ టాయిలెట్ సమీపంలో తొలి బాంబు పేలుడు జరుగగా, రెండో బాంబు ఓ సినిమా థియేటర్ వద్ద, మిగితా నాలుగు బాంబులు హుంకర్ ర్యాలీ జరిగే గాంధీ మైదాన్ వద్ద జరిగినట్టు సమాచారం. ఈ ర్యాలీలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఆదివారం పాట్నాలో మధ్నాహం ఒంటి గంటకు 'హుంకర్' ర్యాలీలో నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.