వర్షాలతో రైతన్నకు దెబ్బ మీద దెబ్బ

      రాష్టవ్యాప్తంగా వర్షాలు కుండపోతలా కురుస్తున్నాయి. గత 48 గంటలుగా రాష్ట్రంలోని అన్నిప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పత్తి రైతుకు ఈ వర్షాలు శరాఘాతంగా పరిణమిచ్చాయి. చెరువులు, కుంటులు నిండి పారుతున్నాయి. పైలిన్‌ తుపానుతో ఇబ్బందుల్లో ఉన్న తీరప్రాంత రైతులకు ఈ అల్పపీడనం మూలంగా వచ్చిన తుపాను పులిమీద పుట్రలా మారింది.   శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఎడతెరపి లేని వర్షం కురిసింది. ప్రస్తుతం  నెల్లూరు-ఒంగోలు మధ్య అల్పపీడనం కేంద్రీకృతమయివుంది. తీరం సమీపంలో ఉన్నందున వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధనా కేంద్రం చెబుతుండడం రైతులకు మరింత ఇబ్బందికరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా మందసలో అత్యధికంగా 17 సెం.మీ, పలాస, సోం పేట, ఇచ్ఛాపురంలో 15 సెం.మీ, కాకి నాడ, చోడవరం, అనకాపల్లి, పత్తిపా డులలో 12 సెం.మీ, కళింగపట్నంలో 11 సెం.మీ, తిరుపతి, విశాఖ విమానాశ్ర యం, అరకు, కావలి, ఎలమంచిలి, పెద్దాపురంలలో 9 సెం.మీ, టెక్కలి, కోడే రులలో 8, అచ్చంపేట, గజపతినగరం, ఎర్రగొండపాలెం, వెంకటగిరి, మాచర్ల, దేవరకొండలలో 7, నెల్లూరు, అవనిగడ్డ, రణస్థలం, తణుకు, ఆత్మకూరు, దర్శి, తాడేపల్లిగూడెం, తెర్లాం, పాలకొండలలో 6, రాజమండ్రి, మచిలీపట్నం, కందు కూరు, నాగర్‌కర్నూల్‌, పొదిలి, పాడేరు, శ్రీకాళహస్తి, కైకలూరు, అద్దంకి, చీపురు పల్లి, విజయనగరంలో 5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

మీడియాకి హ్యండిచ్చిన మెగా బ్రదర్స్

    వేలిస్తే చెయ్యందుకొనే మన మీడియా రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయని చెపుతూనే, దానిపై ఎవరి శక్తిమేర వారు ఊహాగానాలు, సందర్భ సహిత వ్యాఖ్యలు, విశ్లేషణలు వగైరా వగైరాలతో జనాలను, ముఖ్యంగా తెదేపా అభిమానులను మంచి రంజింపజేశారు. కొందరు మరొక అడుగు ముందుకు వేసి, యన్టీఆర్ కి చెక్ పెట్టేందుకే పవన్ కళ్యాణ్ పార్టీలోకి రప్పిస్తున్నారని ఈ వార్తలకి మంచి మసాలా కూడా తగిలించారు. పనిలోపనిగా నాగబాబుకి మచిలీపట్నం నుండి టికెట్ కూడా వాళ్ళే కన్ఫర్మ్ చేసేసి తమ సత్తా చాటుకొన్నారు. మరొక వారం పదిరోజులు ఆగితే పవన్ కళ్యాణ్ కి కూడా టికెట్ ఖాయం చేసేసేవారే, కానీ నాగబాబు తొందరపడి తాము ఏ పార్టీలో చేరడంలేదని ఈ రోజు ప్రకటించేశాడు. మీడియా ప్రజారాజ్యానికి కూడా తిరిగి ప్రాణం పోయాలని ఆశపడింది కానీ ఆ ప్రయత్నం పైనా నాగబాబు నీళ్ళుజల్లి అందరినీ ఉసూరుమనిపించాడు. అయితే ఇక మెగా సోదరులిద్దరూ రాజకీయాలలో చెయ్యి కాల్చుకొనే ఆలోచనలో లేరనే సంగతి మాత్రం ఖరారయిపోయింది.  

అబ్బ మరీ ఇంత సెంటిమెంటయితే తట్టుకోలేము బాబు

  మహాతల్లి ఇందిరమ్మ 'తన శరీరంలో చివరి రక్తం బొట్టుపోయే వరకు దేశసేవ చేస్తానని’ పలికిన కొద్దిరోజులకే హత్య చేయబడటంతో ఆమె మాటలకి చాలా విలువ ఏర్పడింది. ఇక నాటి నుండి నేటి వరకు గల్లీ నుండి డిల్లీ వరకు ప్రతీ రాజకీయ నాయకుడు ఈ లైన్స్ ని తమ ప్రసంగంలో విరివిగా వాడేసుకోవడం మొదలుపెట్టారు.   అయితే ఆమెలా నిజంగా చివరి రక్తం బొట్టు వరకు పనిచేస్తామని చెప్పేందుకు మాత్రం కాదు. ఒకవేళ కర్మకాలి ఎవరి చేతిలోనయినా చస్తే లేక ఏ గుండె జబ్బో వచ్చిమధ్యలో బకెట్ తన్నేసినా, పోయిన తరువాత కూడా జనాలు తమ గురించి చెప్పుకోడానికి ఓ నాలుగు ముక్కలుండాలానే తపనతోనే అందరూ తప్పనిసరిగా తమ ప్రసంగంలో, వీలయితే ట్వీటర్లో కూడా ఈ లైనుండేలా జాగ్రత్త పడుతున్నారు.   అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ ప్రసంగంలో మధ్య మధ్య సోనియా రాహుల్, అధిష్టానం వంటి పదాలను కలుపుకొని ప్రసంగించే ఆనవాయితీని ఎంత నిబద్దతగా పాటిస్తారో, అదేవిధంగా ఈ ‘చివరి రక్తం బొట్టు’, ‘నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు’ ఇత్యాది పదాలను పార్టీలకతీతంగా రాజకీయనాయకులు అందరూ కూడా తమ ప్రసంగంలో తప్పనిసరిగా చెప్పుకొంటారన్న మాట.   ఇక తాజా సమాచార్ ఏమిటంటే, ఇందిరమ్మ మనుమడు రాహుల్ గాంధీ కూడా తనకి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఎందుకని, ఆయన కూడా ఈ లైన్స్ అన్నిఎంచక్కా వల్లె వేసేసారు. ఈ రోజు రాజస్థాన్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన, తన తండ్రి, నాయనమ్మలాగే తన ప్రాణాలకి కూడా ప్రమాదం పొంచి ఉందని, ఉగ్రవాదం, మత తత్వవాదంపై పోరాడుతున్నతనను ఎవరయినా హత్య చేసే అవకాశం ఉందని తనకు తెలుసనీ, అయినా తాను ప్రాణాలు పోతాయని ఏనాడు భయపడలేదని, తనకు తన ప్రాణాలకంటే దేశమే ముఖ్యమని అని స్పష్టం చేసారు. అందువల్ల ప్రజలు కూడా ఈ మతతత్వానికి దూరంగా ఉండాలని ఆయన పిలుపిచ్చారు.   అయితే అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తులకు సహజంగానే ఆ ప్రమాదం పొంచి ఉంటుందనేది ఎవరూ కాదనలేని సత్యం. అందువల్ల ఆయన మాటలను ఎవరూ కొట్టి పారేయలేరు కూడా. అయితే ఆయన బీజేపీ పాలిత రాష్ట్రానికి వచ్చి ఈ మాటలనడంతో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు రాహుల్ మాటలకి బీజేపీ నేతలు భుజాలు తడుముకొంటూ ఆయన మీద చాలా కోపగించుకొన్నారు.   కుంభకోణాలు తప్ప వేరేమి ఎరుగని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంతకంటే వేరేమి మాట్లాడగలరని వారు విమర్శించారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే, ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన తమ పార్టీ గురించి, యుపీయే ప్రభుత్వం సాధించిన ఘన కార్యాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేనందునే ఈ సెంటిమెంటు డైలాగులతో జనాల సానుభూతి పొంది, దానిని ఓట్లుగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు గుమ్మడి కాయలను మళ్ళీ రాహుల్ గాంధీ భుజన్నపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

పవన్ టిడిపిలో చేరడం లేదు: నాగబాబు

      తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు ఖండించారు. తాము ఏ పార్టీలోనూ చేరమని, ప్రస్తుతం మా వృత్తిలో మేము బిజీగా ఉన్నామని ఆయన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. తాము రాజకీయ పార్టీ పెట్టడం లేదని కూడా నాగబాబు స్పష్టం చేశారు. మీడియా కథనాలు అభిమానులను, ప్రజలను గందరగోళపరిచేలా ఉన్నాయని వాపోయారు. మీడియా ఈ విధంగా ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.అయితే ఇటీవల హీరో నందమూరి బాలకృష్ణతో భేటీ అయిన విషయాలను గానీ, పలు జిల్లాలలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లతో కూడిన ఫ్లెక్సీల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

అభయ నిందితులకు 14 రోజులు రిమాండ్

      హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అభయ కిడ్నాప్, అత్యాచారం కేసు నిందితులు సతీష్, వెంకటేశ్వర్లును పోలీసులు బుధవారం ఉదయం మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. నిందితులపై విచారణ జరిపిన కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నిందితుల విచారణ నిమిత్తం రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. నిందితులపై గ్యాంగ్‌రేప్, కిడ్నాప్, అక్రమ నిర్బంధం సెక్షన్లతో పాటు నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గత రాత్రి నిందితుడు సతీష్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

విభజనకి గవర్నర్ గండం

      రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో వున్నారు. రాష్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ తెగ ఉత్సాహపడిపోతూ పావులు చకచకా కదుపుతున్న ఈ తరుణంలో నరసింహన్ చేస్తున్న ఢిల్లీ పర్యటనకి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. బుధవారం నాడు నరసింహన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర మంత్రి చిదంబరంతో విడివిడిగా సమావేశమై అరగంటకు పైగా చర్చలు జరిపారు. అలాగే బుధవారమే ఎ.కె.ఆంటోనీతోపాటు రాహుల్‌గాంధీని కూడా కలుస్తున్నారు. ఈ భేటీలలో నరసింహన్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వివరాలనూ పూసగుచ్చినట్టు వివరించే అవకాశం వుంది. నరసింహన్ కేంద్రానికి ఇచ్చే నివేదికలు రాష్ట్ర విభజన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పాయింటే ఇప్పుడు విభజనవాదుల్లో గుబులు పుట్టిస్తోంది. విభజనవాదులు విమర్శించేదాని ప్రకారం గవర్నర్ నరసింహన్ నూటికి నూరుశాతం సమైక్యవాది. తెలంగాణ మీద కేంద్రానికి గవర్నర్ తప్పుడు నివేదికలు పంపుతున్నారని విభజనవాదులు గతంలో అనేకసార్లు ఆయన మీద ఒంటికాలితో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ  సాక్షిగా ఆయన మీద పేపర్లు విసిరారు. నరసింహన్ మాజీ పోలీసు అధికారి. ఎవర్ని ఎప్పుడు ఎక్కడ దెబ్బకొట్టాలో బాగా తెలిసిన వ్యూహకర్త. అలాంటి నరసింహన్ తెలంగాణవాదులు తనను ఎన్నిరకాలుగా విమర్శించినా, హద్దుమీరి ఆరోపణలు చేసినా ఏనాడూ ఆవేశపడలేదు. చాలా సందర్భాలలో ఆయన నోటి వెంట ‘రాష్ట్రం’ బాగుండాలనే మాటలు వినిపించాయి.  అలా విభజన వ్యతిరేకిగా ముద్రపడిన నరసింహన్ ఢిల్లీలో నివేదికలు అందిస్తూ ఉండటం తెలంగాణవాదుల్లో గుబులు పుట్టిస్తోంది. నరసింహన్ ఎలాంటి నివేదికలు ఇస్తారో, తెలంగాణకు ఎక్కడ ఏ పుల్ల అడ్డువేస్తారో అని విభజనవాదులు భయపడుతున్నారు. విభజనవాదులు గతంలో చేసిన విమర్శలను నరసింహన్ మనసులో పెట్టుకుని విభజనకు వ్యతిరేకంగా నివేదికలు ఇస్తారేమోనన్న దడ విభజనవాదుల్ని పట్టి పీడిస్తోంది. తెలంగాణకు గవర్నర్ రూపంలో వచ్చిన గండం గడిచిపోవాలని విభజనవాదులు కోరుకుంటున్నారు.

ఆర్టీసీ ఛార్జీల మోత

      మరోసారి ఛార్జీల మోత మోగించేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. సంస్థకు వస్తున్న నష్టాలను నివారించి ఆర్థిక వనరులను పెంచుకోవడంలో భాగంగా ఛార్జీల పెంపు తప్పదని ఆర్టీసీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఛార్జీల పెంపు ప్రతిపాదనలతో నేడో ..రేపో మంత్రి బొత్స ముఖ్యమంత్రిని కలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్టీసీ రూ.400 కోట్ల నష్టాల్లో ఉండడం, విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మెతో రూ.745 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఈ మొత్తాన్ని ఒక్కసారిగా కాకుండా వాటిలో దాదాపు రూ.400 కోట్ల మేరకు భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ మనుగడ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రవాణామంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించడం, పెరిగిన డీజిల్‌ ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచుకోవడానికి అనుమతించడం ద్వారా సంస్థను కాపాడాలని ఇటీవల కొన్ని సంఘాలు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. సమ్మె వల్ల కోల్పోయిన ఆదాయం రూ.745 కోట్లలో ప్రభుత్వం వాహన పన్ను మినహాయించడం ద్వారా ఆర్టీసీకి రూ.400 కోట్ల భారం తగ్గే అవకాశం ఉండగా రూ.345 కోట్లకు అదనంగా రూ.55 కోట్లను కలిపి డీజిల్‌ ఛార్జీల పెరుగుదల సర్దు బాటుగా ఛార్జీలు పెంచాలని అధి కారులు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపుపై అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అందులోభాగంగా ప్రజల ఆగ్రహాన్ని చవిచూడకుండా ఉండేందుకు ఛార్జీలను కనీసం కిలో మీటర్‌కు పది పైసలు పెంచడం ద్వారా తాత్కాలికంగా కొంత మేరకు నష్టాలను నివారించు కోవాలని ఆర్టీసీ భావిస్తోంది.

ఇంటింటికీ టిడిపి

      తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రతో పాటు తమ కార్యకర్తలకు కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా క్యాడరు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టనున్నారు. కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి, కాంగ్రెస్ రాజకీయాలు,విభజనలో ఉన్న కుట్ర,తదితర అంశాలను వివరించాలని చంద్రబాబు నాయుడు కార్యకర్తలను కోరుతున్నారు. విభజన మూలంగా రాష్ట్రంలో ఏర్పడే ఇబ్బందులతో పాటు, అవినీతి నేతలను ఎన్నుకుంటే వచ్చే ఇబ్బందులను కూడా గడపగడపకు ప్రచారం చేయాలని నిర్ణయించారు. నవంబరులో రెండో విడత ఆత్మగౌరవ యాత్ర విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో మొదలు కానుంది.

ఎవరికి ఓటు వెయ్యాలో చెబుతా: అశోక్‌బాబు

      అధికారం కోసం అమ్ముడు పోయే పార్టీలకు బుద్ధి చెప్పాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వెయ్యాలో తామే చెబుతామని, ఆ బాధ్యత సీమాంధ్రులు తమకు ఇచ్చారన్నారు. సీమాంధ్రుల పోరాటాన్ని కొందరు నాయకత్వం లేని ఉద్యమంగా అభివర్ణిస్తున్నారని, ఇక్కడ ప్రజలే నాయకులని ఆయన స్పష్టం చేశారు. ఇంతకాలం సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్ఠానానికి తొత్తులుగా మారిపోయారని అశోక్‌బాబు విమర్శించారు. రాజ్యాంగం తెలియని మంత్రులుండడం తమ దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. "మన ఉద్యమాన్ని మనమే కొనసాగిద్దాం. నేను, నాతో ఉన్న వారు అమ్ముడుపోయారని చాలా మంది మాట్లాడుతున్నారు. మేమంతా ఎవరికో అమ్ముడుపోలేదు. కేవలం సీమాంధ్ర జిల్లాల ప్రజాభిమానానికి అమ్ముడు పోయాం. ఈ సత్యాన్ని విభజనవాదులు గ్రహించాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

రెండు రాష్ట్రాలకు నరసింహనే గవర్నర్!

      రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ ను నియమించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజకీయ, సామాజిక అంశాల మీద గవర్నర్ కు మంచి పట్టున్న నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుండి రెండు రాష్ట్రాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తారని అంటున్నారు. కేంద్రం పిలుపు మేరకు ఆయన ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు చిదంబరం,షిండే తదితరులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే చిదంబరాన్ని కలిసి రాష్ట్ర పరిస్థితులపై , ముఖ్యంగా హైదరాబాద్ అంశంపై ఆయన ఒక నివేదిక ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

ఎందరో ముఖ్యమంత్రులు అందరికీ వందనాలు

  తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మొదటి ప్రభుత్వం ఎవరిది, మొదటి ముఖ్యమంత్రి ఎవరవుతారనేది తెలంగాణాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది. కాంగ్రెస్ నేతలు తామే మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జైత్రయాత్రలు మొదలుబెడితే, ‘మీ హస్తంలో అధికారం పెట్టడానికేనా ఇన్నేళ్ళు మేము ఉద్యమాలు చేసేము?' అని ప్రశ్నిస్తూ తెలంగాణా రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతని, అందుకోసం మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యతని కూడా తెరాసయే పుచ్చుకొంటుందని, తెరాస నేతలు తమ కారు మీద ఒట్టేసి మరీ చెపుతున్నారు. ఈవిధంగా తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి చేసేందుకు రెండు పార్టీలు కృతనిశ్చయంతో ఉండగా, కాంగ్రెస్ పార్టీలోనే అనేకమంది నేతలు ముఖ్యమంత్రి కుర్చీలో కర్చీఫ్ వేసి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటున్నారు.   వారిలో జానారెడ్డి, డీ.శ్రీనివాస్, దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, డీకే అరుణ, శ్రీధర్ బాబు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఇంకా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఇంకా ఎందరో నామకనామకులు చాలా మందే ఉన్నారు. మంత్రి అరుణ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలనే ప్రయత్నంలో రాహుల్ గాంధీ మెహబూబ్ నగర్ నుండి పోటీ చేసి తమను కరుణించాలని వేడుకొన్నారు. మరి ఆయన తన విన్నపాన్నిమన్నించినా, మన్నించకపోయినా తనను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఓసారి కూర్చోనిస్తే చాలని ఆమె చిరు కోరిక.   ఇక తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తను కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కర్చీఫ్ కాదు ఏకంగా దుప్పటే వేసేసానని ప్రకటించేశారు. అవినీతికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నఅవినాబావ సంబంధం గురించి మరిచిపోయిన ఆయన, అవినీతి రహితమయిన ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీయే మొట్టమొదట ప్రభుత్వం ఏర్పరచవలసిన ఆగత్యం ఉందని ఆయన అన్నారు. ‘కనీసం మరో పదేళ్ళపాటు (?) అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పడవలసిన అవసరం చాలా ఉందని' ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. ఈ  విషయంలో అందరూ ఆయనను అభినందించక తప్పదు. ఎందుకంటే ఒక కుంభకోణం కప్పెట్టేలోగా మరోకటి బయటపడుతూ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకి కేరాఫ్ ఎడ్రెస్ గా మారిపోయిన ఈ తరుణంలో కూడా ఏకంగా ‘పదేళ్ళ పాటు అవినీతి రహిత ప్రభుత్వం’ ఏర్పాటు చేయడమంటే మాటలా? అయినా కూడా పాపం పాల్వాయి అందుకు తెగించి మరీ హామీ ఇస్తున్నారంటే, అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రి చేసినా చేయకపోయినా జనాలు మాత్రం ఆయన దైర్యానికి తప్పకుండా మెచ్చుకొని తీరాల్సిందే.   తెలంగాణా ప్రజల పాలిట దుర్గామాతవంటి సోనియా గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్న తను రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్దిపదంలో తీసుకుపోతానని ఆయన హామీ కూడా ఇచ్చారు. మరి ఆయన అంత గట్టిగా 10సం.ల వరకు ( అక్షరాల పదేళ్ళవరకు మాత్రమే) అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గ్యారంటీ ఇస్తున్నపుడు, ఆ పెద్దాయన మాట మన్నించి మిగిలిన వారు రేసు లోంచి తప్పుకొంటారనే నమ్మకం మాత్రం లేదు. అందుకే ‘ఎందరో ముఖ్యమంత్రులు అందరికీ వందనాలు’ అని ప్రజలు వారందరికీ ఓ దణ్ణం పెట్టి వారిలో ఎవరికో ఒకరికి ఒటేయక తప్పదు మరి. సీమంద్రాలో కూడా ఈ స్టోరీ సేమ్ టు సేమ్.

స్వంత పార్టీ మీదే ‘దాడి’ ఏలయా?

  రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్లు, కాంగ్రెస్ పార్టీతో వైకాపాకున్నఅనుబంధాలను ఎంత వదిలించుకొందామని ప్రయత్నించినా, అది నక్షత్రకుడిలా జగన్మోహన్ రెడ్డి వెంటపడుతూనే ఉంది. కొద్ది వారాల క్రితం కాంగ్రెస్ యంపీ సబ్బం హరి ఇక నేడోరేపో ఎలాగు వైకాపా కండువా కప్పుకోబోతున్నాను కదా అనే అత్యుత్సాహంతో తను ఇంకా కాంగ్రెస్ యంపీననే సంగతి మరచి, మా పార్టీ (వైకాపా) వచ్చే ఎనికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడే యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని ప్రకటించేసి, కాంగ్రెస్-వైకాపాల దోస్తీని ఖరారు చేసేసారు. దానితో ఆయన వైకాపా కండువా కప్పుకొనే భాగ్యం లేకుండా పోయింది.   ఒకవైపు తెలుగుదేశం అదే పాట పదే పదే పాడుతూ ఇబ్బంది పెడుతుంటే, మరో వైపు కాంగ్రెస్ యంపీలు లగడపాటి, హర్షకుమార్ తదితరులు కూడా సోనియమ్మా దత్తపుత్రుడిని చూసుకొని స్వంత కొడుకులవంటి తమని అన్యాయం చేసేస్తోందని మొత్తుకోవడం జగన్ బాబుకి గొప్ప సంకట పరిస్థితి కల్పించింది. తెదేపా ఆరోపణలను ఒట్టి గాలి కబుర్లని తేలికగా తీసి పడేస్తున్నా, నిఖార్సయిన కాంగ్రెస్ యంపీలే తనకి దత్తపుత్రుడు హోదా ఇచ్చేయడంతో ఆయన చాలా అనీజీగా ఫీలయిపోతున్నారు.   సరిగ్గా ఇటువంటి తరుణంలోనే, (రెండోసారి కూడా తనకే యంయల్సీ టికెట్ కన్ఫర్మ్ చేయనందుకు తెదేపాతో ఉన్న ముప్పైఏళ్ల అనుబంధాన్ని పుటుక్కున తెంచేసుకొని వైకాపాలోకి దూకిన) దాడి వీరభద్రరావు, తనని ఆపత్సమయంలో ఆదుకొన్న వైకాపా కూడా ఇప్పుడు ఆపత్సమయంలో ఉందని భావించి, దాని ఋణం తీర్చుకోవాలనే సత్సంకల్పంతో “జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటిస్తే సోనియా గాంధీ ఆయనను మోసం చేసి జైల్లో పెట్టించేసింది. అందువల్ల ఇక మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు,” అని ప్రకటించేశారు.   కానీ జనానికి వారిని నమ్ముకొన్న జగన్ కి మాత్రం ఆయన మాటలు వేరేలా అర్ధం అయ్యేయి. అసలు ఆయన వైకాపాపై వస్తున్నఆరోపణలు ఖండిస్తున్నారా లేక నిజమేనని దృవీకరిస్తున్నారా అనే అనుమానం కలిగింది. ఎందుకంటే జగన్ సోనియాను నమ్మడం, కాంగ్రెస్ కు మద్దతు పలకడం గురించి ఇప్పుడు ఆయనే స్వయంగా ద్రువీకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో వైకాపకు గానీ జగన్మోహన్ రెడ్డి కి గానీ ఎటువంటి సంబందమూ లేదని ఎంత గట్టిగా నొక్కి వక్కాణిస్తుంటే అది గోడకి కొట్టిన బంతిలా ఇంకా అనుమానాలు పెంచుతోంది తప్ప తగ్గించడం లేదు. దీనితో మన స్వంత పార్టీ మీదనే ఈ దాడి ఏలయా? అంటూ జగన్, దాడి మాష్టారుకి క్లాసు పీకినట్లు సమాచారం.   అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవలన్నట్లు, కండువా ఉండగానే మాట దిద్దుకోవడం మేలని, దాడి మాష్టారు మరో సవరణ స్టేట్మెంట్ ఇచ్చేరు. “ఎప్పుడో మూడేళ్ళ క్రితం జగన్ బాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ఇచ్చిన హామీని ఇప్పుడు ప్రస్తావించడం అప్రస్తుతం. ఆయన కాంగ్రెస్ లోంచి జంపయిపోయి వైకాపా పెట్టినందుకే 16నెలల అజ్ఞాత వాసం చేయవలసి వచ్చింది.అయినప్పటికీ ఆయన మాత్రం ఏనాడు తనను కరుణించమని సోనియమ్మను ప్రాదేయపడలేదు. కావాలంటే ఆయన కోట్ చూడుడి: “ఇది కడప పౌరుషానికి డిల్లీ అహంకారానికి మధ్య జరుగుతున్నయుద్ధం... డేటెడ్ సో అండ్ సో,” అని ఉదాహరణతో సహా సవరణ ఇచ్చేరు.   అయినప్పటికీ ఆయన తాజా స్టేట్మెంట్ కూడా ‘రెండు పార్టీల మధ్య లింకులు కలిగే యున్నవి’ అని చెపుతున్నట్లే ఉంది తప్ప వాటిని ఖండిస్తున్నట్లు మాత్రం లేదు. మరి దాడి మాస్టారి కండువా కూడా ఎప్పుడయినా జారిపోయేలానే కనిపిస్తోంది. జర కండువా భద్రం మాష్టారు.

కిరణ్ పోతూ పోతూ పొగ పెడతాడా?

      రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సీమాంధ్రలో కొత్తపార్టీ పెట్టబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పోయేముందు అల్లాటప్పాగా పోకుండా కాంగ్రెస్ పార్టీకి పొగపెట్టి మరీ పోయేలా కిరణ్ ప్లాన్ చేస్తున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన పక్షంలో బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మొదటిరోజే కిరణ్ రాజీనామా చేసే అవకాశం ఉందట. ఆరోజు కిరణ్ అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లడతారట. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలను సుదీర్ఘంగా ఏకరువు పెట్టి, విభజన వాదులను, కాంగ్రెస్ హైకమాండ్‌ని ఘాటుగా విమర్శించి, తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించే అవకాశం ఉందట. రాజీనామా చేసిన వెంటనే రాజ్‌భవన్‌కి వెళ్ళి తన రాజీనామా లేఖను గవర్నర్‌కి సమర్పించే అవకాశం ఉందని సదరు వర్గాలు సెలవిస్తున్నాయి. తన రాజీనామాతో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి తెలంగాణ ప్రక్రియకు అడ్డంకులు కల్పించడంతోపాటు సీమాంధ్రలో కిరణ్ తన మైలేజ్‌ పెంచుకుంటారని వివరిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!

పాలమూరు నుండి రాహుల్ పోటీ చేయాలి

      కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలోని మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని దిగ్విజయ్ సింగ్ వద్ద ప్రతిపాదించినట్లు రాష్ట్ర మంత్రి డీకె అరుణ తెలిపారు. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ తో ఆమె భేటీ అయింది. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తరువాత తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగిందని, సోనియాగాంధీ పట్ల ప్రజలు నమ్మకంగా ఉన్నారని ఆమె తెలిపారు. అందుకే రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ జిల్లా నుండి పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డిలను రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించారు. రాహుల్ కార్యాలయం నుండి వారికి పిలుపురావడంతో వారు ఢిల్లీకి వెళ్లారు. అదే సమయంలో తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో డీకె అరుణ కూడా జిల్లా మంత్రిగా అక్కడికి వెళ్లి రాహుల్ ను జిల్లా నుండి పోటీ చేయాలని కోరినట్లుంది.

మెగా బ్రదర్స్ కి స్వాగతం: యనమల

      మెగా బ్రదర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని ఆ పార్టీ ప్రకటన చేసింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు మెగాబ్రదర్స్ టిడిపిలోకి వస్తే స్వాగతిస్తామని అన్నారు. తెలుగు ప్రజల సమస్యలపై పోరాడడానికి టిడిపి పార్టీ సరియన్ వేదికని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ చర్చలు జరిగాయా? లేదా అన్న విషయం తనకు తెలియదని చెప్పారు. కాంగ్రెస్ నుంచి సీమాంధ్ర నేతలు పలువురు తమ పార్టీలోకి రాబోతున్నారని పేర్కొన్నారు. మరి మెగా బ్రదర్స్ ఈ విషయం మీద నోరు తెరిస్తే గానీ తెలియదు.