ఇంటి గుట్టు రట్టు చేస్తే ఎలా దివాకర్?
posted on Oct 28, 2013 @ 3:48PM
ఇంటి గుట్టు లంకకి చేటంటారు. మరి అటువంటిది లంకలో ఉన్నవాళ్ళే మన ఇంటి గుట్టుని భద్రంగా కాపాడే ప్రయత్నం చేస్తుంటే, ఇంట్లో వాళ్ళే గుట్టు రట్టు చేస్తుంటే ఏ ఇంటి పెద్దకయినా ఆగ్రహం కలుగక మానదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో మిగిలిన పార్టీలకి పెద్దన్నపాత్ర పోషిస్తుంటే, అందులో బొత్ససత్యనారాయణ రాష్ట్ర కాంగ్రెస్ లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన లంకంత తమ కాంగ్రెస్ గుట్టు మట్టులను కోడిపెట్ట కోడి పిల్లలను జాగ్రత్తగా కాపడుకొస్తున్నట్లు కాపాడుకొస్తుంటే, ముఖ్యమంత్రితో సహా అందరూ ఎప్పుడో అప్పుడు ఆ ఇంటి గుట్టు గురించి టంగ్ స్లిప్పు చేసుకొంటూనే ఉన్నారు.
మొన్న జగన్ ముచ్చటపడి హైదరాబాదులో శంఖం ఊదుకొంటుంటే “మా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మంచి అండర్ స్టాండింగ్ ఉందని, అందుకు నూటా నలబై నాలుగు ఉదాహరణలున్నాయని, ఆయన సభకి అన్ని రైళ్ళని పరిగెత్తించడం కూడా అందులో ఒకటని ప్రకటించేసారు కల్లాకపట మెరుగని మన జేసీ దివాకర్ రెడ్డి గారు. ఓసారి లగడపాటి మరోసారి హర్ష కుమార్ ఇంకోసారి జేసీ దివాకర్ రెడ్డి ఇలా ఎందరిని కంట్రోల్ చేయగలడు ఎంత పెద్దన్న అయితే మాత్రం?
అయినప్పటికీ మరీ మౌనంగా కూర్చొంటే కొంప కోల్లేరయిపోతుందని ఆయన బెంగపెట్టుకొన్నవాడై, దివాకర్ రెడ్డిని లైన్లో పెట్టి ‘ఇంటి గుట్టు రట్టు చేస్తే ఎలా? ఉంటే బుద్దిగా ఉండండి లేకుంటే బయటకి దయచేయండని’ మందలించినట్లు మీడియా గుప్పుమంది. అయితే మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నానన్నట్లు, ఏదో ఇంటి గుట్టు బయట పెట్టోదని సింపుల్ గా చెపితే పోయేదానికి, బయటకి పొమ్మని చెప్పడం ఏమిటి?అయినా నన్ను బయటకి పొమ్మనడానికి నువ్వెవరని? దివాకరుడు సీమ పౌరుషం ప్రదర్శించినట్లు తాజా సమాచారం. ఎందుకయినా మంచిదని కాంగ్రెస్ లోనే పుట్టిన తను తన చివరాఖరి శ్వాస కూడా కాంగ్రెస్లోనే కంటిన్యూ అయిపోతానని ఒకచిన్న డిక్లరేషన్ కూడా చేసేసారు.
అయితే అరచేతిని అడ్డం పెట్టి ఉదయించే సూర్యుడిని ఆపలేమని వైయస్సార్ కాంగ్రెస్ వాళ్ళు మాటిమాటికి ఎందుకు ఏ ఉద్దేశ్యంతో అంటున్నారో పెద్దన్నగారు కాస్త ప్రజలకి వివరిస్తే బాగుంటుందేమో!