నటి జయప్రద రాజమండ్రీ టికెట్ రాజకీయాలు
ఉత్తర ప్రదేశ్ రాంపూర్ నుండి లోక్ సభకు ఎన్నికయిన జయప్రద అక్కడ ములాయం సింగ్, మాయవతిల సహచర్యంలో పార్టీలు, రాజకీయాలు, సిద్ధాంతాల గురించి బాగానే ఒంట పట్టించుకోన్నట్లే కనిపిస్తున్నారు. ఆమె రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పటి నుండి ఏదో ఒక పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నా ఇంతవరకు ఏవి ఫలించకపోవడం వలన ఇంకా గోడ మీదనే కూర్చొని చూస్తున్నారు.
కొన్ని రోజులు కాంగ్రెస్ అధినేత్రితో తనకున్న పరిచయాల గురించి, మరి కొన్ని రోజులు తెదేపాతో తనకున్న పాత అనుబంధం గురించి, మరి కొన్ని రోజులు వైకాపాకు పేటెంట్ చేసుకొన్న ‘విశ్వసనీయత’ గురించి, స్వర్గీయ వైయస్సార్ రాష్ట్రానికి చేసిన సేవల గురించి మాట్లాడుతూ అన్ని పార్టీలకి గాలాలు వేసి చూసారు. ఆమె తనకి అన్ని పార్టీల నుండి ఆహ్వానాలు అందాయని కానీ తానే ఇంకా ఏపార్టీలో చేరాలో నిర్ణయించు కాలేదని, ఈ నెలాఖరులోగా తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.
ఆమె ఇంతవరకు పార్టీని నిర్ణయించుకోకపోయినా తానూ పోటీ చేయబోయే నియోజక వర్గాన్ని మాత్రం తనకు తానే నిర్ణయించుకొని దానికి అనుగుణంగా పార్టీలను వేట్టుకొనే పనిలో ఉన్నారు. అందువల్ల ఆమెకు రాజమండ్రీ .నుండి పోటీ చేసేందుకు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలోనే చేరాలనుకొంటున్నారు గనుక అప్పుడు ఆ పార్టీ సిద్దాంతాలు నచ్చినట్లు మనకి చెప్పబోతున్నారు. అంటే టికెట్ కోసమే సిద్ధాంతాలు తప్ప, పార్టీలో చేరడానికి అవేవి అడ్డుకావని ఆమె ముందే తన ‘ప్రజాసేవ లక్షణాలను’ చాటుకొన్నారు.
రాష్ట్రంలో అన్ని పార్టీలకు గాలం వేసి దేనిలో అవకాశం వస్తే అందులో చేరేందుకు సిద్దపడిన ఆమె, రేపు ఏదో ఒక పార్టీలో చేరిన తరువాత మిగిలిన పార్టీలపై విమర్శలు గుప్పించడం కూడా త్వరలోనే మనం చూడబోతున్నాము. చాలా ఏళ్ల తరువాత రాష్ట్రానికి వచ్చిన ఆమె కేవలం టికెట్టే ప్రాతిపాదికన రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం చూస్తే ఆమె రాష్ట్ర రాజకీయాలలో ఏమి ఆశించి అడుగుపెడుతున్నారో అర్ధం అవుతుంది.
ఆమె తన రాంపూర్ నియోజక వర్గం ప్రజల బాగోగులు గాలికొదిలేసి ఇక్కడ తన రాజకీయ జీవితం చక్కబెట్టుకొంటున్న విధంగానే, రేపు ఏ పార్టీ నుండి రాజమండ్రీ పోటీ చేసి ఎన్నికయినా అక్కడి ప్రజలకూ ఆమె మొహం చాటేయాకమానరు. రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టక మునుపే, తనకు ‘రాజమండ్రీ టికెట్ యావ’ తప్ప ఒక నిర్దిష్టమయిన ఆలోచన కానీ, పార్టీల పట్ల ఒక నిశ్చిత అభిప్రాయం గానీ ఏమీ లేవని ఆమె తన మాటల ద్వారా స్పష్టంగానే చెపుతున్నారు.
ఒకవేళ ఆమెకు తెలుగుదేశం పార్టీ కనుక రాజమండ్రీ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు టికెట్ ఇస్తే, అప్పుడు ఆమె దృష్టిలో కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు చెడ్డవయిపోతాయన్నమాట. అప్పుడు ఆమె జగన్ మోహన్ రెడ్డిని అవినీతి పరుడని విమర్శించవచ్చును, కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పార్టీ అని విమర్శించావచ్చును. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉండవల్లి అరుణ్ కుమార్, తెలుగుదేశం పార్టీలో మురళీ మోహన్ రాజమండ్రీ నుండి పోటీ చేయడం దాదాపు ఖాయం కనుక ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆమెకు మిగిలింది.
తాజా సమాచారం ప్రకారం ఆమె ఆ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆమె దృష్టిలో మంచివాడు అవుతారు గనుక రేపు ప్రజలకి కూడా ఆమె అదే చెప్పి నమ్మమని కోరుతారు. అదే సమయంలో తెదేపా, కాంగ్రెస్ పార్టీలలో లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలు ఆమె మొదలుపెట్టవచ్చును. ఈ విధంగా ఒక సిద్దాంతం, తనకంటూ ఒక అభిప్రాయం లేని జయప్రద రాజమండ్రీ టిక్కేటే లక్ష్యంగా తన రాజకీయ జీవితం మొదలు పెట్టబోతున్నారు.
ఇటువంటి రాజకీయ లక్షణాలు కేవలం ఆమెకు ఒక్కరికే ఉన్నాయని కాదు గానీ, చాలా ఏళ్ల తరువాత రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్న ఆమె కనీసం కొన్ని విలువలు కలిగి ఉండి హుందాతనం ప్రదర్శించి ఉంటే ఈవిధమయిన విమర్శలకు తావు ఉండేది కాదు.
ఇక ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసి, ఇటీవలే ఆ పార్టీలో చేరిన శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు చాలా కలవార పడుతున్నారు. తన కుమారుడికి రాజమండ్రి లోకసభ టిక్కెట్ ఇచ్చే షరతు మీద ౩౦ ఏళ్లుగా నమ్ముకొన్న తెలుగు దేశం పార్టీని వదిలిపెట్టి కొద్ది వారల క్రితమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ఇప్పుడు డిల్లీ నుండి అకస్మాత్తుగా ఊడిపడిన జయప్రద జగన్ మోహన్ రెడ్డిని రాజమండ్రీ టికెట్టు తనకు ఇచ్చేలా ఒప్పించుకొని పార్టీలో చేరినట్లయితే తన పని రెంటికీ చెడ్డ రేవడి అవుతుందని ఆయన కలవర పడుతున్నారు. అందువల్ల అన్ని పార్టీలలో రాజమండ్రి అభ్యర్ధులకు ఆమె పిలవని పేరంటంగా కనబడటంలో ఆశ్చర్యం లేదు.