బీహారీలను ఆకట్టుకొన్ననరేంద్రమోడీ ప్రసంగం
posted on Oct 27, 2013 @ 8:17PM
ఈరోజు (ఆదివారం) పాట్నాలో మోడీ సభ మొదలయ్యే రెండు గంటల ముందు ఏడు వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగాయి.అందులో ఐదుగురు మరణించగా దాదాపు డబ్బై మంది ప్రజలు గాయపడ్డారు. అయినప్పటికీ నరేంద్ర మోడీ సభకు భారిగా జనాలు తరలివచ్చారు.
మోడీ స్థానిక భోజ్ పురీ బాషలో కొంత సేపు ప్రసంగించి బీహారీలను బాగా ఆకట్టుకొన్నారు. ఎటువంటి సభలో ఏ అంశాలు ప్రస్తావించాలో, ఏవిధంగా మాట్లాడాలో బహుశః మోడీకి తెలిసినంత బాగా నేటి రాజకీయ నాయకులలో చాలామందికి తెలియదని చెప్పవచ్చును. డిల్లీ వంటి నగర ప్రజలని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కొంచెం క్లిష్టమయిన అంశాలను, సాంకేతికమయిన పదాలను ప్రయోగించే మోడీ ఇక్కడ మాత్రం స్థానిక ప్రజలకు సులువుగా అర్ధం అయ్యే అంశాలను తనదయిన శైలిలో ప్రసంగించి వారిని ఆకట్టుకోవడమే ఆయన పరిణతికి ఒక మంచి నిదర్శనం.
పౌరాణిక యుగంలో సీతాదేవి పుట్టిన పుణ్యభూమి బీహార్ అని మొదలుపెట్టడంతోనే 'ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్' అన్నట్లు ఆ తరువాత ప్రజలచేత జేజేద్వానాలు పలికించుకొంటూ అలవోకగా ఆయన ముందుకు సాగిపోయారు. బీహార్ గత వైభవం గురించి వారి కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ బుద్ధుడు, అశోకుడు, చాణక్యుడు, చంద్రగుప్తుడు, మౌర్యులు వంటి మహామహులు బీహార్ గడ్డ మీదనే జన్మించారని, నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు యావత్ ప్రపంచంలో మేటి విద్యాలయాలుగా పేరు తెచ్చుకొన్నాయని చెప్పడంతో ప్రజలు హర్షద్వానాలు మిన్నంటాయి.
అదేవిధంగా స్వాతంత్రోద్యమంలో గాంధీ మహాత్ముడు చంపారణ్ లో చేసిన ఉద్యమం గురించి చెప్పి, బీహార్ రాష్ట్రం దేశానికి ఎప్పుడు అవసరమయిన జయప్రకాశ్ నారయణ్ వంటి గొప్ప నేతలను అందిస్తూనే ఉందని, అటువంటి మహానీయుడితో కలిసి పనిచేసే భాగ్యం తనకి దక్కనప్పటికీ, ఇప్పుడు బీహార్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు తను చాల సంతోషిస్తున్నాని అన్నారు.
బీహార్ లో అత్యధికంగా ఉన్నయాదవ కులస్తులను ఆయన మెప్పించిన తీరు అసమాన్యం. వారు ఆరాధించే శ్రీకృష్ణుడు గుజరాత్ లో ఉన్న ద్వారకలో నివసించాడని, అందువల్ల యాదవులతో తనకున్న అనుబంధం ప్రత్యేకమయిందని, అందుకే వారికోసం ద్వారక నుండి ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీసులు తీసుకువచ్చానని ఆయన అన్నపుడు ప్రజల స్పందన ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే వారి కులానికే చెందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల దాణా కేసులో ఐదేళ్ళు జైలు శిక్షపడినప్పటికీ ఆయన పేరు పలికి వారి మనసులు నొప్పించకుండా ఆయన జాగ్రత్త పడుతూనే, లాలూ హయంలో సాగిన ఆటవిక రాజ్యం నుండి వారికి విముక్తి కలిగించదానికే బీజేపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి చెందిన జేడీ(యు)కి మద్దతు ఇచ్చిందని, గానీ ఆయన అధికారంలో స్థిరపడిన తరువాత బీజేపీని కాదని కాంగ్రెస్ హస్తం అందుకొని మిత్రద్రోహం చేసాడని విమర్శించారు.
నితీష్ కుమార్ కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు రాష్ట్రం కోసం రూ.50వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీగా కోరారని, అయితే బీహార్ ప్రజలు ఇక కాంగ్రెస్ ముందు ఎంత మాత్రం చేతులు జాపవలసిన అవసరం లేదని, తనను ఇంతగా ఆదరిస్తున్న బీహార్ ప్రజలకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, రూ.50వేల కోట్లని వడ్డీతో సహా చెల్లించి ప్రజల ఋణం తీర్చుకొంటానని చెప్పి ప్రజల జేజే ద్వానాలు అందుకొన్నారు.
జాతులు, మతాలు, ప్రాంతాల పేరిట విభజించి పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆరు దశబ్దాల పాలనలో చేసిందేమీ లేదని, కనీసం నేటికీ కోట్లాది పేద ప్రజలు రెండు రొట్టెలు తినడానికి కూడా నోచుకోలేదని, అందువల్ల తమ ఈ పరిస్థితుల్లోమార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాక తప్పదని ఆయన చెప్పారు. నిరుపేద హిందూ, ముస్లిం ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుకోకుండా, తమ పేదరికంపైనే పోరాటం చేయాలని, హిందు, ముస్లిం ప్రజలు సంఘటితంగా కలిసిపనిచేసినప్పుడే ఒక ధృడమయిన భారతదేశాన్ని నిర్మించగలమని మోడీ సందేశం ఇచ్చారు. ఆయన తన ప్రసంగంతో బీహారీలను చాలా బాగా అక్కట్టుకోగాలిగారు. అందువల్ల మోడీ సభ ఊహించిన దానికంటే చాలా దిగ్విజయంగా ముగిసింది.