తమలపాకుతో నువొకటంటే తలుపు చెక్కతో నేను రెండంటిస్తా..
posted on Oct 28, 2013 @ 10:22AM
తమలపాకుతో నువొకటంటే తలుపు చెక్కతో నేను రెండంటిస్తా.. అందిట వెనకటికికో గడుసు ఇల్లాలు. జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర సెంటిమెంటు పట్టుకొని సీమాంధ్రలో దూసుకుపోదామని ప్రయత్నిస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు చూసినా ఆయన కంటే రెండడుగులు ముందే ఉంటున్నారు.
జగన్ సమైక్య శంఖారావం పూరించడానికి సిద్దం కాగానే కిరణ్ రచ్చబండ ముచ్చట్లకి సిద్దం అయ్యారు. కోట్లు ఖర్చుపెట్టి జగన్ శంఖారావం చేస్తే, కిరణ్ తన ఏసీ ఆఫీసు గదిలో కూర్చొని, పైసా ఖర్చు, ప్రయాస లేకుండా ప్రధానికి, రాష్ట్రపతికి రెండు చిన్న లేఖలు వ్రాసి పడేసి, జగన్ సభకి దక్కవలసిన మీడియా ఫోకస్ అంతా తన వైపు తిప్పుకొని చిద్విలాసంగా చిర్నవ్వులు చిందిస్తున్నారు.
జగన్ అంత చెమటోడ్చినా దక్కని ఫలం, కిరణ్ సందించిన లేఖాస్త్రాలు బాంబులవలె పేలుతూ అటు సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణాలో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయన వ్రాసిన లేఖను రాష్ట్రపతి హోంశాఖకు పంపి సంజాయిషీ కోరడమే అందుకు కారణం. రాష్ట్రవిభజన కీలకదశకి చేరుకొన్న ఈ తరుణంలో కిరణ్ ఈవిధంగా లేఖలు వ్రాసి తెలంగాణాకి అడ్డుపడుతున్నాడని తెరాస మరియు టీ-కాంగ్రెస్ నేతలు ఆయన మీద చాలా ఫైర్ అయిపోతున్నారు. తెరాస మరియు టీ-కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణాకి అడ్డుపడుతున్నావని ఎంతగా దూషిస్తే, అవతల సీమాంధ్రలో ఆయన రేటింగ్స్ అంతగా పెరిగిపోతున్నాయి.
పైగా ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారారని, ఆయన ఆ కుర్చీలో కూర్చోనంత కాలం రాష్ట్రవిభజన అసాధ్యమని తెలిసినప్పటికీ అధిష్టానం అయనను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని, మీడియాలో వస్తున్నవార్తలు, రాజకీయ విశ్లేషణలు ఆయన రేటింగ్స్ కి మరిన్ని స్టార్స్ జోడిస్తున్నాయి.
అందువల్ల ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ మరో కొత్త ఉపాయం ఆలోచించవలసి ఉంటుంది. అయితే రాష్ట్రవిభజన అనివార్యమని అందరికీ తెలిసినప్పటికీ వీరిద్దరిలో ఎవరు సమైక్య ఛాంపియన్ షిప్ ట్రోఫీ గెలుస్తారా అని ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.