మోడీ సభకి బాంబులతో స్వాగతం
posted on Oct 27, 2013 @ 6:45PM
అవేమి మోడీకి స్వాగతం పలకడానికి పేల్చిన దీపావళి టపాసులు కావు, ఉగ్రవాదులో మరెవరో పేల్చిన నిజమయిన బాంబులు. ఒకటి తరువాత మరొకటి చొప్పున మొత్తం ఏడూ బాంబులు పాట్నా నగరంలో ప్రేలాయి. అందులో ఐదుగురు మరణించగా డబ్బై మంది గాయపడ్డారు. సభ మొదలవడానికి కేవలం రెండు గంటల ముందు ఈ ప్రేలుళ్ళు జరగడం చాలా విచిత్రం. ఎందుకంటే ప్రధాని అభ్యర్ధిగా పోటీలో ఉన్న మోడీ సభకి చాలా ముందు నుంచే భద్రతాపరమయిన ఏర్పాట్లు అన్నీ జరిగి ఉంటాయి. అయినప్పటికీ వరుస ప్రేలుళ్ళు జరిగాయి. అయినప్పటికీ వేలాది మంది జనాలు మోడీ సభకి తరలివచ్చారు. అటువంటి సంఘటన తరువాత కూడా అన్నివేలమంది (అదే మన రాష్ట్రంలో అన్ని లక్షల మంది అని చెప్పుకొంటాము) సభకు హాజరవడం విశేషమే. బహుశః దీనినే మోడీయిజం అనాలేమో.
అటువంటి సంఘటన తరువాత కూడా అంతమంది నిర్భయంగా తనకు సభకు హాజరవడం చూసి మోడీ కూడా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెల్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీతో సహా అతిరధ మహారధులందరూ మోడీని భూతంగా, బీజేపీని మతతత్వపార్టీగా చూపిస్తూ ప్రజలని ఎంతగా భయపెట్టాలని ప్రయత్నిస్తున్నపటికీ జనాలు మాత్రం మోడీ సభకి తరలివస్తుండటం కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం ముందుందని సూచిస్తోంది.
పైగా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా భావింపబడుతున్న రాహుల్ గాంధీ, పార్టీ ప్రచారనికని బయలు దేరి, తన ప్రసంగాలతో పార్టీకి మేలు చేయకపోగా తన ప్రసంగాలతో తనకి, తన పార్టీకి కూడా తలనొప్పులు తెచ్చిపెట్టడం నరేంద్ర మోడీకి కలిసివస్తోంది. మొట్ట మొదటి సారిగా ఇద్దరూ ప్రధాని అభ్యర్దులు జనాల ముందుకి ఒకేసారి రావడంతో ప్రజలు వారి రాజకీయ పరిణతి, నిజాయితీ మరనేక అంశాలను స్వయంగా బేరీజు వేసుకోగలుగుతున్నారు.
నవంబర్, డిశంబర్ నెలలో ఐదు రాష్ట్రాలలో (మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం మరియు డిల్లీ) జరుగబోయే శాసనసభ ఎన్నికలు వారిరువురికీ సెమీ ఫైనల్స్ అంటివే గనుక దానిని బట్టి వారిరువురిలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలుసుకోవచ్చును.
ఇంతవరకు ఈ ప్రేలుళ్ళకు బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది.