రాహుల్ అపరిపక్వ రాజకీయాలు

   - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     నేటి దేశ పార్లమెంటరీ వ్యవస్థలో శాసనవేదికలలో సభ్యులైన ప్రజాప్రతినిధుల రాజకీయ ప్రమాణాలు దిగజారిపోయాయి. ఈ పరిణామం పార్లమెంటరీ వ్యవస్థకే తీవ్రమైన అగ్నిపరీక్ష'' - గురుదాస్ గుప్తా (ప్రసిద్ధ పార్లమెంటేరియన్)   దేశ సంపదగా దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రకటించిన రేడియోతరంగాలపై గుత్తాధిపత్యం చెలాయించడానికి దేశ, విదేశీ టెలికాం సంస్థలు పోటాపోటీలు పడుతూ భారతదేశ ఆర్ధికవ్యవస్థకు నష్టదాయకంగా పరిణమించి, స్వలాభాపేక్షతో లక్షల కోట్ల రూపాయలను స్వాహా చేయడానికి సంబంధించిన భారీ కుంభకోణాన్ని "కాగ్''తో పాటు దేశం దృష్టికి తెచ్చినవాడు గురుదాస్ గుప్తా. ఇందులో ఇరుక్కున్న వాళ్ళు కేవలం బడాబడా కంపెనీలు మాత్రమేకాదు, ప్రధానమంత్రీ, ప్రధానమంత్రి కార్యాలయమూ, కేంద్రప్రభుత్వపు పెంపుడు కంపెనీగా బహిర్గతమైపోయిన అంబానీల "రిలయన్స్'' కూడా ఉన్నాయి; వీరికి తోడూ 2-జి స్కామ్ లో తీవ్ర అభియోగాలను ఎదుర్కొంటున్న మంత్రి చిదంబరం, మాజీమంత్రి రాజా (డి.ఎం.కె), ఒక సిబీఐ ఉన్నతాధికారి కూడా ఉన్నారు! అయితే ఈ కుంభకోణంలో అభియోగాల్ని విచారించే పేరిట నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా అభియోగాల్ని ధృవీకరించగా, అదీ చాలదన్నట్టు "మంత్రుల పరిశీలనా సంఘాన్ని (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినప్పుడు ఆ కమిటీ ముందుకు. అంతకుముందు పార్లమెంటరీ సంయుక్త సంఘం ముందుకువచ్చి ఈ కుంభకోణంలో అసలు దోషులెవరో తాను చేబుతాననీ, తనను పిలవాలనీ మాజీమంత్రి రాజా పదేపదే కోరారు. అయినా అతన్ని పిలవనేలేదు. అన్నీ "సర్దుకున్న తరువాత''నే ప్రధానమంత్రి కార్యాలయం గానీ, మన్మోహన్ సింగ్ గానీ అవసరమైతే "నేనూ సిబీఐ విచారణకు సిద్ధమే''నని 'దొంగలు పడిన ఆరునెలలకు' ఏవో మొత్తుకున్నట్టుగా ప్రకటనలు చేస్తూ వచ్చారు; చివరికి బొగ్గు కుంభకోణంలో వచ్చిన ఆరోపణల విషయంలో కూడా, రోజులకు రోజులు గడిచిపోయిన తరువాత, విదేశీ పర్యటనల తరువాత అంతా "సద్దుమణిగినట్టు'' కన్పించిన తరువాత విమాన ప్రయాణంలో మన్మోహన్ నేనూ విచారణకు సిద్ధమేనని ప్రకటించారు!   సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల ఫలితంగానే ప్రధానమంత్రి కార్యాలయానికీ "బొగ్గు'' తవ్వకాలలో ఉన్న కంపెనీల తాలూకూ కుంభకోణాలకూ ఉన్న సంబంధాన్ని సిబీఐ డైరెక్టర్ బయట పెట్టవలసి వచ్చింది. వీటన్నింటినీ గురుదాస్ గుప్తా బహిర్గతం చేశారు. అలాగే కాంగ్రెస్ - యు.పి.ఎ. ప్రభుత్వానికీ, "రిలయన్స్'' అంబానీలకూ కె.జి.గ్యాస్ తవ్వకాలు, "డి-6''బ్లాక్ లో ఉత్పత్తిని కృత్రిమంగా నియంత్రిస్తున్న [ఒప్పందాలకు విరుద్ధంగా] అంబానీల ఆగడాలకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని కూడా దేశప్రజల దృష్టికి తెచ్చినవాళ్ళు ప్రధానంగా ఇద్దరే ఇద్దరు - (1) ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి (2) గురుదాస్ గుప్తా!   ఈ పూర్వరంగంలో, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల్లో భాగంగా రేపటి ప్రధానమంత్రి పదవికోసం అర్రులుచాచి తన తల్లీ, కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా గాంధి అండతో, ఎదిగే క్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా కాంగ్రెస్ అధిష్ఠానం "ప్రమోట్'' చేసిన రాహుల్ గాంధీ ఇటీవల తన రాజకీయ అపరిపక్వతను చాటుకొంటున్నాడు! ప్రధానమంత్రి పదవికి 2014 ఎన్నికల అనంతరం రావాలని ఆశపడుతున్న తొందర్లో రాహుల్, ఇటీవల ఆగమేఘాల మీద దొడ్డితోవన కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్రతో వచ్చిన నేరచరితులైన పార్లమెంటు సభ్యులపై 'వేటు'ను తప్పించే ఆర్డినెన్సును బాహాటంగా "బుద్ధిలేని'' చర్యగా ఖండించాడు. అదీ ఎలా? అంతకుముందు సుప్రీంకోర్టు నేరచరితులైన లేజిస్లేటర్లు ప్రజాప్రనిధులుగా తగరనీ, వారంతా ఆరేళ్ళపాటు తిరిగి ఎన్నికలలో పాల్గొనరాదని చారిత్రాత్మకమైన తీర్పు చెప్పిన వెంటనే రాష్ట్రపతి లోపాయికారీగా క్యాబినెట్ చర్యతో విభేదిస్తూ నర్మగర్భంగా హెచ్చరించిన తరువాత ఆ విషయం తెలిసిన రాహుల్ గాంధీ 'మెరుపు'లా ఆ ఖ్యాతిని తాను కొట్టేసే దుడుకుతనంతో ఆర్డినెన్సు కాపీని ప్రదర్శనకోసం పత్రికలవారి ముందే చించేసి ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఘోరంగా అవమానపరిచాడు!   అది చాలాక మన్మోహన్ ఏమనుకుంటారోనని తల్లీ, కొడుకులిద్దరూ విదేశపర్యటనలో ఉన్న మన్మోహన్ ను "దువ్వుతూ'' పుండుమీద కారంచల్లినట్టుగా 'వేరే, ఉద్దేశంతో అన్నవి కావు, పట్టించుకోవద్ద'ని బుజ్జగించడానికి ప్రయత్నించారు. సరిగ్గా ఆ అవమానానికి నిరసనగా మన్మోహన్ ఆత్మగౌరవ పతాకం ఎగరవేసి, రాజీనామా చేయాల్సింది. ఎందుకంటే పదేళ్ళుగా కాంగ్రెస్ లో పనిచేస్తున్న రాహుల్ తాను 50వ 'వడి'లో ప్రవేశించి, రేపటి ప్రధానమంత్రి పదవిని ఆశిస్తు, తల్లి ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న సందర్భంలో - పిల్లవాడి స్థాయికి మించి ఎదగలేకపోయాడని చెప్పి తీరాలి. ప్రకటనల్లో హుందాతనంగాని, వైజ్ఞానిక దృక్పధంగాని లేని వ్యక్తిగా లోకానికి రాహుల్ కనపడుతున్నాడని గుర్తుంచుకోవాలి; ఆ ప్రకటన ద్వారా రాహుల్ కాంగ్రెస్ లో ఎవడికివాడే "సూపర్ మాన్''గా ఫోజులు పెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రకటనలిచ్చు కోవచ్చునన్నలైసెన్సు ప్రకటించినట్టయింది.   మాజీమంత్రి శశిథారూ వెంటనే అంతమాటా అన్నాడు కూడా: "రాహుల్ అలా ప్రకటించిన తరువాత మా సొంత అభిప్రాయాల్ని మేమూ ప్రకటించుకోవచ్చునన్న ధైర్యం మాకొచ్చింద''న్నాడు! బహుశా తమ కుటుంబాల అక్రమాస్తుల రక్షణ కోసమే, లేదా అవినీతి పాలవుతున్న, లేదా గురుదాస్ గుప్తా అన్నట్టు "లెజిస్లేటర్ల రాజకీయ ప్రమాణాలు దిగజారి పోతున్నందు''ననే "సమాచారహక్కు చట్టం'' పరిథిలోకి కాంగ్రెస్ లాంటి (మిత్రపక్షాలు సహా) అవినీతికర రాజకీయ పక్షాలు రాకుండా జాగ్రత్తపడడం కోసమే తన పార్టీ ప్రభుత్వం ఎలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుందో రాహుల్ కు తెలియదా? కాగా, ఇప్పుడు తాజాగా రాహుల్, అనేక కుంభకోణాలతో, అవినీతి ఆరోపణలతో తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి 2014లో కూడా అధికారం కట్టపెట్టడానికి పన్నిన చిట్కా - కేవలం రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రయోజనాల రక్షణ కోసం భావోద్రేకాల్ని రెచ్చగొట్టబోవటం. "ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంచితే, భారతీయ జనతాపార్టీ (బిజెపి) మాత్రం ప్రజల్ని విడగొడుతున్నద''ని రాహుల్ ప్రచార ఆరోపణ! కాని 1947 నాటి రాజ్యాంగ నిర్ణయ సభా తీర్మాన స్ఫూర్తికే ఈ రెండుపక్షాలూ (కాంగ్రెస్, బిజెపి) వ్యతిరేకం. కులాతీతమైన లౌకిక వ్యవస్థకు (సెక్యులరిజం) దేశ రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలని, మతసంస్థలకు రాజకీయాలతో ప్రమేయం ఉండరాదని నాటి రాజ్యాంగ నిర్ణయసభ తీర్మానం! ఆ ప్రాతిపదికపైనే స్వతంత్ర భారతదేశంలో ఈ రెండుపార్టీలు ఎన్నికల సంఘం ముందు హామీపడ్డాయి. కాని ఆచరణలో దేశ మైనారిటీల మౌలిక ప్రయోజనాలను ఆచరణలో కాపాడకుండానే ఎన్నికలలో మాత్రం వారి వోట్ల ద్వారా లబ్ది పొందడం మాత్రమే ఈ రెండు పార్టీల లక్ష్యం! అందువల్ల ప్రజల్ని తమతమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం నిరంతరం చీల్చుతూ ఉండటం ఈ రెండింటి వకాలికమైన లక్షణం. "విభజన రాజకీయాలు'' రెండింటి ఉమ్మడి ప్రయోజనాలకు, ఉనికికి అవసరం! ఈ తప్పుడు "విభజన సూత్రం'' దేశ విభజనతో పాటే ప్రాణం పోసుకుంది. విభజించి పాలించమనే ఇండియాలో బ్రిటీష సామ్రాజ్య పాలనతోనే అమలులోకి రాగా, విభజన రాజకీయాలనుంచి తాము ఎన్నికల ప్రయోజనాల కోసం దూరం కాకుడన్నది కాంగ్రెస్, బిజేపీ మౌలికమైన విధాన, వ్యూహాలని మరచిపోరాదు!   ప్రస్తుతం రానున్న ఎన్నికలకు మధ్యంతరంగా ఎన్నికలకు సిద్ధమైన కొన్ని రాష్ట్రాలలో పర్యటిస్తున్న రాహుల్ చేస్తున్న ప్రసంగాలు పిల్ల తరహాగా ఉన్నాయి. కాంగ్రెస్ లోని మహామహా కొమ్ములు తిరిగి ఉన్న వివిధ రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులలో నూటికి 90 మందికి పైగా నెహ్రూ - ఇందిర కుటుంబానికి తమ ఆత్మగౌరవాన్ని కూడా మరిచిపోయి సోనియా నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ కు ఆమె కుటుంబానికే విచక్షణా రహితంగా దాసోహమవడం వల్లనే మంచి యువతరం, యువరక్తం కాంగ్రెస్ వైపునకు మరలడంలేదు. మరలనందున నాయకత్వం చేస్తున్న పనేమిటి? సెంటిమెంట్ ను (మనోభావాల్ని) పోగొట్టుకోవటం; ఆ వరసలో రాహుల్ ఉచ్చరించిన సంప్రదాయమంత్రం - "నా నాయనమ్మను, నా తండ్రిని చంపేశారు. ఏదో ఒకరోజున నన్నూ చంపేస్తారు. అయినా నేను బాధపడ్డం లేదు, కంగారు పడ్డమూ లేదు అన్నాడు!''   కాని నాయనమ్మ హత్యగానీ నాన్న రాజీవ్'' హత్యకు గానీ దోహదపడిన పరిణామాలేవీ? ఏ పరిస్థితుల్లో ఆ ఘోరాలు జరిగాయి? చిరకాలంగా కాంగ్రెస్ కు సేవలందించిన బింద్రెన్ వాలా [శిక్కు]ను సాకింది కాంగ్రెస్ పెంచి పోషించింది కాంగ్రెస్. కాని పంజాబ్ ను కృత్రిమంగా విభజించిన తరువాత ఎదురైనా సమస్యల్లో ఒకటి బింద్రెన్ వాలా కాంగ్రెస్ కు దూరమయి పంజాబ్ శిక్కులకు ప్రత్యేక రాష్ట్రంగా 'ఖలిస్తాన్'ను ప్రకటించాలని ఉద్యమం ప్రారంభించాడు. అది హింసాత్మకంగా పరిణమించింది. పంజాబ్ విభజన ఎప్పుడైతే పంజాబ్ శాసనసభ ఆమోదం లేకుండా, శాసనసభను లెక్కజేయకుండా ఏకపక్షంగా రెండుగా పంజాబ్, హర్యానాలుగా చీల్చడానికి కాంగ్రెస్ ఎప్పుడు నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచీ పంజాబీల (శిక్కుల) ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అలాగే బిజెపి - ఎన్.డి.ఎ. ప్రభుత్వం హయాములో కూడా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లను కృత్రిమంగా విభజించి ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలను ఏర్పరిచారు! వాటిని దేశ, విదేశీ బడా గుత్తా పెట్టుబడిదారులకు దోపిడీ కేంద్రంగా బిజెపి, కాంగ్రెస్ లు మార్చాయి!   రాజస్థాన్ ఎన్నికల పర్యటనలో మాట్లాడుతూ రాహుల్ "ప్రజలు సమైక్యంగా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. కాని బిజెపియే రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజల్ని విడగొడుతుంద''ని ఆరోపించారు. కాని అవే రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కూడా పనిచేస్తుందన్న వాస్తవాన్ని రాహుల్ మభ్యపెట్టాడు. దేశం ఐక్యంగా ఉండాలని ఒక వైపున కోరుకుంటున్న రాహుల్, విభజించి-పాలించే బ్రిటీష రాజనీతికి తలొగ్గిన కాంగ్రెస్ అదే స్వప్రయోజనాల కోసం, తాను సాధికారికంగానే భాషకు ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు వెన్నుదన్నుగా ఏర్పడిన తొలి కమీషన్ (ఫజల్ ఆలీ) సిఫారసులపైన ఏర్పడిన భాషా ప్రయుక్తంగా ఏర్పడిన తెలుగుజాతి తొలి రాష్ట్రమయిన "ఆంధ్రప్రదేశ్''ను నిట్టనిలువునా చీల్చడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు కంకణం కట్టుకున్నదో వివరించ గలగాలి!   ఇందిరాగాంధి పోలీసు - సైనిక సమూహాలతో "ఆపరేషన్ బ్లూస్టార్'' పేరిట దారుణమైన దాడులకు ఖలిస్తాన్ వాదుల మీద పాల్పడడం ద్వారా శిక్కులు అసహనంతో ఉగ్రవాదులుగా మారి ఎదురు మరొక దుస్సాహమైన దుర్మార్గానికి దిగింది. ఫలితంగా ఆమెను సొంత రక్షకులే హత్యగావించారు! దానికి ప్రతిగా ఢిల్లీలో ఇందిరాగాంధి హత్యతో ప్రత్యక్ష సంబంధం లేని 3000 మంది శిక్కులను హతమార్చడం జరిగింది. వేసిన విచారణ కమీషన్ లు కూడా ఈ ఘటనకు విస్తుపోయి, ఈ ప్రతీకార ఘటనలకు ఎవరు కారకులో, వారిని శిల్శించాలని పేర్లుసహా యిచ్చినా, శిక్కుల గాథ ముగియలేదు. ముగియలేదు కనుకనా, ఢిల్లీలో శిక్కులపై జరిగిన మారణకాండతో సోనియాకు గానీ, రాజీవ్ గాంధీకి గాని సంబంధం లేకపోయినా,ఇటీవల వైద్యచికిత్సల నిమిత్తం అమెరికా వెళ్ళిన తన తల్లి (సోనియా) అక్కడి ఖలిస్తాన్ శిక్కుసంస్థలు అమెరికా కోర్టుల ద్వారా ఆసుపత్రికి వెళ్ళి మరీ "సమాన్లు''జారీ చేయించాయి! అలాగే మాజీప్రధాని రాజీవ్ గాంధీపై జరిగిన దారుణ హత్యకూ, శ్రీలంకలో తమిళులపై శ్రీలంక ప్రభుత్వం అమలు జరుపుతున్న నిర్బంధకాండకు అండగా భారత సైన్యం వెన్నుదన్నుగా వెళ్ళి నిలబడడానికీ సంబంధం ఉందని, శ్రీలంకలో మన సైనికజోక్యం లేకపోతే రాజీవ్ మనకి దక్కేవాడనీ పలువురు వ్యాఖ్యాతలు ఆ రోజుల్లో పేర్కొనడమూ కొత్తగాదు.   అందువల్ల మనం స్వతంత్రమైన విధానాలకు లక్ష్యాలకూ దూరమవుతున్న కారణంగానే అమెరికా విసిరిన "సంస్కరణల''వలలోకి మనం చిక్కుబడి పోయిన కారణంగానే, ఇరుగుపోరుగుతో సంబంధాలు 65ఏళ్ళ తర్వాత కూడా కుడుతపడకుండా ఉన్నందున కూడా - దేశానికి చిక్కు సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికైనా గమనిస్తే మంచిది! అందువల్ల రాహుల్ అనవసర భయాలు తనలో పెట్టుకుని, సెంటిమెంట్ కోసం చౌకబారు ప్రకటనలు చేయకూడదు. హుందాతనం గల రాజకీయవేత్తగా ఆయన ఎదగాలని కోరుకుందాం! ఉన్మాదులకు తోడ్పడే "సెంటిమెంటల్ ఉప్పును'' అందించకూడదు! రాహుల్ చిరంజీవిగా ఉండాలన్న కోర్కె తప్ప మరొకటి దేశప్రజలకు ఉండదు గాక ఉండదు. నిజానికి గాంధీజీని చంపినవాడు నాధూరామ్ గాడ్సే అనే పరమ హిందూమతోన్మాది, నేటి బిజెపి పూర్వపు 'బ్రాండ్' అయిన ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తే అయినా, గాంధీజీ ఆదర్శాలను అనుక్షణమూ 'పాతరేస్తున్న'వారు మాత్రం అవినీతి గోదాలోకి పీకమొయ్యా దిగిపోయిన నేటి కాంగ్రెస్ నాయకులేనని రాహుల్ గుర్తించితే, దేశ సమస్యలకు పరిష్కారం చూడగల్గవచ్చునేమో!

మెగాస్టారుకి మెలుకువ వచ్చింది మళ్ళీ

తన మెగాస్టారు ఇమేజిని పణంగా పెట్టి మరీ, శుభమా అంటూ త్రీ..టూ..వన్..జీరో...అంటూ ప్రజారాజ్యం పార్టీని ‘జీరో’తో ఆరంభించినననాటి నుండి చిరంజీవి, హీరో నుండి పెద్ద జీరోగా మారిపోయారు. పట్టుమని ఏడాది కూడా పార్టీని నడుపలేని అయన మంత్రి పదవి కోసం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో జనాల దృష్టిలో ఆయన ‘జీరో టు పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో’ అన్నట్లుగా మారిపోయారు. ఆయన రాన్రాను చిన్న జీరో నుండి మరింత పెద్ద జీరోగా ఎదుగుతున్నారు తప్ప, రాజకీయాలలో ఉండి సాధించేమి లేదు. దేశముదుర్లతో నిండిన కాంగ్రెస్ పార్టీలో జేరడమే ఒకపెద్ద తప్పు గనుక ఆయన తన చుట్టూ ఓ గిరిగీసుకొని ఆ జీరోలో జీరోగా ఉండిపోక తప్పలేదు.   అయితే ప్రతీ మనిషి జీవితంలో ఉత్థానపతనాలు (రైజ్ అండ్ ఫాల్) ఉన్నట్లే ఆయనకీ ఉంటాయి గనుక, కొన్ని రోజులు సోనియమ్మకు అంతరంగికుడిగా మరి కొన్ని రోజులు కేంద్రమంత్రిగా ఒకవెలుగు వెలిగారు. కానీ రాష్ట్ర విభజన ప్రకటనతో అవన్నీకూడా మూన్నాళ్ళ ముచ్చట్లే అవుతాయని ఆయన కూడా  ఊహించలేకపోయారు. ఊహించి ఉంటే అసలు అమ్మ హస్తంలో పార్టీని పెట్టేవారు కారేమో.   తన పార్టీని, దానిని నమ్ముకొన్న వేలాది అభిమానులని, కార్యకర్తలని, చోటా మోటా నేతలని పణంగాబెట్టి సంపాదించుకొన్న కేంద్ర మంత్రి పదవి పోయింది. దానితోబాటే అధిష్టానంతో లింకులు తెగిపోయాయి. పైగా అధిష్టానం హ్యండిచ్చిన కారణంగా ఎన్నికలలో గెలుస్తామనే నమ్మకమూ లేదిప్పుడు.   ఇక సినీ పరిశ్రమలో ఆయన స్వయం కృషి గురించి అందరూ చెప్పుకొంటే, రాజకీయాలలో మాత్రం ఆయన   స్వయంకృతాపరాధం గురించే ఎక్కువ చెప్పుకోవలసి ఉంటుంది. రాష్ట్ర విభజనపై ఓసారి సమైక్యం వైపు, రాజీనామా చేయనని మొండికేసి సోనియమ్మా కొంగు చాటున దాక్కొని మరి కొన్ని రోజులు, మళ్ళీ నలుగురితో నారాయణ అనుకొంటూ రాజీనామా చేసి సమైక్యం వైపు కప్పగంతులు వేసి చివరికి సమైక్యజీరోగా మిగిలిపోయారు. ఇక ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి.   ఇక తనకి సమైక్య కిరణమే దారి చూపాలనే ఆలోచన వచ్చిందో ఏమో మళ్ళీ చాలా రోజుల తరువాత నిద్రలోంచి మేల్కొన్నట్లు మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి వ్రాసిన లేఖలతో తను కూడా ఏకీభవిస్తున్నానని ప్రకటించేశారు. అందువల్ల ఆయనకు కొత్తగా ఒరిగేదేమిటో ఆయనకే తెలియాలి.   ఆయన సినీ పరిశ్రమలో స్వయం కృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగి ఉండవచ్చు గాక, కానీ రాజకీయాలలో అదీ దేశ ముదుర్లతో నిండిన కాంగ్రెస్ పార్టీలో ఎంత స్వయం కృషి చేసేసినా, కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను ఒంటబట్టించుకోనంత కాలం ఏ ప్రయోజనమూ ఉండదు. ఆయన తనకు, తన మనస్తత్వానికి సరిపడని రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ మెగాస్టారుగా వస్తే జనాలు నెత్తినపెట్టుకొంటారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి ముందో చేతులు కట్టుకొని నిలబడటం కంటే, ఆయన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి తన తన మెగాస్టార్ హోదా నిలబెట్టుకొంటే గౌరవప్రదంగా ఉంటుంది కదా.  

విభజన రాజ్యాంగ విరుద్ధమే: చిరు

      చిరు మరోసారి ధైర్యం చేసి సీమాంధ్రులకు అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర విభజనను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నానని, రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చివరి వరకు పోరాడతానని అన్నారు. తెలంగాణపై తీర్మానం, బిల్లు రెండూ అసెంబ్లీకి తప్పనిసరిగా పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తోందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలు, భయాలు, ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్రం ముందు వెళ్తూ ఉండడాన్ని సహించలేనని చెప్పారు. చిరంజీవి ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ సగటు సీమాంధ్రుడికి ఆనందం కలిగించవచ్చేమోగానీ, చిరంజీవి ఏమిటీ.. ఇంత దూకుడుగా వ్యవహరించటమేమిటన్న సందేహం రాజకీయ పరిశీలకులను మాత్రం ఆలోచనలో పడేసింది.

శంఖారావ సభకో నమస్కారం!

      వైస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో ఈరోజు నిర్వహిస్తున్న సమైక్య శంఖారావ సభ, దాని నిర్వహణ వెనుక అసలు ఉద్దేశాల సంగతేమోగానీ, హైదరాబాద్‌లో జనం మాత్రం శంఖారావ సభకో నమస్కారం అంటున్నారు. అసలే వర్షాలతో జనం అల్లాడిపోతుంటే ఈ సమయంలో ఈ సభలేంటని అటు తెలంగాణ వారితోపాటు సీమాంధ్రులు కూడా విసుక్కుంటున్నారు.   సమైక్య శంఖారావం సభని జరగనివ్వమని తెలంగాణవాదులు గట్టి పట్టుదలతో వున్నారు. దీనికితోడు సభకి అడ్డుపడితే నరికేస్తాం, చంపేస్తాం అంటూ వైసీపీ కార్యకర్తలు స్టేట్‌మెంట్లు ఇవ్వడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. దాంతో పోలీసులు తమ డేగకళ్ళకు పనిపెట్టారు. హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభ జరిగే ఎల్.బి.స్టేడియం చుట్టుపక్కల అయితే పరిస్థితి మరింత దారుణంగా వుంది. అటువైపు వెళ్ళిన వాహనాలు పోలీసు ఆంక్షల ఫలితంగా ఎటు తిరిగి ఎటువైపు వెళ్ళి ఎటువైపు తేలతాయో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితులు వున్నాయి. మామూలు రోజుల్లోనే హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లు మామూలు విషయం. ఇక వర్షాలు పడే సమయంలో అయితే ఇకచెప్పనే అవసరం లేదు. అలాంటి పరిస్థతుల్లో ఇలాంటి ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ భారీ స్థాయిలో జామ్ అవుతోంది. పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడి పరిస్థితి కంటే దారుణంగా ఎల్.బి. స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయిన నగర జీవి పరిస్థితి వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వాదుల నిరసన ప్రదర్శనలుంటాయన్న అనుమానాలతో పోలీసులు అందరినీ అనుమానపు చూపులు చూస్తున్నారు. నగరంలో ప్రత్యేక చెకింగ్‌లు, నాకాబందీలు జరుగుతున్నాయి. ఇలాంటి ఇబ్బందులకు కారణమైన వైసీపీ సమైక్య శంఖారావ సభ త్వరగా ముగిస్తే బావుండని నగరజీవి కోరుకుంటున్నాడు. సమైక్య శంఖారావ సభకో నమస్కారం పెడుతున్నాడు.

సిక్కుల ఉచకోతపై బాధలేదా?

      తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తనను కోపానికి గురిచేసిందన్న రాహుల్ వ్యాఖ్యలపై మోడీ తన ప్రసంగంలో పలు సందేహాలు లేవనెత్తారు. ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కుల వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేతలు వేలాది మంది సిక్కులను సజీవదహనం చేయడం... ఈ కేసుల్లో ఒక్కరికీ శిక్ష పడకపోవడం కోపం తెప్పించిందో లేదో చెప్పాలని ప్రశ్నించారు.   ‘ఇందిర హత్యపై కాంగ్రెస్ నేతలంతా ఆగ్రహానికి గురవడం నిజమేనా? ఆ కోపంలో నీ పార్టీ నేతలు వేలాది మంది సిక్కులను సజీవదహనం చేయడం, అయి నా ఒక్కరికీ శిక్ష పడకపోవడం నిజమేనా? నీ నానమ్మ మృతిపై నువ్వు ఆగ్రహానికి గురికావడాన్ని అర్థంచేసుకుంటా. కానీ వేలాదిమంది సిక్కుల మృతి పై నువ్వు బాధపడ్డావా? దీనిపై నీకు కోపం వచ్చిందా’ అని మోడీ ప్రశ్నించారు. తాను కూడా హత్యకు గురవ్వచ్చన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ కలకాలం చల్లగా ఉండేలా చూడమని బీజేపీ ప్రార్థిస్తుందని చెబుతూ.. ఉద్వేగభరితమైన అంశాలను ప్రస్తావించడం ద్వారా రాహుల్ ప్రజల ఉద్వేగాలను దోచుకునే యత్నం చేస్తున్నారన్నారు.

కేంద్రానికి కెసిఆర్ హెచ్చరిక

      కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో హైదరాబాద్ విషయంలో ఏమైనా తేడాలు చేస్తే మరో యుద్ధానికి సిద్ధమని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఇస్తూనే హైదరాబాద్‌పై ఆంక్షలు పెడ్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయని, అదే జరిగితే తెలంగాణను, ప్రజలను అవమానించినట్టేనని అన్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్న ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

భయపెడుతున్న హుస్సేన్ సాగర్..!

      హైదరాబాద్ సికింద్రాబాద్ లను కలుపుతూ హైదరాబాద్ కు తలమానికంగా ఉన్న హుస్సేన్ సాగర్ ఇప్పుడు ప్రమాదం అంచున ఉంది. చాలా ఏళ్ల తరవాత మరో సారి ఈ పరిస్థితి తలెత్తిందది. 2000 సంవత్సరానికి ముందు వచ్చిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ ప్రమాదకర స్థాయికి చేరింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలయిన గాంధీనగర్, అశోక్ నగర్, సుందరయ్య విజ్ఞానకేంద్రం పరిసరాలను వరదనీరు ముంచెత్తింది. హుస్సేన్ సాగర్ తెగుతుందా? అన్న స్థాయికి చేరింది.   ఇప్పుడు దాదాపుగా ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. సాగర్ గరిష్ఠ నీటి మట్టం 513.51 అడుగులు కాగా ప్రస్తుతం 513.25 అడుగులకు చేరుకుంది. నగరంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడి కక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఇప్పుడు హుసేస్ సాగర్ పూర్తిస్థాయి మట్టానికి చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

డిల్లీపై లేఖాస్త్రాలు సందించిన ముఖ్యమంత్రి

రాష్ట్ర విభజనపై ఇంత వరకు మాటలతోనే సరిబెడుతున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇక వ్రాతల్లోకి కూడా దిగారు. ప్రజాభీష్టానికి, రాజ్యంగానికి విరుద్ధంగా సాగుతున్న రాష్ట్ర విభజనను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ప్రధానికి, రాష్ట్రపతికి వేర్వేరుగా లేఖలు సందించారు. రాష్ట్ర విభజనవల్ల వచ్చే వివిధ సమస్యలను, వాటి పట్ల ప్రజలు, ప్రజాప్రతినిధుల ఆందోళనలను వేటినీ కూడా ఖాతరు చేయకుండా ఇంత హడావుడిగా, మొండిగా ముందుకు సాగడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నిస్తూనే, పారదర్శకతలేని కారణంగా ప్రజలు కూడా అనుమానిస్తున్నారని ఆయన వ్రాసారు. ఇంతకు ముందు రాష్ట్రవిభజన చేసినప్పుడు ఏవిధమయిన పద్దతులు పాటించారో, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర విభజనలో కూడా అదేవిధమయిన శాస్త్రీయ, రాజ్యంగా బద్దమయిన పద్దతులను పాటిస్తూ, శాసనసభను కూడా పరిగణనలోకి తీసుకొని ముందుగా విభజన తీర్మానం, ఆ తరువాత బిల్లును పంపాలని ఆయన తన లేఖలో కోరారు.  

డౌటొచ్చేలా కిరణ్ తీరు!

      రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విమర్శించడం ద్వారా కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రజల దృష్టిలో హీరో అయ్యారు. సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న కిరణ్ సమైక్యవాద ఛాంపియన్ అని ఆయన సన్నిహితులు చెబుతూ వుంటారు. తుఫాన్‌ని ఆపలేను గానీ, విభజన తుఫాన్‌ని మాత్రం ఆపగలను అని కిరణ్ చెప్పిన మాట పంచ్ డైలాగ్‌లా చాలా బాగుంది.   అయితే విభజనను ఆపే విషయంలో ఆయన ఆచరణ ద్వారా చేస్తున్నది మాత్రం ఏమీ లేదు. ఇంతకీ కిరణ్ సమైక్యవాదేనా లేక సమైక్యవాద ముసుగు వేసుకుని, సీమాంధ్ర ప్రజల్ని మభ్యపెడుతూ రాష్ట్ర విభజన సాఫీగా సాగిపోవడానికి సహకరిస్తున్నారా? ఈ అనుమానాలు ఆయన్ని వ్యతిరేకించేవారిలో మాత్రమే కాకుండా.. అభిమానించేవారిలో కూడా వస్తున్నాయి. ఎందుకంటే కిరణ్ తీరు అనేక సందేహాలు కలిగించేలా వుంది. ]ఒకపక్క కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా చకచకా అడుగులు వేస్తోంది. విభజనను అడ్డుకుంటానంటున్న కిరణ్ మాత్రం  విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చేదాకా వేచిచూద్దాం అని ప్రశాంతంగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేచిచూసే ధోరణి కాకుండా దూసుకెళ్ళే ధోరణే కరెక్ట్. అయితే ముఖ్యమంత్రి మాత్రం దూసుకెళ్ళేలా కనిపించడం లేదు. కేంద్రం విభజన బిల్లుని అసెంబ్లీకి పంపకపోతే అప్పుడు ఎవరూ చేయగలిగింది ఏమీ వుండదు. అందుకే ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ముందుగానే అసెంబ్లీని సమావేశపరచి విభజన వ్యతిరేక తీర్మానం పంపితే బావుంటుందన్న అభిప్రాయం సమైక్య వాదుల్లో వుంది. ముఖ్యమంత్రి తనకు తానుగా అసెంబ్లీని సమావేశపచడానికి ఆదేశించవచ్చు. ఒకవేళ అలా తనకు తాను ఆదేశిస్తే హైకమాండ్ నొచ్చుకుంటుందనుకుంటే, విభజన తీర్మానం చేద్దామంటూ వైకాపా రాసిన లేఖ ఆధారంగానైనా అసెంబ్లీని సమావేశపరచొచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని సమైక్యవాదులు కోరుతున్నారు. హైకమాండ్‌ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించే ధైర్యం లేకపోవడం, రాష్ట్ర విభజన తర్వాత కేంద్రంలో ఉజ్వల భవిష్యత్తుకు కిరణ్‌కి అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ రావడం వల్లే కిరణ్ కిక్కురుమనడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

రాహుల్‌ మీద మోడీ వ్యంగ్యాస్త్రాలు!

      రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ మాట్లాడిన తీరు విమర్శల్ని ఎదుర్కొంటోంది. కరుణ రసాత్మకంగా మాట్లాడిన రాహుల్ టాపిక్‌ని తానూ హత్యకి గురవుతానేమోననే పాయింట్ వరకూ తీసుకెళ్ళాడు. రాహుల్ ప్రసంగం ఏడవడం ఒక్కటే తక్కువ అన్నట్టుగా సాగింది.   రాహుల్‌గాంధీ ప్రసంగం కొత్త ఓట్లు తెచ్చే మాట దేవుడెరుగు ఉన్న ఓట్లని కూడా పోగొట్టేలా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ తీరు పట్ల కాంగ్రెస్ వర్గాల్లో కూడా అసంతృప్తి కనిపిస్తోంది. రాహుల్ మాట తీరును భారతీయ జనతాపార్టీ గురువారమే అధికారికంగా ఖండించింది. ముస్లింలు కూడా రాహుల్ మాట్లాడిన తీరు ముస్లింలను అవమానించే విధంగా ఉందని విమర్శిస్తున్నారు. సిక్కుల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.  తాజాగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా రాహుల్ గాంధీకి పరోక్షంగా చురకలు వేశాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ రాహుల్ మీద పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తాను వచ్చింది కన్నీళ్ళు తుడవడానికే తప్ప కన్నీరు కార్చడానికి కాదని చురక అంటించాడు. మొత్తమ్మీద ఈ ఇష్యూలో రాహుల్‌గాంధీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది.

సీమంధ్ర ప్రజలను మభ్యపెడుతూ విభజన ప్రక్రియ పూర్తి

  వచ్చేనెల 5నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల కంటే ముందుగానే, రాష్ట్ర విభజన కోసం ఏర్పడిన కేంద్రమంత్రుల బృందం తన నివేదికను సమర్పిస్తుందని కేంద్ర హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే మీడియాకు తెలియజేసారు. ఇక దిగ్విజయ్ సింగ్ కూడా మరో ముఖ్యమయిన విషయం తెలియజేసారు. వచ్చేనెల 15లోగా తెలంగాణా ముసాయిదా తీర్మానం సిద్దం అవుతుందని, వచ్చే జనవరి లోగానే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడుతాయని మీడియాకు తెలిపారు.   రాష్ట్ర విభజనలో ఇమిడి ఉన్న అనేక సంక్లిష్ట అంశాలను పూర్తిగా పరిష్కరించకుండానే, దానినొక మొక్కుబడి తంతుగా పూర్తి చేసేందుకే కేంద్రమంత్రుల బృందం ఏర్పరచబడిందని దీని ద్వారా అర్ధం అవుతోంది. కేంద్రమంత్రుల బృందం తమ పని పూర్తి చేసి, నివేదిక సమర్పించేందుకు ముందు విదించిన ఆరు వారాల కాల పరిమితిని ఉద్దేశ్య పూర్వకంగానే తొలగించామని కాంగ్రెస్ చెప్పినప్పటికీ, సరిగ్గా అంతే కాలపరిమితిలోనే మంత్రుల బృందం తన పని పూర్తిచేయడం గమనిస్తే, సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టేందుకే ఆవిధంగా ప్రకటించారని అర్ధం అవుతోంది. ఇక అదేవిధంగా ముందు ప్రకటించినట్లుగానే నాలుగు నెలలలోనే రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిఅవుతోందని దిగ్విజయ్ తాజా ప్రకటన స్పష్టం జేస్తోంది.   సామరస్య వాతావరణంలో సాంకేతికంగా జరుగవలసిన రాష్ట్ర విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఇంత హడావుడిగా, గోప్యంగా, ప్రజలను మభ్యపెడుతూ చేయడం చూస్తే, కేవలం తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే విభజన చేస్తోందని స్పష్టం అవుతోంది. తన ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనలో కీలకమయిన అనేక అంశాలని విస్మరించి ముందుకు సాగడం ద్వారా విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు, గొడవలు శాశ్వితంగా నిలిచిపోవడం ఖాయం.   మోడీ ప్రభంజనం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, బహుశః ఇక మళ్ళీ ఇంత త్వరలో తాము అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నందునే ఈవిధంగా వ్యవహరిస్తోందని అనుమానం కలుగుతోంది. ఏమయినప్పటికీ కాంగ్రెస్ తొందరపాటు నిర్ణయం, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల అసమర్దత, వారి స్వార్ధ రాజకీయాలు, ప్రతిపక్షాల మధ్య అనైక్యత వలన కాంగ్రెస్ అధిష్టానం తెలుగు ప్రజల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పవచ్చును. కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహం ప్రస్తుతం తెలంగాణా నేతలకి, ప్రజలకి చాలా ఆనందం కలిగించవచ్చును. కానీ మున్ముందు తరచు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు జరిగిననాడు తప్పక కాంగ్రెస్ పార్టీని నిందించక మానరు.   రాష్ట్ర విభజన విషయంలో ప్రజలను చివరి దాక మభ్యపుచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చును. అయితే వారందరూ తమ తమ వ్యక్తిగత పలుకుబడి, కుల సమీకరణాలు, అంగ బలం, ఆర్ధిక బలంతో రానున్నఎన్నికలలో గెలువగలమని దృడంగా నమ్ముతున్నారు.

సీమాంధ్ర సీఎంగా చిన్నమ్మ?

      కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నట్టుగా రాష్ట్ర విభజన సజావుగా సాగిపోతే, సీమాంధ్రలో కాంగ్రెస్ గెలిస్తే సీమాంధ్ర సీఎంగా చిన్నమ్మ అనగా దగ్గుబాటి పురంద్రీశ్వరి అయ్యే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం రెండు ముక్కలు చేస్తే ఎలాగూ ఆ ముక్కలో కాంగ్రెసే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి.   ఇక ఈ ముక్కలో కూడా అధికారంలోకి రావాలంటే చిన్నమ్మని సీఎం అభ్యర్థిగా తెరమీదకు తేవాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తోంది. బొత్స, ఆనం లాంటి నాయకులు కూడా సీమాంధ్రకి సీఎం అయిపోవాలని కలలు కంటున్నప్పటికీ అధిష్ఠానం చిన్నమ్మ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి పురందేశ్వరికి రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం మద్దతు సంపూర్ణంగా లభించే అవకాశం వుంది. టీడీపీకి అండగా వుండే సామాజికవర్గం ఓట్లలో భారీ చీలిక తెచ్చే అవకాశం వుంది. అలాగే మహా నాయకుడు ఎన్టీఆర్ కుమార్తె కావడం, సమర్థురాలిగా పేరు  తెచ్చుకోవడం, తాజాగా రాష్ట్ర  విభజన విషయంలో కాంగ్రెస్ హైకమాండ్‌కి మద్దతుగా మాట్లాడటం ఇవన్నీ  పురందేశ్వరికి  ప్లస్ పాయింట్లుగా మారాయి. రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్రలో కోల్పోయే పరువు, పవరు  పురందేశ్వరికి వల్ల తిరిగి పొందవచ్చనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు వున్నట్టు తెలుస్తోంది. మహిళను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా మహిళల ఓటు బ్యాంకుకు కైవసం చేసుకునే అవకాశం వుందని భావిస్తున్నారు. సీమాంధ్రలో బలంగా వున్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలంటే చిన్నమ్మనే రంగంలోకి దించడం కరెక్టని కాంగ్రెస్ భావిస్తోంది.

సమైక్య శంఖారావానికి రావద్దు

      వర్షాల మూలంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయక చర్యలలో పాల్గొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ లో జరుగుతున్న సమైక్య శంఖారావం సభకు రావాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. తుఫాను మూలంగా ఇబ్బందులు ఉన్నా..తుపాను కంటే విభజన సమస్య చాలా తీవ్రమయినదని అందుకే సమైక్య శంఖారావం సభ యధావిదిగా నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. సభను వాయిదా వేయాలా ? నిర్వహించాలా ? అన్న విషయంలో పార్టీలో తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఢిల్లీకి సమైక్య వాణి వినిపించేలా సభ నిర్వహించాలని, ఇబ్బందులు ఎన్ని ఉన్నా సభ కొనసాగించాలనే వైఎస్ జగన్ పట్టుబడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రియాంకకీ గాలమేశారు!

      మహబూబ్‌నగర్ స్థానం నుంచి లోక్‌సభకు రాహుల్‌గాంధీ పోటీ చేయాలని రాష్ట్ర మంత్రిణి డి.కె.అరుణ ఎంతో అభిమానంతో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుస్తున్న విషయమేమిటంటే, ఒకవేళ రాహుల్‌గాంధీ పోటీ చేయకపోతే, ప్రియాంకాగాంధీ చేతైనా పోటీ చేయించి, తద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని అరుణ మేడమ్ భావిస్తున్నట్టున్నారు.   రాహుల్ లేదా ప్రియాంక ఎవరిచేతైనా పోటీ చేయించాలని దిగ్విజయ్‌సింగ్‌కి విన్నవించుకున్నారట. ఆయన నిందు మనసుతో స్పందించి సరే ఇద్దరి పేరుమీద సపరేట్ సపరేట్‌గా వినతిపత్రాలు సమర్పించండి నేను యువరాజుకి, యువరాణికి చెప్పి చూస్తానని అభయమిచ్చాడట. దాంతో జంట వినతి పత్రాలు సమర్పించి అరుణ గారు ఆనందంగా తిరిగొచ్చారట. సమయానికి సలహా ఇచ్చేవారెవరూ మంత్రిణి గారి దగ్గర ఉన్నట్టు లేరు. లేకపోతే సోనియాగాంధీ పేరు మీద ఒక వినతిపత్రం, రాబర్ట్ వధేరా పేరు మీద మరో వినతిపత్రం సమర్పించి వస్తే ఓ పనయిపోయేది. ఆ వినతిపత్రాలు చూసి ఆ నలుగురిలో ఎవరో ఒకరు మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పావనం చేసేవారు.

అబ్బ! మళ్ళీ దెబ్బెసేసాడు మనోడు

  ఒక సిద్దాంతానికో నియమానికో కట్టుబడేవి కావు మన రాజకీయాలు, అయినా కట్టుబడిఉన్నట్లు అందరినీ భ్రమింపజేస్తాయి. అలా భ్రమింపజేయడమే రాజకీయం. ఇక సమైక్యాంధ్ర చాంపియన్ షిప్ ట్రోఫీ రేసులో అందరి కంటే ముందున్న కిరణ్, జగన్లు కూడా ఈ రాజకీయాలకు అతీతులు కారు. సమైక్యాంద్ర వాదనలతో కిరణ్ కుమార్ రెడ్డి తన రేటింగ్స్ పెంచుకొనేందుకు కష్టపడుతుంటే, సమైక్యాంద్ర సెంటిమెంటుతో సీమాంద్రాలో తన పార్టీని బలోపేతం చేసుకొని అధికారంలోకి రావాలని జగన్ ఆశపడుతున్నాడు.   కానీ పోటీలో ఒకరు గెలవాలంటే ప్రత్యర్ధిని తప్పనిసరిగా ఓడించాలి. అందుకు ఏదో ఒకటి చేయక తప్పదు మరి. దానిని భరించాలంటే చాలా స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. రేపు హైదరాబాదులో సమైక్య శంఖారావం పూరించి సీమాంద్రాపై మరింత పట్టు సాధించుకోవాలని జగన్ ఆలోచిస్తే, అతనికంటే నాలుగాకులు ఎక్కువ చదివిన కిరణ్ కుమార్ రెడ్డి రెండేళ్ళ క్రితం పెరట్లో పడేసిన ‘రచ్చబండ’ని మళ్ళీ దులిపి సిద్దం చేసుకొని ఆ మిషతో ప్రజలను మంచి చేసుకొనేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా ఒట్టి చేతులతో కాకుండా సామాన్య ప్రజలు ఆశించే రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ళు వంటి తాయిలాలను పట్టుకొని మరీ బయలు దేరుతున్నారు.   కుండపోతగా కురుస్తున్న వానల మధ్య సమైక్య శంఖారవం పూరించడానికి వీలవుతుందో లేదో, ఇంతా కష్టపడి ఊపిరి బిగబట్టి గట్టిగా శంఖం ఊదినా అది జనాలకి వినబడుతుందో లేదో అని దిగులుపడుతున్న వైకాపాకి, కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి తమని ఏకంగా రచ్చబండతో కొట్టడంతో కంగు తిన్నారు.   సీమాంద్రాలో ఎలాగోలా నెగ్గుకు రావచ్చును. కానీ, మళ్ళీ తెలంగాణాలో మూసేసిన దుఖాణం తెరవాలంటే ఈ శంఖారావం చాలా అవసరమని వైకాపా భావిస్తుంటే, కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ అదే రచ్చబండతో అక్కడి మంత్రులతో వైకాపాకు కౌంటర్ ఇప్పించే వెసులుబాటు ఉంచుకోవడం కలవరపరుస్తోంది. తెలంగాణా సాధించింది తామేనని, కేవలం తమ పార్టీయే మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని వారు రచ్చబండ మీద నిలబడి మరీ టాం టాం చేసుకొంటూ పనిలోపనిగా అక్కడి జనాలకు కూడా వారు తాయిలాలు పంచి పెట్టి మంచి చేసుకోవచ్చును.   ఇంత జడివానలో తడిసి ముద్దవుతూ అష్టకష్టాలు పడినా దక్కని ఫలం, ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ నేతలు రచ్చబండ దగ్గిర కులాసాగా నాలుగు కబుర్లు చెప్పి, జనాలకి తాయిలాలు పంచిపెట్టి సంపాదించుకోవాలని ప్రయత్నించడం చాలా అన్యాయమని వైకాపా ఆక్రోశిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకవైపు సమైక్యవాదం చేస్తూనే మరోవైపు ప్రజలను సమైక్యం నుండి పక్కదారి పట్టించడానికే ఈ రచ్చబండ కబుర్లు చెప్పడానికి వస్తున్నారని వైకాపా ఆరోపణ.   స్పోర్టివ్ స్పిరిట్ లేకపోవడమంటే మరి ఇదే. అయితే యుద్దంలో గెలుపే ముఖ్యం తప్ప అందుకు ఎంచుకొన్న మార్గాలు ముఖ్యం కాదని అర్ధం అవుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి తమ మెడకు రచ్చబండను గుదిబండగా తగిలిస్తే, దానిని వదిలించుకొని మళ్ళీ జీవితాన్నే మార్చేసే మరో సరి కొత్త ఐడియా కోసం వైకాపా ఆలోచించక తప్పదు. చివరికి ఇద్దరిలో సమైక్య ట్రోఫీ ఎవరికి దక్కుతుందో చూడాలి.

పయ్యావులతో ఎర్రబెల్లి ఢీ

      రాష్ట్ర విభజన విషయంలో ఇతర పార్టీల నుంచి తీవ్రమైన విమర్శల దాడిని ఎదుర్కుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో తలనొప్పి వచ్చి పడింది. పయ్యావుల కేశవ్ విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేయడంతో,తెదేపా ఆంధ్ర, తెలంగాణా నేతల మధ్య విభేదాలకు దారి తీస్తోంది. రాష్ట్ర విభజన ప్రక్రియు అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పయ్యూవుల కేశవ్‌ పిల్‌ వేసిన నేపథ్యంలో ఎర్రబెల్లి తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో తలెత్తే సమస్యలు చెప్పుకోవచ్చని, అందుకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే విభజన ఆపాలని కోరడం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమని, ఇది పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని దయాకర్ రావు అన్నారు. ఈవిషయమై చంద్రబాబుకి పిర్యాదు చేసి పయ్యావులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

సమైక్య శంఖారావం వాయిదా?

      రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రేపు హైదరాబాదులో వైకాపా జరుపనున్నసమైక్య శంఖారావం సభ జరుగుతుందా లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే వానల కారణంగా ప్రజలు, పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ సమయంలో కూడా మడమ తిప్పకపోతే ఎలా? అని పార్టీ నేతలే కాక ప్రత్యర్ధి పార్టీ నేతలు కూడా బాధపడుతున్నారు. సాయంత్రం వరకు వేచి నిర్ణయం తీసుకోవాలా?లేక వెంటనే నిర్ణయం తీసుకోవాలా అన్నదానిపై వైకాపా నేతలు తర్జనభర్జనలు చేస్తున్నారు. సాయంత్రం రైళ్లలో బయల్దేరాక వాయిదా వేయాల్సి వస్తే ఇబ్బంది అవుతుందని భావిస్తన్నారు. బహుశా మధ్యాహ్నం లోగా తుది నిర్ణయం తీసుకోవచ్చు.

జైలుకు మోపిదేవి

      వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అందరూ జైలు నుంచి బయటకు వస్తుంటే మోపిదేవి వెంకట రమణ మాత్రం మళ్లీ జైలుకు వెళ్లాడు. అందరి కన్నా మొదట జైలు నుంచి బయటకు వచ్చిన మోపిదేవి మళ్లీ జైలు కు వెళ్లాడు. వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. వెన్నునొప్పి శస్త్రచికిత్స కోసం కోర్టు మంజూరు చేసిన 45 రోజుల తాత్కాలిక బెయిల్ ఈ నెల 31తో ముగియనుంది. నవంబర్ 1న లొంగిపోవాలని కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టులో లొంగిపోయాడు. అయితే వెనువెంటనే మోపిదేవి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడం విశేషం. దీనిపై విచారణను కోర్టు నేటికి వాయిదా వేస్తూ, ఆయనకు 31 వరకు రిమాండ్ విధించింది.

కొత్త సంవత్సరానికి 'తెలంగాణ'

      రాష్ట్ర విభజన విషయంలో ముందుకే వెళ్తాం. నవంబర్ 15 నాటికి ముసాయిదా బిల్లు రెడీ అవుతుంది. కొత్త ఏడాది నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడతాయ'ని తెలంగాణ ప్రాంత మంత్రులు, ముఖ్యనేతలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. దీనిపై ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. 'విభజనపై మేం వెనక్కు పోయామని, సందిగ్ధంలో పడ్డామని ఎవరైనా అంటే నమ్మొద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని ప్రజలకు వివరించండి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని వివరించండి. భారీ స్థాయిలో సమావేశాలు నిర్వహించండి. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల్లోకి తీసుకువెళ్లండి' అని దిగ్విజయ్ పేర్కొన్నారు.