రేణుకని సాధిస్తున్నారు!
posted on Oct 27, 2013 @ 1:26PM
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సాధించడానికి రేణుకా చౌదరి అప్పనంగా దొరికినట్టుంది. ఆమెని ఇబ్బంది పెట్టడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే వుంటారు. రేణుకా చౌదరికి వున్న నాయకత్వ లక్షణాలు, ఎవరినీ లెక్కచేయనితనం, తాను చెప్పాలనుకున్నది నిర్భయంగా చెప్పే లక్షణమే ఆమెను తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు శత్రువుగా మార్చాయి. తె.కాం. నాయకులలోని పురుషాధిపత్య ధోరణి కూడా ఆమెకు శత్రువుల్ని పెంచుతోంది.
మహిళా కాంగ్రెస్ నాయకురాలంటే తాము చెప్పిన వాటికి తలూపడం తప్ప ఎదురు మాట్లాకూడదు. ఒకవేళ ఎదురు తిరిగి మాట్లాడితే.. ఇదిగో.. ఇలా రేణుకాచౌదరిని వెంటాడినట్టే వెంటాడి వేధిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను రేణుకా చౌదరి మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే తెలంగాణని అభివృద్ధి చేయడమే ముఖ్యమని ఆమె చెప్పేవారు. అది మనసులో పెట్టుకుని ఆమె మీద తెలంగాణ ద్రోహి ముద్ర వేశారు.
ఆమధ్య తెలంగాణ కాంగ్రెస్ సమావేశానికి రేణుకా చౌదరి వెళ్తే పొన్నం లాంటి నాయకులు ఆమెని ఆ సమావేశంలోంచి బయటకి పంపేయాలని నానా యాగీ చేశారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రి ఒకరు రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా ఆడపడుచే కాని రేణుకని ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొనసాగించకూడదని ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా వున్న రేణుక వచ్చే ఎన్నికలలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
అయితే కొంతమంది తె.కాం. నాయకులు ఈసారి రేణుకకు ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ ఇవ్వాలంటే ఆమె ఖమ్మం జిల్లాలో పుట్టినట్టు బర్త్ సర్టిఫికెట్ చూపించాలని డిమాండ్ చేశారు. ఈసారి రేణుకకు ఖమ్మం టిక్కెట్ రాకుండా చేయాలన్న ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇదంతా ఇలా వుంటే, రేణుకకు చెక్ పెట్టడంతోపాటు, రాహుల్‌గాంధీ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఖమ్మం జిల్లాలో వున్న రేణుక వ్యతిరేక వర్గం ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాంటి ఒక ప్లాన్ వేసింది.
రాహుల్‌గాంధీ ఈసారి ఎన్నికలలో ఖమ్మం నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించింది. ఇది రేణుక వర్గీయులకి ఆగ్రహం తెప్పించింది. దాంతో వాళ్ళు ఖమ్మం జిల్లా ఎడిషన్ న్యూస్ పేపర్లలో ‘‘ఖమ్మం నుంచి రేణుకా చౌదరి పోటీ చేయాలంటే బర్త్ సర్టిఫికెట్ కావాలన్నారు. మరి రాహుల్‌గాంధీకి ఖమ్మం జిల్లాలో పుట్టినట్టు బర్త్ సర్టిఫికెట్ ఏదైనా వుందా’’ అనే అర్థం వచ్చేలా ప్రకటనలు ఇచ్చారు. రేణుకని దెబ్బతీయడానికి కాచుకుని కూర్చుని వున్న వాళ్ళకి ఆ ప్రకటనలు లడ్డులా దొరికాయి. ఆ ప్రకటనల కటింగ్‌ని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి శనివారం నాడు దిగ్విజయ్‌సింగ్‌కి అందజేశారు.
రేణుకా చౌదరి వ్యవహార శైలి మీద కూడా డిగ్గీకి ఫిర్యాదు చేశారు. యువరాజు మీదే కామెంట్లు చేయడానికి సాహసిస్తున్న రేణుకని, ఆమె వర్గాన్ని తగిన విధంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తమ్మీద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తనను ఎంత సాధిస్తున్నా, వేధిస్తున్నా రేణుకా చౌదరి వెనకడుగు వేయడం లేదు. కాంగ్రెస్ పార్టీలో వున్న ఈ వర్గపోరు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశానికి మరింత లాభం చేకూర్చే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.