జగన్ తో కేంద్రం కుమ్మక్కు
posted on Oct 28, 2013 @ 11:15AM
కేంద్రంతో జగన్ కుమ్మక్కయ్యారని, అధిష్ఠానం ఆయన్ని దత్తపుత్రుడిగా భావిస్తోందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. ఇక వైసీపీ, టీఆర్ఎస్ లాలూచీ పడ్డాయన్న విషయాన్ని జగన్ సభను చూసిన చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడని అన్నారు. సమైక్య సభ బలపడాలని జగన్ ప్రయత్నించారని, అయితే ఆయన పార్టీ బలపడటం లేదని అధిష్ఠానానికి ఆలస్యంగా అర్థమైందన్నారు. రాష్ట్రం జగన్ గుప్పిట్లో ఉందన్న భ్రమతో కాంగ్రెస్ అధిష్ఠానం విభజన ప్రకియను వేగవంతం చేస్తోందన్నారు.
సమైక్యవాదంతో ముందుకెళ్తున్న ఏపీఎన్జీవో సభకు అడ్డంకులు సృష్టించిన టీఆర్ఎస్.. జగన్‌తో కుమ్మక్కయినందునే ఆయన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదన్నారు. జగన్, కేసీఆర్ తోడు దొంగల్లా కూడబలుక్కుని హైదరాబాద్‌లో శంఖారావం సభను నిర్వహించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లు వచ్చినా, తీర్మానం వచ్చినా ఓడిస్తామని, ఆ తర్వాత రాజీనామా చేయడానికి ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి, ప్రజల గుండెల్లోని భావనను తెలియజేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ప్రజల భావోద్వేగాలను తేలిగ్గా తీసుకోవద్దని అధిష్ఠానానికి చెప్పామన్నారు.