మోడీ రిటైర్మెంట్ చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లేనా?
posted on Aug 29, 2025 @ 3:30PM
ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో 75వ పడిలో అడుగుపెట్టనున్నారు. బీజేపీ తనంతట తానే విధించుకున్న నిబంధన మేరకు మోడీ ఇక రిటైర్ కావలసిందే. మోడీ ప్రధానిగా తొలి సారి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ పార్టీలోని సీనియర్లను వయస్సు కారణంగా చూపుతూ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంచే ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రారంభించడమే కాదు.. చేసి చూపించారు కూడా. బీజేపీలో సీనియర్ మోస్ట్ నాయకులైన ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషీలకు వారికి 75 ఏళ్లు వచ్చాయన్న ఒకే ఒక కారణంతో పార్టీలో క్రియాశీలక పాత్ర లేకుండా చేశారు. వారికి కనీసం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. బీజేపీ అంగీకరించకపోవచ్చు కానీ ఆ సీనియర్లిద్దరినీ అత్యంత అవమానకర రీతిలో పక్కన పెట్టేశారు.
ఇప్పుడు అదే పరిస్థితి మోడీకి వస్తుందని చాలా మంది భావించారు. కానీ ప్రధానిగా పదవీ పగ్గాలు చేపట్టిన ఈ దశాబ్దంపైగా కాలంలో మోడీ పార్టీపైనా, ప్రభుత్వంపైనా కూడా పూర్తి పట్టు సాధించారు. మోడీ కాకపోతే మరెవరు? అన్న పరిస్థితి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏర్పడేలా చేశారు. ఈ నేపథ్యంలోనే మోడీ 75 ఏళ్ల వయస్సు వచ్చినా ప్రధానిగానే కొనసాగే పరిస్థితి కల్పించుకున్నారు. కానీ అనుకోని విధంగా మోడీ ఓవర్ డూయింగ్స్ పార్టీ మెంటార్ గా భావించే ఆర్ఎస్ఎస్ ఒకింత ఆగ్రహంగా ఉందన్న వార్తలు గుప్పుమనడం.. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొంత కాలం కిందట 75 ఏళ్లకే రిటైర్మెంట్ అంటూ నొక్కి వక్కాణించడంతో మోడీ కొనసాగింపు ఎండమావే అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఇందుకు తోడు అంతకు ముందు అంటే మోడీ ముచ్చటగా మూడొ సారి ప్రధానిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత హుటాహుటిన నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్ సహా సంఘ్ ప్రముఖులతో భేటీ అవ్వడం కూడా ఆర్ఎస్ఎస్, మోడీల మధ్య కుచ్ కుచ్ హోతా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఆ తరువాత మోహన్ భగవత్ 75 ఏళ్ల నిబంధన గురించి లేవనెత్తడం కూడా మోడీ పదవికి ఇక ఎసరు వచ్చినట్లేనన్న వార్తలు గుప్పుమన్నాయి. దేశ వ్యాప్తంగా మోడీ వారసుడెవరన్న చర్చ సైతం జోరుగా సాగింది. అయితే ఈ వ్యవహారం అంతా టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. 75 ఏళ్ల వయస్సు నిబంధనపై అంత గట్టిగా మాట్లాడిన మోహన్ భగవత్.. ఉన్నట్లుండి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేశారు. వయస్సు పైబడినా ఉత్సాహంగా పని చేసే వారికి ఆ నిబంధన వర్తించదంటూ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ మోడీ పదవీ కాలం ఇక నెలలే అంటూ జరిగిన చర్చకు తెరపడింది. మరో సారి కూడా మోడీయే అన్న భావన బలపడింది. ఆర్ఎస్ఎస్ ను కూడా తన దారికి తెచ్చుకున్న మహాలుడిగా మోడీని కమలం శ్రేణులు కీర్తిస్తున్నాయి. మోడీ ముందు ఆర్ఎస్ఎస్ తలవంచినట్లైందంటూ పరిశీలకులు విశ్లేషణలకు పదును పెడుతున్నారు.