సుంకాల ‘ట్రంప్’ కు కోర్టులో ఎదురు దెబ్బ!
posted on Aug 30, 2025 @ 3:46PM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏది చేసిన అదొక సంచలనమే. నిజానికి.. కొన్ని కొన్ని నిర్ణయాలు కేవలం సంచలన సృష్టించడం కోసమే చేస్తుంటారా? అని కూడా అనిపిస్తుంది. అందుకే.. అగ్ర రాజ్యం అధినేత, అనే విషయం మరిచి పోయి ఆయన చేసే వ్యాఖ్యలు, తీసుకునే నిర్ణయాలు అనేక సందర్భాలలో నవ్వుల పాలవుతున్నాయి. అమెరికా ప్రజలనూ నవ్వుల పాలు చేస్తున్నాయి. అందుకే, అమెరికా ప్రజలు కూడా ట్రంప్ సెకండ్ టర్మ్ మొదలైనప్పటి నుంచే రోజులు లెక్క పెట్టుకుంటున్నారు.
అదలా ఉంటే.. గత కొంత కాలంగా ‘ట్రంప్’ కోతికి కొబ్బరికాయ దొరికింది అన్నట్లుగా, తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు, ఇతర దేశాల విషయంలో అనవసర జోక్యం చేసుకోవడమే కాకుండాజజ అన్నిటికీ నేనే..నేనే అంటూ ప్రగల్బాలకు పోతున్నారు. సొంత డబ్బా గట్టిగా కొట్టు కుంటున్నారు. అంతే కాదు భారత్ సహా ఆయన ప్రగాల్బాలకు జై కొట్టని దేశాలపై పిచ్చివాడి చేతిలో రాయి చందంగా సుంకాలను పెంచుకుంటూ పోతున్నారు.
అయితే.. సుంకాల ట్రంప్ నెత్తిన అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు మరో మారు మొట్టికాయ వేసింది. ట్రంప్ విధించిన సుంకాలు చట్ట విరుద్ధం అని అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ తన ఎమర్జెన్సీ అధికారాలను అతిక్రమించి భారీగా టారిఫ్ లు విధించారని పేర్కొంది. అయితే పెంచిన టారిఫ్ లను అక్టోబర్ వరకు కొనసాగించడానికి, అదే విధంగా తమ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది.కాగా.. అప్పీల్ కోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో పోరాడతామని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. అయితే కోర్టుల వ్యవహారం ఎలా ఉన్న ట్రంప్ ఎడాపెడా సుంకాలు విధించడం అమెరికా ప్రజల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.