అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా.. సంకేతం అదేనా?
posted on Aug 30, 2025 @ 12:28PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్లకుంట్ల చంద్రశేఖరరావు గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత దాదాపుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆయన రాజకీయంగా ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. పార్టీ వ్యవహారాలలోనూ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరయ్యే బాధ్యతనూ విస్మరించారు. పార్టీ పరాజయం తరువాత ఆయన కేవలం రెండంటే రెండు సార్లు అసెంబ్లీకి హాజరయ్యారు. అప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు. అయితే.. ఈసారి మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి హాజరౌతారని అంతా భావించారు. ఎందుకంటే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంది. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ నివేదికను అనుసరించి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతికి బాధ్యులపై చర్యకు నిర్ణయం తీసుకుంటారు. కాళేశ్వరం అవకతవకలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ సభకు హాజరై తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తారని అంతా భావించారు. దివంగత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మాగంటి మృతి పట్ల సభ సంతాపం తెలిపే కార్యక్రమానికీ డుమ్మా కొట్టిన కేసీఆర్.. రానున్న రోజులలో కూడా వచ్చే అవకాశాలు అంతంత మాత్రమే. దీంతో కేసీఆర్ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లేనా? అన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.
అయితే.. సభకు గైర్హాజరైనా కేసీఆర్ సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై మాత్రం మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లతో శుక్రవారం (ఆగస్టు 29) సుదీర్ఘంగా చర్చించారు. ఆ చర్చల మేరకే హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని పరిశీలకులు అంటున్నారు. సభలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తామంటే కాంగ్రెస్ సర్కార్ భయపడుతోందంటూ ఎదురుదాడికి దిగడం, సభ కాదు కాళేశ్వరంపై వాస్తవాలు ఏంటన్నది తేల్చాల్సింది కోర్టులే అంటూ అసెంబ్లీ ప్రాధాన్యతను తగ్గించే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు.