కామ్రేడ్ల కుర్చీ పోరు
posted on Aug 29, 2025 @ 3:57PM
క్రమశిక్షణకు మారుపేరైన కమ్యూనిస్టుల్లో , ప్రజాసామ్యయుతంగా నడిచే ప్రజా ఉద్యమాల పార్టీ సీపీఐలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. నాయకులు చెప్పినట్లు నడుచుకునే సీపీఐ నేతల్లో పదవీ కాంక్షలు మొదలయ్యాయి. అందుకోసం గ్రూపులు కట్టే పరిస్ధితి ఏర్పడింది. ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హోదా కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు ప్రారంభించారు. దాంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎంపిక అర్ధంతరంగా ఆగిపోయింది.
కౌన్సిల్, కార్యదర్శివర్గం ఎన్నిక జరిగినా..కార్యదర్శి ఎన్నిక మాత్రం జరగకుండానే ఒంగోలులో జరిగిన 3 రోజుల మహసభలను ముగించేశారు. ఆల్ ఇండియా మహాసభ తరువాత దీనిపై నిర్ణయం తీసుకుందామంటూ దాట వేశారు. మూడు రోజుల పాటు ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో గత కార్యక్రమాలను చర్చించుకోవడంతో పాటు, భవిష్యత్ కార్యచరణపై చర్చ జరిగింది. దానితో పాటు నూతన సారథిని ఎన్నుకోవాల్సి ఉంది. పార్టీ నిబంధనల ప్రకారం ఒక కామ్రేడ్ మూడు పర్యాయాలు కంటే ఎక్కువ సార్లు పార్టీ కార్యదర్శిగా పనిచేయాడానికి వీలు లేదు.
రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. మూడు సార్లు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన నేపధ్యంలో ఇప్పుడు కొత్త కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ఇదే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో విభేదాలను, పదవిపై ఉన్న మోజు తో పాటు, పార్టీ నాయకత్వంపై క్యాడర్ మధ్య ఉన్న అంతరాలను బయటపెట్టింది.
మహాసభ చివరిరోజు గందరగోళానికి గురైంది. రామకృష్ణ తరువాత రాష్ట్ర సీపీఐ కార్యదర్శిగా పార్టీ సీనియర్ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఉండాంటూ ప్రస్తుత కార్యదర్శి రామకృష్ణ ప్రతిపాదనలు పెట్టారు. అయితే పార్టీ నిబంధల ప్రకారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి ఎవరైన పోటీ పడవోచ్చు. దాంతో ముప్పాళ్ల పేరు ప్రతిపాదించగానే మరో లీడర్ ఈశ్వరయ్య తాను కార్యదర్శి స్ధానానికి పోటీగా ఉంటానని చెప్పడంతో ఒక్కసారిగా పార్టీ లీడర్స్ అవ్వాకయ్యారు. అయితే అప్పటికే ఈశ్వరయ్య కార్యదర్శి అవుతారని మహాసభకి హాజరైన ప్రతినిధులు భావించారంట.
అయితే రామకృష్ణ ముప్పాళ పేరు తెరమీదకు తీసుకురావడంతో ఈశ్వరయ్య పోటీకి రావడం, ప్రజాస్వామ్య యుతంగా పోటీ పెట్టాలని కోరడంతో చేసేది ఏం లేక ఈశ్వరయ్య ను సమూదాయించే పనికి పార్టీ లీడర్స్ దిగారు. ముప్పాళ వయస్సులో పెద్దవారు.
పార్టీ నిబంధన ప్రకారం 75ఏళ్లు వరకు మాత్రమే పార్టీ రాష్ట్ర పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. ఈ ఒక్క సారి ముప్పాళ నాగేశ్వరరావుకి అవకాశం ఇద్దాం.. తరువాత నువ్వు సెక్రటరీ అవ్వవచ్చు అంటూ ఈశ్వరయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారంట. ప్రజాస్వాయ్యపద్దతిలో ఎన్నిక జరగాలి, తాను పోటీలో ఉంటానని ఈశ్వరయ్య తెగేసి చెప్పడంతో కార్యదర్శి పదవి తరువాత చూద్దాం అంటూ ఎన్నిక వాయిదా వేయాల్సి వచ్చింది.
మరోపక్క ఈశ్వరయ్య అనుచర వర్గం కూడా ఓటింగ్ పెట్టాలని ఓటింగ్ నిర్వహిస్తే ఈశ్వరయ్యే గెలిచే అవకాశం ఉందని డిమాండ్ చేశారంట. అదే కనుక జరిగితే ప్రస్తుత సెక్రటరీగా ఉన్న రామకృష్ణ ప్రతిపాదన వీగిపోతే పరువు పోతుందని భావించిన సిపిఐ ఆగ్రనాయకత్వం కార్యదర్శి ఎన్నికలను వాయిదా వేసిందంటున్నారు. ఇప్పటి వరకు ఇటువంటి పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ సీపీఐ చరిత్రలో లేదంటున్నారు సీనియర్ నాయకులు. క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ లీడర్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని, దాని ప్రభావం కారణంగానే ముప్పాళ పేరు తెరమీదకు వచ్చిందనే అభిప్రాయం కూడా కొంతమంది క్యాడర్ వ్యక్తం చేస్తోంది.
బీసీ వర్గానికి చెందిన ఈశ్వరయ్యకు పదవి వస్తుందనే కారణంతోతే వాయిదా వేశారనే వాదన వినిపిస్తుంది. ఒంగోలులో జరిగిన మహసభలో ఆ జిల్లా క్యాడర్ కూడా పార్టీ అగ్రనాయకత్వం చెప్పిన దానికి వ్యతిరేకంగా నినదించడంతో పార్టీ చరిత్రలో ఒంగోలు సభ నిలిచిపోతుందని, ఇటువంటి మహసభ ఇప్పటివరకు చూడలేదంటూ నాయకత్వం కూడా అసహనం వ్యక్తం చేసిందంట.
కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో దాదాపు 10 మంది జిల్లా కార్యదర్శులు ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి ప్రతిపాదనను వ్యతిరేకించారంటే నాయకత్వానికి క్యాడర్‌కి మధ్య దూరం ఏవిధంగా పెరుగుతుందో అర్థమవుతుందని సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కమ్యూనిస్టుల్లో కూడా అంతర్గత కుమ్ములాటల ఇప్పుడు బహిర్గతం అవుతుండటం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.. పదవీ కాంక్షకు కమ్యూనిస్టులు కూడా అతీతులు కాదన్న విమర్శలు వస్తున్నాయి.