కొందరు నేతల వల్లే తెలంగాణ బీజేపీలో సంక్షోభం.. మరోసారి కమలం పార్టీపై రాజాసింగ్ ఫైర్
posted on Aug 30, 2025 @ 11:09AM
రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ మాజీ నాయకుడు. బీజేపీ టికెట్ పై గోషామహల్ నుంచి విజయం సాధించినా, పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుతో అసహనానికి గురై పార్టీకి రాజీనామా చేసేశారు. ఎమ్మెల్యే గా కావాలంటే అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ను పార్టీ రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి కోరాలని సవాల్ చేశారు. జంటనగరాలకు ఇంత కాలం బీజేపీ ఫేస్ గా గుర్తింపు పొందిన రాజాసింగ్ కమల బంధనాలను తెంచుకుని బయటకు వచ్చిన తరువాత తాను గతంలో ఎన్నడూ లేనంత స్వేచ్ఛగా తన భావాలను, అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతున్నాన్నారు.
తాజాగా ఆయన తెలంగాణ బీజేపీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోవడానికి రాష్ట్రంలోని కొందరు కమలం నాయకుల తీరే కారణమని విమర్శించారు. తాను ఇప్పుడు బీజేపీలో లేనని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు ఏ విషయంపైనైనా స్వేచ్ఛగా మాట్లాడగలనన్నారు. తెలంగాణలో బీజేపీని కొందరు నాయకులు సంక్షోభంలోకి నెట్టే స్తున్నారని ఫైర్ అయ్యారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటీవల చేసిన ప్రకటనలను ప్రస్తావిస్తూ.. ఇది ఇక్కడితో ఆగదనీ, రాబోయే రోజుల్లో మరింత మంది తెలంగాణ బీజేపీ నేతలు మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసే అవకాశం లేకపోలేదన్నారు.
తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ నాయకులు పదవులు పోతాయన్న భయంతో మౌనం వహిస్తు న్నారన్న రాజా సింగ్, రాష్ట్ర నాయకత్వ నిర్ణయాల కారణంగా నే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని జారవిడు చుకుందన్నారు. పార్టీ బాస్‌ల అనుమతి కోసం వేచి ఉండకుండా అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలను లేవనెత్తే స్వేచ్ఛ తనకు ఇప్పుడు ఉందనీ, గతంలో అంటే తాను బీజేపీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో గళ మెత్తే అవకాశం ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ బిజెపిలోని అంతర్గత సమస్యలను కూడా బయటపెడతానన్నారు.