గర్భిణులు పొగతాగితే తరతరాలకూ ప్రమాదం..

  మహిళలు పొగతాగితే ప్రమాదమని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. తాజాగా ఓ పరిశోధన గర్భిణులు పొగత్రాగితే వారికి పుట్టే పిల్లలతో పాటు, వారి పిల్లలకు పుట్టే పిల్లలకు కూడా హాని జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలు గర్భంలో ఉన్న సమయంలో పొగత్రాగితే కచ్చితంగా వారి మనవళ్ళు, మనవరాళ్ళ జీవితంపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు ఎముకలు, కండరాలు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశ: ఉందని తెలిపారు. మగ పిల్లలు యవ్వన దశలో వారి కండరాలు పెరగాల్సిన దానికంటే మరింత ఎక్కువ పెరిగి దుష్రభావాలు బయటపడతాయని, అదే అమ్మాయిలైతే పెరగాల్సిన ఎత్తుతో పాటు, బరువులో తీవ్రమైన వ్యత్యాసం వస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

చంద్రబాబు, ఎన్టీఆర్ సూపర్: కేసీఆర్ ప్రశంస

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, హీరో జూనియర్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి పొగిడారు. కేసీఆర్ మరొకరిని పొగడ్డమేంటి... పైగా చంద్రబాబుని పొగడ్డమేంటని అనుకుంటున్నారా? ఇది నిజంగానే నిజం. కేసీఆర్ వీరిద్దరినీ పొగిడింది సమగ్ర సర్వే విషయంలో! చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్కు చెందినవారైనా సమగ్ర సర్వేలో పాల్గొన్నారని కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులకు వివరాలు అందజేశారని కేసీఆర్ ప్రశంసించారు. అయితే సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన వారిని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో నివసిస్తూ.. తాగునీరు, లైట్లు, రోడ్లు తదితర ప్రభుత్వ సౌకర్యాలను వాడుకుంటూ సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించడం సామాజిక నేరమని విమర్శించారు. తెలంగాణలో అతిథులుగా, టూరిస్టులుగా ఉండాలని భావిస్తున్నవారే సర్వేలో పాల్గొనలేదని కేసీఆర్ చురకలు వేశారు. ఈ చురకలు సర్వేలో వివరాలు నమోదు చేయించుకోని పవన్ కల్యాణ్, విజయశాంతి ఉద్దేశించి వేసినవేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్రం కన్ను: పీటీఐ

  తెలంగాణ ప్రభుత్వంపై నిర్వహించిన సమగ్ర సర్వే మీద కేంద్ర ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించిందని ప్రముఖ వార్తాసంస్థ పీటీఐ ఓ కథనాన్ని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని కుటుంబాల వివరాల జాబితాను కేంద్రం అడిగి తెలుసుకునే అవకాశం ఉందని పీటీఐ తన కథనంలో పేర్కొంది. తెలంగాణ సమగ్ర సర్వే అంశంలో అవసరమైతే కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా జోక్యం చేసుకోబోతున్నట్టు ఆ కథనంలో పీటీఐ వెల్లడించింది. సీమాంధ్ర ప్రజల్లో సమగ్ర సర్వే అనేక సందేహాలను రేకేత్తిస్తున్న నేపథ్యంలో అవసరమైతే జోక్యం చేసుకుంటామని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపినట్టు పీటీఐ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి టెన్షన్ సృష్టించే అవకాశం లేదని కేంద్ర ఆధికారులు ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

మా ఇంటికి ఎన్యూమరేటర్ రాలేదు... ఇదేం సర్వే?

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే మీద బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి విమర్శలు సంధించారు... అవి..   1. మా ఇంటికి ఎన్యూమరేటర్ రాలేదు. మా కుటుంబ వివరాలు నమోదు చేసుకోలేదు. ఇదేం సర్వే?   2. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో సర్వే చేస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టలేదు.   3. ప్రభుత్వ లక్ష్యమేంటో అర్థం కాని సర్వే ఇది.   4. పారిశ్రామికవాడల్లో నివసిస్తున్న వారి వివరాలను సేకరించలేదు. హైదరాబాద్‌లో అద్దెకి వుంటున్న వారి వివరాలు కూడా తీసుకోలేదు.   5. సమగ్ర కుటుంబ సర్వే పత్రాలను ఓల్డ్ సిటీలో అమ్ముతున్నారు. ఈ విషయాన్ని నేను నిరూపించడానికి సిద్ధం.   6. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పిచ్చి పనులతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుంది?

సమగ్ర సర్వే సూపర్‌హిట్: కేసీఆర్

  తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సూపర్ హిట్ అయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా సర్వే జరిగిందని భవిష్యత్తులో ఈ మార్గాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తాయని ఆయన అన్నారు. సర్వేని విజయవంతం చేసిన ఉద్యోగులకు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో వున్న తెలంగాణ ప్రజలు కూడా వచ్చి సమగ్ర సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. ప్రజలు తనకు ఇలాగే సహకరిస్తే వారు కోరుకున్న బంగారు తెలంగాణను వారికి అందిస్తానని కేసీఆర్ అన్నారు. జిల్లాలలో 94 శాతం, హైదరాబాద్లో 88 శాతం సర్వే పూర్తయిందని, మొత్తమ్మీద హైదరాబాద్‌లో కోటి 20 లక్షల మంది వున్నట్టు తేలిందని ఆయన చెప్పారు. సర్వే ద్వారా సేకరించిన వివరాలు ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎవరైనా తన కుటుంబాల పేర్లు నమోదు చేసుకోలేకపోతే, వారికి మరో అవకాశం ఇస్తారని, ఆ వివరాలు రేపు తెలియజేస్తారని చెప్పారు.

విజయవాడ తాత్కాలికం శాశ్వతం కాదు...

  విజయవాడ తాత్కాలిక రాజధాని అని, కొంతకాలం తర్వాత విజయవాడ పూర్తి స్థాయి రాజధాని అవ్వొచ్చు, కాకపోవచ్చని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. అక్కడ భూముల ధరలు పెరిగితే వేరే చోటుకు తరలిపోయే అవకాశం ఉందన్నారు. విజయవాడ చాలా ఇరుకైన నగరమని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దని తాను అనలేదని చెప్పారు. విజయవాడలో ప్రభుత్వ భూములు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయని, మొత్తం 500 ఎకరాలలోపే భూమి అందుబాటులో ఉందన్నారు. కర్నూలుకు 10 కిలోమీటర్ల పరిధిలో 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఇతర ఏ జిల్లా కేంద్రంలోనూ ఇంత భూమి అందుబాటులో లేదని ఆయన తెలిపారు. కర్నూలును రాజధాని చేయాలని తాను అడగటం లేదన్నారు. రాజధానిపై కసరత్తు పూర్తి అయ్యేందుకు ఏడాది సమయం పడుతుందని కె.ఇ.చెప్పారు.

పాకిస్థాన్‌తో మాటల్లేవ్...

  ఈనెల 25న భారత్, పాకిస్థాన్‌ల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు జరుగనున్నాయి. అయితే కాశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేతలతో భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సంప్రదింపులు జరపడం ఈ చర్చలకు విఘాతం కలిగించింది. హురియత్ నేతలతో పాకిస్థాన్ సంప్రదింపులు జరపడం మీద భారత్ సీరియస్ అయింది. దాంతో పాకిస్థాన్‌తో జరగనున్న విదేశాంగశాఖ కార్యదర్శుల స్థాయి చర్చల నుంచి విరమించుకుంటున్నట్లు తేల్చి చెప్పింది. మీకు ఇండియాతో స్నేహం కావాలా? వేర్పాటువాదులతో అనుబంధం కావాలా అని భారత విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్‌కి ఫోన్ చేసి అడిగినప్పటికీ ఆయన హురియత్ నేత షబ్బీర్ షాతో సమావేశమయ్యారు. భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వేర్పాటువాదులతో సమావేశం కావడం రెచ్చగొట్టే చర్యేనని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో జగన్‌ని రఫ్ఫాడేసిన మంత్రులు...

  ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై చర్చ జరపాలంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న జగన్ పార్టీపై అధికార పక్షం ఫైర్ అయ్యింది. శాంతిభద్రతలపై ప్రభుత్వానికి ఎందుకు లెక్కలేదని.. మనుషుల ప్రాణాలంటే అధికార పార్టీకి లెక్కలేదని వైకాపా చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ని ఏపీ మంత్రులు రఫ్పాడించేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ మారలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజా సమస్యలు జగన్‌కు పట్టడం లేదని ఆయన అన్నారు. అలాగే మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి కూడా జగన్‌ని విమర్శల వర్షంలో తడిపేశారు.

కేసీఆర్ సింగపూర్ టూర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి బయల్దేరి సింగపూర్ పర్యటన కోసం వెళ్తున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ ప్రభుత్వ అధికారులు కూడా సింగపూర్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడానికి కేసీఆర్ సింగపూర్ వెళ్తున్నారు. 22, 23 తేదీలలో ఈ సమ్మేళనం జరగనుంది. కేసీఆర్ 24వ తేదీన తిరిగి వస్తారు. తెలంగాణను అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని కేసీఆర్ చెబుతున్నారు. సింగపూర్ పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. సింగపూర్ పర్యటన ముగిసిన అనంతరం ఆయన మలేసియాకు వెళ్తారు. ఆరు పదులు దాటిన కేసీఆర్ తన జీవితంలో మొదటిసారి విదేశాలకు వెళ్తున్నారు. గతంలో అనేక పదవులు నిర్వహించినప్పటికీ ఆయన ఎప్పుడూ దేశం దాటి వెళ్ళలేదు. మొన్నటి వరకూ ఆయనకు పాస్ పోర్ట్ లేదని, మూడు రోజుల క్రితమే ఆయనకి పాస్ పోర్ట్ వచ్చిందని తెలుస్తోంది.

కేసీఆర్ కుటుంబ సర్వే పూర్తి

  తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా సర్వేలో పాల్గొన్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సర్వే అధికారులకు వివరాలు అందించారు. కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి, పిల్లలు వివరాలు అందించారు. కేసీఆర్ కుటుంబ వివరాలతో పాటు బ్యాంకు అకౌంట్ల వివరాలు తెలిపారు. ఈ సర్వే ప్రజల కోసమేనని అర్హులకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతోనే ఇంత పెద్దఎత్తున సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం కేసీఆర్‌కి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. సర్వేపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఏపీ అసెంబ్లీ.. బుధవారానికి వాయిదా

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు సమావేశాలు కూడా వృధా అయ్యాయి. సభ బుధవారం నాటికి వాయిదా పడింది. మంగళవారం సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు శాంతి భద్రతలపై చర్చకు పట్టుబట్టి ఆందోళన చేశారు. సభను సజావుగా నడపాలని, సంప్రదాయాలను పాటించాలని మంత్రి యనమల కోరినప్పటికీ లాభం లేకుండా పోయింది. శాంతిభద్రతలపై చర్చ కోసం ప్రభుత్వం సమాచారం తెప్పించుకోవలసి వుంటుందని అధికారపక్షం చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిన హత్యల గురించి కూడా చర్చకు సిద్ధమని, పరిటాల రవి హత్య గురించి కూడా చర్చిద్దామని తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకుల మీద ఎదురుదాడికి దిగారు. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాదం, వివాదం ఎంతసేపటికీ తెగకపోవడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీని బుధవారానికి వాయిదా వేశారు.

టీ-సర్వేకి విజయశాంతి నో!

   తెరాసలో చిరకాలం కొనసాగి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి మారిన విజయశాంతి, ఈరోజు తెలంగాణా ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించారు. ఆమె అయిష్టత చూపడంతో ఆమె కుటుంబ వివరాలను సేకరించడానికి వెళ్ళిన అధికారులు వెనుతిరిగారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన సర్వే అధికారులు ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుతిరిగారు. జూ.యన్టీఆర్ మాత్రం సర్వే అధికారులకు పూర్తిగా సహకరించి తన వివరాలను అందజేసారు.జూనియర్ ఎన్టీఆర్ కుమారుడికి సోమవారం నాడే అభయ్ రామ్ అని పేరు పెట్టడంతో ఆ పేరు కూడా నమోదు చేయించారు.

భార్య, తమ్ముడి తలలు నరికి కావడి కట్టాడు...

  తోడబుట్టిన తమ్ముడిని, కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి తలలను ఓ కర్రకి అటూ ఇటూ కావడిలాగా కట్టాడు. తాపీగా 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. రెండు మర్డర్లు చేసినా చాలా కూల్‌గా వున్న అతన్ని చూసి పోలీసులు, జనం హడలిపోయారు. విశాఖపట్నం జిల్లా గొప్పులపాలెంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే, చెదల గుండన్న, జానకమ్మ (36) భార్యాభర్తలు. అయితే జానకమ్మ మూడు రోజుల క్రితం గుండన్న తమ్ముడు నారాయణ (40)తో వెళ్ళిపోయి పొరుగూరిలో కాపురం పెట్టింది. దాంతో ఆగ్రహించిన గుండన్న తమ్ముడు నారాయణ పొలంలో ఉండగా కత్తితో వెళ్లి నరికి చంపాడు. తమ్ముడి తలను మూటగట్టుకునిభార్య జానకమ్మ వద్దకు వెళ్లాడు. ఆమెను కూడా హతమార్చి ఆమె తలను కూడా శరీరం నుంచి వేరు చేసి, రెండు శిరస్సులనూ కావడి కట్టి 20 కిలోమీటర్ల దూరంలో పాడేరులోగల హుకుంపేట పోలీస్ స్టేషన్ వరకూ తాపీగా నడుచుకుంటూ వెళ్ళి లొంగిపోయాడు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ కాదు... ఎన్టీఆర్ ఆరోగ్య సేవ

  రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం పేరు మారింది. పేరు మారడంతోపాటు తీరు కూడా మారనుంది. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట వున్న పథకాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా మారుస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆరోగ్య శ్రీలో 100 జబ్బులను అదనంగా చేరుస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్‌ ఛార్జీలను పెంచే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో బయోమెట్రిక్‌, ట్రాకింగ్‌ విధానంపెడతామని మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు.

ఢిల్లీ ఫైవ్‌స్టార్ హోటల్లో నర్స్ మీద గ్యాంగ్ రేప్

  దేశ రాజధాని ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో గల ఓ గదిలో ఒక నర్సుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ దారుణం జరిగింది. అనారోగ్యంతో ఉన్న ఒక మహిళకు సపర్యలు చేయడానికి ఈ నర్సును నియమించారు. అయితే.. సదరు పేషెంట్‌కి సహాయకులుగా వచ్చిన నీరజ్, రాజన్ అనే ఇద్దరు యువకులు ఆ నర్సుపై అఘాయిత్యం చేశారు. అత్యాచారానికి గురైన నర్సు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే.. నిందితులు ఆమెపై మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు. ఉద్యోగం పీకేస్తామని వాళ్లు బెదిరించి, ఒకరి తర్వాత ఒకరుగా పలుమార్లు అత్యాచారం చేసినట్లు అత్యాచారానికి గురైన నర్సు తన ఫిర్యాదులో పేర్కొంది.

అల్లు అర్జున్ తాగి డ్రైవ్ చేశాడా? తప్పుడు ప్రచారం చేశారా?

  కథానాయకుడు అల్లు అర్జున్ తప్పతాగి వెహికల్ డ్రైవ్ చేశాడని, పోలీసులు అల్లు అర్జున్‌ని పట్టుకుని, ఆ తర్వాత లోపాయకారీ ఒప్పందంతో వదిలిపెట్టేశారన్న వార్తలు వినిపించాయి. ఇలాంటి వార్తల పట్ల అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి, అసలేం జరిగిందో వివరణ ఇచ్చారు. ‘‘అర్ధరాత్రి సమయంలో నేను నా వెహికల్ డ్రైవ్ చేస్తూ వస్తుండగా పోలీసులు ఆపారు. నన్ను బ్రీత్ అనలైజర్ ఊదమన్నారు. అయితే మీడియా ముందు అలా ఊదడం ఇబ్బందిగా అనిపించి నేను ఆ విషయాన్ని పోలీసులకు తెలిపాను. పోలీసులు నన్ను మీడియా ముందు నుంచి పక్కకి తీసుకెళ్ళి బ్రీత్ అనలైజ్ పరీక్ష చేశారు. ఆ పరీక్షలో నేను తాగలేదని తెలియడంతో నన్ను వెళ్ళిపొమ్మన్నారు. ఆ సమయంలో నేను తాగి వున్నటయితే పోలీసులు వదిలిపెట్టేవారే కాదు. అయితే పలు వెబ్‌సైట్లలో నేను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయానని వార్తలు రాసి, వీడియోలు పెట్టడం దారుణం. నేను తాగిడ్రైవ్ చేయను. ఒకవేళ మద్యం సేవిస్తే నడుచుకుంటూనో, ఆటోలోనో వెళ్తాను. లేదా ఎవర్నయినా డ్రాప్ చేయమని అడుగుతాను’’ అని అల్లు అర్జున్ అన్నారు.