‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ రూపకర్త ‌మృతి

  ఈమధ్య కాలంలో ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ అనే విరాళాల సేకరణ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం, ఆదరణ పొందుతోంది. తాజాగా హాలీవుడ్, బాలీవుడ్ తాలతోపాటు దక్షిణాదికి చెందిన తారలు కూడా ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా అక్షయ్ కుమార్, హన్సిక తదితరులు కూడా పాల్గొన్నారు. అయితే విషాదమేమిటంటే, ఇంత ఆదరణ పొందుతున్న ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ రూపకర్త కోరె గ్రిఫిన్ ఆగస్టు 16న మసాచుసెట్స్ లోని నాంటుకెట్ సముద్ర తీరంలో జరిగిన ఒక ప్రమాదంలో సముద్రంలో మునిగి చనిపోయారు. డైవింగ్ చేస్తుండగా సముద్రంలో మునిగి ఆయన చనిపోయారు. గ్రిఫిన్ వయసు కేవలం 27 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులోనేప్రపంచ వ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న ఆయన అనుకోని ప్రమాదంలో చనిపోవడం విషాదం. గురువారం నాడు ఆయన సంస్మరణ సభ జరిగింది. కపాలానికి సంబంధించిన తన స్నేహితుడి సహాయార్థం గ్రిఫిన్ ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ కార్యక్రమాన్ని రూపొందించాడు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం ఆన్లైన్ లో హల్ చల్ చేస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’లో పాల్గొంటున్నారు. తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు.

ఏపీ వ్యవసాయ బడ్జెట్ విశేషాలు...

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మొట్టమొదటి వ్యవసాయ బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 14 వేల కోట్ల రూపాయలతో ఈ వ్యవసాయ బడ్జెట్‌‌ రూపొందించారు. వ్యవసాయ బడ్జెట్‌లో విశేషాలు... * జాతీయ వ్యవసాయ విస్తరణ సాంకేతిక మిషన్‌కు 62 కోట్లు. * జాతీయ ఆహారభద్రతా మిషన్‌లో ముతకధాన్యాలు, వాణిజ్యపంటల చేర్పు. * జాతీయ నూనెగింజలు, ఆయిల్‌ఫాం మిషన్లకు 59 కోట్లు. * రాష్ట్రీయ కృషి వికాస్‌యోజన పథకం ద్వారా అనుబంధ శాఖలకు కేంద్ర ప్రభుత్వం నుంచి 230 కోట్లు. * వర్షాధార ప్రాంతాల అభివృద్ధి కోసం 169 కోట్లు. * ఏపీలో ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం, 50 కోట్లు కేటాయింపు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 192 కోట్లు కేటాయింపు. * వాటర్ మేనేజ్‌మెంట్, బిందుసేద్యానికి 348 కోట్లు. * వైఎస్ఆర్ హార్టీకల్చర్ వర్సిటీకి కేంద్రం నుంచి 30 కోట్లు. * పట్టుపరిశ్రమకు 122 కోట్లు. * పశుసంవర్ధక శాఖకు 723 కోట్లు. * మత్స్యశాఖకు 60 కోట్లు. * ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి 112 కోట్లు. * సహకార శాఖకు 156 కోట్లు. * రైతులకు 7 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌. 9 గంటలు పెంచేందుకు కృషి. * ఉచిత విద్యుత్‌కు 3188 కోట్లు.

కత్తులతో కాదు.. కమలాపళ్ళతో చంపేశారు...

  తియ్యగా, మృదువుగా వుండే కమలా ఫలాలని మనం ప్రశాంతంగా ఒలుచుకుని తింటాం. అవసరం అనుకుంటే జ్యూస్ తీసుకుని తాగుతాం. ఓ సినిమా దర్శకుడయితే కమలాపళ్ళని హీరోయిన్ బొడ్డుమీద లాఘవంగా విసిరి ప్రేక్షకులను మెప్పిస్తాడు. అయితే కొంతమంది వ్యక్తులు కమలాపళ్ళని మర్డర్ చేయడానికి ఉపయోగించారు. ఒక వ్యక్తిని కమలాపళ్ళతో కొట్టి చంపారు. దక్షిణాఫ్రికాలోని గ్రామీణ ప్రాంతంలో ఈ విచిత్రమైన హత్య జరిగింది. దక్షిణాఫ్రికాలోని కమలాపళ్ళ తోటల్లో కాయలు సేకరించే కూలీల మధ్య గొడవ జరిగింది. ఇద్దరు కూలీలు తమకు గిట్టని మరో కూలీని కమలాపళ్ళతో కొట్టి మరీ చంపేశారు. కమలాపళ్ళ గుట్ట పక్కనే ఇద్దరూ నిల్చుని ఎదురుగా వున్న వ్యక్తి మీద వరసబెట్టి విసిరారు. దాంతో ఆ వ్యవసాయ కూలీ అక్కడికక్కడే చనిపోయాడు.

యు.పి.లో మరో గ్యాంగ్ రేప్

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అత్యాచార ఘటన జరిగింది. ఓ మహిళ మీద పది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఓ దళిత కుటుంబం వ్యవసాయ పనులు ముగించుకుని వస్తుండగా పొదల్లో దాక్కొని ఉన్న పది మంది దుండగులు వారిపై ఒక్కసారిగా దాడి చేశారు. ప్రతిఘటించిన ఆ మహిళ భర్త, కుమారుడిని చెట్టుకు కట్టేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన వారిని మహిళ కుటుంబం గుర్తించింది. ఆ పది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలల్లో ఆమె అత్యాచారానికి గురైనట్లు వెల్లడయింది. నిందితుల కోసం గాలిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర జంతువు ‘అడవి దున్న’

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా ‘రాష్ట్ర జంతువు’ని తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్ర జంతువుగా ‘అడవి దున్న’ (ఇండియన్ బైపన్) ఎంపికైంది. అడవి దున్నను ఖరారు చేస్తూ దీనికి సంబంధించిన ఫైలు మీద తెలంగాణ అటవీ, పర్యావరణ మంత్రి ఫైలు మీద సంతకం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపించారు. సింగపూర్ పర్యటన నుంచి కేసీఆర్ తిరిగిరాగానే ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పేస్తే ఇక నుంచి అడవిదున్న తెలంగాణ రాష్ట్ర జంతువు హోదాని పొందుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట (ఇండియన్ రోలర్)ని ఖరారు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర చెట్టుగా ఇప్పచెట్టును, రాష్ట్ర పుష్పంగా మోదుగుపువ్వును ఎంపిక చేశారు.

నోరు పారేసుకోవద్దు.. కేసీఆర్‌కి పవన్ సూచన

  సూచన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సమయంలో పవన్ కళ్యాణ్ ఇంట్లో లేని విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సర్వేలో పాల్గొనలేదన్న విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పవన్ కళ్యాణ్ మీద వెటకారంగా కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో టూరిస్టులా వుంటాడేమోనని వ్యంగ్యంగా మాట్లాడారు. దానికి పవన్ కళ్యాణ్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. ‘‘సమగ్ర సర్వే జరిగిన రోజు నేను హైదరాబాద్‌లో లేను. పైగా సమగ్ర కుటుంబ సర్వే ఐచ్ఛికమని, ఇష్టంలేనివాళ్ళు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు చెప్పింది. సర్వే ఐచ్ఛికమని నేను సర్వేలో పాల్గొనలేదు. ఆమాత్రం దానికే కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడటం బాధాకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ విద్వేష పూరితంగా మాట్లాడడం సమంజసం కాదు. బాధ్యత కలిగిన నాయకులు నోరు పారేసుకోవడం మంచిది కాదు.. పదే పదే విద్వేషాలు రెచ్చగొడితే సమాజంలో అశాంతి ఏర్పడుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్న విషయాన్ని తెలుసుకుని ఎవరైనా మాట్లాడాలి’’ అన్నారు.

చంద్రబాబుతో అమిత్ షా సమావేశం...

  భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. అమిత్ షా తన పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని తమ మిత్రపక్షాల నాయకులను కలుస్తున్నారు. గురువారం ఆయనని పవన్ కళ్యాణ్ కలిశారు. శుక్రవారం నాడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు నాయుడితో అమిత్ షా ప్రత్యేకంగా భేటి అయ్యారు. వీరిరువురూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అమిత్‌ షాతోపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడిని కలిశారు.

అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ

  హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన భారతీయ జనతాపార్టీ జాతీయ అమిత్‌ షాతో పవన్‌ కళ్యాణ్ భేటీ అయ్యారు. షాను పవన్ బేగంపేటలోని టూరిజం హోటల్‌లో గురువారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి బిజెపి, జనసేన మధ్య రహస్యమైన అవగాహన కుదిరిందని తెలుస్తోంది. మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయడంపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పవన్‌ కళ్యాణ్‌ సేవలను వినియోగించుకోవాలని బిజెపి, టిడిపి భావిస్తున్నాయి. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలలో జనసేన కూడా పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలించారని తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ రెండు రాష్ట్రాలకు సంబంధించి బిజెపి, జనసే మధ్య ఒక ప్రతిపాదన వచ్చిందన్నారు. ఆ ప్రతిపాదన ఏమిటో ఇప్పుడే చెప్పనన్నారు. 

లవర్లకి, భార్యలకి ‘టూర్’లలో నో ఎంట్రీ

  ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఘోర వైఫల్యానికి ప్రధాన కారణం టూర్ సందర్భంగా విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మతో ప్రేమ కలాపాలు నడపటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టూర్‌కి తనతోపాటు అనుష్క శర్మ కూడా వచ్చేలా విరాట్ కోహ్లీ బీసీసీఐ నుంచి అధికారికంగా అనుమతి తీసుకున్నాడు. సాధారణంగా ఇలాంటి అనుమతి క్రికెటర్ల భార్యలకు మాత్రమే ఇస్తారు. విరాట్ కోహ్లీ ప్రియురాలికి కూడా అధికారికంగా అనుమతి ఇవ్వడంపై దుమారం రేగింది. దాంతో కళ్ళు తెరిచిన బీసీసీఐ టూర్లకు వెళ్ళే క్రీడాకారులు తమ వెంట లవర్లని కాదు కదా, సొంత భార్యలని కూడా తీసుకుని వెళ్ళకూడదని బీసీసీఐ నిబంధన విధించింది.

తెలంగాణ రాష్ట్రం న్యాయమైన ఆకాంక్ష.. అందుకే మద్దతు...

  ‘ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజల న్యాయమైన కోరిక అందుకే భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. హైదరాబాద్ వచ్చిన ఆయన ఒక బహిరంగ సభలో షా ప్రసంగించారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను బీజేపీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విభజించిందని, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో మాత్రం యుపీఏ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని ఆయన అన్నారు. తెలంగాణ అమరవీరులకు అమిత్ షా బీజేపీ తరఫున ఘన నివాళులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నిజాంను తరిమికొట్టిన ఘనత పటేల్‌దేనని, పటేల్ లేకుంటే భారత్‌లో హైదరాబాద్ విలీనం అయ్యేదికాదని అమిత్ షా అన్నారు. సర్దార్ పటేల్ లక్ష్యాన్ని నరేంద్ర మోడీ పూర్తి చేస్తారన్న ఆశాభావాన్ని షా వ్యక్తం చేశారు.

‘నీగ్రో’ అన్నాను.. అయాం వెరీ సారీ... గోవా సీఎం

  గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తాను ‘నీగ్రో’ అనే పదాన్ని ఉపయోగించినందుకు అసెంబ్లీలో క్షమాపణలు చెప్పారు. సాధారణంగా ఆఫ్రికన్ జాతీయులను ‘నీగ్రో’ అని పిలవడం అమర్యాదకరం.. వారిని ‘బ్లాక్స్’ అనాలి. గోవా ముఖ్యమంత్రి గోవా అసెంబ్లీలో గోవా ప్రభుత్వం అదుపులో వున్న విదేశీయుల గురించి వివరిస్తూ, ఓ గుర్తు తెలియని ఆఫ్రికన్ నీగ్రో వ్యక్తిని కలాంగుటే గ్రామం వద్ద అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు చేశాయి. ‘నీగ్రో’ అనే పదం జాతి వివక్ష కిందికి వస్తుందని మండిపడ్డాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దీనిపై స్పందిస్తూ... ఇలాంటి పదాల వాడకంతో విదేశీ యాత్రికులకు ప్రతికూల సందేశాలు వెళతాయంది. దీనిపై సీఎం పారికర్ వివరణ ఇస్తూ.. ఇది పోలీస్ డిపార్ట్‌మెంటు తప్పిదమని, ఆ విభాగంలోని ఓ క్లర్కు సదరు ఫైల్లో నీగ్రో అని పేర్కొన్నాడని తెలిపారు. అయినప్పటికీ నీగ్రో అనే పదం ఉపయోగించినందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని మనోహర్ పారికర్ అన్నారు.

పరమ డొక్కు ఆటో... 3 కిలోల బంగారు బిస్కెట్లు

  బెంగుళూరు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అటుగా వచ్చిన ఓ డొక్కు ఆటోని ఆపారు. ఆటోని తనిఖీ చేసిన పోలీసులు ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు. కారణం, ఆ ఆలోలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కిలోల బంగారు బిస్కెట్లు వున్నాయి మరి. బెంగళూరు నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బిస్కట్ల రూపంలో ఉన్న బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు ఈ సందర్భంగా కనుగొన్నారు. ఆటోలో వున్న కోయంబత్తూరుకు చెందిన నటరాజ్, బాల, రాంకుమార్ల వద్ద ఉన్న సూట్‌కేసులో మూడు కిలోల బంగారు బిస్కట్లు, 42 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించి వారి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. పోలీసులు, ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.

హైదరాబాద్‌లో బీజేపీ అమిత్ షా సందడి

  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాయతీయ విమానాశ్రయంలో అమిత్ షాకి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించిన బీజేపీ నాయకులతో ఆయన చర్చలు జరిపారు. ఈ భేటీలో ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి చర్చలు జరిపారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని, దీనికి సంబంధించిన నేతలకు దిశ నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. కాగా, అమిత్ ‌షా సమక్షంలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ భారతీయ జనతాపార్టీలో చేరారు.

మెదక్ లోక్‌సభ స్థానం నుంచి జగ్గారెడ్డి?

  మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి జగ్గారెడ్డి సిద్ధపడుతున్నారని తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎదురొడ్డి నిలబడగల నాయకుడు జగ్గారెడ్డేనని కాంగ్రెస్ అధిష్టానం భావించడం వల్ల మెదక్ టిక్కట్ ఆయనకే దక్కే అవకాశం వుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక మెదక్ లోకసభ సీటు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను పోటీకి దించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.