సెప్టెంబర్ 13న మెదక్ ఉప ఎన్నిక

  మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 13న మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈనెల 20న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈనెల 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 30 వరకు గడువు ఇస్తారు. మొత్తమ్మీద మెదక్ లోక్ సభ స్థానానికి సెప్టెంబర్ 13న పోలింగ్ జరుగుతుంది. 16న కౌంటింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాన్ని వెల్లడిస్తారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఇటీవల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతూ, మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. అందువల్ల ఇప్పుడీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది. మెదక్ లోక్ సభ స్థానంతోపాటు దేశంలోని 9 రాష్ర్టాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

టీడీపీలోకి ఆనం వివేకానందరెడ్డి?

  నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో కాస్తంత నోరున్న, ప్రజల్లో బలమున్న నాయకుడు ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో గెలిచే అవకాశం వున్న నాయకుడు అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో వున్న పాపానికి ఆనం వివేకానందరెడ్డి ఓడిపోవాల్సి వచ్చింది. అయితే రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఘోర తప్పిదం చేసిందని ఆయన భయపడకుండా విమర్శిస్తూ వుంటారు. మొన్నీమధ్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏదో ఉద్యమం చేద్దామని పిలుపు ఇస్తే, ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెస్ నాయకులకు తన మాటలతో తలంటు పోశారు. ప్రజలకు పనికొచ్చే పనులు చేయండిగానీ, రాజకీయాల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయొద్దని ఆయన ఘాటుగా అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని శనివారం నాడు కలిశారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలసి ఆయన చంద్రబాబును కలిశారు. దీంతో ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

రేపు ఏపీ, టీఎస్ సీఎంల కీలక మీటింగ్

  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలనూ గవర్నర్ నరసింహన్ పక్కన కూర్చోబెట్టుకున్న గవర్నర్ ఇద్దరు సీఎంలూ పరస్పరం సహకరించుకోవాలని కోరిన విషయమూ తెలిసిందే. గవర్నర్ విజ్ఞప్తికి ఇద్దరు ముఖ్యమంత్రులూ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదివారం నాడు భేటీ అవుతున్నారని సమాచారం. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ గవర్నర్ నరసింహన్ సమక్షంలో భేటీ అవుతారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, చీఫ్ సెక్రటరీలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల గురించి చర్చిస్తారు. ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు.

పాకిస్థాన్‌లో పరిస్థితి ఘోరం...

  మనం స్వాతంత్ర్య దినోత్సవం ప్రశాంతంగా చేసుకున్నాం. పాపం పాకిస్థాన్ పరిస్థితే ఘోరంగా వుంది. ఆగస్టు 14న ఉద్రిక్తతల మధ్యే అక్కడ స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. 15వ తేదీకి ఆ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ర్యాలీలు ఊపందుకున్నాయి. తాహిరుల్ ఖాద్రి అనే మత గురువు ఇచ్చిన పిలుపు మేరకు ఆయనకి చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) అనే సంస్థకి చెందిన కార్యకర్తలు ఇస్లామాబాద్‌లో నానా హడావిడీ చేస్తున్నారు. ఇప్పుడు ఇస్లామాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఒకపక్క పీటీఐ ఉద్యమకారులు, మరోపక్క సైన్యం.. వీళ్ళ మధ్యలో బిక్కుబిక్కుమంటున్న సామాన్య జనం. రిగ్గింగ్ చేసి గెలిచిన నవాజ్ షరీఫ్ రాజీనామా చేసేవరకు తమ ఉద్యమం ఆగదని పీటీఐ కార్యకర్తలు అంటుంటే, వాళ్ళని అణిచేస్తామని మిటలరీ అంటోంది. ఇదిలా వుంటే, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్‌ వాహనంపై గుజ్రన్‌వాలా సిటీలో అధికార పీఎంఎల్‌ -ఎన్‌ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అధికార పార్టీ కార్యకర్తలు తనను హతమార్చేందుకు తన వాహనంపై కాల్పులు కూడా జరిపారని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. అయితే ప్రస్తుతం ఉన్న పౌర ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఎవరూ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడరాదని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాల జారీ చేసింది. అలాంటి చర్యలకు పాల్పడితే దేశ ద్రోహం అవుతుందని తెలిపింది.

ఏపీ, టీఎస్ స్పీకర్లకు గవర్నర్ హితబోధ

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్రాల స్పీకర్లతో భేటీ అయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ విందు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు శివప్రసాదరావు, మధుసూధనాచారి హాజరయ్యారు. విందు ముగిసిన తర్వాత ఇద్దరు స్పీకర్లూ తిరిగి వెళ్ళే సమయంలో గవర్నర్ నరసింహన్ ఇద్దరు స్పీకర్ల చేతులు పట్టుకుని ఇద్దరూ కలసి పనిచేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇద్దరూ తనకు రెండు కళ్ళు లాంటివాళ్ళని, ఇద్దరూ కలసి పనిచేస్తే అందరికీ బాగుంటుందని గవర్నర్ ఈ సందర్భంగా అన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు స్పీకర్లూ ఎదుటి పక్షంతో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను గవర్నర్ ముందు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ వారిద్దరినీ అనునయించారు. మొత్తమ్మీద ఇద్దరు స్పీకర్లూ కలసి పనిచేయడానికి కృషి చేస్తామని గవర్నర్‌ నరసింహన్‌కి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

క్రిమినల్... కాల్చిపారేశారు!!

  హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్ దగ్గర ఒక క్రిమినల్ని పోలీసులు కాల్చి చంపేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన శివకుమార్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక దొంగతనాలు చేసిన గజదొంగ. ఇతని మీద 300 పైగా చైన్ స్నాచింగ్ కేసులున్నాయి. ఇతని కోసం పోలీసులు ఎంతోకాలంగా వెతుకుతున్నారు. శుక్రవారం రాత్రి ఔటర్ రింగ్‌రోడ్ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ వుండగా అక్కడకు బైక్ మీద వచ్చిన శివకుమార్ పోలీసుల మీద దాడి చేశాడు. ఒక ఇన్‌స్పెక్టర్‌ని కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. దాంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం శివకుమార్ మీద కాల్పులు జరపగా అతను అక్కడికక్కడే మరణించాడు. నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం ఆర్మేనిపాడు గ్రామానికి చెందిన శివ చైన్‌ స్నాచింగ్‌లు, ఇళ్ళలో దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తుడు. ఈమధ్య కాలంలో హైదరాబాద్‌లో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన రెండో క్రిమినల్ శివకుమార్. మొన్నీమధ్య హైదరాబాద్ శివార్లలోనే ఒక దొంగనోట్ల ముఠాకు చెందిన క్రిమినల్ని పోలీసులు కాల్చి చంపారు.

ఆ విషయంలో యువరాజావారిని శంకించడానికి లేదుట

  ఎన్నికలకు ముందు వరకు రాహుల్ గాంధీని కాబోయే దేశప్రధానిగా కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ఆ తల్లీ కొడుకులు ఎప్పుడు తలచుకొంటే అప్పుడు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొనే అవకాశం ఉన్నప్పటికీ, త్యాగ మూర్తుల కుటుంబానికి చెందిన వారు కనుక గత పదేళ్లుగా డా.మన్మోహన్ సింగును ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆయన చెయ్యిపట్టుకొని వారే దేశాన్ని ఎంచక్కగా పరిపాలించారు. అయితే కాంగ్రెస్ చివరి రోజుల్లో యువరాజవారు తన కుర్చీపై మనసు పారేసుకొన్నారని అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గ్రహించగానే, తను కుర్చీ కాళీ చేసేయడానికి సిద్దమని ఆయన ప్రకటించడమే కాకుండా, రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేసేందుకు కూడా తను సిద్దమని ప్రకటించారు. తీరాచేసి యువరాజవారు పట్టాభిషేకానికి అంగీకరించి దేశప్రజలను, కాంగ్రెస్ నేతలను ఉద్దరించేందుకు దయతో అంగీకరించినా వెర్రిబాగుల ప్రజలందరూ మోడీ మాయమాటలు నమ్మి ఆయనకు హ్యాండిచ్చేసారు. ఆయన కోసం మన్మోహనుల వారు ఖాళీ చేసిన కుర్చీలో మోడీ వచ్చి చటుకున్న కూర్చొండిపోయారు.   నిజానికి యువరాజు రాహుల్ గాంధీకి, అటు పార్టీలో, ఇటు దేశ ప్రజలలో కూడా తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీని అవలీలగా ఓడించిపడేసేవాడే. గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయనకు అదేమీ పెద్దపని కాదు. కానీ మీడియా కూడా మోడీ మాయలో పడి ఆ వెర్రిబాగుల జనాలతో కలిసి యువరాజవారికి నాయకత్వ లక్షణాలు లేవని అర్ధంపర్ధం లేని ప్రచారం చేయడంతో ఆయన ఇమేజి చాలా డ్యామేజి అయిపోవడంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయారు అంతే.   పదేళ్ళ సోనియా కర్రపెత్తనంలో యూపీయే ప్రభుత్వం దేశాన్ని ఎక్కడికో తీసుకుపోయింది. తను ప్రధాని కుర్చీలో కూర్చోగానే ప్రజలను ఇంకా ఎక్కడికో తీసుకుపోతానని యువరాజవారు హామీ ఇచ్చారు కూడా. కానీ ప్రజలు ఆయన మాటలు నమ్మలేదు. కానీ అవే మాయమాటలు చెప్పిన మోడీని గుడ్డిగా నమ్మేసి బీజేపీకి ఓటేసేయడంతోనే, కాంగ్రెస్ పార్టీని యువరాజవారు గెలిపించలేకపోయారని అంటోనీ కమిటీ కనిపెట్టేయగలిగింది. అయినా దేశానికి స్వాత్రంత్రం వచ్చినప్పటి దాదాపు నేటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అందులో ప్రజలను ఉద్దరిస్తూనే ఉంది. కానీ అది గుర్తించని వెర్రిబాగుల జనాలు కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్లలో చేయలేనిది మోడీ ఐదేళ్ళలో చేసి చూపిస్తానంటే గుడ్డిగా నమ్మేశారని అంటోనీ కమిటీ తన నివేదికలో ఆవేదన వ్యక్తం చేసింది. చేతిలో అధికారం ఉన్నపుడే మోడీని ఓడించలేకపోయినప్పటికీ, ఐదేళ్ళ తరువాత ఆయన వెనుక ఎంతమంది మిగిలుంటారో తెలియని పరిస్థితిలో కూడా ఆయన తన నాయకత్వ పటిమను ప్రదర్శించుతూ, మోడీని చిత్తుచిత్తుగా ఓడించి పడేయడం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం సంపాదించి తను ప్రధానమంత్రి అవడం తధ్యమని అంటోనీ మహాశయులు శలవిచ్చారు.

యుద్ధనౌక.. జాతికి అంకితం

  దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ కోల్‌కతా’ని భారత ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేశారు. ముంబైలో వైభవంగా జరిగిన కార్యక్రమంలో మోడీ ఈ భారీ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, భారతదేశంలోని ప్రజలు ప్రశాంతంగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతున్నారంటే దానికి ప్రధాన కారణం మన సైనికులేనని అన్నారు. ఐఎన్ఎస్ కోల్‌కతా నౌక కారణంగా మన నావికాదళం మరింత బలోపేతం అవుతుందని ఆయన చెప్పారు. సరిహద్దుల భద్రతతోపాటు సముద్రంలో కూడా భద్రత ఎంతో అవసరమని ఆయన చెప్పారు. ఛత్రపతి శివాజీ కూడా సముద్ర రక్షణ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

బాలకృష్ణ కుమార్తెలు.. లక్ష్మీకళ అంటే ఇదే...

  ‘అన్న’ నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి మోహనకృష్ణ కుమార్తె మోహనరూప వివాహం కృష్ణ కళ్యాణ్ కుమార్‌తో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో నందమూరి, నారా కుటుంబాలతోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు పాల్గొని వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ వివాహ మహోత్సవంలో నందమూరి బాలకృష్ణ కుమార్తెలు బ్రహ్మణి, తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తళతళలాడే పట్టుచీరలు కట్టుకుని పెళ్ళి పందిట్లో సందడి చేస్తున్న బ్రహ్మణి, తేజస్విని చూసినవారంతా వీళ్ళిద్దరూ బుగ్గలు చిదిమి దీపం పెట్టుకునేలా వున్నారని, ‘లక్ష్మీకళ’ అనే మాటకు ఇద్దరూ నిదర్శనంలా వున్నారని అనుకున్నారు.

ఉత్తరాఖండ్ అల్లకల్లోల్లం

  భారీ వర్షాలు మరోసారి ఉత్తరాఖండ్‌ని అల్లకల్లోలం చేస్తున్నాయి. గతంలో ఓసారి ఉత్తరాఖండ్‌ని వణికించిన భారీ వర్షాలు మరోసారి తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ఇప్పటి వరకు 20 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక ఇళ్ళు ధ్వంసమయ్యాయి. నదులు పొంగి ప్రవహిస్తూ వుండటంతో రాష్ట్రం మొత్తం జలమయమైంది. వేలాది మంది ప్రజలు నీటిలో చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్‌కి వెళ్ళిన అనేకమంది యాత్రికులు కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ వాతావరణం అనుకూలించడం లేదు.

ప్రణాళికా సంఘం రద్దు

  ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎర్రకోట నుంచి ప్రసంగించిన నరేంద్రమోడీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త ఆత్మతో కూడిన వ్యవస్థ దేశానికి అవసరమని, అందుకే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రణాళికా సంఘానికి సుదీర్ఘ చరిత్ర వుంది. 1950లో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని స్థాపించారు. కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటైన ప్రణాళికా సంఘానికి అపరిమిత అధికారాలు వుండేవి. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వుండేవారు. సంఘంలో ఉపాధ్యక్షుడి పదవి కూడా కీలకమే. గుల్జారీలాల్‌ నందా, టి.టి.కృష్ణమాచారి, సి.సుబ్రమణ్యం, పి.ఎన్.హక్సార్, మన్మోహన్‌సింగ్, ప్రణబ్‌ముఖర్జీ, కె.సి.పంత్, జశ్వంత్‌సింగ్, మధు దండావతే, మోహన్‌ ధారియా, ఆర్.కె.హెగ్డే తదితరులు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు.

నవ్యాంధ్ర పునర్నిర్మాణమే ధ్యేయం: చంద్రబాబు

  స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో, నవ్యాంధ్ర నిర్మాణమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలులో ఏర్పాటు చేసిన 68వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ‘‘స్వాతంత్ర్య పోరాటంలో ఆంధ్రులు త్యాగాలు స్ఫూర్తిదాయయం. రాష్ట్రంలో గతంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో పోల్చితే రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో జరుగుతున్న నేటి స్వాతంత్ర్య దినోత్సవానికి ఎంతో ప్రత్యేకత వుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన దుష్పరిణామాల నుంచి కోలుకోవడానికి అందరూ కార్యదీక్షతో పనిచేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. 15 వేల కోట్ల ఆర్థిక లోటుతో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఈ పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా అధిగమించడానికి కృషి చేయాలని ఆయన కోరారు. రౌతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా వివరించారు.

సర్వేకి సహకరించండి.. ప్లీజ్...

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19వ తేదీన తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడానికి ముందుకు వెళ్తోంది. ప్రజలకు ఇష్టముంటేనే సర్వేకి సహకరించవచ్చని కోర్టుకు హామీ ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తాను అనుకున్న పని చేయడానికి నడుం బిగించింది. ఈ నేపథ్యంలో సర్వే విజయవంతం చేసే బాధ్యతలను జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. దాంతో తెలంగాణలోని పది జిల్లాల కలెక్టర్లు ఈ సర్వేని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తులు, వినతులు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సర్వేని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నందువల్ల దీనిని విజయవంతం చేయడానికి కలెక్టర్లు సర్వ ప్రయత్నాలు చేస్తు్న్నారు. ప్రజలకు విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు.

స్వాతంత్ర్య స్ఫూర్తి.. దేశానికి దీప్తి: మోడీ ప్రసంగం

  స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాన్ని ప్రగతిపథంలోకి కలసికట్టుగా తీసుకెళ్దామని ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. 68వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి మోడీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ‘పార్టీకన్నా దేశమే మిన్న.. అందరం కలసి పనిచేద్దాం. అన్ని పార్టీలు కలసి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నేతలు, పాలకులు దేశ నిర్మాతలు కాదు.. రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలే దేశ నిర్మాతలని మోడీ అన్నారు. సంఖ్యాబలంతో కాకుండా ఏకాభిప్రాయంతోనే ముందుకు వెళ్ళాలని చెప్పారు. కలసి నడుద్దాం.. కలసి ఆలోచిద్దాం.. కలసి ముందుకు నడుద్దాం... ఐకమత్యంగా దేశాభివృద్ధికి పాటుపడదామని పిలుపు ఇచ్చారు. ప్రతిక్షణం దేశసేవలో ఎలా నిమగ్నమయ్యామన్నదే ముఖ్యం. దేశ హితం కోసం మనం నిరంతరం పనిచేయాలి. దేశాభివృద్ధి మన బాధ్యత మాత్రమే కాదు.. మన పూర్వికుల కల. మన పూర్వికుల కలను నిజం చేయాల్సిన బాధ్యత మన మీద వుంది. దేశానికి ఏం చేశామని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం వుంది’’ అన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో నరేంద్రమోడీతోపాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్, ఎల్.కె.అద్వానీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.