కెన్యాలో ఎబోలా.. తెలుగు వ్యక్తి మృతి

ఆఫ్రికన్ దేశాలను ప్రమాదకరమైన ఎబోలా వైరస్ గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వైరస్ కారణంగా కెన్యాలోని ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించారు. మృతుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిటుకురాళ్లు గ్రామానికి చెందిన గజేందర్ రెడ్డిగా గుర్తించారు. ఈయనకు నాలుగు రోజుల క్రితం ఈ వైరస్ సోకిందని తెలుస్తోంది. వైరస్ కారణంగా విషజ్వరం పెరిగిపోయి ఆయన మరణించినట్టు తెలుస్తోంది. గజేందర్‌రెడ్డి భార్యాపిల్లలు కెన్యా నుంచి స్వదేశానికి బయల్దేరి గురువారం ఉదయం 10 గంటలకు బెంగళూరుకు వచ్చారు. అయితే వారు ఆరోగ్యంగా వున్నట్టు తెలుస్తోంది. ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియార్రా లియోన్, నైజీరియా దేశాల్లో ప్రబలిన భయానకమైన ఎబోలా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 1,229కి చేరినట్టు తెలుస్తోంది.

కళ్ళంలో కారంకొట్టి 11 లక్షలు చోరీ...

  కృష్ణాజిల్లా గుడివాడలోని రాజేంద్రనగర్ బ్యాంక్ అధికారి ఇంట్లో దుండగులు దోపిడీ చేశారు. బ్యాంక్ అధికారి రాంప్రసాద్ కళ్లల్లో కారం కొట్టి ఏటీఎంలో ఉంచేందుకు దాచిన రూ.11 లక్షలు దోచుకెళ్లారు. పల్సర్ బైక్ వచ్చిన వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారని బాధితుడు రాంప్రపాద్ తెలిపారు. ఇల్లు అద్దెకు ఉందా అంటూ వచ్చిన దుండగులు తాను లేదని చెప్పేలోపే తన కంట్లో కారం చల్లి తన ఇంట్లోకి చొరబడి డబ్బు ఎత్తుకుపోయారని వివరించారు. వారిని పట్టుకునేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. ఈ సంఘటన మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణ జరుపుతున్నారు.

సిగ్గుపడుతున్నా.. తలదించుకుంటున్నా.. జాకీచాన్

  హాలీవుడ్ నటుడు, కుంగ్ ఫూ స్టార్ జాకీచాన్ కుమారుడు, నటుడు అయిన జేసీ చాన్ ఈనెల 14వ తేదీన డ్రగ్స్‌ వినియోగిస్తూ దొరికిపోయాడు. క్రమశిక్షణతో కెరీర్ మలచుకున్న జాకీచాన్ కుమారుడు ఇలాంటివాడని తెలుసుకుని ప్రపంచం మొత్తం విస్తుపోయింది. చాకీచాన్ గతంలో చైనాలో డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆయన కుమారుడే డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిపోవడం కంటే అవమానకరమైన విషయం మరొకటి వుంటుందా? తన కుమారుడు ఇలా దొరికిపోయిన విషయం తెలుసుకున్న జాకీచాన్‌ షాక్‌కి గురయ్యారు. ఇన్నిరోజులూ బయటి ప్రపంచానికి ముఖాన్ని చూపించలేకపోయారు. ఇప్పుడు మనసు దిటవు చేసుకుని ఈ సంఘటన మీద తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘నా కుమారుడు జేసీ చాన్ చేసిన ఘనకార్యం వల్ల నేను సిగ్గుతో తల దించుకుంటున్నాను. ఈ వార్త వినగానే నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. ఇంతకాలం ప్రజల ముందు తలెత్తుకుని జీవించిన నేను ఇప్పుడు సిగ్గుతో తల వంచుకుంటున్నాను. నన్ను అందరూ క్షమించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నేను చాలా విషాదంలో మునిగిపోయి వున్నాను. జేసీ చాన్ తల్లి అయితే దు:ఖంలో మునిగిపోయి వున్నారు. జేసీ చాన్ చేసిన తప్పు నుంచి నేటి యువతరం పాఠాలు నేర్చుకుని సక్రమమైన మార్గంలో నడుస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

దొంగలు బాబోయ్ దొంగలు...

  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గురువారం నాడు దొంగలు చెలరేగిపోయారు. హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఓ ఖాతాదారుడు 9 లక్షలు డ్రా చేసుకుని బయటకి వచ్చాడు. తనస్కూటర్ డిక్కీలో డబ్బు పెట్టుకున్న తర్వాత చూస్తే స్కూటర్ టైర్‌కి పంక్చర్ పడి వుంది. స్కూటర్‌ని నెట్టుకుంటూ వెళ్ళి పంక్చర్ వేయిస్తూ వుండగా దొంగలు అతని కన్నుగప్పి డిక్కీలో వున్న 9 లక్షలను దోచుకుపోయారు.   అలాగే హైదరాబాద్‌లోని బేగం బజారులో ఆటోలో వెళ్తున్న వ్యాపారులపై దాడి చేసి వారి వద్ద నుంచి 2 కేజీల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుని పోయారు.   తెనాలి చెంచుపేటలో ఒక వ్యక్తి బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయలను డ్రా చేసుకుని వస్తుండగా, దొంగలు ఆ వ్యక్తి చేతిలోంచి సంచిని లాక్కుని పారిపోయారు.   అనంతపురం జిల్లాలోని లోని ఓ దేవాలయంలో దొంగలు పడి హుండీలోని డబ్బుతోపాటు 20 లక్షల విలువైన నగలు, వెండి సామానును దోచుకుని పోయారు.

రంగంలోకి నారా లోకేష్... ఆనం బ్రదర్స్ టీడీపీ ఎంట్రీ ఖాయం

  నెల్లూరు జిల్లాలో రాజకీయంగా బలం కలిగిన ఆనం బ్రదర్స్ గత ఎన్నికలలో తెలుగుదేశం, మోడీ ధాటికి తట్టుకోలేక ఓడిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు. రాజకీయంగా రెబల్ అయిన ఆనం వివేకానందరెడ్డి ఎన్నికల ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన పాపం ఆయనతోపాటు ఆయన సోదరుడు రామనారాయణరెడ్డిని కూడా ఓడించింది. అయితే అప్పటి నుంచి వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీని ఘాటుగా విమర్శిస్తూ వస్తున్నారు. ఆయన ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమన్న అభిప్రాయం జిల్లాలో వుంది. అయితే రామనారాయణరెడ్డి మనసులో ఏముందన్న విషయం మాత్రం నిన్నటి వరకూ బయటపడలేదు. ఇప్పుడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. అయితే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో వున్న ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరడం అక్కడ స్థానికంగా వుండే తెలుగుదేశం నాయకత్వానికి కొంత ఇబ్బంది కలిగించే అంశం కావచ్చు. కొంత వ్యతిరేకత కూడా ఎదురయ్యే అవకాశం వుంది. అందుకే, ఆనం సోదరుల తెలుగుదేశంలో చేరిక సాఫీగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే బాధ్యతను నారా లోకేష్ తీసుకున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆనం సోదరుల తెలుగుదేశంలోకి ఆగమనాన్ని వ్యతిరేకిస్తున్న వారిని బుజ్జగించే పనిలో ప్రస్తుతం లోకేష్ ఉన్నట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో బుజ్జగింపులు పూర్తయి, ఆనం బ్రదర్స్ తెలుగుదేశంలో చేరడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

గవర్నర్ తిరుగుబాటు.. కేంద్రానికి నోటీసులు..

  యుపీఏ హయాంలో గవర్నర్ పదవులు పొందిన కొంతమందిని ఎన్డీయే ప్రభుత్వం తన పరిపాలనా సౌలభ్యం కోసం సాగనంపుతూ వస్తోంది. కొంతమంది బుద్ధిగా ఇంటికి వెళ్ళిపోతే కొంతమంది మాత్రం తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. వారిలో ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ ఒకరు. తనను గవర్నర్ పదవి నుంచి తొలగించే అర్హత కేంద్ర ప్రభుత్వానికి లేదంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తులున్న రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ ధర్మాసనం ఈ విషయంలో ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

గవర్నర్‌కి అధికారాలు వద్దు: టీఆర్ఎస్ ఎంపీలు

  టీఆర్ఎస్ ఎంపీలు గురువారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని కలిశారు. రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొన్న విధంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ చేతిలో వుంచడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, అలా చేయడానికి వీల్లేదని టీఆర్ఎస్ ఎంపీలు రాజ్‌నాథ్‌సింగ్‌కి విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌కి ప్రత్యేక అధికారాలు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్ర హక్కులను హరించడమేనని వారు పేర్కొన్నారు. సెక్షన్ - 8 కింద రాష్ట్ర అధికారాలు లాక్కోవడం సరికాదని వాదించారు. ఎన్డీయే ప్రభుత్వం సమాఖ్య విధానాన్ని గౌరవించాలని చెప్పారు. అయితే అయితే చట్ట ప్రకారమే గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటారని రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా వారికి చెప్పారు. తాము విభజన చట్టంలో వున్న అంశాన్ని అమలు చేయాలని అనుకుంటున్నామే తప్ప సమాఖ్య విధానానికి ఎంతమాత్రం వ్యతిరేకంగా వెళ్ళడం లేదని వారితో అన్నారు.

దినేష్‌రెడ్డి బీజేపీ తీర్థం?

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి త్వరలో భారతీయ జనతాపార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. డీజీపీగా పదవీ విరమణ చేసిన దినేష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు కేవలం లక్షా పదిహేను వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. త్వరలో ఆయన బీజేపీలో చేరతారని సమాచారం. దినేష్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినవారు. అయినప్పటికీ ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు తెలంగాణలో బంధుత్వాలు వున్నాయి. తెలంగాణలో బీజేపీ పుంజుకునే దశలో వున్నందున ఆయన బీజేపీ తెలంగాణ నాయకుడిగానే వుండే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.

నాలుగు రాష్ట్రాల్లో నేడు ఉప ఎన్నికలు

  కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్... ఈ నాలుగు రాష్ట్రాల్లో గురువారం నాడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల్లో మూడేసి స్థానాలకు, పంజాబ్‌లో రెండు స్థానాలకు, బీహార్‌‌లో పది స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉమ్మడి శత్రువైన భారతీయ జనతాపార్టీని ఎదుర్కొనడానికి ఒకరికొకరు పెద్ద శత్రువులైన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ఉప ఎన్నికల సందర్భంగా దోస్తీ కట్టారు. వీరి దోస్తీ ఫలిస్తుందో, వికటిస్తుందో ఈ ఉప ఎన్నికల ఫలితాలు చెబుతాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఉప్పు, నిప్పులా వున్న వీరిద్దరూ ఈ ఎన్నికల కోసం చెట్టపట్టాల్ వేసుకున్నారు. బీహార్‌లోని పది స్థానాల్లో నితీష్, లాలూ పార్టీలో చెరో నాలుగేసి స్థానాల్లో పోటీ చేస్తుండగా, వీరిద్దరితో స్నేహం కలిపిన కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. అలాగే పది స్థానాల్లో భారతీయ జనతాపార్టీ తొమ్మిది స్థానాల్లో, ఒక స్థానంలో ఎల్‌జేపీ పోటీ చేస్తున్నాయి. ఈనెల 25న ఈ నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు వుంటుంది.

కేసీఆర్ ఇన్ సింగపూర్

  జీవితంలో మొదటిసారి దేశం దాటి బయటకి వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అడుగు పెట్టిన మొదటి విదేశం సింగపూర్‌లో బిజీబిజీగా వున్నారు. బుధవారం ఉదయం సింగపూర్‌కు చేరుకున్న కేసీఆర్ బృందానికి ఐఐఎం పూర్వ విద్యార్థులు స్వాగతం పలికారు. కేసీఆర్ బృందం సింగపూర్‌లోని రిట్జ్ కార్టన్ హోటల్లో బస చేశారు. ఐఐఎం పూర్వ విద్యార్థులు గురువారం కార్యక్రమం నిర్వహించనున్న స్టేడియాన్ని కెసిఆర్ సందర్శించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సింగపూర్ హైకమిషనర్‌తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. 23న ఉదయం సింగపూర్ నుంచి కేసీఆర్ కౌలాలంపూర్‌కు చేరుకుంటారు. ఆ రోజు అక్కడే ఉండి 24వ తేదీ రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమలశాఖ కమిషనర్ జయేష్ రంజన్, ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్, ముఖ్యమంత్రి అదనపుకార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు కేసీఆర్‌తోపాటు విదేశీ పర్యటనకు వెళ్ళారు.

మహిళ తలలోంచి బుల్లెట్....

  పోలీసు శిక్షణ సందర్భంగా చేసిన ఫైరింగ్ ఒక మహిళా రైతు ప్రాణాల మీదకి తెచ్చింది. మెదక్ జిల్లా శివ్వంపేట సమీపంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బీహెచ్‌ఇఎల్ ఆధ్వర్యంలో పోలీసు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు రైఫిల్ షూటింగ్ శిక్షణ జరుగుతోంది. అయితే ఈవిషయం తెలియక అటువైపుగా వెళ్ళిన చంద్రకళ (48) అనే మహిళా రైతు తలలోంచి బుల్లెట్ దూసుకుపోయింది. దాంతో చంద్రకళను సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి తలలోని బుల్లెట్‌ని తొలగించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.

తమ పెరట్లోనే రాజధాని వుండాలంటే ఎలా?

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఎవరి ఇష్టమొచ్చినట్టుగా వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. ఎవరి ఇష్టమొచ్చినట్టుగా ఏ విషయమూ మాట్లాడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినప్పటికీ రాజధాని విషయంలో కామెంట్లు ఆగడం లేదు. అలాగే కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్ రాజధాని తమ ప్రాంతంలోనే పెట్టాలని, లేకపోతే ఉద్యమం లేవదీస్తామని అన్నట్టుగా నర్మగర్భ బెదిరింపులు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరున్న రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజధాని మా ప్రాంతంలో కావాలంటే మా ప్రాంతంలో కావాలని అంటున్న వారికి షాక్ తగిలేలా ఒక కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరూ రాజధాని తమ పెరట్లోనే వుండాలని అన్నట్టుగా మాట్లాడుతున్నారని, ఎవరి ఇష్ట ప్రకారమో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయడం జరగదని, అన్ని ప్రాంతాలకూ అందుబాటులో వుండటం, వనరులు వుండటం, భూ లభ్యత వుండటం.. ఇలాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని రాజధాని ఏర్పాటు వుంటుందని చెప్పారు. అంచేత రాజధాని మా ప్రాంతంలో వుండాలంటే మా ప్రాంతంలో వుండాలని స్టేట్‌మెంట్లు ఇచ్చేవారు ఇకనైనా కామ్‌గా వుంటే మంచిది.

బ్లూ ఫిలిమ్స్ ముఠా అడ్డంగా దొరికింది

  విజయవాడలో కుటీర పరిశ్రమలా బ్లూఫిలిమ్స్ చిత్రీకరిస్తున్న ఒక ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు పరారీలో వున్నారు. ఈ ముఠా నీలిచిత్రాల చిత్రీకరణ చేస్తోందన్న అనుమానం వున్న పోలీసులు ముఠా సభ్యుల కార్యకలాపాల మీద ఓ కన్నేసి వుంచారు. గురువారం నాడు ఈ ముఠా సరికొత్త నీలిచిత్రం చిత్రీకరణకు సన్నాహాలు ప్రారంభించింది. విజయవాడలో రహస్యంగా నీలిచిత్రం చిత్రీకరణ జరుపుతుండగా పోలీసులు దాడి చేశారు. దాంతో ముఠా ‘బెడ్’హేండెడ్‌గా దొరికిపోయింది. పోలీసులకు దొరికిన ఇద్దరిని పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేట్ చేస్తున్నారు.

రాజ్‌నాథ్‌తో నరసింహన్ భేటీ... అధికారాల గురించే...

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, ఉద్యోగుల బదిలీ వంటి అధికారాలను గవర్నర్‌కి బదిలీ చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయంలో తన అధికారాల గురించి చర్చించడానికే గవర్నర్ ఢిల్లీకి వచ్చారని తెలుస్తోంది. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందుకుని ఇక గవర్నర్ రంగంలోకి దిగుతారని సమాచారం. రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. తాను రాజ్‌నాథ్‌ని కలవటం వెనుక వున్న అసలు విషయం చెప్పకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య బాగుందని, రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు బాగున్నాయని, త్వరలో పరిస్థితులన్నీ సర్దుకుంటాయని చెప్పారు.

నిద్రపోతే పోతారట... హవ్వ...

  వరంగల్, నల్గొండ, ఖమ్మం, కృష్ణాజిల్లాలో బుధవారం రాత్రి విచిత్రమైన పుకారు షికారు చేసింది. బుధవారం నాడు నిద్రపోయినవాళ్ళు చనిపోతారని పుకార్లు వ్యాపించాయి. దాంతో చాలామంది జనం నిద్ర పోవడం మానేసి రోడ్లమీదకి చేరి కాలక్షేపం చేశారు. బుధవారం అర్ధరాత్రి ఈ పుకారు వ్యాపించింది. దాంతో అర్ధరాత్రి నుంచి జనం రోడ్ల మీదే సెటిలయ్యారు. కాస్తంత బుర్రున్నవాళ్ళు ఇవన్నీ పుకార్లని, ఇళ్ళలోకి వెళ్ళి హాయిగా నిద్రపొండని చెప్పినా జనం వినలేదు. అలా చెప్పినవాళ్ళనే పిచ్చోళ్ళని చూసినట్టు చూశారు. చాలామంది పెద్దలు నిద్ర మానుకుని కూర్చోవడమే కాకుండా ఈ మూఢ నమ్మకం గురించి పట్టించుకోకుండా హాయిగా నిద్రపోతున్న పిల్లల్ని కూడా నిద్రలేపి కూర్చోపెట్టారు. నిద్రపోతే చనిపోరు... నిద్రపోకపోతేనే చనిపోతారన్న నిజం ఈ జనాలకి ఎప్పటికి తెలుస్తుందో ఏంటో!

బడ్జెట్ గురించి జగన్‌కేం తెలుసు?

  ‘‘జగన్... నీకసలు బడ్జెట్ అంటే ఏమిటో తెలుసా?’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు జగన్‌ని సూటిగా ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ ప్రతిపాదించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ ప్రతిపాదనల గురించి, కేంద్రం నుంచి రానున్న గ్రాంట్ గురించి కాసేపు మాట్లాడిన అనంతరం బడ్జెట్ గురించి వైసీపీ నాయకుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు రాగా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అసలు జగన్‌కి బడ్జెట్ అంటే తెలుసా అని ప్రశ్నించారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన జగన్ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా వుందని చెప్పారు. తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం వుందని జగన్‌కి గుర్తుచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాలన్నిటినీ కడిగే ప్రయత్నంలా బడ్జెట్ వుందని చంద్రబాబు చెప్పారు.

నేడు హైదరాబాద్‌కి అమిత్ షా రాక

  బీజేపీ స్టార్ లీడర్, భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించున్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌కి వస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మొదటిసారి దక్షిణాది రాష్ట్రానికి వస్తున్నారు. ఆయనకు ఘనమైన స్వాగతం పలకడానికి తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం మూడున్నర తర్వాత ఆయన హైదరాబాద్‌కి వస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఇదే వేదికమీద పలువురు బీజేపీలో చేరతారు. వారిలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా వుంటారని తెలుస్తోంది. అలాగే శుక్రవారం నాడు సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే బీజేపీ గ్రామాధ్యక్షుల సదస్సులో కూడా అమిత్ షా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీని మరింత పటిష్టం చేసి, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే అమిత్ షా పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. తెలంగాణ పర్యటన సందర్భంగా అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులను కూడా కలుస్తారు.