ఆ వార్తలు పచ్చి అబద్ధాలు.. అనుష్క...

  బాలీవుడ్ నటి అనుష్క శర్మ - క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య వున్న సంబంధం గురించి రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి. అయితే వాటి మీద ఇప్పటి వరకు అనుష్క శర్మ స్పందించలేదు. అయితే తాజాగా ఆమె స్పందించారు. విరాట్ కోహ్లితో త్వరలో తన వివాహం జరగనుందన్న వార్తల్ని అనుష్క శర్మ ఖండించారు. ఆ వార్తలు వాస్తవం కాదని, పచ్చి అబద్ధాలని పేర్కొంటూ అనుష్క తరపు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అనుష్క శర్మ పెళ్లి చేసుకోబోతోందంటూ పలు పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ, అందులో ఏమాత్రం నిజంలేదు. అవి పూర్తిగా నిరాధారమైన వార్తలు... పచ్చి అబద్ధాలు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

మెదక్ బరిలో సునీత?

  మెదక్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా లక్ష్మారెడ్డి నిలబడే అవకాశం వుందన్న అంశం ప్రచారంలోకి వచ్చింది. మెదక్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి గెలిచేంత సీన్ లేకపోయినప్పటికీ ఆ స్థానం కోసం ప్రయత్నాలు మాత్రం భారీగా జరుగుతున్నాయి. జైపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజ నరసింహ... ఇలా డజనుకు పైగా కాంగ్రెస్ నాయకులు మెదక్ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతూ పైరవీల బాటలో వున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో విస్తృత మంతనాలు జరిపిన అనంతరం మెదక్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని పోటీకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఆ యువతి పొట్ట.. ఏలిక పాముల పుట్ట

  ప్రపంచంలో ఇలాంటి తల్లిని ఇంతవరకూ ఎవరూ చూసి వుండరేమో. ఫ్లోరిడాలోని ఓ తల్లి తన కుమార్తె అందాల పోటీలో విజయం సాధించాలని, సన్నగా వుండాలని భావించింది. దానికోసం ఆమె అనుసరించిన మార్గం అత్యంత దారుణంగా వుంది. ఆ తల్లి కూతురి కడుపులో ఏకంగా ఏలికపాములు పెంచింది! ఏలిక పాముల గుడ్లు తన కూతురితో తినిపించడం ద్వారా ఈపని చేసింది. తట్టుకోలేని కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా... వైద్యులు ఆమెకు పరీక్షలు చేస్తే ఈ విషయం తేలింది. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. ఆమె కడుపులో వందల సంఖ్యలో ఏలికపాములు ఉన్నాయని వైద్యులు తెలిపారు. బాధితురాలి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బిగ్‌బజార్‌లో బిగ్ చోరీ

  హైదరాబాద్‌లోని కాచిగూడలో వున్న బిగ్‌బజార్‌లో భారీ చోరీ జరిగింది. సంస్థలో గతంలో పనిచేసిన సెక్యూరిటీ గార్డులే దొంగలుగా మారి 50 లక్షలకు పైగా విలువైన లాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దోచుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగింది. గతంలో బిగ్‌బజార్ లో పనిచేసి, మానివేసిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులుపక్కా ప్రణాళికతో చోరీ చేశారని సీసీ కెమెరా ఫుటేజ్‌ల ద్వారా తెలుస్తోంది. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్‌లు బిగ్‌బజార్‌లో 3వ ప్లోర్‌లోని ఫైర్‌ఎగ్జిట్ ద్వారం నుంచి 2వ అంతస్తులోని ఎలాక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించి అక్కడున్న ఖరీదైన ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్‌లు, కెమెరాలను, తర్వాత పక్కనే ఉన్న స్టోర్‌రూమ్, స్టాఫ్‌రూమ్‌ల తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లి రెండు బీరువాల తాళాలను పగులగొట్టి అందులో ఉన్న ఖరీదైన సెల్‌ఫోన్‌లను ఎత్తుకెళ్లారు. మొత్తం పరికరాల విలువ 50 లక్షలకు పైనేనని సిబ్బంది చెబుతున్నారు.

పాక్ కాల్పులు... ఇద్దరి మృతి

  పాకిస్థాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. శనివారం నాడు జమ్మూ కాశ్మీర్‌లోని ఆరెస్ పురా, ఆర్నియాల్లో పాక్ రేంజర్లు 22 సరిహద్దు సైనిక శిబిరాలు, 13 గ్రామాలపై భారీగా కాల్పులు జరిపి, బాంబులు పేల్చారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు మృతిచెందగా ఒక బీఎస్‌ఎఫ్ జవాను సహా ఆరుగురు గాయపడ్డారు. పాక్ జమ్మూ సెక్టార్లో ఈ ఏడాది భారీగా కాల్పులకు దిగడం ఇదే తొలిసారి. గత పక్షం రోజుల్లో కాల్పుల విరమణకు గండికొట్టడం 16వ సారి. ఈ నేపథ్యంలో భారత - పాకిస్థాన్ సరిహద్దు గ్రామాలకు చెందిన మూడు వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

టీడీపీ నేత తుమ్మలకు అస్వస్థత... ఒత్తిడితోనే...

  ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తుమ్మలను అత్యవసర విభాగంలో వుంచి వైద్యులు చికిత్స చేస్తున్నట్టు తెలుస్తోంది. తుమ్మల అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఆస్పత్రికి వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావును పరామర్శించారు. కాగా, ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కీలక నేతల్లో ఒకరైన తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల జరిగిన ఎన్నికలలో విజయం సాధించలేకపోయారు. ఆయన త్వరలో తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలు ఈమధ్యకాలంలో వినిపించాయి. రెండు మూడు రోజుల్లో ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంతలోనే తుమ్మల అనారోగ్యానికి గురయ్యారు.అయితే టీడీపీని వీడాలా వద్దా అన్న సందిగ్ధంలో వున్న తుమ్మల ఆ ఒత్తిడితోనే అనారోగ్యానికి గురయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ఇక సింగపూరే.. కేసీఆర్

  ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో వున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఐఐఎం పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, నవ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలనతోపాటు, పాలనలో పారదర్శకత వుంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సింగపూర్‌లా అభివృ‌ద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలున్నాయని, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని కేసీఆర్ తెలిపారు. అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలు భారతదేశంలో ప్రవేశించడానికి తెలంగాణ రాష్ట్రం ముఖద్వారంలా వుంటుందని, ఆటోమేటిక్ అప్రూవల్ సిస్టమ్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని కేసీఆర్ వివరించారు.

దేశం కోసమే బీజేపీలో చేరాను...

  మన దేశంలోని రాజకీయ నాయకులలో దేశభక్తి కలవాళ్ళు ఇప్పటికీ చాలామంది వుండటం మన అదృష్టం. అలాగే దేశం కోసం పార్టీ మారే నాయకులు కూడా వుండటం మన భరతమాత సౌభాగ్యం. ఇప్పుడు అలాంటి దేశభక్తుల కోవలోకి మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి కూడా చేరారు. డీజీపీగా రిటైరైన తర్వాత వైసీపీలో చేరిన ఆయన మొన్నటి ఎన్నికలలో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన తాజాగా బీజేపీ అధ్యక్షుడు హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. తాను బీజేపీలో ఎందుకు చేరారో దినేష్ రెడ్డి వివరిస్తూ, ‘‘దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రగతి కోసం భారతీయ జనతా పార్టీలో చేరాను. వైసీపీ ప్రాంతీయ పార్టీ కావడం వల్ల దాన్ని వదిలిపెట్టేశాను. బీజేపీ జాతీయ పార్టీ కావడం వల్ల జాతీయ దృక్పథంతో అందులో చేరాను’’ అన్నారు. ఏది ఏమైనప్పటికీ దినేష్‌రెడ్డి లాంటి దేశభక్తులున్న మన దేశం చాలా గొప్పది.

కేసీఆర్ సర్వే కథేంటి? మోడీ కూపీ...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే మీద ఎన్నో వివాదాలు చెలరేగిన విషయం, అయినప్పటికీ కేసీఆర్ వెనుకడుగు వేయకుండా సర్వే పూర్తి చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సర్వే వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిందే తప్ప జోక్యం చేసుకోలేదు. కేంద్ర హోంశాఖ ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారో వివరించండంటూ లేఖ రాసిందని మొదట్లో వదంతులు వచ్చాయి. అయితే వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు కేంద్ర హోంశాఖ కూడా ఖండించింది. అయితే తాజాగా కేసీఆర్ నిర్వహించే సర్వే గురించి ప్రధాని నరేంద్రమోడీ కూపీ లాగినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనలో వున్నారు. ఆయన శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి రెండు రాష్ట్రాల్లోని పరిస్థితుల మీద సమగ్ర నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా నరేంద్రమోడీ సమగ్ర కుటుంబ సర్వే గురించి గవర్నర్‌ని అన్ని విషయాలూ వివరంగా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అలాగే ఈ సర్వే గురించి కూడా ప్రధానికి గవర్నర్ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది.

కోర్టు కేసుల్లో హీరోయిన్

  కన్నడ హీరోయిన్ పూజాగాంధీకి కోర్టుల చుట్టూ తిరగడానికే టైమ్ సరిపోతున్నట్టుంది. మన తెలుగులో రూపొందిన ‘పూజ’ సినిమాలో ‘‘ఎన్నె్న్నో జన్మల బంధం నీదీనాదీ’’ అనే పాటలో నటించిన ‘కల్పన’ అనే కన్నడ నటి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. 1970 ప్రాంతంలో జరిగిన ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ కల్పన జీవిత కథ ఆధారంగా కన్నడ భాషలో ‘అభినేత్రి’ అనే సినిమా రూపొందింది. ఆ సినిమాలో పూజాగాంధీ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా మీద కల్పన కుటుంబ సభ్యులు కేసు వేశారు. దాంతో దర్శక నిర్మాతలతోపాటు హీరోయిన్ పూజాగాంధీ కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఎట్టకేలకు కోర్టు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో ‘అభినేత్రి’ విడుదల కానుంది. ఇదిలా వుంటే, గత ఎన్నికలలో రాయచూర్ అసెంబ్లీ స్థానం నుంచి పూజాగాంధీ పోటీ చేసి ఓడిపోయింది. ఎన్నికల సమయంలో ఆమె ఎన్నికల నిబంధనలు అతిక్రమించారంటూ కేసు నమోదైంది. ఆ కేసు విచారణ కోసం గురువారం ఆమె కోర్టుకు హాజరయ్యారు.

జగన్ ‘బఫూన్’పై అసెంబ్లీలో గొడవ...

  వైఎస్సార్సీపీ నాయకుడు, గౌరవనీయ ప్రతిపక్ష సభ్యుడు అయిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులను ‘బఫూన్లు’ అనడం మీద వివాదం పెరుగుతోంది. శుక్రవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత జగన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘బఫూన్లు’ అనే పదం మీద స్పీకర్ సూచించినట్టుగా జగన్ సారీ చెబుతారని అందరూ భావించారు. అయితే జగన్ సారీ చెప్పకపోగా తన వ్యాఖ్యలని సమర్థించుకున్నారు. జగన్ మీద తెలుగుదేశం నాయకులు ఉవ్వెత్తున విరుచుకుపడినప్పటికీ జగన్ లైట్‌గా తీసుకుని తన ధోరణిని కొనసాగించారు. కాగా శనివారం నాడు అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి జగన్ ‘బఫూన్’ వ్యాఖ్యల మీద వివాదం కొనసాగింది. తెలుగుదేశం సభ్యులు జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అయితే జగన్ గానీ, ఆయన పార్టీ నాయకులు గానీ ఈ విషయంలో క్షమాపణ చెప్పే ధోరణిని కనబరచలేదు. సభలో గందరగోళం జగడంతో 10 గంటల 15 నిమిషాలకు స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.

మందుబాబులం.. మేము మందుబాబులం...

  మందు కొట్టడం అనేది గోవా సంస్కృతిలో ఒక భాగమని అందువల్ల గోవాలో మద్యపాన నిషేధం లాంటి ఆలోచనలు ఎవరికీ రాబోదని, అలాంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందంటే వాళ్ళు గోవాకి చెందిన వ్యక్తులు అయి వుండరని గోవా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విల్ఫ్రెడ్ మెస్కిటా అన్నారు. మద్యనిషేధం గోవాకు అసలు రాలేదని, ఎందుకంటే గోవా సంస్కృతిలోనే మద్యపానం ఇమిడి ఉందని ఆయన అన్నారు.కేరళలో దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించనున్నట్లు అక్కడి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రకటించారు. ఇదే బాటలో గోవా కూడా నడిచే అవకాశం వుందా అని విలేకరులు అడిగినప్పుడు మెస్కిటా ఇంత స్పష్టంగా స్పందించారు. గోవా ప్రజలు అన్ని సందర్భాల్లోనూ మందు కొడుతూనే వుంటారని, అలాంటి సంస్కృతి వున్న గోవాలో మద్యనిషేధం విధించాలని అనడం అన్యాయమని ఆయన చెప్పారు.

అసెంబ్లీలో జగన్ కామెంట్స్... హత్యల సంఖ్యదేముందిలే...

  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను ‘‘బఫూన్లు’’ అని వ్యాఖ్యానించి వివాదాన్ని సృష్టించిన వైసీపీ నాయకుడు జగన్ ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. హత్యల సంఖ్య పైన తాను సభను తప్పుదారి పట్టించలేదని, అయినా హత్యల సంఖ్య ఎంతయితే ఏంటని, సమస్యను మానవతా దృక్పథంతో చూడాలని జగన్ అన్నారు. హత్యల వైసీపీ చెప్పే సంఖ్యకు, సాక్షి పత్రిక ప్రచురించిన సంఖ్యకు తేడా ఉంది కదా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు ‘‘సంఖ్యలదేముందిలే’’ అని తేలిగ్గా తీసుకున్నట్టుగా జగన్ మాట్లాడారు. తాను తెలుగుదేశం సభ్యులను ‘బఫూన్లు’ అనడాన్ని జగన్ సమర్థించుకున్నారు.

గవర్నర్‌కి అధికారాలు తప్పవు... బిల్లులో వున్నవే...

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలోనే వుంటాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న విధంగానే గవర్నర్‌కి అధికారాలు కట్టబెట్టామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుంటారని, రోజువారీ పాలనలో గవర్నర్ జోక్యం వుండబోదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇదిలావుండగా, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఆంధ్రప్రదేశ్, రాజధానిలోని పరిస్థితులను మోడీకి ఆయన వివరించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన అంశాలను మోడీ ఈ సందర్భంగా గవర్నర్‌ దగ్గర ఆరా తీసినట్టు తెలుస్తోంది. నరసింహన్ మోడీతో అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి గవర్నర్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు మీద కూడా నివేదిక సమర్పించినట్టు సమాచారం.

షిండే, చిదంబరం, ఆజాద్‌లకు అరెస్టు వారెంట్లు...

  ముగ్గురు మాజీ కేంద్ర మంత్రుల అరెస్ట్‌కు అనంతపురం కోర్టు వారెంట్లు జారీ చేసింది. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన కేసులో గత యూపీఏ ప్రభుత్వంలోని జీవోఎం సభ్యులైన సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, పి. చిదంబరంలపై బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. రాష్ట్ర విభజన సమయంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)లో ఈ ముగ్గురు మంత్రులే కీలకంగా నిలిచారు. అయితే విభజనకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయడంలో వీరు ఏకపక్షంగా వ్యవహరించారని, కాంగ్రెస్‌ పార్టీ చెప్పినట్టల్లా ఆడారని, ఎవరి నుంచి ఎలాంటి సూచనలు స్వీకరించలేదన్న ఆరోపణలు వీరిమీద వున్నాయి.

జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు.. సభ వాయిదా..

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం నాడు వాడిగా, వేడిగా జరిగాయి. శాంతి భద్రతల మీద చర్చ జరగాలని ప్రతిపక్ష వైసీపీ పట్టుబట్టడంతో స్పీకర్ అందుకు అనుమతి ఇచ్చారు. అయితే వైసీపీ కార్యకర్తల మరణాలను తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తూ జగన్ తదితర వైసీపీ నాయకులు మాట్లాడ్డం పట్ల తెలుగుదేశం శాసనసభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో రక్తచరిత్ర వున్న నాయకుడు, ఫ్యాక్షనిస్టు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనని తెలుగుదేశం సభ్యులు గళమెత్తారు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో నరమేధం జరిగిందని, వందలమంది తెలుగుదేశం కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఈ సందర్భంగా జగన్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను ‘బఫూన్లు’ అని వ్యాఖ్యానించడంతో గొడవ తారస్థాయికి చేరింది. దాంతో స్పీకర్ కోడెల సభను శనివారం నాటికి వాయిదా వేశారు. అలాగే జగన్ చేసిన ‘బఫూన్’ అనే వ్యాఖ్యను స్పీకర్ కోడెల తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని సూచించారు. తెలుగుదేశం సభ్యులు కూడా ఇదే డిమాండ్ చేశారు. అయితే జగన్ తన వ్యాఖ్యని ఉపసంహరించుకోలేదు. దీనిపై తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మళ్ళీ ‘విదర్భ’ హడావిడి...

  మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన సమయంలో విదర్భ ఉద్యమ నాయకులు కూడా హడావిడి చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విదర్భ ఉద్యమకారులు తమకూ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఉద్యమం ఉద్ధృతం చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే విచిత్రంగా అలాంటిదేమీ జరగలేదు. అయితే తాజాగా మరోసారి విదర్భ ఉద్యమ హడావిడి మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి మహారాష్ట్రలోని నాగపూర్‌కి వెళ్ళారు. అక్కడ విదర్భ వాదులు నల్లజెండాలు చూపించి మోడీకి తమ నిరసన తెలిపారు. ప్రత్యేక విదర్భ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

షర్మిల అరెస్ట్!!

  మణిపూర్ హక్కుల కార్యకర్త ఇరోం షర్మిలను విడుదల చేయాలనంటూ మణిపూర్ కోర్టు ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలకు తలవంచి మణిపూర్ ప్రభుత్వం ఆమెను విడుదల చేయడం విదితమే. అయితే ఇరోం షర్మిలను అలా విడుదల చేశారో లేదో ఇలా రెండు రోజులకే ఆమని మణిపూర్ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. మణిపూర్‌లో అమల్లో ఉన్న వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్పీఏ)పై తన పోరాటంలో ఆమె నిరాహార దీక్ష చేస్తున్నారు. పోలీసులు బలవంతంగా ఆమెకు ముక్కుద్వారా ఆహారం ఇస్తున్నారు. షర్మిల విడుదలైన తర్వాత తాను ఇక ముందు కూడా నోటి ద్వారా ఆహారం తీసుకోనని ప్రకటించారు. దాంతో ఆమె నిరాహార దీక్ష ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణ మీద పోలీసులు మళ్ళీ ఆమెని అరెస్టు చేశారు. ఏఎఫ్‌ఎస్పీఏ చట్టానికి వ్యతిరేకంగా ఆమె గత 14 ఏండ్లుగా ఆమరణ నిరాహార దీక్ష పోలీసు నిర్బంధంలో ఆమెకు ఇన్నాళ్లు ముక్కు ద్వారా ద్రవ ఆహారాన్ని అందిస్తూ వచ్చారు.