ఏపీ అసెంబ్లీ.. బుధవారానికి వాయిదా
posted on Aug 19, 2014 @ 2:23PM
ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు సమావేశాలు కూడా వృధా అయ్యాయి. సభ బుధవారం నాటికి వాయిదా పడింది. మంగళవారం సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు శాంతి భద్రతలపై చర్చకు పట్టుబట్టి ఆందోళన చేశారు. సభను సజావుగా నడపాలని, సంప్రదాయాలను పాటించాలని మంత్రి యనమల కోరినప్పటికీ లాభం లేకుండా పోయింది. శాంతిభద్రతలపై చర్చ కోసం ప్రభుత్వం సమాచారం తెప్పించుకోవలసి వుంటుందని అధికారపక్షం చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిన హత్యల గురించి కూడా చర్చకు సిద్ధమని, పరిటాల రవి హత్య గురించి కూడా చర్చిద్దామని తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకుల మీద ఎదురుదాడికి దిగారు. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాదం, వివాదం ఎంతసేపటికీ తెగకపోవడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీని బుధవారానికి వాయిదా వేశారు.