అయోమయంలో దానం నాగేందర్..!
posted on Dec 31, 2015 @ 9:34AM
ప్రస్తుతం కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పరిస్థితి ఏం చేయలేని అయోమయ పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ పట్టు సడలడంతో ఆపార్టీలోకి చాలామంది నేతలు టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే దానం కూడా పార్టీ మారాలని అనుకున్నారు. అయితే అందరిలా కాకుండా దానం నాగేందర్ పార్టీ మార్పుపై చాలా హై డ్రామానే కొనసాగింది. కొంత మంది పార్టీ మారుతున్నారు అంటే.. కొంత మంది మారట్లేదు అని.. కానీ దానం మాత్రం టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరపడం.. కానీ దానం కండీషన్స్ అప్లయ్ అన్న చందాన వ్యవహరించడం..దానికి తోడు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి దానం కనుక పార్టీలోకి వస్తే.. తాను బయటకు వెళ్తానంటూ అల్టిమేటం జారీచేయటం..దాంతో టీఆర్ఎస్ నేతలు వెనక్కి తగ్గడం జరిగాయి. ఇక ఆ కారణంగా చేసేది ఏం లేక దానం తాను పార్టీ మారడంలేదని.. కాంగ్రెస్ లోనే ఉంటున్నానని చెప్పడం.. ఇవన్నీ దానం పై ఉన్న నమ్మకాన్ని తగ్గించాయని స్పష్టంగా అర్ధమవుతోంది. అయితే ఈ విషయంలో హైకమాండ్ అప్పుడే దానంకు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా మళ్లీ ఇప్పుడు దానంకు అధిష్టానం నుండి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రేస్ పార్టీ సమాయత్తమవుతోంది. అయితే ఈ గ్రేటర్ ఎన్నికలకు గాను దానం తన సత్తా చూపడానికి సిద్దమయ్యి.. ఆ పార్టీ నేతల చేతిలోనే ఘోర అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా దానం కూకట్‌పల్లి, ఉప్పల్‌లో ప్రచారానికి సిద్ధమవగా..రంగారెడ్డి జిల్లాలో రాజకీయం చేస్తే ఊరుకోమంటూ అక్కడి నేతలు సుధీర్‌రెడ్డి, మల్లేష్ వర్గాలు తెగేసి చెప్పాయి. అంతేకాదు ఇంకా పలు కాంగ్రెస్ నేతలు కూడా దానంపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దానం తను ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాడంటూ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి దానంపై ఫిర్యాదు చేశాడు. ఇక దానంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. దీంతో పై నుంచి దానంకు మరోసారి హెచ్చరిక జారీచేశారు. పార్టలో ఉండాలా! లేదా! తేల్చుకోమంటూ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఇప్పుడు దానంకు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నట్టు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో వైపు దానం కాంగ్రెస్ పార్టీ తనను నమ్ముతుందా? లేదా? అనే సందిగ్ధంలో పడిపోయారంట.