భారీ మనిషి కన్నుమూత

  ప్రపంచంలోనే అతి పెద్ద భారీ శరీరం వున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన మెక్సికోకు చెందిన ఆండ్రెస్ మోరినో (38) శుక్రవారం మెక్సికోలో మరణించాడు. గుండె సంబంధిత వ్యాధి కారణంగా ఆయన మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 450 కిలోల బరువుండే ఆండ్రెస్ రెండు నెలల క్రితం బరువు తగ్గడానికి శస్త్ర చికిత్స చేయించున్నాడు. త్వరలో తాను మూడు వందల కిలోల బరువు తగ్గి 150 కిలోలకు చేరుకుంటానని అందరికీ చెప్పేవాడు. అయితే ఈలోపే మరణించాడు. మొదటి ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయన ఆరోగ్యం మామూలుగానే వుందని, అయితే క్రిస్మస్ రోజున అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

చలి బాబోయ్... చలి...

  తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. హైదరాబాద్‌లో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణం మారిపోయింది. చలికాలం మొదలై చాలాకాలం అయినప్పటికీ గురువారం వరకు పెద్దగా చలిగా అనిపించలేదు. శుక్రవారం నుంచి చలి ఒక్కసారిగా పెరిగిపోయింది. చీకటి పడగానే పెరిగిన చలిలో జనం ఇళ్ళకే పరిమితమయ్యారు. వివిధ పనుల మీద హైదరాబాద్‌కి వచ్చినవారికి సరైన ఆశ్రయం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. బస్టాండుల్లో, ఆస్పత్రుల వద్ద జనం అవస్థ వర్ణనాతీతంగా వుంది. పారిశుద్ధ్య కార్మికులు చలిలో వణుకుతూనే నగరంలో రోడ్లు శుభ్రం చేశారు. ఉత్తర భారత దేశం నుంచి తెలంగాణ వైపు చల్లటి గాలులు వీస్తున్నాయని, అందుకే చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో మరో పదిరోజులపాటు చలి తీవ్రత ఇలాగే వుండే అవకాశం వుందని చెబుతున్నారు. నిజామాబాద్, రామగుండాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతక 13 డిగ్రీలకు చేరింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా చలి పెరిగింది. విశాఖ మన్యంలో చలిగాలుల తీవ్రత పెరగడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. శనివారం ఉదయం మినుములూరులో 6, లంబసింగిలో 7, పాడేరులో 8, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మర్డర్ల కుటుంబం

  అనంతపురం జిల్లాలో ఒక గొప్ప మర్డర్ల కుటుంబం ఉదంతం బయటపడింది. ఈ ఉదంతం బయట పడటానికి కారణం కూడా ఒక మర్డరే కావడం ఘోరం. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి కాలనీలో ఒక యువకుడు కన్న తండ్రినే కత్తితో నరికి చంపాడు. పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. కన్న తండ్రినే చంపడానికి గల కారణాలను తెలుసుకుని పోలీసులు నిర్ఘాంత పోయారు. ఇప్పుడు మర్డరైపోయిన తండ్రి గతంలో తన పెద్ద కొడుకుని గుట్టు చప్పుడు కాకుండా మర్డర్ చేసేశాడట. అయితే తన అన్నను తన తండ్రే చంపాడన్న బాధ తనకు ఎప్పటినుంచో వుందని, అందుకే అదును చూసుకుని తన తండ్రిని చంపేశానని తండ్రిని మర్డర్ చేసిన ఆ తనయుడు చెప్పాడు.

“హలో...ఇది భూమండలమేనా?”

  మొన్న గురువారం నాడు లండన్ లో నివసిస్తున్న ఒక మహిళకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలివైపు నుండి “హలో...ఇది భూమండలమేనా?” అనే ప్రశ్న వినబడటంతో ఆమెకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. అంతలోనే ఆ ఫోన్ కాల్ కట్ అయిపోయింది. ఆమె ఏమనుకొని ఉంటుందో తేలికగానే ఊహించవచ్చును.   ఆమెకు వచ్చిన ఆ ఫోన్ కాల్ ఈ భూమండలం మీద నుండి వచ్చిన ఫోన్ కాల్ కాదు కనుకనే అటువంటి ప్రశ్న వినబడింది. భూమికి 400 కిమీ దూరంలో అంతరిక్షంలో ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుండి టిమ్ పీక్ అనే వ్యోమగామి తన కుటుంబానికి ఫోన్ చేయబోయి పొరపాటున వేరే నెంబరుకి చేసి “హలో ఇది భూమండలమేనా?” అని అడగటంతో అది వార్త అయ్యింది. ఆరునెలల పాటు అంతరిక్షంలో ప్రయోగాలు చేయడానికి క్రిందటి నెలే టిమ్ పీక్ అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చేరుకొన్నాడు.   తను పొరపాటున రాంగ్ నెంబరుకి చేసినట్లు గుర్తించిన టిమ్ పీక్ “ఆమెకు ఫోన్ చేసి “హలో...ఇది భూమండలమేనా?” అని అడిగినందుకు క్షమాపణలు చెప్పుకొంటున్నాను. పొరపాటున రాంగ్ కాల్ చేసాను తప్ప ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు,” అని ఒక ట్వీట్ మెసేజ్ కూడా పెట్టడంతో ఈ విషయం ఈ భూమండలంలో ఉన్నవారందరికీ ఈ విషయం తెలిసింది.

ప్రధాని మోడీకి స్వయంగా స్వాగతం పలకనున్న పాక్ ప్రధాని

  ఎవరూ ఊహించని విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడి కాబూల్ నుంచి డిల్లీ వస్తూ దారిలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపాలనుకోవడంతో ఇరు దేశాలలో హర్షం వ్యక్తం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడి దౌత్యపరమయిన పట్టింపులను పక్కన పెట్టి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తునందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అందుకు ప్రతిగా ఆయన కూడా దౌత్యపరమయిన పట్టింపులను పక్కనబెట్టి ఆయనే స్వయంగా మోడీకి స్వాగతం తెలిపేందుకు లాహోర్ లో అల్లామ ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళారు. బహుశః అక్కడే వారిద్దరూ కొంత సేపు మాట్లాడుకొన్నాక మళ్ళీ మోడీ డిల్లీకి బయలుదేరవచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య మొదలయిన చర్చల ప్రక్రియ గురించి కూడా వారు మాట్లాడుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లాహోర్ చేరుకున్న మోడీ

  భారత ప్రధానమంత్రి మోడీ పాకిస్థాన్‌లోని లాహోర్‌కి చేరుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌కి వెళ్ళిన మోడీ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్‌కి వెళ్ళారు. ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం పాకిస్థాన్‌లో మోడీ పర్యటన లేదు. అయితే పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజును పురస్కరించుకుని కాబూల్‌ నుంచి మోడీ ఆయనకు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు షరీఫ్ ఆయన్ని లాహోర్ కి ఆహ్వానించారు. దాంతో మోడీ లాహోర్‌కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయన్ని మోడీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. వాజ్‌పేయి తర్వాత పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్ళిన మొదటి భారత ప్రధాని మోడీ కావడం విశేషం.  

ఇళ్ళమీద నుంచి దూసుకెళ్ళిన విమానం

  కాంగోలో ఒక విమానం విమానాశ్రయంలో దిగే సమయంలో విమానాశ్రయం పక్కనే వున్న నివాసాల మీద నుంచి దూసుకుని వెళ్ళడంతో ఆ ఇళ్ళలో నివసించే ఏడుగురు వ్యక్తులు మరణించారు. సర్వీసెస్ ఎయిర్ కంపెనీకి చెందిన ఒక కార్గో జెట్ విమానం ముజి - మయిలోని విమానాశ్రయంలో లాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే విమానం మాత్రం ఎలాంటి సమస్య లేకుండా విమానాశ్రయంలో దిగింది. ముజీ - మయి విమనాశ్రయంలో సదుపాయాలు సరిగా లేవన్న ఉద్దేశంతో గతంలో కొద్దికాలంపాటు ఈ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిషేధించారు. ప్రజలు వత్తిడి చేయడంతో ఇటీవలే విమానాల రాకపోకలకు అనుమతించారు.  

బాలీవుడ్ నటి సాధన కన్నుమూత

  అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటీమణి సాధన శివ్‌దాసాని (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో కన్నమూశారు. రాజ్‌కపూర్ చిత్రం ‘శ్రీ 420’లో డాన్సర్‌గా నటించిన సాధన ఆ తర్వాత హీరోయిన్‌గా ప్రమోషన్ పొందారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆమె హీరోయిన్‌గా రాణించారు. లవ్ ఇన్ సిమ్లా, ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా, హమ్ దోనో, మేరే మహబూబ్, వో కౌన్ థీ లాంటి సినిమాలు ఆమెకు నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. లవ్ ఇన్ సిమ్లా దర్శకుడు రామకృష్ణ నయ్యర్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు.  

వేద పాఠశాల ప్రారంభించిన ప్రణబ్

  పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఆయి భీమవరంలో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వేద పాఠశాల భవన సముదాయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం వేద పాఠశాల విద్యార్థులతో రాష్ట్రపతి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఎంపీలు మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.  

‘భలే మంచిరోజు’ షార్ట్ రివ్యూ

  తారాగణం: సుధీర్‌బాబు, వామిఖ, ధన్య బాలకృష్ణన్, చైతన్యకృష్ణ, సాయికుమార్, వేణు, పోసాని కృష్ణమురళి. సంగీతం: ఎం.ఆర్.సన్నీ, కెమెరా: శ్యాం దత్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: విజయ్ - శశి, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య, నిర్మాణం: 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్.   ‘భలే మంచిరోజు’ ఒక క్రైమ్ కామెడీ సినిమా. కథ విషయానికి వస్తే, రామ్ (సుధీర్‌బాబు) మెకానిక్ పని చేస్తూ వుంటాడు. తనను ప్రేమ పేరుతో మోసం చేసి మరో అబ్బాయిని పెళ్ళి చేసుకుంటున్న మాయ (ధన్య బాలకృష్ణన్)కి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో పెళ్ళి జరిగే ప్రదేశానికి తన స్నేహితుడు (ప్రవీణ్)తో కలసి కారులో బయల్దేరతాడు. అదే సమయంలో శక్తి (సాయికుమార్) సీత (వామిఖ)ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తూ వుంటాడు. వీరిద్దరి కార్లూ ఒక ప్రదేశంలో ఢీకొంటాయి. ఈ ప్రమాదం సందర్భంగా సీత అక్కడి నుంచి పారిపోతుంది. సీతను వెతికి తీసుకురాకపోతే నీ స్నేహితుడిని చంపేస్తానని శక్తి రామ్‌ని బెదిరిసిస్తాడు. దాంతో సీతను వెతుకుతూ రామ్ బయల్దేరతాడు. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా ఫస్టాఫ్ చకచకా పరిగెడుతుంది. ద్వితీయార్థం మెల్లగా సాగుతుంది. కామెడీ బాగానే వుంది. సాంకేతిక నిపుణులు మంచి ప్రతిభ కనబరిచారు.  

ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవం చేయనున్న మోడీ

  ఆఫ్ఘనిస్తాన్ కోసం భారత్ నిర్మించి ఇస్తున్న పార్లమెంటు భవనాన్ని ప్రారంభోత్సవం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడి రష్యాలో రెండు రోజుల పర్యటన ముగించుకొని కొద్ది సేపటి క్రితమే కాబూల్ చేరుకొన్నారు. ఆ దేశ రాజధాని కాబూల్ నగరంలో సుమారు 86 ఎకరాల విస్తీర్ణంలో రూ.710 కోట్ల వ్యయంతో మొఘల్ సంస్క్రతీ సంప్రదాయాలను ప్రతిభింబిస్తూ పార్లమెంటు భవనం నిర్మించబడింది. ఆఫ్ఘన్ పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవం చేసిన తరువాత నరేంద్ర మోడీ డిల్లీ చేరుకొని భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ నివాసానికి వెళతారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు.

చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు

  క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఏసు క్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్‌ను ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారని, ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన గొప్ప మానవతావాది ఏసు ప్రభువని చంద్రబాబు అన్నారు. అలాగే నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు చూపిన ఉషస్సుతో ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతికి బాటలు వేయాలని అన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ, శాంతి, అహింస, సేవాగుణం, సామరస్యం లాంటి మానవతా విలువలను శతాబ్దాల క్రితమే ప్రబోధించిన గొప్ప వ్యక్తి ఏసుక్రీస్తు అన్నారు.

అయుత చండీయాగంలో మూడోరోజు...

  మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తు్న్న అయుత చండీయాగం మూడోరోజుకు చేరింది. మూడోరోజు శుక్రవారం ఉదయం గురుప్రార్థన, గణపతిపూజ, ఏకాదశన్యాస పూర్వక త్రిసహస్ర చండీ పారాయణాలు, నవావరణ పూజ, నవగ్రహ హోమం, యోగిని బలి, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పునశ్చరణ, దంపతీపూజ, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు వుంటాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధార్మిక ప్రవచనాలు వుంటాయి. మూడోరోజున ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి తదితరులు చండీయాగంలో పాల్గొంటారు.  

దావూద్ ఇబ్రహీం పాక్ లో లేడు కానీ తరచూ వచ్చి పోతుంటాడుట!

  అనేక నేరాలలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఉంటున్నట్లు భారత నిఘావర్గాలు ఆధారాలను చూపుతుంటే, పాక్ ప్రభుత్వం అతను తమ దేశంలో నివసించడం లేదని వాదిస్తోంది. పాక్ ప్రభుత్వం చెపుతున్నది నిజమే కాని పాక్షికంగా మాత్రమేనని పాకిస్తాన్ కి చెందిన ప్రముఖ 'డాన్' మీడియా గ్రూప్ సి.ఈ.ఓ. హమీద్ హరూన్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన ఈరోజు సాయంత్రం “భారత్-పాకిస్తాన్ మధ్య మెరుగుపడిన సంబంధాలను స్థిరీకరించడానికి ఎటువంటి చర్యలు చేప్పట్టాలి” అనే విషయం చర్చించేందుకు ముంబై ప్రెస్ క్లబ్ మరియు అబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నపుడు దావూద్ ఇబ్రహీం గురించి కొన్ని ఆసక్తికరమయిన విషయాలు తెలియజేసారు.   హమీద్ హరూన్ ఆ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ “దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో స్థిరనివాసం ఏర్పరచుకోలేదనే విషయం నేను ఖచ్చితం చెప్పగలను. కానీ అతను తరచూ పాకిస్తాన్ వచ్చి పోతుంటాడనే సంగతి విషయం నేను చాలా సార్లు విన్నాను. అతను దుబాయ్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య తిరుగుతూ అక్కడే ఉంటున్నట్లు నేను విన్నాను. అతనిని నేను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. అతను ఒక హంతకుడు. పాక్ ప్రభుత్వం అటువంటి హంతకులను పట్టుకొని కటినంగా శిక్షించాలని కోరుకొంటున్నాను. అటువంటి వ్యక్తులను ఉపేక్షించరాదు,” అని అన్నారు.   భారత్ మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన జవాబు చెపుతూ “ఒకవేళ భారత్-పాకిస్తాన్ దేశాల ప్రభుత్వాలు తమ చర్చలను ముందుకు తీసుకువెళ్ళడంలో విఫలమయితే, ఇరు దేశాల ప్రజలే చొరవ తీసుకొని రెండు దేశాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు కృషి చేయాలి,” అని అన్నారు.   భారత్-పాకిస్తాన్ దేశాల మత్స్యకారులను ఇరు దేశాల ప్రభుత్వాలు విడుదల చేస్తూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు దోహదపడుతున్నాయి. మత్య్సకారులను దేశభద్రత, రక్షణ కారణాలతో ఇబ్బందిపెట్టకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే వారు రెండు దేశాలలో సమాజంలోని అతి పేద వర్గానికి చెందినవారు,” అని హమీద్ హరూన్ అన్నారు.