బీజేపీ సీనియర్లు మళ్ళీ ఏమి బాంబు ప్రేలుస్తారో?

  బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శాంత కుమార్ ఈరోజు డిల్లీలో మురళీ మనోహర్ జోషి ఇంట్లో సమావేశం అవడం అందరినీ ఆకర్షిస్తోంది. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై ఆరోపణల నేపధ్యంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వారు నలుగురు చర్చించి ఉండవచ్చని తెలుస్తోంది. వారు తమ సమావేశ వివరాలను మీడియాకు తెలియజేయకపోవడంతో వారు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై తమ అసమ్మతిని బహుశః లేఖ ద్వారా పార్టీ అధిష్టానానికి తెలియజేవచ్చని పార్టీలో నేతలు భావిస్తున్నారు.   అరుణ్ జైట్లీని విమర్శించినందుకు ఎంపి కీర్తి ఆజాద్ ని పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని అద్వానీ శిష్యుడుగా చెప్పుకోబడుతున్న శత్రుఘన్ సిన్హా తప్పు పట్టారు. బహుశః ఆయన వారి ఆభిప్రాయన్నే వ్యక్తం చేసి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ రేపు అద్వానీ తదితరులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లయితే, బీజేపీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసివస్తే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు జవాబు చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడవచ్చును.

మోడీకి కత్తి + కత్తిలాంటి గిఫ్ట్

  భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం రష్యా పర్యటనలో వున్న విషయం తెలిసిందే. మోడీ గురువారం నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ మోడీకి అరుదైన కానుకను అందజేశారు. మహాత్మాగాంధీ తన స్వహస్తాలతో రాసిన డైరీలోని ఒక పేజీని గాంధీ చిత్రపటంతో కలిపి మోడీకి కానుకగా పుతిన్ అందజేశారు. ఈ కానుకతోపాటు 18వ శతాబ్దం కాలం నాటి ఒక కత్తిని కూడా పుతిన్‌ మోడీకి అందజేశారు. ఈ విషయాన్ని మోడీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. తనకు అరుదైన కానుకలు ఇచ్చినందుకు మోడీ పుతిన్‌కి ట్విట్టర్ ద్వారా కూడా ధన్యవాదాలు తెలిపారు.  

చండీయాగంలో రెండో రోజు...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం గురువారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. చండీయాగంలో భాగంగా గురువారం నాడు నిర్వహించే కార్యక్రమాలు ఇవి... గురుప్రార్థన, గోపూజ, ఏకాదశ న్యాసపూర్వక ద్వి సహస్ర చండీ పారాయణ, నవావరణ పూజ, యోగినీ బలి, మహా ధన్వంతరీ యాగం, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పునశ్చరణ, మహాసౌరం, ఉక్తదేవతా జపాలు, కుమారి - సువాసినీ - దంపతి పూజ, మహ మంగళహారతి, విశేష నమస్కారాలు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధార్మిక ప్రవచనం, సాయంత్రం కోటి నవాక్షరి పునశ్చరణ, ఉపచార పూజ, విశేష నమస్కారాలు, శ్రీచక్ర మండలారాధనం, అష్టావధాన సేవ, ప్రసాద వినియోగం, రాత్రి ఏడున్నరకు శ్రీరామలీల హరికథా కాలక్షేపం.  

కీర్తి ఆజాద్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు

  ఊహించినట్లే బీజేపీ తన ఎంపి కీర్తి ఆజాద్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కుంభకోణంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పోటీగా కీర్తి ఆజాద్ కూడా అరుణ్ జైట్లీపై విమర్శలు గుప్పించారు. దాని వలన పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాడ్డాయి. పార్టీ అధిష్టానం ఎంతగా హెచ్చరిస్తున్నా వినకుండా జైట్లీపై విమర్శలు గుప్పిస్తుండటంతో కీర్తి ఆజాద్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ బుధవారం సాయంత్రం ప్రకటించింది.   ఈ విషయం తెలియగానే కీర్తి ఆజాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి “నేను అవినీతికి వ్యతిరేకంగానే పోరాడాను తప్ప వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు. డీడీసీఏలో అవినీతి జరిగిన మాట నూటికి నూరుపాళ్ళు వాస్తవం. దాని గురించి మాట్లాడినందుకే నాపై ఇటువంటి చర్య తీసుకోవడం దురదృష్టకరం. డీడీసీఏలో గుండు సూది మొదలుకొని పెద్ద పెద్ద నిర్మాణాల వరకు ప్రతీ కొనుగోలులో, పనిలో అవినీతి జరిగింది. ఈ అవినీతి చివరికి ‘వికీ లీక్స్’ వరకు చేరుకొంది అంటే ఎంత బారీ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధం చేసుకోవచ్చును. వికీ లీక్స్ సంస్థ విడుదల చేసిన జాబితాలలో ఆ అవినీతి బాగోతాలు చూడవచ్చును,” అని కీర్తి ఆజాద్ అన్నారు. ఆ వివరాలున్న వీడియోని ఆయన మీడియా ప్రతినిధులకు ప్రదర్శించి చూపారు. పార్టీలో ఉన్నా లేకపోయినా అవినీతిపై తన పోరాటం కొనసాగిస్తానని అన్నారు.

గవర్నరు సదాశివంను అవమానించిన ఎయిరిండియా..!

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి..కేరళ గవర్నరు సదాశివంకు చేదు అనుభవం ఎదురైంది. నిన్న రాత్రి ఆయన కోచి నుండి త్రివేండ్రంకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లగా.. ఆయన వెళ్లే సరికి అక్కడ విమానం లేకపోయేసరికి ఆయన షాకయ్యారు. వివరాల ప్రకారం.. అసలు సదాశివం వెళ్లవలసిన విమానం 9.20కి బయలుదేరాల్సి ఉంది. అయితే అది కాస్త ఆలస్యమై షెడ్యూలు 11.40కి మారింది. అయితే గవర్నరు కూడా 11.28కే వచ్చేశారు. కానీ అప్పటికే విమానం ఎక్కేందుకు ఉపయోగించే నిచ్చనను తొలగించేశారు. గవర్నరుకు ఎలాంటి చెకింగ్ లేకుండా పంపించొచ్చు కాబట్టి ఆయన్ను 11.28కి కూడా అనుమతించొచ్చు. అయినా ఆయన్ను వదిలేసి 11.40కి విమానం గాలిలోకి ఎగిరింది. దీంతో షాక్ కు గురయిన సదాశివం చాలాసేపు మాట్లాడకుండా ఎయిర్ పోర్టులోనే అలా ఉండిపోయారు. ఎయిరిండియాపై కేసు వేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అయుత చండీయాగం... సంప్రదాయ దుస్తుల్లో గవర్నర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయుత మహా చండీయాగం నిర్వహిస్తున్న ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ ప్రాంతమంతా సందడిగా వుంది. రుత్విక్కులు, వేద పండితులు, యాగాన్ని తిలకించడానికి వచ్చిన ప్రజలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా వుంది. యాగానికి వస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకడానికి కేసీఆర్ కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు సిద్ధంగా వున్నారు. ఏ అతిథి వచ్చినా సాదర స్వాగతం పలుకుతున్నారు. ఇంతలో గవర్నర్ నరసింహన్ వస్తు్నారన్న సమాచారం అందింది. కాసేపట్లో గవర్నర్ కారు వచ్చి కేటీఆర్, హరీష్ రావు ముందు ఆగింది. అందులోంచి దిగిన గవర్నర్ నరసింహన్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన సూటూ బూటులో దిగలేదు. నూటికి నూరుశాతం సంప్రదాయమైన దుస్తుల్లో సతీ సమేతంగా ఆయన యాగానికి వచ్చారు. అసలు గవర్నర్ నరసింహన్ శైలే అది.. ఆయన దేవాలయానికి వెళ్తే చొక్కా వేసుకోరు. ఆధ్మాత్మికవేత్త అయిన ఆయనకు ఎక్కడకి ఎలా రావాలో బాగా తెలుసని అక్కడున్నవారు అనుకోవడం వినిపించింది.  

అరుణ్ జైట్లీ విషయంలో వెనక్కి తగ్గిన కేజ్రీవాల్..?

డీడీసిఏ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరుణ్ జైట్లీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూసి కేజ్రీవాల్ కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అదేంటంటే.. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారంలో అరుణ్ జైట్లీకి క్రీడారంగ ప్రముఖుల నుంచి మద్దతు దొరకడమే. కేజ్రీవాల్ అరుణ్ జైట్లీ పై చేస్తున్న విమర్శలకు గాను గంగూలీ స్పందిస్తూ రాజకీయ నాయకుడు ఎన్నికల ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడతారనీ అందుకే వారి అధికారాలను ఎవరూ ప్రశ్నించజాలరని అన్నారు. గుంగూలీ తో పాటు ఇంకా అరణ్ జైట్లీకి వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లీల మద్దతు కూడా లభించింది. అంతేకాదు ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ డీడీసీఏ నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఇంతకుముందే విచారణ జరిగిందని.. దీనిలో ఎటువంటి అక్రమాలు జరగలేదని విచారణలో తేలిందని చెప్పారు. అవినీతిపరుడైన అధికారిని దగ్గర పెట్టుకుని అవినీతిరహిత పాలన అందిస్తామని కేజ్రీవాల్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీంతో అరుణ్ జైట్లీకి ప్రముఖ క్రీడాకారుల మద్దతు లభించే సరికి కాస్త సలైంట్ అయినట్టు కనిపిస్తుంది.

హేమను భర్తే చంపేశాడు

  ముంబైకి చెందిన ప్రముఖ చిత్రకారిణి హేమ ఉపాధ్యాయ్, ఆమె లాయర్ హరీష్ భంభానీ కొద్ది రోజుల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులు హేమ భర్త, చిత్రకారుడు చింతన్ ఉపాధ్యాయ్‌ని నిందితుడిగా గుర్తిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత పోలీసులు తమదైన శైలిలో చింతన్‌ను విచారించగా, కోర్టు కేసులు వదిలించుకోవడానికే హేమను హత్య చేశానని చింతన్ ఒప్పుకున్నాడు. చిత్రకారులైన ఈ దంపతుల మధ్య గత కొన్నేళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి. 2013 సంవత్సరంలో హేమా ఉపాధ్యాయ్ చింతన్ ఉపాధ్యాయ్ మీద కేసు పెట్టింది. అప్పటి నుంచి అతన్ని కోర్టు చుట్టూ తిప్పుతోంది. కోర్టు కేసుతో విసుగెత్తిపోయిన చింతన్ తన భార్యను చంపడం ద్వారా కేసుల నుంచి తప్పించుకుందామని అనుకున్నాడు. దానికోసం విద్యాధర్ అనే వ్యక్తితో ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారం విద్యాధర్ హేమకు ఫోన్ చేశాడు. చింతన్ నుంచి విడాకులు తీసుకోవడానికి ఉపకరించే ఆధారాలు తన దగ్గర వున్నాయని, తాను నివసించే వేర్‌హౌస్ ప్రాంతానికి వస్తే వాటిని ఇస్తానని చెప్పాడు. దాంతో హేమ తన లాయర్ హరీష్‌తో కలసి వేర్‌హౌస్ ప్రాంతంలోవున్న విద్యాధర్ ఇంటికి వెళ్ళింది. అక్కడ విద్యాధర్ వాళ్ళిద్దర్నీ హత్యచేసి, మృతదేహాలను అట్టపెట్టెల్లో కుక్కి చెత్త కుండీల దగ్గర పారేశాడు. హేమ హత్య విషయం బయట పడిన తర్వాత చింతన్ ఉపాధ్యాయ్ అమాయకుడిలాగా భోరుభోరున ఏడ్చాడు. అయితే చివరికి అతనే హత్యకు కారణమని బయటపడింది.  

ఢిల్లీ కోర్టులో కాల్పులు..

ఢిల్లీ కోర్టులో దుండగులు కాల్పులు జరిపి కలకలం సృష్టించారు.  న్యూఢిల్లీలోని కర్కర్డూమా కోర్టులో రూమ్ నెం. 73లోకి ఐదుగురు దుండగలు ప్రవేశించి జడ్జి ఎదుటే 10 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు, కోర్టు క్లర్క్ కు గాయాలు అవ్వగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ కాల్పులతో అప్రమత్తమైన సిబ్బంది ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మిగిలిన ముగ్గురు ఆగంతకులు పరారయ్యారు. కాగా గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి... పట్టుబడిన ఇద్దరు నిందితులను విచారిస్తున్నారు. పరారైన ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.