amaravathi stone foundation

కేసీఆర్ ను చాలా జాగ్రత్తగా చూసుకున్న చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ ను స్వయంగా శంకుస్థాపన కార్యక్రమానికి పిలిచిన సంగతి అందరికి తెలిసిందే. కేసీఆర్ కూడా తాను వస్తానని చెప్పిన మాట ప్రకారం శంకుస్థాపనకు వెళ్లారు. అయితే ఏదో పిలిచాం కదా మన పని అయిపోయిందిలే అని వ్యవహరించకుండా.. కేసీఆర్ వచ్చిన దగ్గర నుండి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే మంత్రులకు ఆదేశించడం జరిగిందట. అంతేకాదు చంద్రబాబు చెప్పినట్టు మంత్రులు కూడా కేసీఆర్ ను అదే రీతిలో ఆహ్వానించడం.. ఆయనకు కావలసినవి చూసుకోవడం చేశారంట. దీనిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన ప్రాంగణానికి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి చంద్రబాబుతో పాటు కేసీఆర్ కూడా వెళ్లారు. అయితే కేసీఆర్ కొంచెం వెనుక ఉండగా.. చంద్రబాబు కేసీఆర్ ను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అదొక్కటే కాదు ఇంకా ఇతర అంశాల్లో కూడా చంద్రబాబు కేసీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వడానికే ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఒక్క చంద్రబాబే కాదు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి ఎవరో ఒకరు కేసీఆర్ తో మాటలు కలుపుతూ కేసీఆర్ ఎక్కడా నొచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నాలు చేశారు. అంతేనా అమరావతి శిలాఫలకంపై కూడా కేసీఆర్ పేరు చేర్చి అత్యంత గౌరవం దక్కించారు చంద్రబాబు.

AP CM

మోడీ ప్రసంగంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చ

  ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార తెదేపా-ప్రతిపక్ష పార్టీల మధ్య అప్పుడే ఈ విషయం గురించి విమర్శలు ప్రతివిమర్శలు మొదలయిపోయాయి. ఈ విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చిస్తారని సమాచారం.   ప్రధాని నరేంద్ర మోడీ నిన్న తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడం తనకు చాలా నిరాశ కలిగించిందని గల్లా జయదేవ్ అన్నారు. కేంద్రంతో కలిసి కొనసాగుతున్నంత కాలం ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ కోసం దానితో పోరాటం చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాని ఏవిధంగా సాధించుకోవచ్చనే దానిపై సరయిన అవగాహన ఉండాలని కనుక దీనిపై ఏవిధంగా ముందుకు సాగాలనే దాని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని గల్లా జయదేవ్ తెలిపారు.

amarawathi

అమరావతి శిలాఫలకంపై గల్లా అసంతృప్తి

  గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నియోజకవర్గాల పరిధిలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగగా, కనీసం వీరిద్దరికీ సరైన ప్రాధాన్యతే దక్కలేదు, ప్రోటోకాల్ ప్రకారం చూసినా, అ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేకి వేదికపై చోటు ఇవ్వాల్సి ఉండగా... వీళ్లిద్దరినీ పట్టించుకున్న పాపానపోలేదు, అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆటలో అరటిపండులా మారగా, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు. కనీసం శంకుస్థాపన చేస్తున్న సమయంలోనైనా స్థానిక ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కి అవకాశం కల్పించాల్సి ఉంది, పైగా అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పేర్లు లేకపోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి, దీనిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేసిన గల్లా జయదేవ్... స్థానిక ప్రజాప్రతినిధులను ఇలా అవమానించడం సరికాదన్నారు.

ysrcp ap special status

కేంద్ర, రాష్ట్ర సర్కారులకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల ధర్నా

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఏపీ ప్రత్యేక హోదాపైన కాని.. ప్రత్యేక ప్యాకేజీ పైన కాని ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన రోజున ఏదో ప్రకటన చేస్తారని చూసిన తెలుగు ప్రజల ఆశలపై మోడీ నీరు జల్లారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారని.. ఈనేపథ్యంలో ఆందోళనలు చేపడతామని చెప్పారు. దీనిలో భాగంగానే వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, విజయనగరం, కృష్ణా జిల్లాలో పలువురు వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

amaravathi stone foundation

ఫ్యూఛర్ సీఎం దేవాన్ష్ అట..

ఏపీ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర దేశ ప్రధానులు, ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే అందరూ పాల్గొన్నా ఒకరు మాత్రం ఈ కార్యక్రమంలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అదేవరో కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణల ముద్దుల మనువడు దేవాన్ష్. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఈ బుడతడని అందరూ నేతలు ముద్దుచేయడం ఒక ఎత్తైతే.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొంచెం సేపు దేవాన్ష్ ని ముద్దుచేయడం ఒక ఎత్తు. అంతేకాదు.. వేదిక మీద బాలకృష్ణ దేవాన్ష్ ను ఎత్తుకొని ఉండగా పక్కన ఉన్న నేతలు దేవాన్ష్ ను రాబోయే కాలంలో కాబోయే సీఎం అంటూ వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లకు నచ్చినా ఇది విన్న కొంతమంది నేతలు మాత్రం నోట మాట రాని స్థితిలో పడిపోయారు.

Telangana

ఇరువురు ముఖ్యమంత్రులు ఇకముందు కూడా ఇలాగే వ్యవహరించాలి

  అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించడానికి లేవగానే సభకి వచ్చిన ప్రజలు హర్షద్వానాలతో ఆయనను స్వాగతించడం విశేషం. ఇంతవరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ని యుద్దాలు చేసినప్పటికీ ఆయన రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానాన్ని మన్నించి తన మంత్రులతో సహా ఈ కార్యక్రమానికి హాజరయినందునే ప్రజలలో ఆయన పట్ల ఒక సదాభిప్రాయం ఏర్పడింది. ఆయన కారణంగానే రాష్ట్ర విభజన జరిగి, హైదరాబాద్ కోల్పోయి మళ్ళీ కొత్తగా రాజధాని నిర్మించుకోవలసి వస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరును కూడా అమరావతి శిలాఫలకం చేర్చి గౌరవించింది. కనుక ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవలైస్న బాధ్యత ఆయనదే.   నిన్న సభలో ఆయన చాలా హుందాగా మాట్లాడారు. దసరా మరియు అమరావతి శంఖుస్థాపన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసారు. రాష్ట్రానికి అత్యుత్తమ రాజధాని నగరం నిర్మించుకోవాలని కోరుకొన్నారు. రాష్ట్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణం కోసం తమ ప్రభుత్వం సహకరించడానికి సిద్దంగా ఉందని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా వివేకంతో, చాలా చక్కగా వ్యవహరించారు. అందుకు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు.   ఇంతకాలం వారిరువురి మధ్య నెలకొన్న తీవ్ర విభేదాల కారణంగానే చిన్న సమస్య కూడా కొండంత అయ్యేది. ఒకరిపట్ల మరొకరికున్న వ్యక్తిగత దురాభిప్రాయాలు, రాజకీయ విద్వేషాలను పక్కనపెట్టి ఇకపై ఇదే విధంగా సానుకూల వైఖరి అలవరుచుకొన్నట్లయితే రెండు రాష్ట్రాలు ఊహించిన దానికంటే చాలా వేగంగా అన్ని విధాలా అభివృద్ధి సాధించవచ్చును. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే చెప్పారు.

amaravathi stone foundation

ఏపీ శంకుస్థాపన.. మోడీ వరుస ట్వీట్లు

  ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి.. ఆ తరువాత తిరుమల బాలాజీని దర్శించుకున్న నేపథ్యంలో ఆయన ట్విట్ట్రర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెరలేపిందని.. నూతన రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించేందుకు ముందడుగు వేసిందని.. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అంతేకాదు పార్లమెంట్ నుండి మట్టిని, యమునా నది నుండి నీటిని తీసుకెళ్లి చంద్రబాబుకు అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం తాను చేసిన కార్యక్రమాల గురించి తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేశారు. శంకుస్థాపన అనంతరం తాను బాలాజీ దర్శనార్దం తిరుమల వెళ్లానని.. అక్కడ బాలాజీని దర్శించుకొని ప్రార్ధనలు జరిపానని, అనంతరం అక్కడి ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్ ను ప్రారంభించానని ట్విట్టర్ లో తెలిపారు.

governor narasimhan

గవర్నర్ సాష్టాంగ నమస్కారాలు.. సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది

  గవర్నర్ నరసింహన్ కు దైవభక్తి కాస్త ఎక్కవే అని మనందరికి తెలిసిన విషయమే. ఆయన భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల బాలాజీని అమితంగా అరాధించే ఆయన కనీసం నెలకు ఓ రెండు సార్లు అయినా దేవుని దర్శనార్దం తిరుమలకి వెళుతుంటారు. అయితే ఆయన భక్తి ఎలా ఉన్నా ఆయన వల్ల మాత్రం సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆయన వల్ల సెక్యూరిటీ ఇబ్బంది పడటం ఏంటనుకుంటున్నారా.. నిన్న ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ కూడా విచ్చేశారు. శంకుస్థాపన అనంతరం మోడీ తిరుమల బాలాజీని దర్శించుకోవడానికి వెళ్లగా ఆయనతో పాటు గవర్నర్ కూడా వెళ్లారు. అక్కడికి వెళ్లిన గవర్నర్ ప్రధాని వెంట నడిచారు. అయితే ఆలయం లోపలికి వెళ్లిన వెంటనే గవర్నర్ ఒక్కసారిగా ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం పెట్టడంతో వెనుక ఉన్న భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాకయ్యి ఆయన్ని దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఒక్క సాష్టాంగ నమస్కారమే కదా అని అనుకున్న సిబ్బందికి.. తాను వరుసగా ఐదారు పెట్టేసరికి వెనక్కి వెళ్లలేక.. అటు ముందుకు వెళ్లలేక కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ys jagan

మోడీ నిరాశపరిచారు.. ఆందోళనలు చేపడతాం.. జగన్

  ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీ 5 కోట్ల ఆంధ్రా ప్రజలను నిరాశపరిచారని వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీ ఏపీ ప్రత్యేక హోదా గురించి కానీ, ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ ఎటువంటి హామీ ఇవ్వకపోవడాన్ని జగన్ తప్పు పట్టారు.  ప్రధాని మోడీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని ప్రజలంతా ఆశించారని, అయితే హోదాపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజలు నిరాశ చెందారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మోడీ వస్తారు.. ఏదో ఒక ప్రకటన చేస్తారు అని ఆశించిన ఏపీ ప్రజలకు.. ఢిల్లీ నుండి మట్టి తీసుకొచ్చి చేతిలో పెట్టారని ఎద్దేవ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి తెలుగు ప్రజలను మోసం చేశారని.. వారికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.

amaravathi stone foundation

ఒక్క మాట చెప్పి ఊరుకుంటారా? మోడీపై ఏపీ ప్రజల ఆగ్రహం

  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీ చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు ఎందరెందరో ప్రముఖులు, రాజధాని ప్రజలు అంతా కలిసివచ్చారు. అయితే అంతా బానే ఉన్నా ఒక్క విషయంలో మాత్రం ఏపీ ప్రజలు మోదీపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్డీయే సర్కార్ ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని గత కొంతకాలం నుండి చెపుతున్నా కాని ఇప్పటి వరకూ దాని మీద ఓ క్లారిటీ ఇచ్చింది లేదు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు సమయం తీసుకున్న మోడీ ఏపీ శంకుస్థాపన రోజైన ఏదో ఒక తీపి ప్రకటన చేస్తారని ఆశగా ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైంది. శంకుస్థాపన అనంతరం ప్రసంగించిన మోడీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఒక్క మాట చెప్పి ఊరుకున్నారు. దీంతో ఏపీ ప్రజలు మోడీపై మంటక్కిపోతున్నారు. కనీసం ఏదో ఒక చిన్న చిన్న వరాలు కూడా ఇవ్వకుండా ఉంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

modi speechy

విభజన హామీలన్నీ నెరవేరుస్తామన్న మోడీ

  నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ...తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు, ప్రియమైన సోదరసోదరీమణులారా.. నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ...అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు, అమరావతికి ఘనమైన చరిత్ర ఉందన్న మోడీ... అమరావతి ప్రజా రాజధాని కాబోతోందని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని నిర్మించాలన్న చంద్రబాబు దీక్ష తనకు నచ్చిందని, బాబు సంకల్పానికి, కార్యదీక్షకు ఇది నిదర్శనమన్నారు, చంద్రబాబు పిలుపు మేరకు తాను కూడా పార్లమెంట్ ప్రాంగణం నుంచి మట్టిని, పవిత్ర నది యమునా నుంచి జలాలను తీసుకొచ్చానని మోడీ అన్నారు, పట్టణాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దిక్సూచిలా ఉండాలని ఆకాంక్షించిన మోడీ...అమరావతికి దేశ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికెళ్లి చంద్రబాబు పిలవడం తనకు ఆనందాన్ని కలిగించిందని, రాష్ట్రాలు వేరైనా ఇద్దరి ఆత్మ మాత్రం తెలుగేనని మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చి... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని ప్రధాని మోడీ అన్నారు.

babu specch

మోడీ సహకారం మరువలేనిది-బాబు

  అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీకి చంద్రబాబునాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి, యమునా నది నీటి తెచ్చి ఇచ్చి అమరావతి నిర్మాణానికి తన సహకారం ఉంటుందని ప్రకటించిన మోదీకి బాబు ధన్యవాదాలు తెలిపారు, ప్రధాని నేతృత్వంలో అమరావతిలో ప్రజారాజధానిని నిర్మిస్తామన్న చంద్రబాబు...  ప్రధాని ఇప్పటికే చాలా సహాయం చేశారని అన్నారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపి పోలవరం ప్రాజెక్టుకు మోడీ సహకరించారని, అంతేకాకుండా వెనుకబడిన జిల్లాలకు సహాయం చేశారని, ప్రాజెక్టులు అందించారని చంద్రబాబు చెప్పారు. కేంద్రం అందిస్తున్న సహకారానికి ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, అలాగే అమరావతి మాస్టర్ ప్లాన్ సింగపూర్‌ కు, నిర్మాణంలో సహకారం అందిస్తున్న జపాన్ కు చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

babu specch

కేసీఆర్ కి చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు

  రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని, అయితే సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటే ముందుకెళ్తే తెలుగు రాష్ట్రాలు రెండూ అభివృద్ధిలో దూసుకెళ్తాయని చంద్రబాబు అన్నారు, తెలుగు మాట్లాడేవారంతా కలిసి పనిచేసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్న బాబు... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నారని అన్నారు, అమరావతి శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు... పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్తామన్నారు, సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయన్న చంద్రబాబు... వాటిని పరిష్కరించకుంటూ ముందుకెళితే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు

chandrababu

ఏపీకి రెండు పండుగలు-చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ రెండు పండగలు జరుపుకుంటున్నారని...ఒకటి విజయదశమి అయితే రెండోది అమరావతి నగరం శంకుస్థాపన మహోత్సవమని చంద్రబాబునాయుడు అన్నారు, ప్రజలు టీడీపీకి అధికారం కట్టబెట్టి... ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించే బృహుత్తరమైన బాధ్యతను తమపై పెట్టారని చంద్రబాబు అన్నారు, తన మాటను నమ్మి... రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని, అమరావతికి భూములిచ్చిన రైతాంగాన్ని అభినందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వాములను చేశామన్న చంద్రబాబు... కులాలు, మతాలకు అతీతంగా మనమట్టి-మన నీరు సేకరించామన్నారు. ఎన్టీఆర్‌, పీవీ నరసింహారావు, అబ్దుల్‌ కలాం పుట్టిన గ్రామాల నుంచి మట్టిని తీసుకువచ్చి రాజధాని ప్రాంతంలో చల్లామని సీఎం పేర్కొన్నారు.

venkaiah naidu

భారత్... ఏపీ వైపు చూస్తోంది-వెంకయ్య

  అభివృద్ధి విషయంలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు, అమరావతి శంకుస్థాపన వేదికపై నుంచి మాట్లాడిన వెంకయ్య... ప్రపంచంలోనే అద్భుత రాజధానిగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు, అభివృద్ధిలో ప్రజలంతా భారతదేశం వైపు చూస్తుంటే, భారత్ మాత్రం హైదరాబాద్ వైపు, ఏపీ వైపు చూస్తుందని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్... పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో పోటీ పడాలన్న వెంకయ్యనాయుడు....పరిపాలన సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, తెలుగు ప్రజలంతా కలిసుండాలని సూచించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ ఒక వేదిక పైకి రావడం సంతోషకరమని, కేసీఆర్, చంద్రబాబులు ప్రజలకు మంచి మార్గాన్ని చూపారని అన్నారు. ప్రభుత్వం, ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ రాజధాని నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు వెంకయ్యనాయుడు

కేసీఆర్ మాటలకు జైకొట్టిన ఆంధ్రులు

  అమరావతి శంకుస్థాపన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షధ్వానాలు చేశారు. కేసీఆర్ ప్రసంగిస్తారని ఆహ్వానించగానే ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది, కేసీఆర్ ప్రసంగిస్తున్నంతసేపు ఏపీ ప్రజలు పాజిటివ్ గా స్పందించారు, ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతి నిర్మాణం కావాలంటూ కేసీఆర్ చెప్పగానే హర్షధ్వానాలు చేశారు, అలాగే అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం... అన్ని సహాయ సహాకారాలు అందిస్తుందని ప్రకటించిన కేసీఆర్... తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున ఏపీ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగులో మాట్లాడిన సింగపూర్ మంత్రి

  ఏపీ నూతన రాజధాని అమరావతికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ శుభాకాంక్షలు తెలియజేశారు, అక్కడక్కడా తెలుగులో మాట్లాడుతూ దసరా శుభాకాంక్షలు చెప్పిన ఈశ్వరన్... ఆంధ్రులను ఆకట్టుకున్నారు, అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉందని, ఏడాది క్రితమే చంద్రబాబు తన విజన్ గురించి వివరించారని, అందుకే అమరావతి మాస్టర్ ప్లాన్ చేసిచ్చామని అన్నారు. చంద్రబాబు, ఏపీ ప్రభుత్వ పెద్దలు, ప్రజల మద్దతుతో సింగపూర్‌ సంస్థలు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాయని, దీన్ని జులైలోనే ఏపీకి అందజేశామని ఈశ్వరన్ తెలిపారు, సింగపూర్‌ ప్రధాని, ప్రజల తరపున ఏపీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈశ్వరన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.