కారులో హెల్మెట్ పెట్టుకోనందుకు జరిమానా!
బండితోలేవారు హెల్మెట్ పెట్టుకోకపోవడం నేరం. మరి కారు నడిపేవారు కూడా హెల్మెట్ ధరించి వెళ్లాలంటే ఎలా! అదంతా మాకు అనవసరం అంటున్నారు బెంగళూరు పోలీసులు. హెల్మెట్ ధరించకుండా కారుని నడిపినందుకుగాను 100 రూపాలయ జరిమానా చెల్లించవలసిందిగా ఎమ్.ఎస్.పాటిల్ అనే వ్యక్తికి చలాను పంపారు. ఇదేదో పొరపాటుగా చేసిందనుకోవడానికి లేదు.
ఎందుకంటే కొన్నాళ్ల క్రితమే ఆ రాష్ట్ర బీజేపీ నేత ప్రకాష్‌కు కూడా ఇలాంటి ఒక చలాను పంపారు. ‘ఫలానా రోజున మీ డ్రైవరు కాలు తోలుతుండగా, మీరు పక్కనే కూర్చుని ఉన్నారనీ, అయితే మీరు ఆ సమయంలో హెల్మెట్ ధరించి లేరనీ, అందుకుగాను 100 రూపాయల జరిమానా చెల్లించమనీ...’ ప్రకాష్‌గారికి అందిన తాఖీదులో ఉంది. కారు నడిపేటప్పుడే హెల్మెట్టే దండుగ అయితే, కారులో కూర్చున్నవారు కూడా దాన్ని ధరించాలి అంటే ఏం చేసేది అంటూ బెంగళూరు వాసులు తలలు పట్టుకుంటున్నారు. బెంగళూరు ట్రాఫిక్ అధికారులు మాత్రం ఇలాంటి చిన్నాచితకా పొరపాట్లు సహజమే కాబట్టి, వచ్చి వివరణ ఇచ్చుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. అంటే! పోలీసులు తప్పు చేసినా కూడా జనాలు వెళ్లి వివరణ ఇచ్చుకోవాలన్నమాట.