ఇరువురు ముఖ్యమంత్రులు ఇకముందు కూడా ఇలాగే వ్యవహరించాలి
posted on Oct 23, 2015 @ 12:22PM
అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించడానికి లేవగానే సభకి వచ్చిన ప్రజలు హర్షద్వానాలతో ఆయనను స్వాగతించడం విశేషం. ఇంతవరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ని యుద్దాలు చేసినప్పటికీ ఆయన రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానాన్ని మన్నించి తన మంత్రులతో సహా ఈ కార్యక్రమానికి హాజరయినందునే ప్రజలలో ఆయన పట్ల ఒక సదాభిప్రాయం ఏర్పడింది. ఆయన కారణంగానే రాష్ట్ర విభజన జరిగి, హైదరాబాద్ కోల్పోయి మళ్ళీ కొత్తగా రాజధాని నిర్మించుకోవలసి వస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరును కూడా అమరావతి శిలాఫలకం చేర్చి గౌరవించింది. కనుక ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవలైస్న బాధ్యత ఆయనదే.
నిన్న సభలో ఆయన చాలా హుందాగా మాట్లాడారు. దసరా మరియు అమరావతి శంఖుస్థాపన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసారు. రాష్ట్రానికి అత్యుత్తమ రాజధాని నగరం నిర్మించుకోవాలని కోరుకొన్నారు. రాష్ట్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణం కోసం తమ ప్రభుత్వం సహకరించడానికి సిద్దంగా ఉందని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా వివేకంతో, చాలా చక్కగా వ్యవహరించారు. అందుకు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు.
ఇంతకాలం వారిరువురి మధ్య నెలకొన్న తీవ్ర విభేదాల కారణంగానే చిన్న సమస్య కూడా కొండంత అయ్యేది. ఒకరిపట్ల మరొకరికున్న వ్యక్తిగత దురాభిప్రాయాలు, రాజకీయ విద్వేషాలను పక్కనపెట్టి ఇకపై ఇదే విధంగా సానుకూల వైఖరి అలవరుచుకొన్నట్లయితే రెండు రాష్ట్రాలు ఊహించిన దానికంటే చాలా వేగంగా అన్ని విధాలా అభివృద్ధి సాధించవచ్చును. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే చెప్పారు.