ముస్లిం చట్టాలపై న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు
ముస్లింలు అనుసరించే నిబంధనలు (షరియా) గురించి కేరళ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు, అక్కడ పెనుదుమారాన్ని సృష్టిస్తున్నాయి. కమాల్ పాషా అనే సదరు న్యాయమూర్తి ఒక సమావేశంలో మాట్లాడుతూ... షరియాలోని అనేక అంశాలు స్త్రీల పట్ల పక్షపాతం కలిగి ఉన్నాయనీ, అందుకని దేశంలోని మిగతా ప్రజలందరి కోసం నియమించి ‘ఏకరీతి పౌర నిబంధన’ (యూనిఫాం సివిల్ కోడ్)ను వ్యతిరేకించడం మంచిది కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడం లేదని పాషా వాపోయారు. కమాల్ పాషా వ్యాఖ్యలు కేరళలో సంచలనం సృష్టించాయి. కేరళలో ఉన్న ముస్లిం సంస్థలు అన్నీ కూడా ఏకతాటిన ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. కమాల్ మాట్లాడిన మాటలు హిందూ అతివాద సంస్థల ప్రకటనల్లా ఉన్నాయని మండిపడుతున్నాయి. ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న కేరళలో, ఈ ప్రకటన మరింత వివాదాన్ని రాజేసే ప్రమాదం లేకపోలేదు.