మోడీ ప్రసంగంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చ
posted on Oct 23, 2015 @ 2:47PM
ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార తెదేపా-ప్రతిపక్ష పార్టీల మధ్య అప్పుడే ఈ విషయం గురించి విమర్శలు ప్రతివిమర్శలు మొదలయిపోయాయి. ఈ విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చిస్తారని సమాచారం.
ప్రధాని నరేంద్ర మోడీ నిన్న తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడం తనకు చాలా నిరాశ కలిగించిందని గల్లా జయదేవ్ అన్నారు. కేంద్రంతో కలిసి కొనసాగుతున్నంత కాలం ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ కోసం దానితో పోరాటం చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాని ఏవిధంగా సాధించుకోవచ్చనే దానిపై సరయిన అవగాహన ఉండాలని కనుక దీనిపై ఏవిధంగా ముందుకు సాగాలనే దాని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తానని గల్లా జయదేవ్ తెలిపారు.