విభజన హామీలన్నీ నెరవేరుస్తామన్న మోడీ
posted on Oct 22, 2015 @ 3:00PM
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ...తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు, ప్రియమైన సోదరసోదరీమణులారా.. నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ...అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు, అమరావతికి ఘనమైన చరిత్ర ఉందన్న మోడీ... అమరావతి ప్రజా రాజధాని కాబోతోందని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని నిర్మించాలన్న చంద్రబాబు దీక్ష తనకు నచ్చిందని, బాబు సంకల్పానికి, కార్యదీక్షకు ఇది నిదర్శనమన్నారు, చంద్రబాబు పిలుపు మేరకు తాను కూడా పార్లమెంట్ ప్రాంగణం నుంచి మట్టిని, పవిత్ర నది యమునా నుంచి జలాలను తీసుకొచ్చానని మోడీ అన్నారు, పట్టణాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దిక్సూచిలా ఉండాలని ఆకాంక్షించిన మోడీ...అమరావతికి దేశ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికెళ్లి చంద్రబాబు పిలవడం తనకు ఆనందాన్ని కలిగించిందని, రాష్ట్రాలు వేరైనా ఇద్దరి ఆత్మ మాత్రం తెలుగేనని మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చి... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని ప్రధాని మోడీ అన్నారు.