కన్నయాను నిలదీసిన ప్రొఫెసర్‌!

  మకరంద్‌ పరాంజపేయ్‌- జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆంగ్లోపన్యాసకుడు. పరాంజపేయ్ ఒక కవి కూడా! ఆయన నిన్న విద్యార్థులతో మాట్లాడుతూ జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయాకుమార్‌ మీద నేరుగా విరుచుకుపడ్డారు. పరాంజపేయ్‌ ఉపన్యాసానికి కన్నయా తదితరులు తరచూ అడ్డుతగులుతూనే ఉన్నా ఆయన తను అనాలనుకున్న నాలుగు మాటలనూ అనేసి కూర్చున్నారు. కన్నయాకుమార్‌ విడుదలైన తరువాత చేసిన ఉత్తేజపూరతి ప్రసంగంలో చాలా చారిత్రక అసత్యాలు ఉన్నాయని పేర్కొన్నారు పరాంజపేయ్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత గోల్వార్కర్‌, ఇటలీ నియంత ముస్సోలినీని కలిశారని కన్నయా చెప్పడం అలాంటి అసత్యాలలో ఒకటని అన్నారు పరాంజపేయ్. ఒక వ్యక్తిని తీవ్రవాదం అనే ఆరోపణ మీద ఉరితీసినందుకు ఇంతగా మండిపడుతున్న మీకు, రష్యాను స్టాలిన్‌ పాలించే రోజుల్లో ఎన్ని లక్షల మందిని నిరాధారంగా చంపేశారో గుర్తుందా అంటూ నిలదీశారు. కమ్యూనిస్టులు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారని తరచూ చెప్పే కన్నయాకుమార్‌ అందుకోసం ఏదన్నా సాక్ష్యం చూపించగలరా అంటూ ప్రశ్నించారు. కమ్యూనిస్టులు పాలించే చైనాలో కనీసం ఒక ఊరేగింపుని నిర్వహించే స్వాతంత్ర్యం కూడా లేదని, మరి ప్రజాస్వామ్యం మన దేశంలో కాకుండా మరెక్కడ ఉందని నిలదీశారు. మరి కన్నయాకుమార్‌ ఈ ప్రశ్నలకు ఏమని బదులిస్తాడో!

అమితాబ్ సంచలన వ్యాఖ్యలు... నేను క్షయవ్యాధిని

తాను ఒక క్షయవ్యాధిని అని.. ఆ వ్యాధి నుండి సురక్షితంగా బయటపడ్డాను అని అంటున్నాడు ఓ బాలీవుడ్ సూపర్ స్టార్. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరునుకుంటున్నారా.. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్..ప్రపంచ ట్యూబర్కులోసిస్ దినోత్సవం నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్షయవ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు అమితాబ్ నడుంకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాధికి నువ్వెందుకు సేవలు అందిస్తున్నావని చాలా మంది అడుగుతున్నారు.. దీనికీ ఓ హిస్టరీ ఉందని.. 2000లో నాకు ఈ వ్యాధి వచ్చింది.. దాదాపు సంవత్సరంపాటు చికిత్స చేయించుకొని నేను ఈ వ్యాధి నుండి బయటపడ్డానని అన్నారు.   అంతేకాదు నాకు ఈ వ్యాధి వచ్చినప్పుడు కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం చేస్తున్నాను.. అప్పుడు సరిగా కూర్చోలేకపోయేవాడిని.. ఆ బాధను బరించలేక రోజుకు 10 పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని అని చెప్పారు. అయితే తాను ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి గల కారణాలు కూడా చెప్పారు.  ఒక వ్యాధి బారినపడి సురక్షితంగా బయటపడటం ఇప్పటికే ఆ వ్యాధితో బాధపడుతున్నవారికి మనోధైర్యాన్నిస్తుంది అని అన్నారు.

ఆటగాడి కోసం... అభిమానిని చంపేశాడు!

  అది ముంబైలోని మహేష్‌ అపార్ట్‌మెంట్స్‌- అందులోని ఒక ఫ్లాట్‌లో ఉండే దురుంచక్వా అనే నైజీరియా జాతీయుడిది మొన్న ఆదివారం పుట్టినరోజు. ఆ సందర్భంగా మరో నైజీరియా మిత్రుడైన నువాబుతో కలిసి పార్టీ చేసుకోవడం మొదలుపెట్టాడు. మాటల సందర్భంగా తమకు ఇష్టమైన ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఇద్దరూ. పోర్చుగల్‌ తరఫున ఆడే రొనాల్డోనే గొప్ప ఆటగాడు అని ఒకరంటే, కాదు అర్జెంటీనా ఆటగాడైన మెస్సీనే గొప్ప అని మరొకరు వాదించారు. తాగింది తలకెక్కిందో ఏమో కానీ, వాదన మాత్రం హద్దులు దాటడం మొదలుపెట్టింది. దురుంచక్వా తన చేతిలో ఉన్న మందుగ్లాసును నువాబు మీదకు విసిరాడు. దాంతో కోపం తెచ్చుకున్న నువాబు, పగిలిన అద్దం ముక్కతో దురుంచక్వా గొంతుకోశాడు. అలా దురుంచక్వా పుట్టినరోజు వేడుక కాస్తా అతని ప్రాణాలను బలిగొంది. అభిమానం వెర్రితలలు వేస్తే, పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది.

ఒక్కసారే 150 మంది ఉగ్రవాదులు హతం..

  ఉగ్రవాదులపై అమెరికా సైన్యం ఉక్కుపాదం మోపింది. నిన్న మొన్నటి వరకూ ఇరాక్, సిరియాల్లో ఉన్న ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసిన ఈ సైన్యం..ఇప్పుడు ఆఫ్రికా గడ్డ మీద వైమానిక దాడులు చేసింది. గత కొద్ది కాలంగా తమ దాడులతో సొమాలియాను వణికిస్తున్న అల్ షబాబ్ సంస్ధపై కూడా అమెరికా సైన్యం వైమానికి దాడులు చేసింది. దీంతో దాదాపు 150 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో అంతమయ్యారని అమెరికా రక్షణ శాఖ విభాగం పెంటాగాన్ అధికారులు తెలిపారు. కాగా సోమాలియా ప్రభుత్వ బలగాలు, ఆఫ్రికన్ యూనియన్ శాంతి పరిరక్షణా బలగాల మీద దాడులు చెయ్యడానికి 200 మంది ఉగ్రవాదులకు అల్ షబాబ్ శిక్షణ ఇస్తున్నదని అమెరికా సైన్యం గుర్తించి.. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న స్థావరాల మీద అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది.

తాను చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ వివరణ.. అందరూ ఎంజాయ్ చేశారుగా..

సావిత్రి ఆడియో ఫంక్షన్లో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఆడవారిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన బాలకృష్ణ తన చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాకు స్త్రీలంటే ఎంతో గౌరవం.. నా వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించండి అంటూ కోరారు. నా సినిమాల్లో మహిళలను కించపరిచే సంభాషణలు ఉండవు అన్నారు. ఓ ప్రజా ప్రతినిధిగా నా బాధ్యత నాకు తెలుసు అని.. అయినా నేను మాట్లాడుతుంటే స్టేజ్ మీద అందరూ ఎంజాయ్ చేశారు అంటూ వ్యాఖ్యానించారు.   కాగా సావిత్రి ఆడియో ఫంక్షన్లో బాలకృష్ణ.. అమ్మాయిల వెంటపడే పాత్రలు తాను చేస్తే ఒప్పుకోరు కదా అంటూ ప్రశ్నిస్తూనే.. ముద్దైనా పెట్టాలి.. లేదా కడుపైనా చేయాలి.. అంతే కమిట్ అయిపోవాలి అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలసిందే.

జగన్ పై విరుచుకు పడుతున్న అధికార పార్టీ నేతలు.. కౌంటర్ కు ప్రతి కౌంటర్లు

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన.. రోజాను అన్యాయంగా సస్పెండ్ చేశారు.. మహిళా ఎమ్మార్వోపై దాడి చేసిన ఎమ్మెల్యేపై కేసులు లేవు.. అంగన్ వాడీ కార్యకర్తలపై దాడులు చేస్తే కేసులు లేవు.. విద్యార్ధి రితికేష్వరీ కామాంధులకు బలైపోయింది ఆ కేసుకు సంబంధిచిన వారిపై కేసులు లేవు.. నిజంగా రాష్ట్రంలో మహిళలను గౌరవిస్తున్నామా..? అని ప్రశ్నించారు.   దీంతో జగన్ మాటలకు మళ్లీ అచ్చెన్నాయుడు స్పందించి ఆయనకు గట్టిగా సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రిపై విమర్శలకు దిగే నీచ స్థాయికి జగన్ వచ్చారు.. పాత విషయాలే ప్రస్తావిస్తున్నారు.. కొత్త విషయం ఒక్కటైనా ఉందా..? ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు.. సలహాలు, సూచనలు ఇవ్వండి స్వీకరిస్తాం అని అన్నారు. దీంతో జగన్ మీరు చేసే అన్యాయాలు అసెంబ్లీలో ప్రస్తావిస్తే మైకే కట్ చేసి తిట్టిస్తారా అని అన్నారు.   అంతేకాదు రావెల సుశీల్ అంశాన్ని కూడా జగన్ ప్రస్థావించారు. దీంతో రావెల స్పందించి.. తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే.. నా కుమారుడు సుశీల్ తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమే.. పరిటాల హత్య కేసులో జగన్ నిందితుడు.. అని వ్యాఖ్యానించారు.. దీనికి జగన్.. కొడుకు తప్పు చేస్తే నన్ను నిందిస్తున్నారు.. ఓ శాసనసభ్యుడి మాటలపై నేషనల్ ఛానెళ్లలో చర్చు జరుగుతోంది అని చెప్పుకొచ్చారు. 

బీజేపీ పొత్తుపై పీడీపీ ఆసక్తికర వ్యాఖ్యలు.. బీజేపీతో పొత్తు నా తండ్రి వీలునామా..

  పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సయీద్ భారతీయ జనతా పార్టీ పొత్తు విషయంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయంపై గత కొద్ది రోజుల నుండి వార్తలు వచ్చిన సంగతి తెలసిందే. ఒకానొక సందర్భంలో పీడీపీ, బీజేపీతో పొత్తు విరమించుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మెహబూబా ముఫ్తీ సయీద్ పొత్తుపై మాట్లాడుతూ బీజేపీతో పొత్తు అనేది తన తండ్రి దివగంత ముఫ్తీ మహ్మద్ సయీద్ జీవించివుండగా రాసిపెట్టిన వీలునామా అని..  తన తండ్రి మాట శిలాశాసనం లాంటిదని, ఆయన మాట జవదాటబోమని అన్నారు. బీజేపీతో సంకీర్ణ సర్కారు అన్నది మా తండ్రి తీసుకున్న నిర్ణయం అని.. ఒక తండ్రి పిల్లలకు వీలునామా రాశాడంటే... దాన్ని అమలుపరచడం ద్వారా వాళ్లు నాశనమైపోయినా సరే... దాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని..ఈ పొత్తువల్ల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో తాము రాజకీయంగా నాశనమైనప్పటికీ అధైర్యపడి వెనుకంజ వేయబోమని స్పష్టంచేశారు. దీంతో పీడీపీ, బీజేపీ తో పొత్తు ఓకే అయినట్టు తెలుస్తోంది.

మరో వివాదంలో స్మృతీ ఇరానీ.. చేతులు జోడించినా వెళ్లిపోయారు..

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వచ్చిపడుతున్నాయి. రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఇప్పటికే ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మరో వివాదంలో స్మృతీ ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. స్మృతీ ఇరానీ శనివారం రాత్రి యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళుతుండగా ఆమె కాన్వాయ్ ద్విచక్రవాహనంను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయిన కుమార్తె స్మృతీ పై సంచలనమైన ఆరోపణలు చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత వైద్య సహాయం అందించడానికి మంత్రి ముందుకు రాలేరని.. కారు దిగి బయటకు వచ్చారని, రక్తం కారుతున్న స్థితిలో తాను చేతులు జోడించి తాము ఆసుపత్రికి వెళ్లేందుకు సహకరించాలని వేడుకుంటే ఆమె వినిపించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. పిల్లలు సహాయం కోసం అర్థిస్తున్నా మంత్రి స్మృతి ఇరానీ చూసి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆమె సోదరుడు అభిషేక్‌ ఆరోపించాడు. దీంతో అభిషేక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు.   ఇదిలా ఉండగా జరిగిన ఈ ఆరోపణలకు మంత్రి కార్యాలయం స్పందించి.. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని.. మంత్రి కారు వల్ల ప్రమాదం జరగలేదని ఎస్‌ఎస్‌పీ రాకేష్‌ సింగ్‌ తెలిపారు.

జగన్, అచ్చెన్నాయుడు మధ్య వాగ్వాదం.. మాట్లాడే హక్కు లేదు..

  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. మంత్రి అచ్చెన్నాయుడు కి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. బొగ్గు నుంచి కరెంట్ వరకు రాష్ట్రంలో కుంభకోణం జరిగిందని.. ఎల్ఈడీ బల్పుల కొనుగోలులో స్కాం జరిగిందని అన్నారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందించి.. విద్యుత్ ఆదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఈడీ బల్బుల ఉపయోగాన్ని పెంచామని, వీధి దీపాలు పెట్టామని.. అన్నారు. జగన్, వైసిపి నేత బొత్స సత్యనారాయణ వంటి వారికి అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు లేదని.. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు తాము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

టీడీపీకి మరో షాక్.. వారిద్దరూ కూడా టీఆర్ఎస్ లోకి..?

తెలంగాణలో ఇప్పటికే చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. టీడీపీకి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీలు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ  సమావేశానికి వీరిద్దరు డుమ్మా కొట్టడంతో వీరిద్దరు కూడా టీడీపీ వీడనున్నట్టు తెలుస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక వీరిని చేర్చుకోవాలని తెరాక నేతలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈమెయిల్ సృష్టికర్త రే టామ్లినస్ మృతి

ఈమెయిల్ సృష్టికర్త రే టామ్లిసన్ కన్నుమూశారు. 74 ఏళ్ల రే, వాషింగ్టన్లోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.  ఆయన 1941 ఏప్రిల్ 23 న న్యూయార్క్ లో జన్మించారు . కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో ఎక్స్ పర్ట్ గా రాణించి, ఈ మెయిలింగ్ సిస్టమ్ ను కనిపెట్టారు. ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కు మెయిల్ పంపడం ఎలా అన్నదానిపై పరిశోధనలు చేసి, ఎట్టకేలకు 1971లో బోస్టన్ లో తను పనిచేస్తున్న సంస్థలో తోటి ఉద్యోగికి మొట్టమొదటి మెయిల్ ను పంపించారు. మెయిల్ కోసం ఉపయోగించే @ సింబల్ ను కూడా మొట్ట మొదట ఆయనే ఉపయోగించడం విశేషం. ఈమెయిల్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ సమూలంగా మారిపోయింది. ప్రపంచం ఒక కుగ్రామంగా మారడంలో ఈమెయిల్ చాలా కీలక పాత్ర పోషించింది. రే చేసిన సేవలకు మెచ్చి ఆయన్ను ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్ వరించింది. ఇంతటి మేధావి మరణించడం పట్ల నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇండియా బంగ్లాదేశ్ ఫైనల్ కు తుఫాన్ ముప్పు

  ఆసియా టి20 కప్ లో భాగంగా, ఈరోజు రాత్రి ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, మ్యాచ్ జరగనున్న మీర్ పూర్ లో తుఫాన్ వాతావరణం నెలకొంది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వేస్తున్నాయి. దీంతో మ్యాచ్ ఆడేది లేనిది అనుమానంగా మారింది. ఒక వేళ వర్షం వెలిసిపోతే, కాస్త ఆలస్యంగానైనా మ్యాచ్ మొదలయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో, ఫైనల్ కోసం రిజర్వ్ డే కేటాయించని కారణంగా, కప్ ను ఇండియా బంగ్లాదేశ్ రెండూ విజేతలుగా పంచుకుంటాయి. మరో వైపు బంగ్లాదేశ్ ను ఫైనల్లో కూడా చిత్తుచేసి ఈ ఏడాది టి20 ఫేవరెట్స్ అని ప్రూవ్ చేసుకోవాలని టీం ఇండియా చూస్తుంటే, ఎలాగైనా ఇండియాను ఓడించి, ప్రపంచదేశాలకు తామంటే ఏంటో చూపాలని బంగ్లా తహతహలాడుతోంది.

నా కొడుకు తప్పు చేయలేదు : రావెల

రాజకీయంగా కుట్ర పన్ని నా కొడుకును ఇరికించారు. నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు అన్నారు రావెల కిషోర్. కేవలం తమను దెబ్బ తీసేందుకు, జగన్ ఇలాంటి ఆటలు ఆడిస్తున్నారంటూ ఆరోపించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందని, తన కుమారుడు నిర్దోషిగా బయటికి వస్తాడని ఆయన అన్నారు. చంద్రబాబు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తుంటే, చూడలేకే జగన్ నీచానికి దిగజారుతున్నారంటూ విమర్శించారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ కు మమ్మల్ని విమర్శించే హక్కు లేదంటూ, జగన్ కులాల కుమ్ములాటను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు మంత్రి. కాగా ఇప్పటికే రావెల సుశీల్ పోలీసులకు లొంగిపోయారు. ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ, సుశీల్ పై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే..

గుజరాత్ లో టెర్రర్ అలర్ట్ : రంగంలోకి దిగిన గార్డ్స్

గుజరాత్ లో టెర్రర్ ఎలర్ట్ ప్రకటించారు. జైషే మహ్మద్, లష్కర్ తోయిబా సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదులు పదిమంది మిలిటెంట్లు, రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు ఇంటిలెజన్స్ హెచ్చరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సెక్యూరిటీని భారీగా పెంచారు. ముఖ్యంగా సముద్రతీరప్రాంతమంతా కోస్టల్ గార్డ్స్ గస్తీ తిరుగుతున్నారు. కుచ్ తీరం వద్ద గత మూడు నెలల్లో ఐదు పడవలు వదిలేసి వెళ్లడంతో అనుమానం బలపడింది.   పాకిస్థాన్ సెక్యూరిటీ అడ్వైజర్ నాసిర్ జంజువా 10 మంది గుజరాత్ లోకి ప్రవేశించారని కన్ఫామ్ చేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ అడిషనల్ సిఎస్ శనివారం, త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు. గుజరాత్ లో సోమ్ నాథ్ ఆలయం, ద్వారకేశ్వర ఆలయం, అక్షర్ థాం, సర్దార్ సరోవర్ డ్యాం లాంటి కీలక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. పోలీసులు బస్ట్ స్టాప్ లు, రైల్వే స్టేషన్లను జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన వారందరినీ చెకింగ్ చేస్తున్నారు. శివరాత్రి రోజున దేశంలో విధ్వంసానికి, ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయి.

మంత్రి గారి కొడుకు కుక్కపిల్ల కోసం వెళ్లాడా..?

ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్ పై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై తన ఫేస్ బుక్ లో సుశీల్ వివరణ ఇచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని, కేవలం కుక్కపిల్లను కాపాడే ప్రయత్నం చేశానని, ఆ మహిళ అడ్డొచ్చి స్థానికులతో కలిసి తనపై దాడి చేసిందని, ఇదంతా కేవలం రాజకీయమేనంటూ ఆరోపించారు.   కానీ సంఘటనా స్థలం దగ్గర ఒక షాపుకు సంబంధించిన సీసీ క్యామ్ ఫుటేజ్ లో చూస్తే, అక్కడ ఎలాంటి కుక్కపిల్లా లేదు. పైగా, కారు స్లో అవడం, కారును చూసి మహిళ వేగంగా నడిచివెళ్లిపోవడం మాత్రమే సీసీ ఫుటేజ్ లో ఉంది. న్యూస్ ఛానళ్లలో ప్రసారమైన ఈ ఫుటేజ్ కు, సుశీల్ తన ఫేస్ బుక్ లో చెబుతున్న దానికి పొంతన లేదు. ఫుటేజ్ ను ఆధారంగా తీసుకుని పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరో వైపు నిందితుణ్ని శిక్షించాలంటూ మహిళా సంఘాలు పట్టుబడుతున్నాయి.