సీతక్కపై మావోయిస్టుల గుస్సా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దాసరి అనసూయ, సీతక్కకు ప్రత్యేక స్థానం వుంది. సీఎం రేవంత్‌రెడ్డి సీతక్క తనకు సొంత అక్క కంటే ఎక్కువని పలు సంధర్భాలలో స్వయంగా చెప్పుకున్నారు, అంటే, ఆ ఇద్దరి అనుబంధం గురించి ఇక వేరే చెప్పవలసిన అవసరం లేదు. మరోవంక మావోయిస్టు సిద్దాంత మూలాలు ఉన్న సీతక్కకు సహజంగానే అడవి బిడ్డలతో ప్రత్యేక అనుబంధం వుంది. అడవి బాట వదిలి జాతీయ రాజకీయ స్రవంతిలోకి వచ్చిన, గిరిజనులతో సీతక్క సంబంద బాధవ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె, రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏ పదవి’లో ఉన్నా, గిరిజనంతో కలిసే జీవిస్తున్నారు. గిరిజనుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో గిరిజన ఎమ్మెల్యేగా ఆమె,నెత్తిన మూటతో కాలినడకన కొండలు గుట్టలు ఎక్కి, గిరిజనులు నిత్యావసర సరుకులు మందులు అందించి సీతక్క శభాష్ అనిపించుకున్నారు.
అందుకే, ములుగు నియోజకవర్గం ప్రజలు ఆమెను వరసగా మూడు మార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇప్పడు రేవంత్ రెడ్డి ఆమెను మంత్రిని చేశారు. అయితే, ఇప్పడు సీతక్క ఒక వంక సొంత పార్టీలో వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. ఆమె పైన ఎప్పుడు లేని విధంగా ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపు, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఇతరత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవంక, మాజీ కామ్రేడ్ సీతక్కను టార్గెట్ చేస్తూ, మావోయిస్టులు ఆమె తమ మూలాలను మరిఛిపోయారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో, తాజాగా, మావోయిస్టులు ఆమెను హెచ్చరిస్తూ రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ లేఖలో మావోయిస్టులు ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా.. మంత్రి సీతక్క స్పందించడం లేదని ఆరోపించారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మావోయిస్టులు వివరించారు. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా, 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరచిపోయారా...? అంటూ ఆమెను సూటిగా ప్రశ్నించారు.
అయితే ఆదివాసీల వ్యవహారంలో మావోయిస్టులు తనకు రాసిన లేఖ పై సీతక్క, వెంటనే స్పందించారు.తన మూలాలను తానెప్పుడు మరిచి పోలేదన్నారు. ఆదివాసీలకు వ్యతిరేకంగా ఉన్న, జీవో 49ను తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టానని వివరించారు. ఆ క్రమంలో ఆదివాసీల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖతోపాటు తానూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అటవీశాఖ అధికారులు తప్పా.. ఎవరూ ఆదివాసీల జోలికి వెళ్లడం లేదని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. అయితే ఎవరు మాట్లాడినా నిజాలు మాట్లాడాలంటూ మావోయిస్టులకు ఆమె పరోక్షంగా సూచించారు. అయితే, ఇంచుమించుగా మూడు దశాబ్దాలకు పైగా మెయిన్ స్ట్రీమ్ రాజకేయల్లో ఉన్న సీతక్క, తొలి సరిగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కుంటున్నారని, ఆమె సన్నిహితులు అవేదన వ్యక్తపరుస్తున్నారు.