హక్కుల కోసం పీవోకేలో ప్రజాందోళన.. మరో జెన్ జడ్ కానుందా?
posted on Sep 29, 2025 @ 12:22PM
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో జనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పాకిస్థాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా పీవోకే ప్రజలపై రాజకీయ, ఈర్థిక అణచివేతకు పాల్పడుతోందని ఆరోపిస్తూ అవామీ యాక్షన్ లీగ్ పిలుపు మేరకు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. సోమవారం (సెప్టెంబర్ 29) నుంచీ షట్టర్ డౌన్, వీల్ జామ్ పేరుతో నిరవధిక బంద్ పాటిస్తున్నట్లు అవామీ యాక్షన్ లీగ్ పేర్కొంది. పాకిస్థాన్ ఆక్రమణ నుంచి విముక్తి కావాలంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు.
ప్రజాందోళనకు నాయకత్వం వహిస్తున్న అవామీ యాక్షన్ లీగ్ 38 డిమాండ్లలో ప్రజాందోళనకు నాయకత్వం వహిస్తున్నది. వాటిలో ప్రధాన డిమాండ్ పీవోకే అసెంబ్లీలో పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలన్నది ప్రధాన డిమాండ్ గా ముందుకు తీసుకువచ్చింది. అలాగే గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలనీ, విద్యుత్ చార్జీలను తగ్గించాలని కూడా జనం కోరుతున్నారు. ఏడు దశాబ్దాలుగా పీవోకే ప్రజలు కనీస ప్రాథమిక హక్కులు కూడా లేకుండా దుర్భర జీవితాలను గుడుపుతున్నారనీ, ఇప్పుడు హక్కుల కోసం నినదిస్తూ ఆందోళనకు దిగారనీ అవామీ యాక్షన్ లీగ్ చెబుతోంది. ఇప్పటికైనా పీవోకే ప్రజలకు ప్రాథమిక హక్కులు ఇవ్వకుంటే ప్రజాగ్రహం మరింత పెచ్చరిల్లడం తథ్యమని హెచ్చిరించింది.
ఇలా ఉండగా పీవోకేలో ఆందోళనలను అణచివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పీవోకే అంతటా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. పంజాబ్ ప్రావిన్స్ నుంచి పెద్ద ఎత్తున దళాలను తరలించింది. అంతే కాకుండా ఆదివారం (సెప్టెంబర్ 29) అర్ధరాత్రి నుంచీ పీవోకే వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది. పీవోకేలోకి ఎవరూ ప్రవేశించకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా దిగ్బధనం చేసింది. మరో వైపు పీవోకే అధికారులు అవామీ యాక్షన్ లీగ్ ప్రతినిథులతో సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో పీవోకేలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.