నాగార్జునసాగర్ అన్ని గేట్లు ఎత్తివేత..18 ఏళ్ల తర్వాత
ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తుంది. దీంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో : 2,55,811 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 2,47,213 క్యూసెక్కులుగా ఉంది.
ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 590.00 అడుగులకుగాను ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో.. దిగువ భాగంలోని నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా దాదాపు 18 ఏళ్ల తర్వాత.. నెల ముందుగానే నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సాగర్ గేట్లు ఎత్తడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాగార్జునసాగర్ మనకు ఆధునిక దేవాలయమని అభివర్ణించారు. సాగర్‌కు మాజీ ప్రధాని నెహ్రూ పునాది వేస్తే.. ఇందిరాగాంధీ ప్రారంభించారని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ద్వారా 26 లక్షల ఎకరాల ఆయుకట్టుకు నీరు అందుతుందని మంత్రి తెలిపారు.
కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి 7 గేట్లు 10 అడుగులు మేర నీటీని అధికారులు విడుదల చేశారు. జూరాల జలాశయం నుండి 1,48,619 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలో చేరింది. దీంతో సుంకేసుల మ్యారేజ్ నుండి 1,10,497 క్యూసెక్కుల నీరు వచ్చింది. ఇన్ ఫ్లో 2,59,116 క్యూసెక్కులు..ఔట్ ఫ్లో 2,55,811 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుతం నీటిమట్టం 883.00 అడుగులు చేరింది.