జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక...బీజేపీ త్రిసభ్య కమిటీ

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఎంపిక కోసం నాయకులు, పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు  త్రిసభ్య కమిటీని నియమించింది. ఇందులో  మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.  మరోవైపు కాషాయ పార్టీ నుంచి బరిలో దిగేందుకు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన విషయం తెలిసిందే. అదేవిధంగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీ సుభాష్, మాధవీ లత టిక్కెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  మరోవైపు  బీఆర్‌ఎస్  పార్టీ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత  బరిలో నిలుస్తుందని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించారు. హస్తం పార్టీ నుంచి  నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, దానం నాగేందర్, వి.హనుమంత రావు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ అక్టోబర్ 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు.   

ముగిసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

  తెలంగాణలో సంచలనంగా మారిన పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరి తరఫు న్యాయవాదులు విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్‌ల విచారణ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 1న జరగాల్సిన విచారణ వాయిదా పడటంతో, మహిపాల్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఇవాళ స్పీకర్ ఎదుట వాదనలు వినిపించారు. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేసింది. కానీ, రోజులు గడుస్తున్నా నిర్ణయం రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో, స్పీకర్ సంబంధిత ఎమ్మెల్యేలకి నోటీసులు పంపారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి తప్ప మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అఫిడవిట్‌ల ద్వారా స్పష్టీకరించారు. ఫిర్యాదుదారులు తమ ఆధారాలను సమర్పించగా, విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారా? లేక మరికొంత సమయం కోరుతారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.  

పొన్నంపై అంజన్ కుమార్ యాదవ్ ఫైర్.. కారణమేంటంటే?

జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోంది. జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతల సంఖ్య భారీగా ఉండటంతో అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్నది తేల్చుకోలేక పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపి ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో మాత్రం అధిష్ఠానం ప్రయత్నాలు అధిష్ఠానానివే..  అన్నట్లుగా ఉంది. ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇక పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు టీకెట్ పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీలో విభేదాలు కూడా జూబ్లీ బైపోల్ ముంగిట రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నాయకుడు  అంజ‌న్ కుమార్ యాద‌వ్ మంత్రి పొన్నం మీద ఫైర్ అయ్యారు. తన కుమారుడు ఎంపీగా ఉండటంపై కామెంట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు అంజన్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది, దీనిపై మాట్లాడడానికి మధ్యలో పొన్నం ప్రభాకర్ ఎవరంటూ ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ కంటే తాను చాలా సీనియర్ ని అని అంటూ.. కాంగ్రెస్ లో ఒకే కుబుంబం నుంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చాలా మంది ఉన్నారంటూ ఓ పెద్ద లిస్టు చెప్పారు. ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టివిక్రమార్క ఉండగా, ఆయన అన్న మల్లు రవి ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి, మంత్రి కొమటిరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ల పేర్లు ప్రస్తావించారు. ఇలా ఒకే కుటుంబం నుంచి రెండు పదవులు ఉన్నవారు చాలా మంది ఉన్నారన్నారు. అటువంటప్పుడు తన కుమారుడు ఎంపీ అయితే జూబ్లీ బైపోల్ లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.  ఇక జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి తనకు అన్ని అర్హతలూ ఉన్నాయన్న అంజన్ కుమార్ యాదవ్ పార్టీ అధిష్ఠానం తనకే టికెట్ ఇస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమాతోనే ఆయన ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించేశారు.  జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కటౌట్ లు ఏర్పాటు చేశారు. ఇంటింటి ప్రచారాన్ని కూడా షురూ చేసేశారు.  

డిజిట‌ల్ బుక్ ఫార్ములా... జగన్‌కే రివ‌ర్స్

  జ‌గ‌న్‌కి ఎంత టైం బ్యాడో చెప్ప‌డానికిదో మ‌చ్చు తున‌క కాబోలు. అదేంటంటే ఆయ‌న డిజిట‌ల్ బుక్ ఓపెన్ చేసి.. మిమ్మ‌ల్ని ఎవ‌రైనా వేధిస్తే.. మ‌రీ ముఖ్యంగా మీరు కూట‌మి ప్ర‌భుత్వం నుంచి అన‌వ‌స‌ర కేసులు ఇత‌ర‌త్రా వేధింపుల‌కు లోనైతే.. మిమ్మ‌ల్ని ఎవ‌రు వేధిస్తున్నారు.. అన్న పూర్తి వివ‌రాల‌ను మీరు మ‌న డిజిట‌ల్ బుక్ లోకి ఎక్కించాలి.. ఆపై మ‌నం అధికారంలోకి వ‌చ్చాక‌.. వారు స‌ప్త స‌ముద్రాల ఆవ‌ల దాగి ఉన్నా వ‌ద‌ల‌కుండా వెంటాడి మ‌రీ రివేంజ్ తీర్చుకుందాం. ఇదీ జ‌గ‌న్ తీస్కొచ్చిన డిజిట‌ల్ బుక్ ప్ర‌ధానోద్దేశం. ఇది చూస్తుంటే రివ‌ర్స్ అయ్యేలా క‌నిపిస్తోంది.. మాములుగా అయితే ఈ డిజిట‌ల్ బుక్ కి ప్ర‌త్య‌ర్ధి  పార్టీలు, మ‌రీ ముఖ్యంగా టీడీపీ, జేఎస్పీ, బీజేపీ వారిపై కంప్ల‌యింట్లు రావాలి. కానీ ఎంత చిత్ర‌మంటే చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక సంఖ్య‌లో వైసీపీ  కార్య‌క‌ర్త‌ల నుంచి మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కంప్ల‌యింట్లు రావ‌డంతో ఒక్క‌సారిగా  పార్టీ షాక‌య్యింది. అస‌లు పార్టీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిందో అప్ప‌డు అర్ధ‌మైంద‌ట‌.. జ‌గ‌న్ కి. ఇక్క‌డ మ‌నం ఒక్క‌రే ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా మ‌ద్యం కుంభ‌కోణం వంటి వాటి ద్వారా దోచుకుంటున్నాం. మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతో మంచి వారు, స‌చ్చీలురు అనుకుంటూ వ‌చ్చార‌ట జ‌గ‌న్. కానీ వారు కూడా సేమ్ టూ సేమ్.. అదే ఫ్లో మెయిన్ టైన్ చేస్తున్న‌ట్టు ఆయ‌న‌కు అంత వ‌ర‌కూ అర్ధ‌మ‌య్యింది కాదు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ ఓట‌మికి ప్ర‌ధాన  కార‌ణం వాలంటీర్లుగానే భావిస్తూ వ‌చ్చారు. అందుకే ఇటీవ‌ల ఒక స్ట్రాంగ్ డెసిష‌న్ తీస్కున్నారాయ‌న‌. ఒక వేళ మ‌నం అధికారంలోకి వ‌స్తే.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి.. ఆపై కార్య‌క‌ర్త‌ల‌పైనే ఆధార ప‌డాల‌ని భావించిన జ‌గన్ కి డిజిట‌ల్ బుక్ ద్వారా ఈ విష‌యం తెలియ‌డంతో ఏం చేయాలో పాలు పోలేద‌ట‌. మ‌హిళా మంత్రుల‌ని మ‌నం త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేదని అంటారు ఫ్యాను పార్టీ వ‌ర్గాలు వారు.. రోజా ఆడుదాం ఆంధ్ర ద్వారా,  ర‌జ‌నీ స్టోన్ క్ర‌ష‌ర్ య‌జ‌మానులు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల ద్వారా భారీగానే దోచుకున్న‌ట్టు స‌మాచారం. ఉండ‌వ‌ల్లి శ్రీదేవిని అడిగితే విడుద‌ల ర‌జ‌నీ గురించి, ఆమె ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంత వెన‌కేసుకొచ్చారో ఏకంగా ఒక చిట్టా త‌యారు చేశారంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు.  అంత భారీగా ఉంటాయి ర‌జ‌నమ్మ లీల‌లు అంటారు ఉండ‌వ‌ల్లి శ్రీదేవిలాంటి కొంద‌రు. స‌రే శ్రీదేవికంటే తాను డాక్ట‌ర్ అయితే ఆరోగ్య శాఖ త‌న‌కివ్వాల్సింది ర‌జ‌నీకిచ్చార‌నే అసూయ ఉండొచ్చ‌ని లైట్ తీస్కుంది పార్టీ అధిష్టానం. ఇప్పుడుగానీ అస‌లు విష‌యం అఫిషియ‌ల్ గా తెలిసి రాలేద‌ట జ‌గ‌న్ కి. అంత‌గా ఆమెపై ఫిర్యాదులు వెల్లువ‌ల అందుతున్నాయ‌ట‌. ఇక రోజా అయితే టీటీడీ చ‌రిత్ర‌లోనే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో.. టోకెన్లు అమ్మి సొమ్ము చేసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయ్. ఈ విష‌యంపై మా ద‌గ్గ‌ర బోలెడు ఆధారాలున్నాయంటారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో.. ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ద్వారా సాగిన అవినీతి కాండకు జ‌గ‌న్ భారీ మూల్యం చెల్లించుకోవ‌ల్సి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌టికీ లీలా మాత్రంగా వీట‌న్నిటి గురించి విన్న జ‌గ‌న్ వారి వారి ప్రాంతాల నుంచి ఆయా లీడ‌ర్ల‌ను త‌ర‌లించి ఇత‌ర ప్రాంతాల్లో పోటీ చేయించినా ఫ‌లితం లేకుండా  పోయింది. ఇప్పుడు జ‌గ‌న్ కి మ‌రింత స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతున్న విష‌యం ఏంటంటే.. తాను వీరి మాయ‌లో ప‌డిపోయి.. వారు తెర వెన‌క ఏం  చేస్తున్నారో అస్స‌లు ప‌ట్టించుకోలేక పోయాన‌ని తీవ్రంగా బాద ప‌డుతున్నార‌ట‌. ఆ మాట‌కొస్తే వాళ్ల‌ను నిల‌దీసే  ప‌రిస్థితి  కూడా లేదు. అందుకు రీజ‌న్.. తాను కూడా త‌లాపాపం తిలాపిడికెడు అన్న‌ట్టు.. త‌మ హ‌యాంలో చేసిన అవినీతి య‌జ్ఞంలో పీక‌లోతు మునిగి పోయి ఉండ‌ట‌మే.. అన్న‌ది అస‌లు విష‌యంగా తెలుస్తోంది. మ‌రి చూడాలి ర‌జ‌నీతో పాటు మ‌రి ఎంద‌రిపై డిజిటల్ బుక్ లో కంప్ల‌యింట్లు వ‌స్తాయో.

రాహుల్ త‌ర్వాత... గాంధీల శ‌కం ముగిసిన‌ట్టేనా?

  రాహుల్ త‌ర్వాత... గాంధీల శ‌కం ముగిసిన‌ట్టేనా? ఈ ప్ర‌శ్న ఎందుకు త‌లెత్తిందంటే.. తాజాగా వ‌య‌నాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కేర‌ళ‌లోని అరికోడ్ లో జ‌రిగిన  ర్యాలీలో ప్ర‌సంగించిన త‌ర్వాత  త‌న ఇద్ద‌రు పిల్ల‌లు మిరాయా, రైహాన్ ల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేశారు. కాబోయే గాంధీ కుటుంబ వార‌సులుగా వీరిద్ద‌రే అన్న సంకేతాలిచ్చారామె. అయితే ఇక్క‌డొచ్చే చిక్కేంటంటే.. సాంకేతికంగా వీర్ని మిరాయా వాద్రా, రైహాన్ వాద్రాగా పిల‌వాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో చూస్తే రాహుల్ త‌ర్వాత ఈ గాంధీ అన్న శ‌బ్ధం ఈ కుటుంబం చివ‌ర వినిపించ‌డం ఇక మాయ‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అన్న‌ది గాంధీ కుటుంబ వార‌స‌త్వంగా వింటూ వ‌స్తున్నాం. ఆ మాట‌కొస్తే రాజీవ్ గాంధీని పెళ్లాడిన సోనియా సైతం గాంధీగానే ఇక్క‌డ పిల‌వ‌బ‌డ్డారు. క‌ట్ చేస్తే ఇప్పుడు స‌మ‌స్య ఏంటంటే రాహుల్ త‌ర్వాత ఆ కుటుంబం నుంచి గాంధీ అన్న ఇంటి పేరు దాదాపు క‌నుమ‌ర‌గు కానుంద‌నే చెప్పాలి. కార‌ణం.. రాహుల్ గాంధీకి అధికారికంగా పెళ్లి కాలేదు. ఆపై ఆయ‌న‌కంటూ పిల్ల‌లున్నార‌న్న విష‌యం  కూడా ఎవ‌రికీ తెలీదు. దీంతో ఈ కుటుంబం నుంచైతే గాంధీ అన్న స‌ర్ నేమ్ ఇక‌పై వినిపించే ఛాన్స్ లేదు. రాహుల్ గాంధీయే ఈ ప‌రంప‌ర‌లో చివ‌రి వార‌వుతారు. అయితే ఇక్క‌డ మ‌రొక అవ‌కాశం లేక పోలేదు. అదే మేన‌కాగాంధీ, వ‌రుణ్ గాంధీ. సంజ‌య్ గాంధీ కుమారుడైన‌ వ‌రుణ్ గాంధీ కి కూడా ఇద్ద‌రు కూతుళ్లు. వీరు పేర్లు ఆద్య‌, అన‌సూయ‌. వీరి పేర్ల చివ‌ర గాంధీ అన్న శ‌బ్ధం వినిపిస్తుంది. కానీ వారు కుమార్తెలు కావ‌డంతో. వారి ఇంటి పేరు కూడా మారే అవ‌కాశ‌ముంది. అచ్చం ప్రియాంక గాంధీ వాద్రాలాగా.  మొత్తంగా ఈ త‌రం త‌ర్వాత కూడా ఒక వార‌సుడు.. అది  కూడా గాంధీ అన్న ఇంటి పేరును ప్ర‌పంచం ముందు స‌గ‌ర్వంగా నిల‌ప‌డానికి త‌గిన యోధుడు  క‌నుచూపు మేర క‌నిపించ‌డం లేదు. వ‌చ్చే రోజుల్లో రాహుల్ త‌న ఓట్ల చోరీ ప్ర‌చారం ఫ‌లించి.. పీఎం అయితే.. గాంధీ వంశం నుంచి అయ్యే చివ‌రి పీఎం ఈయ‌నే అవుతారు. ఆ త‌ర్వాత గాంధీల చ‌రిష్మా క్ర‌మేణా క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. బీజేపీ గానీ గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టి రాహుల్ గాంధీని కూడా రాకుండా చేస్తే.. రాజీవ్ గాంధీయే చివ‌రి గాంధీస్ ఫ్యామిలీ కా పీఎం. అంతే సంగ‌తులు చిత్త‌గించ‌వ‌ల‌యును అన్న‌ట్టుగా మార‌నుంది ప‌రిస్థితి. ఆ మాట‌కొస్తే ఒరిజిన‌ల్ గాంధీకి ప్ర‌తిగా లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిని తెర‌పైకి తేవాల‌ని విస్తృతంగా ప్ర‌య‌త్నిస్తోంది ఆర్ఎస్ఎస్.  ఇటీవ‌ల జ‌రిగిన శ‌తాబ్ది ఉత్స‌వాల్లో మోహ‌న్ భ‌గ‌వ‌త్ అన్న మాట ఏంటంటే ఇవాళ గాంధీ జ‌యంతే కాదు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి కూడా అన్న కామెంట్ చేశారు. ఈ లెక్క‌న చూస్తే గాంధీ అన్న శ‌బ్ధం విన‌బ‌డ‌కుండా చేయ‌డంలో ఇటు ఒక వ‌ర్గం ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. అటు ఆ కుటుంబం నుంచి కూడా సాంకేతికంగా ఇందుకు స‌హ‌కారం అందుతోన్న విధం క‌ళ్ల‌కు క‌డుతోంది. మ‌రి  మీరేమంటారు!!!

ఆటో డ్రైవర్ల కోసం యాప్.. చంద్రబాబు

రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.   రాష్ట్రంలో స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు అండగా  నిలిచే లక్ష్యంగా ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకానికి  రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు రూ. 436 కోట్ల చెక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి  సీఎం పవన్ కళ్యాణ్ అందజేశారు. ఈ సందర్భంగా  ఆటో డ్రైవర్లకు అనేక కష్టాలు ఉన్నాయి.. గతంలో రోడ్లు గతుకులతో ఆటోలు తరచూ రిపేర్లకు గురయ్యేవి, ఆటో డ్రైవర్ల ఒళ్లు హూనం అయ్యేది ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు.    రాష్ట్రంలోని రోడ్లన్నీ బాగు పడుతున్నాయి. రూ. 3400 కోట్ల రూపాయలు వ్యయం చేసి రోడ్లు బాగు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.  ఇకపై రోడ్లపై గుంతలు పడకుండా చూసుకోవలసిన బాధ్యత మీదేనన్న ఆయన జరిమానాల జీఓ రద్దు చేస్తాం, సీసీటీవీలో అంతా రికార్డ్ అవుతోంది కాబట్టి అందరూ క్రమశిక్షణతో ఉండాలన్నారు. ఆటో డ్రైవర్ల  కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి పాలనలో ప్రజల కష్టాలు తీరాయని చెప్పిన చంద్రబాబు.. సంక్షేమం లబ్ధిదారుల దరికి చేరిందన్నారు. ఆటో డ్రైవర్ల కోసం ఒక యాప్ తయారు చేస్తామని చెప్పిన ఆయన ఆ యాప్ ద్వారా బుకింగ్ లు వచ్చేలా చేస్తామన్నారు. ఇకపై ఆటో స్టాండ్ లకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా ఆటో డ్రైవర్లకు గిరాకీ లభించేలా సాంకేతికత ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు.   ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా మీకు అవకాశాలు దొరికేలా చేస్తాం. ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  మీకు మంచి చేసిన కూటమి ప్రభుత్వం గురించి పది మందికి చెప్పండని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముందు వరకూ అంటే 16 నెలల కిందటి వరకూ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయనీ, పాలన ఎక్కడికక్కడ ఆగిపోయిందని చెప్పిన చంద్రబాబు.. తాను అధికార పగ్గాలు చేపట్టిన తరువాత మళ్లీ అన్నిటినీ గాడిన పెట్టానని చెప్పారు.అంతకు ముందు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉంవల్లి నుంచి ఆటోలో వేదిక వద్దకు వచ్చారు. 

పీకే నీకు ద‌మ్ముంటే... బీహార్ కింగ‌య్యి చూపించు!

  పీకే అంటే ప‌వ‌న్ క‌ళ్యాన్ మాత్ర‌మే కాదు ప్ర‌శాంత్ కిషోర్ అని కూడా. ఒక ద‌శ‌లో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక ఊపు ఊపింది పీకే మేనియా. 2019 ఎన్నిక‌ల్లో మొద‌ట టీడీపీ చేస్కోవ‌ల్సిన పీకే ఒప్పందం త‌ర్వాత జ‌గ‌న్ ఎగ‌రేసుకుపోవ‌డం. ఆయ‌నిచ్చిన స‌ల‌హా సూచ‌న‌ల‌తో.. ప్ర‌త్యేక హోదా డ్రామాలాడి ఎలాగోలా జ‌గ‌న్ గెల‌వ‌డం ఒక గ‌త చ‌రిత్ర‌. దీంతో పీకే ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద ప‌డ్డం క్ర‌మేణా మొద‌లైంది. అక్క‌డి నుంచి పీకే, ఆయ‌న ఐ ప్యాక్ టీం వేరు వేరుగా మార‌డం.. ఆపై ఆయ‌న శిష్యులు రాహుల్ శ‌ర్మ‌, సునీల్ క‌నుగోలు వంటి వారు కూడా ఆయ‌నంత‌టి వారు కావ‌డం. మ‌రీ ముఖ్యంగా  సునీల్ క‌నుగోలు క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ని అదే ఊపులో తెలంగాణ లోనూ కొన‌సాగించి ఇక్క‌డా ఆ పార్టీని గెలిపించ‌డం వ‌ర‌కూ పీకే మానియా య‌ధేచ్చ‌గా న‌డిచింద‌నే చెప్పాలి. గ‌త ఎన్నిక‌ల టైంలో కేసీఆర్‌తో కూడా పీకే మంత‌నాలు జ‌ర‌ప‌డం సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా పీకే ఏమంటున్నాడంటే.. రేవంత్ బీహారీల‌ను తిట్టార‌నీ.. ఆయ‌న్ను ఎలాగైనా స‌రే ఈ సారికి ఓడించి ప్ర‌తీకారం తీర్చుకుంటానంటారు పీకే. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో అతి క‌ష్టం మీద గెలిచార‌నీ.. ఈసారికి ఆయ‌న్ను ఎలాగైనా స‌రే ఓడించి తీరుతాన‌ని శ‌ప‌థం చేశారు ప్ర‌శాంత్ కిషోర్. ప్ర‌స్తుతం పీకే, ఆయ‌న టీములు వేరు వేరు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ని  నిండా ముంచింది పీకే కి చెందిన ఐప్యాక్ టీమే. ఊహించ‌ని విధంగా మ‌న సీట్ల సంఖ్య పెర‌గ‌బోతుంద‌ని ఊద‌ర‌గొట్టిన ఈ టీం అన్న‌ట్టుగానే జ‌గన్ కి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా 11  సీట్లు వ‌చ్చాయి. దీంతో పీకే పెప్ అయిపోయింద‌న్న టాక్ స్ప్రెడ్ అయ్యింది. అలాంటి పీకే ప్ర‌స్తుతం బీహార్ లో జ‌న్ సూర‌జ్ పార్టీ అని ఒక‌దాన్ని పెట్టి..  రాజ‌కీయ‌పు అడుగులు వేస్తున్నా రు. ఈ క్ర‌మంలో ఆయ‌న రాజ‌కీయ భ‌విత‌వ్యానికే దిక్కులేదు. ఆయ‌నొచ్చి ఇత‌రుల రాజ‌కీయ భ‌విత‌వ్యం అంతు  చూస్తామ‌న‌డ‌మేంటి? కింగ్ మేక‌ర్ పొజిష‌న్ నుంచి కింగులా మారుతామ‌న్న తాప‌త్రయం గ‌ల పీకే.. దానిపై మొద‌ట‌ ఫోక‌స్ పెట్ట‌కుండా ఇంకా పాత‌కాలపు స్ట్రాట‌జిస్టు గానే థింక్ చేస్తే ఎలా??? అన్న‌ది మరొక కామెంట్. ఫ‌స్ట్ మీర‌క్క‌డ కింగ‌వ్వండి సార్.. ఇత‌రులను బొంగు చేయ‌డం సంగ‌తి చూద్దాం అన్న‌ది ఆయ‌న‌కు కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు విసురుతున్న స‌వాల్.

జూబ్లీ ఉప ఎన్నిక.. కొండవీటి చాంతాడు చిన్నబోయేలా ఆశావహుల సంఖ్య

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది.  అయితే కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకూ ఆ ఉప ఎన్నికలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతోంది.  ఫలితంగా రోజు రోజుకూ ఆశావహుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. చివరకు అభ్యర్థిని ఎంపిక చేసిన తరువాత ఆసంతృప్తి భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది.  కాంగ్రెస్ పకడ్బందీగా, ప్రణాళికా బద్ధంగా జూబ్లీ ఉప ఎన్నిక రేసులోంచి మాజీ ఎంపీ అజారుద్దీన్ ను తప్పించిందని చెప్పుకున్నంత సేపు పట్ట లేదు.. మరింత మంది పోటీలోకి వచ్చేసి పార్టీకి తలనొప్పులు తీసుకురావడానికి. బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి గెలిచి, ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్ నుంచి పలువురు నేతలు జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీకి సై అంటున్నారు. అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడే చిన్నబోతుంది. అభ్యర్థి ఎంపిక విషయంలో జాప్యం కారణంగా ఇప్పుడు ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది. ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు అలకపాన్పు ఎక్కి అసమ్మతి జ్వాలలు ఎగిసిపడతాయన్న ఆందోళన కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది. దీంతో  మీనాక్షి నటరాజన్ ను కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దింపింది. ఆశావహుల మధ్య సయోధ్య కుదిర్చి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన అజెండాతో ఆమె హస్తిన నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఆమె ప్రయత్నాలు ఎంత వరకూ, ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.   జూబ్లీ ఉప ఎన్నిక తో పాటు స్థానిక ఎన్నికలలో కూడా పార్టీని విజయతీరాలకు చేర్చాలన్న వ్యూహంతో ఆమె పథక రచన చేయనున్నారు. ఇందు కోసం ఆమె వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా జూబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై ఆమె దృష్టి సారిస్తారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పార్టీ సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.   ఆమె జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో పార్టీలో ఏకాభిప్రాయాన్ని తీసుకురాగలుగుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. 

చంద్రబాబు నివాసానికి బాంబు బెదరింపు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ వచ్చిన ఈ మెయిల్ బెదరింపు కలకలం సృష్టించాయి. అలాగే ఈ నెల 6న చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. ఆ తిరుపతిలోని పలు ప్రాంతాలకు కూడా ఇదే ఉగ్ర సంస్థ నుంచి బెదరింపు ఈమెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసాలు సహా రాష్ట్రంలోని పలు కీలక ప్రదేశాలలో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ ఈమెయిల్స్ రావడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.  ఇటీవల రాష్ట్రంలో అనుమానికత ఉగ్రవాదుల అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులు జరిగిన రోజుల వ్యవధిలో సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వ్యక్తులు, ప్రసిద్థ తిరుపతి ఆలయాలు లక్ష్యంగా బాంబు పేలుళ్ల బెదరింపులు రావడం కలకలం రేపింది.   హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్ అనే  ఉగ్ర సంస్థ నుంచి ఈ బెదరింపులు వచ్చాయి.  రాష్ట్ర వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్లుగా ఈమెయిల్స్ ద్వారా హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్ సంస్థ హెచ్చరించింది. ఈ బెదరింపు ఈమెయిల్స్ లో పోలీసులు అలర్టయ్యారు. చంద్రబాబు, జగన్ నివాసాలు సహా తిరుపతిలోని పలు ప్రదేశాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించారు.  6న చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తిరుపతి, కాళహస్తి సహా పలు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు.కాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ ఈమెయిల్స్ బెదరింపుల వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థకు పంపారు. 

కమలం నేతల మధ్య కాంట్రాక్టు పనుల రచ్చ

  కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ లో కమలం నేతల మధ్య కాంట్రాక్టు పనుల రచ్చ సొంత పార్టీలో కాక రేగుతోంది. జమ్మలమడుగులో కమలం నేతల మధ్య కాంట్రాక్టు పనుల వ్యవహారం రచ్చ రచ్చగా మారడం జమ్మలమడుగులోనే కాదు జిల్లా రాజకీయాల్లో కూడా రాజకీయ చర్చలకు దారితీశాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో అభివృద్ధి పనులు చేపడుతున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సి.ఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీ పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఇటీవల దాడులకు పాల్పడ్డారు.  ఈ వ్యవహారం కమలం పార్టీలో వర్గపోరు ను తలపిస్తోంది. సి.ఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్ స్ట్రక్షన్ కంపెనీ గండికోటలో ఏ.పి టూరిజం శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపుగా రూ.55 కోట్లు విలువైన అభివృద్ధి పనులను టెండర్లు దక్కించుకుని పనులు చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించి గత‌ నెల 22 న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు.  తమ గ్రామ సమస్యల పరిష్కారం అయిన తర్వాత, అధికారులు చూసిన వెళ్ళిన  తర్వాత పనులు చేపట్టాలని హెచ్చరించారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే ఆదినారాయరెడ్డి వర్గీయులు వాహనాల్లో దాదాపు 50 మంది జమ్మలమడుగు నుండి బయలు దేరి గండికోటలోని రిత్విక్ కన్ స్ట్రక్షన్ కంపెనీ క్యాంప్ ఆఫీస్ పైన, కంటైనర్ దాడి చేసి  ధ్వంసం చేశారు.  అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని దుర్భషలాడి బయటకు పంపారు.  కంప్యూటర్లు, చైర్లు పగలగొట్టారు. గండికోటలోని గుర్రపుశాల వద్ద జెసిబితో చేపడుతున్న పనులను నిలిపివేశారు. గండికోటలో జరుగుతున్న పనులను అర్ధంతంగా నిలిచిపోయ్యాయి. జమ్మలమడుగులో గత కొంత కాలంగా రమేష్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి మధ్య అధిపత్యం తారా స్థాయికి చేరుకుంది. ఒకే నియోజకవర్గానికి చెందిన ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు కావడంతో పోలీసులకు సైతం పాలుపోని పరిస్తితి గా మారింది. టిడిపిలో కొనసాగే సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ఏర్పడ్డ అగాధం  ప్రస్తుతం బిజెపిలో కొనసాగింపు అన్న చందంగా తయారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా  కావస్తున్నా రమేష్ నాయుడు, ఆదినారాయణ రెడ్డి మధ్య మరింతగా అధిపత్య పోరు  కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది.  జమ్మలమడుగు స్థానిక ప్రజాప్రతినిదిగా ఆదినారాయణ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ ఎంపి రమేష్ నాయుడు అధిపత్యం ఏంటి అన్నది ఆది వర్గీయు లు చెప్పుకొస్తున్నారు. అభివృద్ధి పనుల కాంట్రాక్టు దక్కించుకొని చేపట్టడంలో తప్పేముందని సీఎం రమేష్ వర్గీయులు చెప్పకు వస్తున్నారు. గండికోట అభివృద్ధి పనులను రమేష్ నాయుడు కు చెందిన కన్స్ట్రక్షన్ కంపెని సొంతం చేసుకోవడంతో మరో మారు లోకల్ గా బడా నేతల మధ్య అధిపత్యం తారా స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు . తాజాగా జరిగిన గండికోట గొడవలో ఇద్దరు ప్రజాప్రతినిధులకు చెందిన అనుచరుల మద్య ఉద్రిక్తత పరిస్థితులు దారి తీశాయి.  విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాల మధ్య దాడికి పాల్పడిన కొందరిని అదుపులో తీసుకున్నారు. రిత్విక్ కన్ స్ట్రక్షన్ మేనేజర్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం జమ్మలమడుగు అభివృద్ధిలో ఇద్దరు కమలం పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య కొనసాగుతున్న అధిపత్యం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనని కూటమి నేతలకు పొలిటికల్ టెన్షన్ తప్పడం లేదు.  

జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి.. ఎవరో తెలుసా?

నిర్మాతగా మారిన పారిశ్రామిక వేత్త రామ్ తాళ్లూరి ఇప్పుడు రాజకీయ నాయకుడయ్యారు.  ఔను జనసేన అధినేత రామ్ తాళ్లూరికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు.  ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. పలు ఐటీ కంపెనీలు ఉన్న వ్యాపార వేత్త అయిన రామ్ తాళ్లూరి.. అటు తరువాత సినిమా నిర్మాతగా కూడా మారారు.   డిస్కో రాజా, నేల టికెట్, చుట్టాలబ్బాయి, మట్కా మరియు మెకానిక్ రాకీ వంటి చిత్రాలను నిర్మించినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. అది పక్కన పెడితే.. రామ్ తాళ్లూరి ఛారిటీ కార్యక్రమాలు పవన్ కల్యాణ్ దృష్టిని ఆకర్షించాయి. జనసేన ఆవిర్బావం నుంచీ కూడా రామ్ తాళ్లూరి జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచారు. గత కొన్నేళ్ల నుంచీ జనసేన సోషల్ మీడియా వింగ్ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటున్నారు.  అలాగే తెలంగాణలో కూడా జనసేన కోసం రామ్ తాళ్లూరి పని చేస్తున్నారు. జనసేన, జనసేనాని పవన్ కల్యాణ్ కు అభిమాని అయినా ఇప్పటి వరకూ రామ్ తాళ్లూరి పవన్ కల్యాణ్ తో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా నిర్మించలేదు. అయినా జనసేన పట్ల అంకిత భావంతో గత పదేళ్లుగా పని చేస్తున్న రామ్ తాళ్లూరిని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ముందు ముందు ఆయనకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్న పవన్ కల్యాణ్ కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిని రామ్ తాళ్లూరికి కేటాయించడం ఆయన నిబద్ధతపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా జనసైనికులు అభివర్ణిస్తున్నారు. 

బీహార్ లో పీకే ప్రభావమెంత?.. లాభమెవరికి.. నష్టం ఎవరిది?

ఒకప్పుడు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ఇప్పుడు తన పార్టీకి తాను ఎన్నికల వ్యూహాలు రచించుకుంటున్నారు. ఔను ఒక్కప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఫలానా పార్టీ అధికారంలోకి రావాలంటే.. ఆ పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ అయ్యి ఉండాలి అని అంతా భావించారు.   2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువుదీరడానికైనా, 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నా.. అలాగే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడో సారి అధికార పగ్గాలను అందుకున్నారన్నా.. అందుకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణమన్నది  పరిశీలకులు విశ్లేషణ.  అలాంటి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సొంతంగా జన సురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని త్వరలో బీహార్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఓంటరిగా రంగంలోకి దిగుతున్నారు. ప్రశాంత్ కిశోర్ స్వరాష్ట్రం బీహార్ అయినప్పటికీ ఈ సారి ఆయన ఎన్నికల వ్యూహాలు ఫలించే అవకాశాలు అంతంత మాత్రమేనన్నది పరిశీలకుల విశ్లేషణ. మూడేళ్ల కిందట సరిగ్గా ఇదే నెలలో ఆయన జగన్ సూరజ్ పార్టీ అధినేతగా బీహార్ లో పాదయాత్ర ఆరంభించారు. అప్పటి నుంచీ రాష్ట్రమంతటా తిరుగుతూనే ఉణ్నారు. ఇప్పటి వరకూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 5500 గ్రామాలను పాదయాత్ర ద్వారా చుట్టేశారు. భారీ ర్యాలీలు, బహిరంగ సభల వంటివి లేకుండానే.. తన పాదయాత్రలో భాగంగా ఇల్లిల్లూ తిరుగుతున్నారు. భారీ ర్యాలీలూ, ప్రసంగాలకు దూరంగా. ఆయన ప్రజలలో మమేకమై వారి సమస్యల పరిష్కారం విషయంలో గట్టిగా నిలబడతానని హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ పట్ల యువత ఆకర్షితులౌతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే బీఆర్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ప్రజా హృదయాలను గెలుచుకున్నారంటున్నారు.  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, ఓటమి అన్న అంశాల జోలికి పోకుండా జనసురాజ్ పార్టీ అన్ని నియోజకవర్గాలలోనూ పార్టీ వాయిస్ ను వినిపించాలన్న లక్ష్యంతో ప్రశాంత్ కిశోర్ ముందుకు సాగుతున్నారు. విశ్వసీయ సమాచారం మేరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. బీఆర్ లో ప్రధాన పోరు ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే ఉందని సర్వేలు చెబుతున్నాయి. అంతే కాకుండా స్వల్ప మొగ్గు ఇండి కూటమి (బీహార్ లో మహాఘట్ కూటమి) వైపే ఉందని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. బీహార్ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ జనసూరజ్ పార్టీ కీలక పాత్ర పోషించనుందని ఆ సర్వేలు చెబుతున్నాయి. పార్టీ ఏర్పాటు చేసిన తరువాత తొలి సారి ఎన్పికల రణరంగంలోకి అడుగుపెట్టిన శాంత్ కిషోర్ తన పార్టీ అభ్యర్థులను అన్ని నియోజకవర్గాలలోనూ నిలబెట్టనున్నారు. సర్వేల అంచనా ప్రకారం ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ పార్టీ  8 నుంచి 11 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. అయితే సీట్ల పరంగా మాత్రం ప్రశాంత్ కిషోర్ జీరో నంబర్ తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఇక రాష్ట్రంలో నితీష్ కుమార్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని సర్వేలు పేర్కొన్నాయి. ప్రశాంత్ కిశోర్ పార్టీ ఎనిమిది నుంచి 11 శాతం ఓట్లు సాధించడమంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చడమే అవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ సంగతి అటుంచితే..ప్రకాంత్ కిషోర్ కొత్త పార్టీతో తొలి సారి ఎన్నికల రణరంగంలోకి దిగి ఆ మాత్రం ఓట్ షేర్ సాధించడంటే మాటలు కాదని అంటున్నారు.   

మిథున్ రెడ్డికి జగన్ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదా?

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని జగన్ పక్కన పెట్టేశారా? తనకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మిథన్ రెడ్డిని కనీసం కలిసేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదా? అంటే పార్టీ వర్గాలే కాదు.. పరిశీలకులు సైతం ఔననే అంటున్నారు. అందుకు ఉదాహరణగా మిథన్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో అరెస్టై నెలల తరబడి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ.. జగన్ ఒక్కటంటే ఒక్కసారి కూడా మిథున్ రెడ్డిని పరామర్శించిన పాపాన పోలేదు. అయితే.. మిథున్ రెడ్డి అరెస్టుకు ముందు.. వివిధ కేసులలో అరెస్టైన పార్టీ కింది స్థాయి నాయకుల నుంచి కార్యకర్తల వరకూ అందరినీ జగన్ పనిగట్టుకు వెళ్లి మరీ పరామర్శించారు. అలా పరామర్శించిన వారిలో గంజాయి కేసుల్లో, వేధింపుల కేసుల్లో అరెస్టైన పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు.   అయితే మిథున్ రెడ్డి ని మాత్రం జగన్ పరామర్శించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.  జైలుకు వెళ్లి పరామర్శించలేదు సరే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డి మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు రెగ్గ్యులర్ బెయిలుపై విడుదలైన తరువాత కానీ జగన్ మిథున్ రెడ్డిని పలకరించ లేదు. మిథున్ రెడ్డి జగన్ తో  భేటీకి చేసిన ప్రయత్నం ఫలించలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మిథున్ రెడ్డికి జగన్ అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అంటున్నాయి. ఒక్క  మిథున్ రెడ్డి అనే కాదు..  అసలు మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఏ ఒక్కరినీ కూడా జగన్  ఇంత వరకూ పరామర్శించలేదు. పలకరించలేదు. దీంతో మద్యం కుంభకోణం విషయంలో జగన్ లో భయం పేరుకుపోయిందనీ, ఆ కేసులో అరెస్టైన వారికి ఎంత దూరంగా ఉంటే... ఆ కేసు దర్యాప్తు తనను చేరడానికి అంత ఆలస్యం అవుతుందనీ జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీ కర్నాటక మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మ్యాటరేంటంటే?

ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఉన్నాయి. అయితే అవెప్పుడూ ప్రభుత్వాల మధ్య వైరానికీ, మంత్రుల మధ్య  ఘర్షణాత్మక పరిస్థితులకూ దారి తయలేదు. ఇటీవల కర్నాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకుని, అందుకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టేయడానికి రెడీ అయిన సందర్భంగా కూడా ఏపీ నుంచి ఖండనలు అయితే వచ్చాయి కానీ.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు చెడే పరిస్థితి రాలేదు. అయితే.. తాజాగా కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సామాజిక మాధ్యమ వేదికగా రెండు రాష్ట్రాల ఐటీ మంత్రుల మధ్యా జరుగుతున్న మాటల యుద్ధం నెట్టింట వైరల్ అయ్యింది.   ఇటీవలి కాలంలో బెంగళూరు  ఓఆర్ఆర్ ప్రాంతం నుంచి పలు కంపెనీలు.. ఆంధ్రప్రదేశ్ కు తమ బిచాణా ఎత్తివేసే దిశగా యోచిస్తున్నాయి. అటువంటి కంపెనీలను మంత్రి నారా లోకేష్  ఏపీకి రావాలని ఆహ్వానం పంపడమే కాకుండా, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం రాష్ట్రంలో అములు అవుతోందంటూ కంపెనీలకు ది బెస్ట్ అనదగ్గ రాయతీలను ఇస్వామని ప్రతిపాదిస్తున్నారు. అంతే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి ఏరోస్పేస్, అలాగే ఎకో ఫ్రెడ్లీ వ్యవస్థలన తీసుకువస్తున్నదని చెబుతున్నారు.   అయితే లోకేష్ తమ రాష్ట్రంలోని కంపెనీలను ఏపీకి ఆహ్వానాంచడంపై బెంగళూరు ఐటీ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   బెంగళూరు ఇప్పటికే ఇండియాకు టెక్నికల్ కేపిటల్ గా ఉన్న సంగతిని గుర్తు చేస్తూ.. ఏపీలో పెట్టుబడులు క్షేమదాయకం కాదంటూ ఏపీలో 2019-2024 మధ్య కాలంలో ఆ రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయాయని చెబుతున్నారు. అంతే కాకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఈ ప్రతిపాదనలు, ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ ఏపీని పరాన్నజీవిగా అభివర్ణించారు.  కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే మాటలకు లోకేష్ దీటుగా స్పందించారు. ఎక్కడా పరుషమైన పదాలను ఉపయోగించకుండానే.. కర్నాటక మినిస్టర్ కు దిమ్మదిరిగే బదులిచ్చారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతున్న మాట వాస్తవమేననీ, అయితే ఈ ఆహ్వానాలు పోటీ తత్వంతోనో, మరో రాష్ట్రానికి నష్టం చేకూర్చాలన్న ఉద్దేశంతోనో కాదని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో కొత్త కొత్త రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.    

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదరరెడ్డి ఇక లేరు

కాంగ్రెస్   సీనియర్ నాయకుడు,   మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి  ఇక లేరు. ఆయన వయస్సు 73 ఏళ్లు. కిడ్నీల సమస్యతో  బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు.  ఆయన పార్దివ దేహాన్ని రేపు సాయంత్రానికి తుంగతుర్తికి తరలించనున్నారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.    రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్న రేవంత్  రాంరెడ్డి దామోదరరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  టీసీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పొన్న, తుమ్మలలు రాంరెడ్డి దామోదరరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ సంతాపం ప్రకటించారు.  తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒక సారి సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 

జగన్ లా తుగ్లక్ ను కాను... ఈ మాటన్నదెవరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వ ప్రాధామ్యాలపై స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి, మెరుగైన జీవన ప్రమాణాలు లక్ష్యంగా పాలనలో ముందుకు సాగుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన పదే పదే చెబుతుంటారు. సంపద సృష్టితో పాటు ఆ సృష్టించిన సంపదను ప్రజలకు పంచడం ద్వారా సమాజంలో ఆర్థిక అంతరాలు తగ్గించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన దాదాపు ప్రతి సంరద్భంలోనూ చెబుతూనే ఉంటారు.  సాధారణంగా ఆయన ప్రత్యర్థులపై చేసే విమర్శలన్నీ అంశాల ప్రాతిపదికనే ఉంటాయి. పరుషంగా మాట్లాడటం చాలా చాలా అరుదు. అటువంటి చంద్రబాబు నాయకుడు బుధవారం (అక్టోబర్ 1) విజయనగరం జిల్లాలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ ను తుగ్లక్ గా అభివర్ణించారు. జగన్ హయాంలో రాష్ట్రం భ్రష్టుపట్టిన తీరును వివరిస్తూ.. 2024 ఎన్నికలలో విజయం సాధించి తన నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో ప్రగతి ఎలా పరుగులు తీస్తున్నదో వివరించిన చంద్రబాబు.. తాను జగన్ లాంటి తుగ్లక్ ను కాదని చెప్పారు. జగన్ పాలనా విధ్వంసాన్ని, తన పాలనలో పరుగులు పెడుతున్న ప్రగతిని వివరించారు.   జగన తన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల ఆనందాన్ని హరించేశారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్నారనీ, 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయం సాధించి పదవీ పగ్గాలు అందుకున్న తరువాతనే రాష్ట్ర ప్రజలలో మళ్లీ ఆనందం కనిపిస్తోందన్నారు.   సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కూడా కలిగిందన్నారు. జగన్ తుగ్లక్ పాలనకు పూర్తి భిన్నంగా   తన పరిపాలన అభివృద్ధి, స్థిరత్వం, ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడంపై దృష్టిపెట్టిందని వివరించారు.   

టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం

  తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వాయిదా వేసుకున్నారు. మరోవైపు వచ్చే వారం పోలీసుల అనుమతితో ఆయన బాధితులను పరామర్శిస్తారని టీవీకే పార్టీ పేర్కొన్నారు.  కరూర్‌లో సెప్టెంబర్‌ 27న విజయ్‌ నిర్వహించిన రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం విజయ్‌ను తీవ్రంగా కలచివేసింది. అనంతరం ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనలను రద్దు చేశారు. టీవీకే నాయకులు ఈ ఘటనపై ఆరోపణలను ఖండిస్తూ, గతంలో పెద్దఎత్తున ర్యాలీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని చెప్పారు. దీనిని డీఎంకే కుట్రగా కూడా ఆరోపించారు. అయితే అధికార పార్టీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. విజయ్‌ నిన్న భావోద్వేగంతో ఒక వీడియో విడుదల చేస్తూ, "ఇలాంటి పరిస్థితిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు" అన్నారు. కరూర్‌ వెంటనే ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నకు సమాధానంగా, "ఆ నిర్ణయం అసాధారణ పరిస్థితికి దారి తీస్తుందని భావించాను. త్వరలోనే బాధిత కుటుంబాలను కలుస్తాను" అని స్పష్టం చేశారు.  

జగన్ హయాం ఒక నేర సామ్రాజ్యం.. ఎన్సీఆర్బీ నివేదిక

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాం ఒక నేర సామ్రాజ్యంగా మారిందని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. జగన్ హయాంలో రాష్ట్ర మొత్తం నేరమయంగా మారిందనీ, ప్రజలంతా బాధితులుగా మారిపోయారని పేర్కొంది. సాక్ష్యాలతో సహా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆంధ్ఱప్రదేశ్ లో జగన్ హయాంలో దళితులు, మహిళలు, పిల్లలపై అసంఖ్యాకంగా ఘోరాలూ, నేరాలూ జరిగాయని ఎన్సీఆర్బీ 2023 నివేదిక పేర్కొంది. జగన్ హయాంలో ఏపీలో పోలీసులంతా రాజకీయం కోసమే పని చేశారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా మొత్తం 58 రాజద్రోహం కేసులు నమోదైతే.. ఆంధ్రప్రదేశ్ లో 11 రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. కల్లోల మణిపూర్ తరువాత ఏపీలోనే ఈ తరహా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఏపీలో పరిస్థితి అప్పట్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడమే రాజద్రోహం అన్నట్లుగా ఉండేదని ఆ నివేదిక పేర్కొంది.   ఇక రాజకీయాల కోసం వర్గాల మధ్య చిచ్చులు పెట్టడంలోనూ వైసీపీ హయాంలో పెచ్చరిల్లిపోయిందని నివేదిక వివరించింది. ఇక మహిళలపై జరిగిన దాడుల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. దేశ వ్యాప్తంగా మహిళలపై 8,416 కేసులు నమోదు  వాటిలో  2,826 అంటే 33.57% కేసులు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే నమోదయ్యాయి.  ఈ తరహా నేరాలకు గురైన బాధితుల సంఖ్య దేశం మొత్తంలో   8,661 ఉంటే ఒక్క  ఆంధ్రప్రదేశ్ లోనే 3,020 మంది ఉన్నారు.  షెల్టర్‌హోమ్‌లలో బాలికలపై లైంగిక వేధింపుల విషయంలోనూ దేశం మొత్తంలోనే ఏపీ మూడో స్థానంలో నిలిచింది.   ఇక దళితులపై   దాడుల విషయంలో ఏపీ దక్షిణాదిలోనే అగ్రస్థానంలో నిలిచింది. జగన్ హయాంలో వారానికి ముగ్గురు దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయని కేసులను బట్టి చూస్తే అర్ధమౌతుంది. ఇక ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసుల విషయంలో కూడా ఏపీ అగ్రపీఠినే నిలిచింది.   దేశవ్యాప్తంగా 57,789 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైతే.. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 2,027 నమోదు అయ్యాయి. ఈ తరహా కేసుల్లో దక్షిణాది రాష్ట్రాలలో ఏపీయే నంబర్ వన్ గా ఉందని ఆ నివేదిక వెల్లడించింది.   

బాబు మాకు బిగ్ బ్రదర్.. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విజన్ తమకు ఆదర్శమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయెల్ అన్నారు. దేశంలో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకోవడానికి ఆయనే ఆద్యుడని ప్రశంసించారు.  ఢిల్లీలో మంగళవారం (సెప్టెంబర్ 30) జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సదస్సులో గోయల్ మాట్లాడారు.  దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ముఖ్యంగా ఐటీ రంగ అభివృద్ధికి చంద్రబాబు అందించిన సేవలు అమోఘమన్నారు.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడం ఇది ఏడో సారి అన్న పీయూష్ గోయెల్ ఈ సారి సీఐఐ సదస్సుకు వేదిక విశాఖపట్నం కావడం ముదావహమన్నారు.  పరిశ్రమలు స్థాపనకు, పెట్టుబడులకు విశాఖ అత్యంత అనువైన ప్రదేశమని చెప్పారు.   దేశవ్యాప్తంగా అమలు చేసిన జీఎస్టీ వంటి కీలక ఆర్థిక సంస్కరణలు విజయవంతం కావడం వెనుక చంద్రబాబు విజన్, ప్రోత్సాహం, సహకారం ఉందన్న ఆయన సీబీఎన్ మార్గనిర్దేశంతోనే ఇటువంటి క్లిష్టమైన సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయగలిగామన్నారు. విశాఖలో జరగబోయే సీఐఐ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.