15 నెలల్లో 4లక్షలకు పైగా ఉద్యోగాలు.. అసెంబ్లీ వేదికగా జాబ్ డేటా
posted on Sep 27, 2025 @ 4:17PM
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన 15నెలల కాలంలోనే గణనీయంగా ఉద్యోగాల సృష్టిజరిగింది. దీనిపై అసెంబ్లీ వేదికగా చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఇంత వరకూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఎన్ని ఉద్యోగ నియామకాలు జరిగాయన్నదానిపై గణాంకాలతో సహా వివరించారు. గత 15 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మొత్తం 4,71,574 ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా 15 వేల 941 పోస్టులు, అలాగే వివిధ ప్రభుత్వ శాఖలలో 9,093 ఉద్యోగాలు ఇక పోలీసు శాఖలో 6వేల వంద పోస్టులు భర్తీ అయ్యాయని వివరించారు. అలాగే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, జాబ్ మేళాల ద్వారా 92 వేల149 మందికి ఉపాధి లభించిందన్నారు. వర్క్ ఫ్రం హోం మోడల్ లో 5 వేల 500 అవకాశాలు దక్కాయి.
ఉద్యోగ కల్పనలో అధిక శాతం ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ, ఎంఎస్‌ఎంఈలు వంటి పరిశ్రమలలో 3లక్షల 48 వేల 891 మందికి ఉద్యోగాలు లభించాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత వరకూ ఉద్యోగాలు లభించిన వారి పేర్లు, వారి హోదా, ఎక్కడ పని చేస్తున్నారు వంటి అన్ని వివరాలతో పబ్లిక్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అంతే కాకుండా ఐదేళ్లలో 20 లక్సల ఉద్యోగాల భర్తీ చేసి తీరుతామనీ, ఇప్పటి వరకూ జరిగింది ప్రారంభం మా్రతమేననీ రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయనీ వివరించారు.