కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా?

కాంగ్రెస్ లో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. మేడారం పనుల కాంట్రాక్టుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి మధ్య నెలకొన్న విభేదాలు కేబినెట్ భేటీపైనా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. విభేదాలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవలసింది పోయి మీడియా ముందుకు వెళ్లడమేంటన్నది రేవంత్ ఆగ్రహంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ మాజీ ఓఎస్డీ వ్యవహారం అగ్నికి అజ్యం పోసినట్లైంది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు ఏకంగా మంత్రి సురేఖ నివాసానికి వెళ్లడం, అక్కడ కొండా సురేఖ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా మీడియా ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా నిప్పులు చెరిగారు.  ఇక దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. ఉరుములేని పిడుగులా మంత్రి కొండా సురేఖకు చెందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మేడారం పనులను తప్పించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మేడారం పనుల రికార్డులను వెంటనే ఆర్అండ్ బి శాఖకు అప్పగించాల్సిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరగనున్న కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టాలని కొండా సురేఖ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టడమే కాదు.. అవసరమైతే మంత్రి పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయంటున్నారు. కేబినెట్ భేటీకి గైర్హాజర్ అవుతున్నట్లు కొండా సురేఖ ప్రకటించనప్పటికీ, ఆమె సన్నిహిత వర్గాలు మాత్రం ఆమె కేబినెట్ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేవని అంటున్నారు.  

మంత్రి కొండా సురేఖకు మరో షాక్

మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇస్తోంది. ఆమె మాజీ ఓఎస్డీని విధుల నుంచి తొలగించిన ప్రభుత్వం.. అతడిపై కేసుల విషయంలో రాజీ లేకుండా అరెస్టు చేయాలంటూ పోలీసులను ఆమె నివాసానికి పంపించింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఆమెకు ప్రభుత్వం మరో  షాక్ ఇచ్చింది.  మేడారం జాతర పనులను ఆర్అండ్ బీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే మేడారం జాతర పనుల రికార్డులను ఆర్ అండ్ బీకి అప్పగించాలంటూ దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేడారం జాతర పనులకు సంబంధించిన టెండర్ల విషయంలోనే మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేని సుధాకరరెడ్డిల మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ సీఎంకు ఫిర్యాదు కూడా చేశారు. అలాగే మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ హైకమిండ్ కు లేఖ రాశారు.  ఇప్పుడు తాజాగా  మేడారం జాతర పనుల రికార్డులను ఆర్అండ్ బి శాఖకు అప్పగించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో.. కొండా సురేఖను పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 

కొండా సురేఖ నివాసం వద్ద అర్థరాత్రి హైడ్రామా

తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం (అక్టోబర్ 15) అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం గాలింపు చర్యలలో భాగంగా  పోలీసులు జూబ్లీహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ కొండా సురేఖ కుమార్తె  కొండా  సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  విషయమేంటంటే.. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ను ప్రభుత్వం మంగళవారం (అక్టోబర్ 14) విధుల నుంచి తొలగించింది.   తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ఓఎస్డీగా నియమితులైన సుమంత్‌  అధికారులపై ఒత్తిడి తేవడం, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వంటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయనను విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా   డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైలు విషయంలో సుమంత్ తుపాకీతో బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం ప్రభుత్వం అతడిపై వేటు వేసింది. విధుల నుంచి తొలగించిన తరువాత  సుమంత్.. మంత్రి సురేఖ నివాసంలోనే ఉన్నారనే సమాచారంతో బుధవారం రాత్రి   వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు  మంత్రి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కుమార్తె వారితో వాగ్వాదానికి దిగారు. తాము ఏ ప్రభుత్వంలో ఉన్నామో అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేచ శారు.  సుమంత్‌పై నమోదైన కేసు వివరాలు స్పష్టంగా చెప్పకుండా, అరెస్ట్ వారెంట్ చూపించకుండా తమ ఇంట్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ లోగా అక్కడకు మీడియా రావడంతో పోలీసులు వెనక్కు తగ్గారు.  ఈ సందర్భంగా కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీసీ మంత్రి అయిన తన తల్లి కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు.  బీసీలకు అన్యాయం జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉండటమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు.

హవ్వ.. రాష్ట్రానికి గూగుల్ జగన్ క్రెడిటేనంట?

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా ఉంది వైసీపీ తీరు. కింద పడినా మాదే పై చేయి అని చాటుకోవడానికి ఆ పార్టీ చేస్తున్న విన్యాసాలు నవ్వుల పాలౌతున్నాయి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ఆ ఐదేళ్ల కాలంలోనూ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అధ: పాతాళానికి దిగజారిపోయేలా చేశారు. ఉన్న పరిశ్రమలను తరిమేశారు. కొత్తవి రాకుండా అడ్డగోలు విధానాలతో  అడ్డుకున్నారు. ఒక్క పారిశ్రామిక రంగం అనేమిటి? జగన్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ వెనుకబడిపోయింది. అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయింది. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి గురించి పోరుగు రాష్ట్రం మంత్రులే జోకులేసేలా అప్పట్లో రాష్ట్ర పరిస్థితి ఉండేది. అయినా సరే జగన్  మాత్రం అభివృద్ధి, సంక్షేమాలలో తామే మేటి అని నిస్సిగ్గుగా చాటుకునే వారు. అంతే కాదు.. జగన్ హయాంలో వీసమెత్తు అభివృద్ధి లేకపోయినా.. కొత్తగా రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి రాకపోయినా పట్టించుకునే వారు  కాదు కానీ, అంతకు ముందు చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల గురించి మాత్రం అదంతా తమ క్రెడిటేనని చాటుకోవడానికి  వైసీపీయులుఇసుమంతైనా వెనుకాడే వారు కాదు. అనంతపురంలో కియా మోటార్స్ రావడానికి చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ మాత్రం అసెంబ్లీ వేదికగా నిస్సిగ్గుగా కియా రాష్ట్రానికి రావడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని చెప్పుకున్నారు. ఒక్క కియా అనేమిటి, తమ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో అంతకు ముందు ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి అంతా తమ ఖాతాలోకి వేసుకోవడానికి ఇసుమంతైనా సంకోచించేవారు కాదు.  ఇప్పుడు విశాఖలో గూగుల్ తన అతి పెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సర్కార్ తో ఒప్పందం చేసుకున్న తరువాత వైసీపీ మళ్లీ ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి తాపత్రేయపడుతోంది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడానికి జగనే కారకుడని ఏ మాత్రం సిగ్గు లేకుండా చెప్పుకుంటోంది.      వైజాగ్‌లోని తన ఏఐ  హబ్ ద్వారా రాబోయే ఐదేళ్లలో   15 బిలియన్ల డాలర్ల పెట్టుబడిని గూగుల్ మంగళవారం  అధికారికంగా ప్రకటించిన విషయం  తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం, గూగుల్ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి  అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ సమక్షంలో సంతకాలు జరిగాయి.  ఇంతటి స్థయిలో ప్రపంచ మేటి సంస్థ గూగుల్ నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ లపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం ఈ ఘనతను అంగీకరించలేక.. తనదైన శైలిలో ఫేక్ ప్రచారానికి తెగబడుతోంది.   చంద్రబాబు నాయుడు దార్శనికతకు, అభివృద్ధి సంక్షేమం విషయంలో ఆయన ఆచరణాత్మక విధానాలను రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన ప్రత్యర్థులు సైతం అభినందిస్తారు, ప్రశంసిస్తారు. అయితే వైసీపీ మాత్రం ఈ వాస్తవాన్ని అంగీకరించలేక ఫేక్ ప్రచారానికి దిగి నవ్వుల పాలౌతోంది.  గూగుల్ డేటాసెంటర్ విశాఖకు రాబోతోందనగానే.. వైసీపీ డేటా సెంటర్ల వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదన్న వాదనను తలకెత్తుకుంది. అయితే, ఆ ప్రచారం ఎందుకూ పనికిరాకుండా పోవడం.. చంద్రబాబు, లోకేష్ ల బ్రాండ్ ఇమేజ్ అమాంతంగా పెరిగిపోవడంతో.. వైసీపీ ఇక కొత్త ప్రచారానికి తెరతీసింది. అదేమిటంటే.. రాష్ట్రానికి గూగుల్ తరలిరావడానికి జగనే కారణమనీ, ఇందులో చంద్రబాబు ఘనతేమీ లేదనీ తన భుజాలను తానే చరిచేసుకోవడం మొదలెట్టిది. ఇంతకీ వైసీపీ వాదనేంటంటే.. కొన్నేళ్ల కిందట జగన్ అదానీని కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ..  ఆ భేటీలోనే గూగుల్ డేటా సెంటర్  ఏపీకి తీసుకురావాలని జగన్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నమే ఫలించి ఇప్పుడు గూగుల్ వైజాగ్ కువచ్చింది. అయితే ఈ వాదన వైసీపీ నవ్వుల పాలు కావడానికి తప్ప మరొకందుకు ఉపయోగపడలేదని పరిశీల కులు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నసమయంలో  రాష్ట్రంలో ఒక్కకంటే ఒక్క ప్రధాన ఐటీ కంపెనీ వచ్చిదా?  అసలు ఏ కంపెనీ అయినా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తైనా చూసిందా? అంటూ జనమే వైసీపీ వాదనను పూర్వపక్షం చేస్తున్నారు.  నెటిజనులు వైసీపీ వాదనను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇక రాజకీయ పరిశీలకులైతే.. వైజాగ్ కు గూగుల్ తరలిరావడం చంద్రబాబు ఘనతే అని వైసీపీ అంగీకరించలేకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చునని అంటూనే.. ఈ సమయంలో వైసీపీ ఫేక్ ప్రచారానికి దిగకుండా మౌనం వహిస్తే ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకూ మంచిదని సలహా ఇస్తున్నారు.  

బీహార్ రాజకీయాల్లో లూలూ శకం ముగిసిందా?

బీహార్ రాజకీయాలలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభావం కనిపించడం లేదా? అన్న చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. గతంలో అయితే  ఒక్క బీహార్ అనేమిటి దేశ వ్యాప్తంగా, ఆ మాటకొస్తే అంతర్జాతీయంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఒక జైగాంటిక్ పొలిటీషియన్. ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ ది పుష్ప రేంజ్ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అన్నట్లుగా ఉండేది.  రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో.. రైల్వేలను లాభాల బాట పట్టించారు. దీంతో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ లాలూ సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. ఒక పశువుల కాపరి కొడుకు.. ఇంతటి రేంజ్ కి ఎలా ఎదిగారు? అంటూ హార్వర్డ్  యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలు ఆయన జీవితాన్ని ఒక కేస్ స్టడీలా తీసుకుని పరిశీలించాయి. అదీ అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ స్టామినా. అయితే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పొలిటికల్ గా సొంత పార్టీలోనే ఇన్ సిగ్నిఫికెంట్ అయిపోయారు. అంతటి స్టేచర్ ఉన్న వ్యక్తి ఇప్పుడు కనీసం కుమారుడిని కూడా మందలించలేని, నియంత్రించలేని పరిస్థితిలో ఉన్నారు.    ఇప్ప‌టి వ‌ర‌కూ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన ప్ర‌త్య‌ర్ధులే   ఇర‌కాటంలో ప‌డేసేవారు.. ఇప్పుడు ఏకంగా ఆయన కుమారుడే పక్కన పెట్టేస్తున్నారు.  లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ అధినేతగా  పార్టీ  లీడ‌ర్ల‌కు ఇచ్చిన బీఫామ్స్ ను ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ వెనక్కు తీసేసుకున్నారు.  అదేమంటే మ‌హా ఘ‌ట్ బంధ‌న్ లోనే ప్రధాన  పార్టీ అయిన కాంగ్రెస్ ఇదేం ప‌ద్ధ‌తి? ఇంకా సీట్ల సర్దుబాటు కాకుండానే పార్టీ అభ్యర్థులకు బీఫామ్ లు ఎలా ఇస్తారంటూ నిలదీయడమే కారణమంటున్నారు.  ఈ ఎన్నిక‌ల్లో గానీ ఆర్జీడీ పరిస్థితి ఏమాత్రం అటూ ఇటూ అయినా, అంటే పార్టీ విజయం సాధించి అధికారం చేజిక్కించుకోలేకపోతే మాత్రం.. లాలూ ప్రసాద్ యాదవ్ పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనని పరిశీలుకుల విశ్లేషిస్తున్నారు.   ఒక్క లాలూ ప్రసాద్ యాదవ్ పొలిటికల్ కెరీరే కాదు, ఆర్జేడీ ఉనికి కూడా నామమాత్రం అయిపోతుందంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఓ రేంజ్, నేమ్ అండ్ ఫేమ్. బీహార్ ఒక స‌మోసాలాంటిదైతే లాలూ అందులో మ‌సాలాతో కూడుకున్న ఆలూ అన్న ఫేమ్ ఉండేది. అయితే కేసులు, జైలు, వయస్సు పైబడటం ఇత్యాది కారణాలతో అదంతా గతంగా మిగిలిపోయింది. ఇప్పుడు సొంత పార్టీలోనే, అందునా సొంత కుమారుడే పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వని పరిస్థితి నెలకొంది.  వాటీజ్ లాలూస్ బ‌యోగ్ర‌ఫీ అని ఒక లుక్కేసుకుంటే.. పాట్నా యూనివ‌ర్శిటీలో విద్యార్ధి నాయ‌కుడిగా మొద‌లైన లాలూ ప్ర‌స్థానం.. అంచెలంచెలుగా ఎదిగింది. జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ వ‌ద్ద శిష్య‌రికం చేసిన లాలూ.. ఎమ‌ర్జెన్సీ హ‌యాంలో ఇందిరాగాంధీకే చార్ట‌ర్ ఆఫ్ డిమాండ్స్ అందించిన ధీశాలిగా పేరు సాధించారు. అంతే కాదు 29 ఏళ్ల అతి పిన్న‌వ‌య‌సులోనే ఆయ‌న లోక్ స‌భ‌కు ఎంపిక‌య్యారు. కేవ‌లం ప‌దేళ్ల స‌మ‌యంలోనే ఆయ‌న బీహార్ రాజ‌కీయాల్లో న‌వ యువ శ‌క్తిగా ఎదుగుతూ వ‌చ్చారు. సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని విజ‌య‌ప‌థాన న‌డిపించారు. అంతేనా 1990లో సీఎం అయ్యారు. ఆర్ధికంగా ఎదుగుతోన్న బీహార్ పై ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిందంటే అర్ధం చేసుకోవ‌చ్చు లాలూ ఆర్ధిక‌ప‌రంగా ఎంత‌టి నిష్ణాతుడో. 1996లో బ‌య‌ట ప‌డ్డ రూ.950 కోట్ల‌ ప‌శుగ్రాస కుంభ‌కోణం ఆయ‌న జీవితాన్ని తారు మారు చేసేసింది. ఆ స‌మ‌యంలో త‌న స‌తీమ‌ణి ర‌బ్రీదేవిని ముఖ్య‌మంత్రి చేశారు లాలూ. 1997లో ఆయ‌న జ‌నతా ద‌ళ్ నుంచి విడిపోయి రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ ని ఏర్పాటు చేశారు. లాలూ అతి పెద్ద విజ‌యం రైల్వే మంత్రిగా ఉండ‌గా.. న‌ష్టాల్లో ఉన్న ఆ శాఖ‌ను లాభాల బాట ప‌ట్టించ‌డం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌పై అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఒక స‌మ‌యంలో కొన్ని అంత‌ర్జాతీయ యూనివ‌ర్శిటీలు.. రైల్వేలో లాలూ పాటించిన  యాజ‌మాన్య ప‌ద్ధ‌తుల‌పై ప‌రిశోధ‌న‌కు దిగాయంటే అర్ధం చేసుకోవ‌చ్చు ఆయ‌న శ‌క్తి  సామ‌ర్ధ్యాలు ఏపాటివో. అయితే లాలూ జీవితాన్ని త‌ల‌కిందులు చేసింది మాత్రం.. దాణా కుంభ‌కోణ‌మ‌నే చెప్పాలి. ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో తీర్పులు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతి కేసులోనూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు జైలు శిక్ష  విధించింది. చివరిది, అయిదోది అయిన డొరండా ఖజానా కేసులో ఆయనకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2022 ఫిబ్రవరి 21న ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది.  ఒక ప‌శువుల కాప‌రి కొడుకు ఇంత‌టి అంత‌ర్జాతీయ స్థాయికి ఎద‌గ‌డం.. భార‌త ప్ర‌జాస్వామ్యం సాధించిన విజ‌యం.. అంటూ ఆయ‌న త‌న‌కు తాను స్వ‌యంగా ఏషియా టైమ్స్ ప‌త్రిక ఇంట‌ర్వ్యూలో ఎలా చెప్పుకున్నారో. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ప‌శువుల‌ దాణా కుంభ‌కోణంలో ఆయ‌న పీక లోతు కూరుకుపోవ‌డం ద్వారా..  త‌న ప‌త‌నాన్ని త‌నే శాసించుకున్నారని  చెప్పాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే రాజ‌కీయంగా ఎంతో అప్ర‌దిష్ట‌పాలైన లాలూ.. ప్ర‌స్తుతం త‌న కొడుకు నుంచి కూడా ఛీత్కార స‌త్కారాలు పొంద‌డం  ఆయన రాజకీయ జీవితంలో అతి పతనావస్థ అనే చెప్పాలి. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లాలూను మళ్లీ పతాక స్థాయికి తీసుకెడతాయా, మరింత పతనావస్థలోకి దిగజార్చుతాయా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.  

జూబ్లీహిల్స్ బై పోల్స్.. మంటలు రేపుతున్న కన్నీళ్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో  దొంగ ఓట్ల వ్య‌వ‌హారంతో పాటు క‌న్నీటి  క‌థ‌లు కూడా భారీగానే న‌డుస్తున్నాయ్.  బీఆర్ఎస్ అభ్య‌ర్ధి మాగంటి సునీత త‌న భ‌ర్త‌ను త‌లుచుకుని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారొక స‌భ‌లో. అయితే ఈ క‌న్నీటి క‌హానీలు కేటీఆర్, హ‌రీష్ కావాల‌నే ద‌గ్గ‌రుండి  నడిపిస్తున్న‌ారంటూ  కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడ‌ర్లు పొన్నం త‌దిత‌రులు. త‌మ‌కు సునీత మీద సానుభూతి ఉందంటూనే.. ఆమెను కావాల‌నే రెచ్చ‌గొట్టి  ఏడిపించి సీన్ క్రియేట్ చేస్తున్నది మాత్రం  హ‌రీష్, కేటీఆరే అంటూ విమర్శలు చేస్తున్నారు.   అస‌లు బీఆర్ఎస్ త‌మ అభ్య‌ర్ధిగా సునీత‌ను నిలబెట్టిందే ఇందుకు అంటున్నారు.  వాస్తవానికి జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలుత పార్టీ అనుకున్న వ్యక్తులు వేరు అంటూ గుర్తు చేస్తున్నారు. జూబ్లీ బైపోల్ లో  బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలుత  కేటీఆర్ స‌తీమ‌ణి  శైలిమ పేరు, ఆ తరువాత   పీజేఆర్ త‌న‌యుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి పేరు కూడా బీఆర్ఎస్ పరిశీలించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.  అయితే శైలిమ, విష్ణువర్దన్ రెడ్డిలలో ఒకరిని నిలిపినా.. జూబ్లీ ఉప ఎన్నిక జరుగుతుందే కానీ, బీఆర్ఎస్ కు అవసరమైన సెంటిమెంట్ పండదన్న భావనతోనే మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారని అంటున్నారు.   బేసిగ్గా బీఆర్ఎస్ ఆయువు ప‌ట్టు మొత్తం సెంటిమెంటులో దాగి ఉంటుంది. అయితే ప్రాంతీయ సెంటిమెంటు, లేకుంటే ఇదిగో ఇలాంటి సెంటిమెంట్లు ఆధారంగా వారు త‌మ కారు  న‌డిపిస్తుంటారు. ఎంద‌రో బ‌లిదానాల పునాదుల మీద క‌ట్టుకున్న పార్టీ క‌దా? అలాగే ఉంటుంద‌ని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.   బీఆర్ఎస్ దంతా  ఎమోష‌న్ చుట్టూ ఆడే డ్రామానే అంటారు వారు. ఇవేవీ కాకపోతే.. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబును అప్పు తెచ్చుకుని మరీ ఆయనపై విమర్శలు గుప్పించి పబ్బంగడుపుకోవడం చూస్తున్నాం కదా అని ఎద్దేవా చేస్తున్నారు.   మొత్తం సెంటిమెంట్ ఆధారంగానే బీఆర్ఎస్ రాజకీయం ఉంటుందనీ, అటువంటి పార్టీకి అందివ‌చ్చిన అవ‌కాశంలా సునీత క‌న్నీళ్లు చెంత‌నే ఉంటే వాడుకోకుండా ఎలా ఉంటారు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  

క‌విత యాత్ర షురూ!

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన కల్వకుంట్ల క‌విత పార్టీ పెడ‌తారా? పెట్ట‌రా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇది సమాధానం లేని ప్రశ్నగా ఉన్నా.. కవిత ఈ ప్రశ్నకు త్వరలోనే జవాబు ఇవ్వబోతున్నారంటున్నారు పరిశీలకులు. ఆమె సొంతంగా పార్టీ పెట్టే ప్రయత్నంలోనే ఉన్నారనీ, అందుకే ఈ నెల చివరి వారంలో ఆమె తెలంగాణలోని అన్ని జిల్లాలనూ కవర్ చేసే విధంగా ఒక యాత్ర చేపట్టబోతున్నారనీ అంటున్నారు. ఆమె యాత్ర చేపట్టనున్నట్లు ఇప్పటికే ఖరారు చేశారు.  ఇక ఇంత‌కీ ఆ యాత్ర ఎలా జ‌ర‌గ‌నుంది? ఆ డీటైల్స్ ఏంట‌ని చూస్తే.. కల్వకుంట్ల కవిత తాను త్వరలో చేపట్టబోతున్న యాత్రలో ఎక్కడా కూడా తన తండ్రి కేసీఆర్ ఫొటో కనిపించదంటున్నారు. ఇందుకోసం ఆమె తెలంగాణ సిద్ధాంతకర్త   ప్రొఫెసర్ జ‌య‌శంక‌ర్ త‌దిత‌రుల‌తో ఒక పోస్టర్ ను తీసుకువచ్చి.. దానినే ప్రముఖంగా తన యాత్రద్వారా జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది.   ఇలా ఎందుకు? అంటే..  తండ్రి కేసీఆర్  త‌న అన్న‌ కేటీఆర్ తో ఉన్నారు.  ఎంత కాదనుకున్నా వారిద్దరూ ఒక జట్టు.  దీనిని మార్చడం అసాధ్యం. అందుకే ఆమె సొంతంగా, స్వతంత్రంగా అడుగులు వేయాలని కవిత నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. అందుకోసం అవసరమైతే.. ఇంత కాలం తన పేరు ముందు ఉంచుకున్న పుట్టింటి ఇంటి పేరు కల్వకుంట్లను సైతం వద్దనుకునేలా ఆమె అడగులు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందు కోసమే పార్టీ నుంచి భౌతికంగా బయటకు వచ్చేయడంతో ఆగకుండా.. కల్వకుంట్ల కుటుంబానికి కూడా దూరం జరిగి.. తాను నేటి మహిళను, కావలసినంత ఆత్మవిశ్వాసం ఉంది అని నిరూపించుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.   ఇక యాత్ర ఎందుకు అంటే.. ఇలా యాత్రలు చేసిన వారికి అధికార ఫలం దక్కుతుందన్న భావనతోనే అంటున్నారు.  నిన్న కాక మొత్త బతుకమ్మ సందర్భంగా తన తండ్రి సొంత ఊరు చింతమడకలో కవిత కన్నీటిపర్యంతమై భావోద్వేగంతో చేసిన ప్రసంగంలో.. మాజీ మంత్రి హరీష్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఇక ఇప్పుడు తన యాత్రలో కూడా అదే చేయనున్నారు. కుటుంబం నుంచి తనను వేరు చేశారన్న సెంటిమెంటు పండించడంతో పాటు.. ఉభయతారకంగా యాత్ర సెంటిమెంటు కూడా పండుతుందని కవిత భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే  యాత్ర సెంటిమెంటు అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని కాదు. ఇక్క‌డా ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ్. ఇంత వరకూ కేవ‌లం అన్న‌ల‌కే ఈ సెంటిమెంటు వ‌ర్క‌వుట్ అయ్యింది.   చెల్లెళ్ల‌కు కాద‌ని  గ‌త అనుభ‌వాలు చెబుతున్నాయి.  జ‌గ‌న్, ష‌ర్మిళ ఇద్ద‌రూ యాత్ర‌లు చేశారు. కానీ అధికారం జ‌గ‌న్ కే   ద‌క్కింది. ఇక్క‌డ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?  లేక కవితకు కలిసివస్తుందా అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే.  

ప్రశాంత్ కిషోర్ పై రఘోపూర్ లో కేసు

బీహార్ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పై కేసు నమోదైంది. బీహార్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ.. ఈ కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వందల వాహనాలతో ఆయన ర్యాలీగా రఘోపూర్ కు వచ్చారు. దీనిపై ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.    కాగా రఘోపూర్ లో మంగళవారం (అక్టోబర్ 14) ప్రశాంత్ కిషోర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన అమేథీలో రాహుల్ గాంధీ ఎలా ఓటమి పాలయ్యారో.. అదే విధంగా రఘోపూర్ లో తేజస్వి యావ్  పరాజయం పాలు కాబోతున్నారని ప్రశాంత్ కిషోర్   చెప్పారు. వాస్తవానికి రఘోపూర్ తేజస్వి యాదవ్  కు పెట్టని కోట లాంటి నియోజకవర్గం. ప్రశాంత్ కిషోర్ తేజస్వియాదవ్ ను టార్గెట్ చేసుకుని అక్కడ నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించారు. వాస్తవానికి తేజస్వియాదవ్ కు ప్రత్యర్థిగా తన జన సూరజ్ పార్టీ తరఫున తానే అభ్యర్థిగా రంగంలోకి దిగాలని ముందుగా భావించిన ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత నిర్ణయం మార్చుకున్నారు. ఈ సారి ఎన్నికలలో తాను వ్యక్తిగతంగా పోటీ చేయడం లేదని ప్రకటించేశారు. రఘోపూర్ తో జనసురాజ్ అభ్యర్థిని గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితి చూస్తుంటే తేజస్వి యాదవ్ ఈ సారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. రఘోపూర్ లో విజయావకాశాలు లేకపోవడంతో తేజస్వి మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలున్నాయన్న ఆయన.. ఆయన మరో చోట ఎక్కడైనా పోటీ చేయనివ్వడం.. రఘోపూర్ లో మాత్రం ఆయనను ఓడించి తీరుతామని ఉద్ఘాటించారు.  కాగా ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు తేజస్వియాదవ్ కు కలవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందనీ, ఆయన అందుబాటులో ఉండరనీ చెప్పారు. అలాగే స్థానిక సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

జూబ్లీ బైపోల్.. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి

జబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎవరన్న విషయంలో ఇన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠ కు తెరపడింది. ఈ బైపోల్ లో తమ పార్టీ అభ్యర్థిగా దీపక్ రెడ్డిని ఖరారు చేస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 15)న ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే.. ముందుగా బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ప్రకటించింది. ఆ తరువాత కాంగ్రెస్ సైతం పలు పేర్లను పరిశీలించి.. చివరకు అభ్యర్థిగా స్థానిక యువకుడు నవీన్  యాదవ్ ను ప్రకటించింది. కానీ బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడింది. పలు పేర్లు పరిశీలించింది. రాష్ట్ర నాయకులలో సయోధ్య కొరవడటంతో పార్టీ అభ్యర్థి ఎంపిక కమలం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. అయితే చివరకు ముందు నుంచీ అనుకుంటున్న లంకల దీపక్ రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసింది. లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికలలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా వెనుకబడి మూడో స్థానంలో నిలిచారు.  

జూబ్లీ బైపోల్.. బీఆర్ఎస్ చేతులెత్తేసిందా?

జూబ్లీ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ విమర్శల జోరు పెంచాయి. బీజేపీ ఇంకా ఒకింత సైలెంట్ గానే ఉంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాత్రం మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. అయితే ఈ మాటల యుద్ధంలో బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ మోడ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ కంటే ముందుగానే బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ఆరంభించేసింది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టి బీఆర్ఎస్ సానుభూతి వేవ్ పై నమ్మకం పెట్టుకుంది. ఇక కాంగ్రెస్ ఒకింత ఆలస్యమైనా బలమైన అభ్యర్థినే రంగంలోకి దింపిందని పరిశీలకులు అంటున్నారు. నవీన్ యాదవ్ లోకల్ నినాదంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణల వ్యూహం ఆ పార్టీకి ఈ ఎన్నికలలో ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.  బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో పూర్తిగా సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధారపడినట్లు కనిపిస్తున్నది. వాటిపై కూడా నమ్మకం సన్నగిల్లి.. నకిలీ ఓట్లు, అధికారులు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు అంటూ ఆరోపణలు గుప్పించడం ద్వారా ముందుగానే ఓటమి భయాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు.  ఎన్నికల ప్రచారంలో  కేటీఆర్.. వేల కొద్దీ దొంగ ఓట్లు చేర్చారని, అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారనీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు సహజంగా ఓటమి భయం నుంచి పుట్టుకువస్తాయని రాజకీయ పండితులు అంటుంటారు.  కేటీఆర్.. బీఆర్ఎస్ ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు ఓటమి భయాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు.  జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్రమంగా ఇరవై వేల ఓట్లు చేర్చారంటూ కేటీఆర్ నేరుగా సీఈవోకు ఫిర్యాదు చేశారు. తన ఆరోపణలను రుజువుగా ఆయన  ఓ ఇంట్లో ఏకంగా నలభై మూడు ఓట్లు ఉన్నాయంటున్నారు. అవన్నీ దొంగఓట్లేనని చెబుతున్నారు. ఈ ఆరోపణనే ఆయన కాంగ్రెస్ పై ప్రయోగించిన పెద్ద ఆయుధంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ అగ్రనేత బీహార్ లో ఓట్ల చోరీ అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారనీ, ఇక్కడ తెలంగాణలో వారి కాంగ్రెస్ పార్టీయే ఓట్ల అక్రమాలకు పాల్పడుతుంటే పెదవి విప్పడం లేదనీ ఆలోచించారు. సరే కేటీఆర్ ఆరోపణపై స్పందించిన ఎన్నికల సంఘం..ఆ ఇంటిలో 43 ఓట్లపై పరిశీలించి.. కేటీఆర్ ఆరోపణలు అవాస్తవమని, అది బహుళ అంతస్తుల భవనమని తేల్చేసింది.  అది పక్కన పెడితే.. కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ తమ ప్రచారంలో జూబ్లీలో గెలిపిస్తే ఏం చేస్తామన్నది చెప్పడం లేదు.. కానీ ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపడుతుందంటూ ఓటర్లను భయపెట్టాలని చూస్తున్నారు. తమకు ఓటు వేయడం అని అడగడానికి బదులు కాంగ్రెస్ కు ఓటే వేయవద్దంటూ ప్రచారం చేస్తున్నారు.  ఈ రకమైన డిఫెన్సివ్ వైఖరి బీఆర్ఎస్ లోని ఓటమి భయాన్ని ఎత్తి చూపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. పోటీకి ప్రశాంత్ కిశోర్ దూరం

బీహార్ లో రాజకీయ వేడి రగులుకుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన వేళ ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి..అదే మహాఘట్ బంధన్ లు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. వాటి కంటే ముందు.. రాజకీయవేత్తగా మారిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన జన  సురాజ్ పార్టీ తరఫున ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేశారు. ఇక ఎన్డీయేలో  సీట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కి వచ్చింది. భాగస్వామ్య పార్టీలలో ఏ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేయాలన్న ఒక క్లారిటీకి వచ్చింది. బీజేపీ అయితే తొలి జాబితా రెడీ చేసేసుకుంది. మరో వైపు మహాఘట్ బంధన్ లో మాత్రం సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయంలో భాగస్వామ్య పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అదలా ఉంటే.. ఎన్నికల వేళ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తాను ఈ సారి పోటీలో దిగడం లేదని ప్రకటించి సంచలనం సృష్టించారు. మొదటి నుంచీ ఆయన మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ కీలక నేత తేజస్వి ప్రసాద్ పోటీ చేసే రాఘోపుర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన తొలి జాబితాలో రాఘోపుర్‌  ఉన్నప్టికీ, అక్కడ నుంచి పోటీకి ఆయన మరో అభ్యర్థి పేరు ప్రకటించారు. దీంతో ఆయన పోటీ చేస్తారా లేదా అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సారి ఎన్నికలలో తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.  ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం చెప్పారు.  తాను ఈ సారి ఎన్నికలలో పూర్తిగా పార్టీ విజయం కోసం మాత్రమే పని చేస్తాననీ, పోటీలో ఉండననీ తేల్చి చెప్పారు.  రాఘోపుర్‌ ఎమ్మెల్యేగా తేజస్వీ యాదవ్‌పై పోటీకి మరో అభ్యర్థిని నిలబెట్టినట్లు చెప్పారు. పార్టీ ప్రయోజనాల కోసం తాను పోటీకి దూరం అయ్యాననీ, తాను పోటీ చేస్తే పార్టీ వ్యవహారాలపై దృష్టిని పూర్తిగా కేంద్రీకరించడానికి అవకాశం ఉండదన్న ఉద్దేశంతో తానీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  

చిక్కుముళ్ల మహాఘట్ బంధన్!

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు ఇండీ కూటమి ముక్కలేనా? బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుపై ధీమాతో ఉన్న ఇండియా కూటమి.. అదేనండి బీహార్ లో మహాఘట్ బంధన్ లో  సీట్ల సర్దుబాటు వ్యవహారం చిచ్చు రేపుతోంది. వాస్తవిక బలంతో సంబంధం లేకుండా కూటమి పార్టీలూ వేటికవి తమకే సింహభాగం కావాలని పట్టుబడుతుండటంతో  మొదటికే మోసం వస్తుందా అనిపించేలా మారింది.  మహాఘట్ బంధన్ పార్టీల  సీనియర్ నాయకుల మధ్య సోమవారం (అక్టోబర్ 13)  సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సీట్ల సర్దుబాటు వరకూ ఎందుకు అసలు కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపైనా పీటముడి పడింది. మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థిపై చర్చంచేందుకు హస్తిన వెళ్లిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వియాదవ్.. అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడిని కానీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కానీ కలవకుండానే తిరిగి పాట్నాకు వచ్చేశారు.   అలాగే ఈ కూటమిలో మరో భాగస్వామ్య పార్టీ అయిన వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేష్ సహానీ కూడా తమ పార్టీకి కేవలం 18 స్థానాలే కేటాయిస్తామనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన 30 సీట్లు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ అలా ఇవ్వకుంటే కూటమి నుంచి నిష్క్రమిస్తానని హెచ్చరిస్తున్నారు.  అంత వరకూ ఎందుకు.. కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ తాను గత ఎన్నికలలో పోటీ చేసిన విధంగానే ఈ సారి కూడా 70 స్థానాలను డిమాండ్ చేస్తున్నది. అయితే అందుకు కూటమిలోని మిగిలిన పార్టీలు ఏమంత సుముఖంగా లేవు. గత ఎన్నికలలో కాంగ్రెస్ 70 స్థానాలలో పోటీ చేసి కేవలం 19 స్థానాలలోనే గెలిచిన సంగతిని గుర్తు చస్తూ 60 స్థానాలతో సరిపెట్టుకోవాలని ఆర్జేడీ చెబుతోంది. అయితే ఇందుకు కాంగ్రెస్ ససేమిరా అంటోంది. గత ఎన్నికలకూ ఇప్పటికీ చాలా తేడా ఉందని చెబుతూ.. రాహుల్ గాంధీ ఒటు అధికార యాత్ర తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెబుతోంది.   అంతే కాదు.. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో సహాని అసంతృప్తితో వైదొలిగితే.. ఆ సీట్లులో కూడా తమ పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తారని కాంగ్రెస్ అంటోంది. అయితే ఆర్జేడీ ఇందుకు అంగీకరించడం లేదు. కూటమి ఇన్ టాక్ట్ గా ఉండాల్సిందే అని పట్టుబడుతోంది.  మొత్తం మీద సీట్ల సర్దుబాటు విషయంలో మహాఘట్ బంధన్ లో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఆ కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఐదేళ్లుగా బీహార్ లో ఏకతాటిపై ఉన్న మహాఘట్ బంధన్ ఎన్నికల ముందు ఇలా అంతర్గత విభేదాలను రచ్చకీడ్చుకోవడం.. ఎన్డీయేకు కలిసివస్తుందని అంటున్నారు. 

జూబ్లీ బైపోల్.. కమలం ఆటలో అరటిపండేనా?

సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ముహూర్తం ఖరారైంది. ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది.నవంబర్ 11న పోలింగ్ 14న కౌంటింగ్ జరుగుతుంది. మరోవంక, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతున్నాయి. నిజానికి.. ఎన్నికల ప్రకటన కంటేముందు నుంచే జూబ్లీ నియోజక వర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీల నుంచి ఆశావహులు, ఓ వంక టికెట్ కోసం ప్రయతిస్తూనే మరో వంక వ్యక్తిగత స్థాయిలో ప్రచారం సాగించారు.   వాస్తవానికి.. జూబ్లీ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలూ  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని,   కాంగ్రెస్, బీఆర్ఎస్ లతోపాటుగా బీజేపీ కూడా ప్రధాన పోటీ దారుగా ఉంటుందనీ, ముక్కోణపు పోటీ అనివార్యం అన్న ప్రచారం జరిగింది. అయితే.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, బీజేపీ మరో మారు ఆటలో అరటిపండు అవుతుందా అనే అనుమనాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా.. అభ్యర్ధి ఎంపిక విషయంలో జాప్యం జరగడంతో పాటుగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో పోలిస్తే, పార్టీ నాయకత్వంలో ఉప ఎన్నికల గెలుపు విషయంలో  పెద్దగా ఆశలు,ఉత్సాహం కనిపించడం లేదు. అటు నాయకత్వంలోనూ, ఇటు క్యాడర్ లోనూ గెలుస్తామనే విశ్వాసం కనిపించడం లేదు.  మరో వంక పార్టీ నిజామాబాద్ ఎంపీ, ధర్మపురి అరవింద్  పార్టీలో పోటీ చేసే సత్తా ఉన్న నాయకుడు ఎవరూ లేరన్నట్లుగా, బీఆర్ఎస్  నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన జీహెచ్ఎంసి మాజీ మేయర్  బొంతు రామ్మోహన్ నుపార్టీలో చేర్చుకుని, జూబ్లీ ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధిగా నిలపాలని  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సూచించారు. సలహా ఇచ్చారు. అయితే  ఆయన ఏ ఉద్దేశంతో ఆ సూచన చేశారో ఏమో కానీ, ఆయన  చేసిన సూచన, పార్టీ బలహీనతను బయట పెట్టిందని అంటున్నారు. అరవింద్  సూచనతో అసలే అంతత మాత్రంగా ఉన్న క్యాడర్ ఉత్సాహం మరింతగా నీరుగారి పోయిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.  అలాగే.. నియోజక వర్గంలో గట్టి బలమున్న టీడీపీ మద్దతు బేషరుతుగా లభిస్తుందని బీజేపీ నాయకత్వం భావించింది. అయితే..  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భవిష్యత్ రాజకీయలను దృష్టిలో ఉంచుకుని  వ్యూహాత్మకంగా  మద్దతు విషయంలో బీజేపీ కోరితే ఆలోచిస్తామని  లేదంటే తటస్థంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నాయకులకు సూచించారు. దీంతో  మొదటి నుంచి మాగంటితో కలిసున్న టీడీపీ క్యాడర్ ,ఓటర్లు పార్టీతో సంబంధం లేకుండా మాగంటి సునీత వైపే మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. దీంతో  బీజేపీ క్యాడర్  మరింతగా నీరుగారి పోయిందని అంటున్నారు.   అదలా ఉంటే..  మరో వంక నిరుత్సాహానికి గురైన బీజేపీ స్థానిక నాయకులు, క్యాడర్  పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. ఇప్పటికే కొందరు స్థానిక నాయకులు, క్యాడర్ తో సహా బీఆర్ఎస్  తీర్ధం పుచ్చుకున్నారు.  మరో వంక, పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్ మరో మారు బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తనదైన స్టైల్లో’ సెటైర్లు వేశారు.  కిషన్ రెడ్డి జీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు..?  బీఆర్ఎస్‌ని గెలిపిస్తారా? కాంగ్రెస్‌ని గెలిపిస్తారా?  అంటూ  చురకలు అంటించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది.  మీ గౌరవం ప్రమాదంలో ఉంది అంటూ  కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వ్యంగ వ్యాఖ్యలు చేశారు. రాజా సింగ్ విసిరిన వ్యంగ్యాస్త్రాల విషయం ఎల్లా ఉన్నా..  జూబ్లీ ఉప ఎన్నికలలో బీజేపీ రోల్  ఏమిటి?  వ్యూహం ఏమిటి? అనే విషయంలో పార్టీ వర్గాలనుంచి వినిపిస్తున్న అనుమానాలు మాత్రం ఒటమి తథ్యం అనిపించేలాగానే ఉన్నాయి.

ఆ ఫోన్ అన్ లాక్ కు కోర్టు అనుమతి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ34 అయిన చెరుకూరి వెంకటేశ్ నాయుడి ఐఫోన్ ను అన్ లాక్ చేసేందుకు విజయ వాడ ఏసీబీ కోర్టు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నకు అనుమతి ఇచ్చింది.  ఈ మేరకు న్యాయమూర్తి పి. భాస్కరరావు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో వెంకటేశ్ నాయుడి ఫోన్ అత్యంత ముఖ్యమైన ఆధారమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భావిస్తోంది. గతంలో డబ్బు కట్టలను లెక్కిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను అధికారులు ఇదే ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని డిజిటల్ ఆధారాలు, కీలక సంభాషణలు, ఇతర సమాచారం ఈ ఫోన్‌లోనే భద్రపరిచి ఉండవచ్చని సిట్ బృందం బలంగా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో, ఫోన్ లాక్‌ను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు కొన్ని రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, వెంకటేశ్ నాయుడి ఫోన్ అన్ లాక్ కు అనుమతిస్తూ  ఆదేశాలు జారీ చేసింది. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు కొలిక్కి

దేశ వ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖారరయ్యాయి. రాష్ట్రంలో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 6న తొలి విడత, 11న మలివిడత పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధానంగా ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే పోరు ఉన్నా.. జనసురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సైతం కీలక పాత్ర పోషించనున్నారన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ బీహార్ పరిస్థితి, ప్రజల మొగ్గు ఏ కూటమి వైపు అన్న కోణంలో జరిగిన పలు సర్వేలు కూడా ప్రశాంత్ కిశోర్ కింగ్ మేకర్ గా అవతరించే అవకాశాలున్నాయనే పేర్కొన్నాయి. అటువంటి ప్రశాంత్ కిశోర్ ఎన్డీయే, ఇండియా కూటముల కంటే ముందే తన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. విద్యావంతులు, మేధావులతో కూడిన ఆ జాబితా విస్మయ పరిచింది. రాజకీయ నేపథ్యం ఇసుమంతైనా లేనివారికే ఆయన తొలి జాబితాలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు కేటాయించారు. అదలా ఉంచితే.. అధికారంపై ధీమా వ్యక్తం చేస్తున్న ఎన్డీయే, ఇండియా కూటములు మాత్రం పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. అసమ్మతులను బుజ్జగించి జాబితాలను ప్రకటించడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు సోమవారం (అక్టోబర్ 13) నాటికి ఓ కొలిక్కి వ చ్చింది. ఆ సర్దుబాటు ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 243 నియోజకవర్గాలకు గాను కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలలోనూ పోటీ చేయనున్నాయి. సద్దుబాటులో భాగంగా  కూటమి భాగస్వామ్య పక్షమైన  చిరాగ్ పాశ్వాన్  నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్-విలాస్)కి  29 సీట్లు కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీకి చెందిన  హిందుస్థానీ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌) , రాజ్యసభ ఎంపీ  ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌మోర్చా కు చెరో ఆరు సీట్లు కేటాయించారు.   ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం సజావుగా పూర్తయ్యిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ థృవీకరించారు.  ఇక ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం నేడో రేపో కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

జూబ్లీ బరిలో టీఆర్ఎస్.. బీఆర్ఎస్ కు షాక్!

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించి, సిట్టింగ్ సీటును నిలుపుకుని రాష్ట్ర రాజకీయాలలో తన సత్తా చాటడానికి సర్వశక్తులూ ఒడ్డి సమాయత్తమవ్వడానికి సిద్ధమౌతున్న బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వడానికి టీఆర్ఎస్ రంగంలోకి దిగింది. అదేంటి టీఆర్ఎస్ పేరు మార్చుకుని బీఆర్ఎస్ అయ్యింది కదా? మళ్లీ టీఆర్ఎస్ బరిలోకి దిగడమేంటని అనుకుంటున్నారా? ఔను తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ రక్షణ సమితి-డెమొక్రట్ (టీఆర్ఎస్-డి)అనే పార్టీ జూబ్లీ బరిలో అభ్యర్థిని నిలబెట్టబోతున్నది.  బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే లక్ష్యంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. అయతే పార్టీలోంచి తెలంగాణ పేరును అయితే తీసేశారు కానీ, ఆయన రాజకీయాలు మాత్రం తెలంగాణను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ తెలంగాణ పేరును పార్టీ పేరు లోంచి తీసేసిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షల సంగతి పక్కన పెడితే.. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాజకీయాలకూ దూరమయ్యారు. 2023 ఎన్నికలలో ఓటమి తరువాత ఆయన జనం ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.   సరే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరో మాజీ మంత్రి హరీష్ రావులు.. బీఆర్ఎస్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ముందుకు తీసుకుపోవడానికి, ప్రజలలో పార్టీ పట్టును పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.  జూబ్లీ ఉప ఎన్నికలో విజయం లక్ష్యంగా పార్టీని సమాయత్తం చేస్తున్నారు.   ఈ పరిస్థితుల్లో జూబ్లీ ఎన్నికలో అభ్యర్దిని నిలబెట్టడానికి టీఆర్ఎస్ -డి  రెడీ అవ్వడం బీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు.    అవును జూబ్లీ బైపోల్ లో టీఆర్ఎస్-డి రంగంలోకి దిగుతోంది. పార్టీ అభ్యర్థిగా కంచర్ల మంజూష అనే మహిళను రంగంలోకి దింపబోతున్నది. ఈ విషయాన్ని టీఆర్ఎస్-డి అధ్యక్షుడు నరాల సత్యనారాయణ సోమవారం (అక్టోబర్ 13) ప్రెస్ క్లబ్ లో పార్టీ జెండాను, వెబ్ సైట్ ను ఆవిష్కరించి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు.   తెలంగాణ ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎ్ -డి లోగో రూపకల్పన చేశామన్న సత్యనారాయణ   జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీఆర్ఎస్-డి అభ్యర్థిగా తమ  పార్టీ  కార్యనిర్వాహక అధ్యక్షురాలు   కంచర్ల మంజూషను ప్రకటించారు.  ఇక టీఆర్ఎస్-డి పార్టీ లోగో, జెండా అన్నీ బీఆర్ఎస్ ను పోలి ఉన్నాయి. గులాబి రంగు, జెండా, గుర్తు అన్నీ బీఆర్ఎస్ ను పోలి ఉండటంతో బీఆర్ఎస్ క్యాడర్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్ -డి అభ్యర్థి జూబ్లీ బైపోల్ లో రంగంలోకి దిగితే తమ విజయావకాశాలకు గండి పడటం ఖాయమన్న ఆందోళన బీఆర్ఎస్ వర్గాలలో వ్యక్తం అవుతోంది.    

జూబ్లీహిల్స్‌లో ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు : కేటీఆర్

  జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లును కాంగ్రెస్ వాళ్ళు రాయించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లోని రహమత్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాగో కాంగ్రెస్‌కి ప్రజలు ఓటేయ్యరని గుర్తించి దొంగ ఓట్లును రాయించారని కేటీఆర్ అన్నారు. ఫేక్ ఓట్లను ఎలా ఎదర్కోవాలో అలా ఎదుర్కొంటాం అని తెలిపారు.  కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ లేడని...అజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిలబడనీయకుండా ఒక పేపర్ మీద ఎమ్మెల్సీ అని రాసి బకరాను చేశాడని కేటీఆర్ విమర్శరించారు. అజారుద్దీన్‌కు ఇచ్చిన ఎమ్మెల్సీ పోస్ట్ కోర్టులో నిలబడదు.. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. షేక్‌పేట్‌లో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం అని ఇచ్చాడు.. అది ఆర్మీ వాళ్లు వచ్చి మాది అని గుంజుకున్నారని జీహెచ్ం‌ఎసీ  ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన ఫ్రీ వాటర్ స్కీం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తేస్తారని తెలిపారు. ఎందుకంటే మాకు ఒక్క సీటు ఇవ్వలేదని కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ మీద పగపట్టారని కేటీఆర్ ఆరోపించారు   

సినిమాల కోసం అవసరమైతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా.. సురేష్ గోపీ

సినిమా నటులు రాజకీయాలలోకి రావడం అరుదేం కాదు. అయితే రాజకీయ నాయకుడిగా మారిన నటుడు తనకు రాజకీయాల కంటే సినిమాలే ముఖ్యం అంటూ యూటర్న్ తీసుకోవడం చాలా చాలా అరుదు. అందులోనూ సినిమాల కోసం అవసరమైతే కేంద్ర మంత్రి పదవిని  కూడా వదులుకోవడానికి సిద్ధం అనడం అంటే.. అది అసలు ఊహకు కూడా అందని విషయం.  అలాంటి ఊహకందని వ్యాఖ్యలు చేశారు ప్రముఖ మలయాళ నటుడు, కేంద్రపెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ. రాజకీయాలలో ఉండటం, కేంద్ర మంత్రిగా పదవిలో ఉండటం తనకేమీ సంతృప్తి ఇవ్వడం లేదన్నారు సురేష్ గోపీ. సినీ కెరీర్ ను వదిలిపెట్టి రాజకీయాలలోకి రావాలని కానీ, కేంద్ర మంత్రి కావాలని కానీ తాను ఎన్నడూ అనుకోలేదని సురేష్ గోపీ చెప్పుకొచ్చారు. అయినా రాజకీయాలలోకివచ్చి కేంద్ర మంత్రిని అయ్యాననీ, కానీ అప్పటి నుంచీ తనకు చేతిలో డబ్బులు ఆడటంలేదనీ, ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డబ్బుల కోసం మళ్లీ సినిమాలలో నటించాలని భావిస్తున్నట్లు చెప్పారు. తాను సినిమాలలో నటించడానికి కేంద్ర మంత్రి పదవి అడ్డంకి అయితే.. ఆ పదవిని తృణ ప్రాయంగా త్యజిస్తానని చెప్పారు. అదే జరిగి ఒక వేళ తానురాజీనామా చేస్తే.. తాను వదిలేసే మంత్రి పదవిని తన రాష్ట్రానికే చెందిన అంటే కేరళకు చెంది రాజ్యసభ సభ్యుడు సదానంద్ మాస్టర్ కు ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు.  సినిమాల ద్వారా విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సురేష్ గోపీ ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో త్రిసూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి..  పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా కేంద్ర కేబినెట్ లో స్థానం పొందారు. అయితే రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ తన ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. తన పిల్లలు ఇంకా సెటిల్ కాలేదనీ, ఈ పరిస్థితుల్లో తనకు ఆదాయం చాలా అవసరమన్న ఆయన.. అందుకోసం మళ్లీ సినిమాల్లో నటించాలని భావిస్తున్నట్లు చెప్పారు.  అందు కోసం అవసరమైతే  కేంద్ర మంత్రి పదవిని వదిలేయడానికైనా సిద్ధమన్నారు.  

తెలంగాణ తెలుగుదేశం.. చంద్రబాబుపై పెరుగుతున్న ఒత్తిడి!?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని బలీయ శక్తి అనడంలో సందేహం లేదు. అదే సమయంలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో బలీయంగా ఉంది. అయినా కూడా ఆ రాష్ట్రంలో రాజకీయంగా పార్టీ కార్యకలాపాలేవీ పెద్దగా జరగడం లేదు. ఏమైనా సమావేశాలు జరిగినా, జరిపినాఅవి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కే పరిమితం అవుతున్నాయి తప్ప.. జనంలోకి పెద్దగా వెళ్లడం లేదు. అయినా.. పార్టీ రాజకీయంగా తెలంగాణలో క్రియాశీలంగా లేకపోయినా, పార్టీ క్యాడర్ మాత్రం తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన పిలుపు ఏదీ లేకపోవడంతో.. రాష్ట్ర విభజన తరువాత నుంచీ పార్టీ క్యాడర్ ఎక్కడికక్కడ కామ్ డౌన్ అయిపోయారు. ఎన్నికల సమయంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు కోసం తెలుగుదేశం క్యాడర్ వైపు చూడటం ఆనవాయితీగా మారిపోయింది. ఆ సమయంలో కూడా తెలుగుదేశం కేడర్ కు అధినాయకత్వం నుంచి ఎటువంటి డైరెక్షన్ రాని పరిస్థితుల్లో.. కార్యకర్తలు ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వారంతట వారే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు.  సరే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు కరవు అన్న సంగతి తెలిసిందే. అయితే కార్యకర్తల బలం మాత్రం ఇసుమంతైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇందుకు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే తార్కానం. అన్ని పార్టీలూ కూడా ఆ ఎన్నికలలో తెలుగుదేశం జెండా మోయడానికి పోటీలు పడడమే. తెలంగాణలో తెలుగుదేశం వెనుకబాటుకు కారణం  నాయకులు కరవవ్వడమే అన్న విషయంలో సందేహం లేదు. ఆ కారణంగానే రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇతర పార్టీల నేతలు తెలుగుదేశం క్యాడర్ బలంతోనే తాము గెలిచామని చెప్పుకోవడానికి ఇసుమంతైనా సంకోచించరు.  అంతటి బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం తెలంగాణలో విస్తరించడానికి అన్ని అవకాశాలూ ఉన్నా నాయకత్వం మాత్రం ఆ దిశగా పెద్దగా దృష్టిపెట్టడం లేదన్న అసంతృప్తి ఇప్పుడు క్యాడర్ లో బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత.. తెలంగాణలో పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసుకుంటుందని ఆశించిన క్యాడర్ ఇప్పుడు పార్టీ అధినాయత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థానిక ఎన్నికలలో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ క్యాడర్ అధిష్ఠానాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నది. అసలు జూబ్లీ బైపోల్ లోనే తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టాలని క్యాడర్ డిమాండ్ చేసినప్పటికీ చంద్రబాబు బీజేపీతో పొత్తు కారణంగా ఉన్న పరిమితులను విడమర్చి చెప్పి సముదాయించారు.  అయితే స్థానిక ఎన్నికల విషయానికి వచ్చే సరికి అలా సముదాయించడం అంత తేలిక కాదన్న భావన రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నది.